కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

మార్కు 1:15—“దేవుని రాజ్యం దగ్గరపడింది”

మార్కు 1:15—“దేవుని రాజ్యం దగ్గరపడింది”

 “నిర్ణయించిన సమయం పూర్తయింది, దేవుని రాజ్యం దగ్గరపడింది. కాబట్టి పశ్చాత్తాపపడండి, మంచివార్త మీద విశ్వాసం ఉంచండి.”—మార్కు 1:15, కొత్త లోక అనువాదం.

 “కాలం పూర్తి అయింది. దేవుని రాజ్యం దగ్గరగా ఉంది. పశ్చాత్తాపపడి శుభవార్త నమ్మండి.”—మార్కు 1:15, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

మార్కు 1:15 అర్థమేంటి?

 దేవుని రాజ్యం a “దగ్గరపడింది” లేదా “దగ్గరగా ఉంది” అని యేసుక్రీస్తు చెప్పాడు. ఆయన ఎందుకలా అన్నాడు? ఆ రాజ్యానికి కాబోయే రాజు ఆయనే, పైగా ఆయనే స్వయంగా వాళ్ల మధ్య ఉన్నాడు కాబట్టి అలా అన్నాడు.

 ఆ రాజ్యం అప్పటికే పరిపాలించడం మొదలుపెట్టిందని యేసు ఉద్దేశం కాదు. నిజానికి ఆ తర్వాత ఆయనే, దేవుని రాజ్యం భవిష్యత్తులో వస్తుందని తన శిష్యులకు సూచించాడు. (అపొస్తలుల కార్యాలు 1:6, 7) ఏదేమైనా, భవిష్యత్‌ రాజుగా b యేసు ఎప్పుడు కనిపిస్తాడని బైబిలు ప్రవచించిందో సరిగ్గా ఆ సంవత్సరంలోనే ఆయన వచ్చాడు. అందుకే ఆయన, “నిర్ణయించిన సమయం పూర్తయింది” అని చెప్పగలిగాడు. రాజ్యం గురించిన సువార్తను లేదా మంచివార్తను ప్రకటించడం కోసం ఆయన బహిరంగ పరిచర్యను మొదలుపెట్టాల్సిన సమయం అదే.—లూకా 4:16-21, 43.

 ఆ రాజ్యం గురించిన మంచివార్త నుండి ప్రజలు ప్రయోజనం పొందాలంటే వాళ్లు పశ్చాత్తాపపడాలి, అంటే గతంలో చేసిన పాపాల విషయంలో బాధపడాలి, దేవుని ప్రమాణాల ప్రకారం జీవించాలి. అలా పశ్చాత్తాపపడిన ప్రజలు, రాబోయే ఆ రాజ్యం గురించిన మంచివార్త మీద తమకు విశ్వాసం ఉందని చూపించారు.

మార్కు 1:15 సందర్భం

 గలిలయలో తన పరిచర్య మొదలుపెట్టిన కొత్తలో యేసు ఆ మాట అన్నాడు. మత్తయి 4:17 అదే సందర్భం గురించి మాట్లాడుతూ యేసు “అప్పటినుండి” దేవుని రాజ్యం గురించి ప్రకటించాడని చెప్తోంది. ఆ రాజ్యమే యేసు పరిచర్య ముఖ్యాంశం. నిజానికి నాలుగు సువార్తల్లో c 100 కన్నా ఎక్కువసార్లు ఆ రాజ్యం గురించిన ప్రస్తావన ఉంది; వాటిలో ఎక్కువశాతం యేసు ప్రస్తావించినవే. బైబిల్లో నమోదైన వివరాల్ని గమనిస్తే, యేసు వేరే ఏ విషయం కన్నా దేవుని రాజ్యం గురించే ఎక్కువగా మాట్లాడాడు.

మార్కు 1వ అధ్యాయం చదవండి. చదువుతున్నప్పుడు అధస్సూచీల్లో ఉన్న వివరణల్ని, క్రాస్‌ రెఫరెన్సులను కూడా చూడండి.

a దేవుని రాజ్యం అనేది పరలోక ప్రభుత్వం, భూమ్మీద తన ఇష్టాన్ని నెరవేర్చడానికి దేవుడు దాన్ని స్థాపించాడు. (దానియేలు 2:44; మత్తయి 6:10) మరిన్ని వివరాల కోసం, “దేవుని ప్రభుత్వం అంటే ఏమిటి?” అనే ఆర్టికల్‌ చూడండి.

b ప్రవచించబడిన మెస్సీయగా అంటే దేవుని ప్రత్యేక ప్రతినిధిగా తనకున్న పాత్రల్లో ఒకదాన్ని పోషించడానికి ఆయన రాజవ్వాల్సి ఉంది. ఆయన ఏ సంవత్సరంలో మెస్సీయగా కనిపిస్తాడని బైబిలు కాలపట్టిక సూచించిందో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్‌ చూడండి: “యేసే మెస్సీయ అని మెస్సీయ గురించిన ప్రవచనాలు నిరూపిస్తున్నాయా?

c సువార్తలు అనేవి క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని మొదటి నాలుగు పుస్తకాలు; చాలామంది వాటిని ‘కొత్త నిబంధన’ అని అంటారు; వాటిలో యేసు జీవితం, పరిచర్య గురించిన వివరాలు ఉన్నాయి.