కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు జాయ్‌నిజమ్‌ని అంటే యూదులకు ప్రత్యేక రాజ్యం ఏర్పడాలని నమ్ముతారా?

యెహోవాసాక్షులు జాయ్‌నిజమ్‌ని అంటే యూదులకు ప్రత్యేక రాజ్యం ఏర్పడాలని నమ్ముతారా?

 లేదు వాళ్లు అలా నమ్మరు. యెహోవాసాక్షులు క్రైస్తవులు. వాళ్ల నమ్మకాలన్నీ లేఖనాధారమైనవి. యూదులు పాలస్తీనా ప్రాంతానికి తిరిగి వస్తారని లేఖనాలు చెబుతున్నట్లు కొన్ని మతాల వాళ్లు బోధిస్తారు. యెహోవాసాక్షులు ఈ నమ్మకాన్ని సమర్థించరు. ప్రత్యేకించి ఈ రాజకీయ పరిణామం గురించి లేఖనాలు ఎక్కడా చెప్పడం లేదని వాళ్లు నమ్ముతారు. నిజానికి ఏ మనిషినీ, ప్రభుత్వాన్నీ, గుంపునూ మిగతా వాటికన్నా గొప్పవని లేఖనాలు బోధించడంలేదు. యెహోవాసాక్షుల అధికారిక పత్రిక, కావలికోట స్పష్టంగా ఇలా పేర్కొంది: “యూదులకు రాజకీయంగా ప్రత్యేక రాజ్యం ఏర్పడాలని బైబిల్లో ఎక్కడా లేదు.”

 ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం, జాయ్‌నిజమ్‌ అంటే, “పాలస్తీనా ప్రాంతంలో యూదులకు ఒక దేశాన్ని ఏర్పాటు చేసి, దానికి మద్దతు ఇవ్వాలనే లక్ష్యంతో సాగిన యూదా జాతీయ ఉద్యమం.” కాబట్టి ఆ ఉద్యమం మతపరమైనదేకాక, రాజకీయపరమైనది కూడా. యెహోవాసాక్షులు జాయ్‌నిజమ్‌ని ఒక మత సిద్ధాంతంగా ప్రచారం చేయరు, జాయ్‌నిజమ్‌కు సంబంధించిన రాజకీయ విషయాల్లో ఎవరి పక్షం వహించరు.

 యెహోవాసాక్షుల సంస్థ పూర్తిగా మతపరమైనది, జాయ్‌నిజమ్‌తో సహా ఎలాంటి రాజకీయ వ్యవహారాల పక్షాన మాట్లాడదు. యెహోవాసాక్షులు రాజకీయ విషయాల్లో తటస్థంగా ఉంటారని ప్రపంచవ్యాప్తంగా పేరొందారు. కొన్ని దేశాల్లోనైతే అలా తటస్థంగా ఉన్నందుకు తీవ్రమైన హింసలు కూడా భరించాల్సి వచ్చింది. దేవుని పరలోక రాజ్యం మాత్రమే భూమ్మీద శాశ్వత శాంతి సమాధానాలను తీసుకురాగలదని, ఏ మానవ ప్రభుత్వంగానీ, ఉద్యమంగానీ దాన్ని సాధించలేవని మేము నమ్ముతున్నాం.

 తాము ఏ దేశంలో జీవిస్తున్నా, ఆ దేశ చట్టాలకు లోబడడం తమ మతనమ్మకాల్లో ఒక ప్రాథమిక సూత్రమని యెహోవాసాక్షులు నమ్ముతారు. వాళ్లు ప్రభుత్వాలపై తిరుగుబాటు చేయరు, సాయుధ పోరాటాల్లో పాల్గొనరు.