కంటెంట్‌కు వెళ్లు

దేవదూతలు అంటే ఎవరు?

దేవదూతలు అంటే ఎవరు?

బైబిలు ఇచ్చే జవాబు

 దేవదూతలు అంటే మనుషుల కన్నా చాలా ఎక్కువ శక్తి, సామర్థ్యం ఉన్న ప్రాణులు. (2 పేతురు 2:11) వాళ్లు పరలోకంలో ఉంటారు, అది భౌతిక విశ్వం కన్నా ఎంతో ఎత్తయిన స్థలంలో, కంటికి కనిపించనంత దూరంలో ఉంటుంది. (1 రాజులు 8:27; యోహాను 6:38) అందుకే దేవదూతల్ని అదృశ్య ప్రాణులు అని కూడా పిలుస్తారు.—1 రాజులు 22:21; కీర్తన 18:10.

దేవదూతలు ఎక్కడ నుండి వచ్చారు?

 దేవుడు దూతల్ని యేసు ద్వారా సృష్టించాడు. బైబిలు యేసును “మొత్తం సృష్టిలో మొట్టమొదటి వ్యక్తి” అని పిలుస్తోంది. దేవుడు యేసును ఉపయోగించి సృష్టిని ఎలా చేశాడో వర్ణిస్తూ బైబిలు ఇలా చెప్తోంది, దేవదూతలతో సహా ‘అటు పరలోకంలో ఇటు భూమ్మీద, కనిపించేవీ కనిపించనివీ, దేవుడు ఆయన్ని [యేసును] ఉపయోగించుకొనే అన్నిటినీ సృష్టించాడు.’ (కొలొస్సయులు 1:13-17) దేవదూతలు పెళ్లి చేసుకోరు, పిల్లల్ని కనరు. (మార్కు 12:25) అయితే దేవుడు, దేవదూతల్లో ప్రతీ ఒక్కరినీ ఒక్కో ప్రాణిగా సృష్టించాడు.—యోబు 1:6.

 దేవుడు ఈ భూమిని సృష్టించడానికన్నా ఎన్నో ఏళ్ల ముందు దూతల్ని సృష్టించాడు. దేవుడు భూమిని సృష్టించినప్పుడు దేవదూతలు ‘ఆనందంతో జయధ్వనులు చేశారు.’—యోబు 38:4-7.

దేవదూతల సంఖ్య ఎంత?

 ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారో బైబిలు చెప్పట్లేదుగానీ, చాలామంది ఉన్నారని మాత్రం చెప్తోంది. ఉదాహరణకు, అపొస్తలుడైన యోహానుకు ఒక దర్శనంలో లక్షల-కోట్ల సంఖ్యలో ఉన్న దేవదూతలు కనిపించారు.—ప్రకటన 5:11.

ప్రతీ దేవదూతకు ఒక పేరు, వ్యక్తిత్వం ఉంటాయా?

 ఉంటాయి. ఇద్దరు దేవదూతల పేర్లు బైబిల్లో ఉన్నాయి. అవి, మిఖాయేలు, గబ్రియేలు. (దానియేలు 12:1; లూకా 1:26) a ఇతర దేవదూతలకు కూడా పేర్లు ఉన్నప్పటికీ, వాటిని తెలియజేయడానికి వాళ్లు ఇష్టపడని సందర్భాలు బైబిల్లో ఉన్నాయి.—ఆదికాండము 32:29; న్యాయాధిపతులు 13:17, 18.

 ప్రతీ దేవదూతకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది. వాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు కూడా. (1 కొరింథీయులు 13:1) వాళ్లకు ఆలోచనా సామర్థ్యం ఉంది. అంతేకాదు దేవున్ని తమ సొంత మాటలతో స్తుతిస్తారు కూడా. (లూకా 2:13, 14) తప్పొప్పులను వివేచించి, తమకిష్టమైన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ దేవదూతలకు ఉంది. ఆ స్వేచ్ఛతోనే కొంతమంది దేవదూతలు సాతానుతో చేతులు కలిపి దేవునికి ఎదురుతిరిగారు.—మత్తయి 25:41; 2 పేతురు 2:4.

దేవదూతలందరూ సమానమేనా?

 కాదు. దేవదూతలందరి కన్నా ఎక్కువ శక్తి, అధికారం ఉన్న దేవదూత ఎవరంటే, ప్రధానదూతైన మిఖాయేలు. (యూదా 9; ప్రకటన 12:7) ఆ తర్వాతి స్థానంలో సెరాపులు ఉంటారు. వీళ్లు యెహోవా సింహాసనం దగ్గర ఉంటారు. (యెషయా 6:2, 6) ఆ తర్వాతి ఉన్నత స్థానంలో ఉన్న దేవదూతలు కెరూబులు. వీళ్లు ప్రత్యేకమైన పనుల్ని చేస్తుంటారు. దేవుడు ఆదాముహవ్వలను ఏదెను తోటనుండి తరిమేసిన తర్వాత ఆ తోటను కాపలా కాసిన దేవదూతలు కెరూబులే.—ఆదికాండము 3:23, 24.

దేవదూతలు మనుషులకు సహాయం చేస్తారా?

 చేస్తారు. దేవుడు ప్రజలకు సహాయం చేయడానికి తన నమ్మకమైన దూతల్ని ఉపయోగించుకుంటున్నాడు.

  •   దేవుని రాజ్యసువార్తను ప్రకటించే తన సేవకుల్ని నడిపించడానికి దేవుడు దూతల్ని ఉపయోగించుకుంటున్నాడు. (ప్రకటన 14:6, 7) అలా దూతల్ని ఉపయోగించి దేవుడు ఇస్తున్న నిర్దేశం వల్ల ఇటు ప్రకటించేవాళ్లు అలాగే మంచివార్త వినేవాళ్లు కూడా ప్రయోజనం పొందుతున్నారు.—అపొస్తలుల కార్యములు 8:26, 27.

  •   చెడ్డ ప్రజలవల్ల క్రైస్తవ సంఘం పాడవ్వకుండా దూతలు కాపాడతారు.—మత్తయి 13:49.

  •   దేవునికి నమ్మకంగా ఉండేవాళ్లను దేవదూతలు నడిపిస్తారు, సంరక్షిస్తారు.—కీర్తన 34:7; 91:10, 11; హెబ్రీయులు 1:7, 14.

  •   చెడుతనాన్ని నాశనం చేయడం కోసం యేసుతోపాటు దేవదూతలు యుద్ధంచేసి మనుషులకు ఓదార్పును తెస్తారు.—2 థెస్సలొనీకయులు 1:6-8.

ప్రతీ మనిషికి ఒక దేవదూత కాపలాగా ఉంటుందా?

 దేవుని సేవకులకు దేవునితో ఉన్న స్నేహం పాడవ్వకుండా దూతలు కాపాడతారనే మాట వాస్తవమే. కానీ దానర్థం ప్రతీ క్రైస్తవునికి ఒక్కో దేవదూతను కాపలాగా దేవుడు నియమిస్తాడని దానర్థం కాదు. b (మత్తయి 18:10) దేవుని సేవకులకు ఎదురయ్యే ప్రతీ కష్టం లేదా శోధన నుండి దేవదూతలు తప్పించరు. బదులుగా, వచ్చిన సమస్య నుండి బయటపడడానికి కావాల్సిన తెలివిని, శక్తిని ఇవ్వడం ద్వారా దేవుడు “తప్పించుకునే మార్గాన్ని” చూపిస్తాడని బైబిలు చెప్తోంది.—1 కొరింథీయులు 10:12, 13; యాకోబు 1:2-5.

దేవదూతల గురించి అపోహలు

 అపోహ: దేవదూతలందరూ మంచివాళ్లే.

 నిజ: బైబిలు కొంతమందిని ‘చెడ్డదూతలు,‘ ‘పాపం చేసిన దేవదూతలు’ అని పిలుస్తోంది. (ఎఫెసీయులు 6:12; 2 పేతురు 2:4) వాళ్లు సాతానుతో చేతులు కలిపి దేవునిపై తిరుగుబాటు చేసిన చెడ్డదూతలు లేదా దయ్యాలు.

 అపోహ: దేవదూతలకు చావులేదు.

 నిజం: సాతానుతో సహా చెడ్డదూతలందరూ నాశనమైపోతారు.—యూదా 6.

 అపోహ: మనుషులు చనిపోయాక దేవదూతలు అవుతారు.

 నిజం: దేవుడు దేవదూతల్ని ప్రత్యేకంగా సృష్టించాడు, అంతేగానీ చనిపోయిన మనుషులు దేవదూతలుగా మారలేదు. (కొలొస్సయులు 1:16) చనిపోయి పరలోకానికి పునరుత్థానం చేయబడేవాళ్లకు ఇక ఎప్పటికీ చావు ఉండదు. అది దేవుడు వాళ్లకిచ్చే బహుమానం. (1 కొరింథీయులు 15:53, 54) వాళ్లు దేవదూతల కన్నా పైస్థానంలో ఉంటారు.—1 కొరింథీయులు 6:3.

 అపోహ: దేవదూతలు ఉన్నది మనుషులకు సహాయం చేయడానికే.

 నిజం: దేవదూతలు దేవుడిచ్చే ఆజ్ఞల్ని పాటిస్తారు. మనం ఇచ్చేవి కాదు. (కీర్తన 103:20, 21) యేసు కూడా, తనకు సహాయం అవసరమైతే దేవుడినే అడగాలిగానీ, దూతల్ని కాదని గుర్తించాడు.—మత్తయి 26:53.

 అపోహ: సహాయం కోసం మనం దేవదూతలకు ప్రార్థన చేయవచ్చు.

 నిజం: ప్రార్థన అనేది దేవునికి మనం చేసే ఆరాధనలో ఒక భాగం. ఆరాధన యెహోవా దేవునికి మాత్రమే చెందుతుంది. (ప్రకటన 19:10) మనం యేసు ద్వారా దేవునికి మాత్రమే ప్రార్థన చేయాలి.—యోహాను 14:6.

a కొన్ని బైబిలు అనువాదాలు యెషయా 14:12 లో “లూసిఫరు” అనే పేరును ఉపయోగిస్తాయి. కొంతమంది ఆ పేరు అపవాదియైన సాతానుది అని అనుకుంటున్నారు. అయితే లూసిఫరు అనే పేరుకు ఆదిమ హీబ్రూలో “ప్రకాశించేది” అని అర్థం. ఆ లేఖన సందర్భాన్ని బట్టి చూస్తే ఆ పేరు సాతానుది కాదు గానీ యెహోవా నాశనం చేసిన బబులోను సామ్రాజ్యాన్ని సూచిస్తుందని చెప్పవచ్చు. (యెషయా 14:3, 4, 13-20) నాశనం చేసిన తర్వాత బబులోనును ఎగతాళి చేస్తూ “ప్రకాశించేది” అనే మాటను ఉపయోగించడం జరిగింది.

b ఒక సందర్భంలో దేవదూత పేతురును జైలు నుండి తప్పించిన వృత్తాంతం బట్టి పేతురుకు ఒక దూత కాపలాగా ఉండేవాడని కొంతమంది అనుకుంటారు. (అపొస్తలుల కార్యములు 12:6-16) పేతురు శిష్యుల దగ్గరకు వెళ్లినప్పుడు, పేతురుకు ప్రతినిధిగా ఉన్న ఒక దేవదూత తమ దగ్గరకు వచ్చాడని వాళ్లు అనుకున్నారు. అందుకే వాళ్లు, వచ్చింది పేతురు కాదు “ అతని దేవదూత” అని అన్నారు.