కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు తెలుసా?

మీకు తెలుసా?

ప్రాచీన బబులోనులో దొరికిన ఇటుకలు, వాటి తయారీ విధానం బైబిలు చెప్పేవి నిజమని ఎలా రుజువు చేస్తున్నాయి?

పురాతన వస్తువుల్ని తవ్వేవాళ్లకు ప్రాచీన బబులోనులో ఎన్నో లక్షల ఇటుకలు దొరికాయి. అప్పట్లో నగరాల్ని కట్టడానికి ఆ ఇటుకల్ని ఉపయోగించేవాళ్లు. పురాతన వస్తువుల్ని తవ్వే శాస్త్రజ్ఞుడైన రోబర్ట్‌ కొల్దేవ్‌ ఇలా అంటున్నాడు: ‘నగరం బయట ఎక్కడైతే మంచి బంకమట్టి అలాగే ఇటుకలు కాల్చడానికి కట్టెలు దొరుకుతాయో, అక్కడి కొలిమిలో ఇటుకల్ని తయారుచేసేవాళ్లు.’

ఈ కొలిమిల్నే, బబులోను ప్రభుత్వ అధికారులు ఒక ఘోరమైన పని చేయడానికి కూడా ఉపయోగించే వాళ్లని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ప్రాచీన అష్షూరు చరిత్రలో అలాగే భాషలో నిపుణుడైన పౌల్‌-అలెన్‌ బోలి అనే ఫ్రొఫెసర్‌, యూనివర్సిటీ ఆఫ్‌ టొరొంటోలో పనిచేస్తున్నాడు. అతను ఇలా అంటున్నాడు: ‘ఎవరైతే రాజు మాటను వినరో లేదా బబులోను దేవుళ్లను గౌరవించరో, వాళ్లను కొలిమిలో పడేసి, కాల్చేయాలని బబులోను తవ్వకాల్లో దొరికిన చాలావాటి మీద రాసి ఉంది.’ ఉదాహరణకు, నెబుకద్నెజరు రాజు కాలం నాటి ఒక రాతల్లో ఇలా ఉంది: ‘వాళ్లను చంపేయండి, కొలిమిలో వేసి వాళ్లను కాల్చేయండి, వాళ్లను మాడ్చి మసి చేయండి, పొగ పైకిలేచేలా చేయండి, కొన ఊపిరిపోయేలా మంటల్లో వేసేయండి.’

ఈ మాటలు మనకు దానియేలు 3వ అధ్యాయాన్ని గుర్తుచేస్తాయి. అక్కడ ఏం ఉందంటే, రాజైన నెబుకద్నెజరు ఒక పెద్ద బంగారు ప్రతిమను చేయించి, బబులోను నగరం బయట దూరా మైదానంలో నిలబెట్టించాడు. అప్పుడు ముగ్గురు హెబ్రీ యువకులైన షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఆ ప్రతిమకు వంగి నమస్కారం చేయడానికి ఒప్పుకోలేదు. దాంతో నెబుకద్నెజరుకు బాగా కోపం వచ్చి “కొలిమిని మామూలుకన్నా ఏడు రెట్లు ఎక్కువ వేడిగా చేయమని” ఆజ్ఞాపించాడు. అలాగే ఆ ముగ్గుర్ని “మండే కొలిమిలో పడేయమని” చెప్పాడు. అప్పుడు ఒక శక్తివంతమైన దేవదూత వాళ్లను ప్రాణాలతో కాపాడాడు.—దాని. 3:1-6, 19-28.

© The Trustees of the British Museum. Licensed under CC BY-NC-SA 4.0. Source

ఒక కాల్చిన ఇటుక మీద నెబుకద్నెజరు పేరు

బబులోనులో దొరికిన ఇటుకలు బైబిలు చెప్తున్నది నిజమని రుజువు చేస్తున్నాయి. అలాంటి ఇటుకల్లో చాలావాటి మీద రాజును పొగుడుతూ కొన్ని మాటలు ఉన్నాయి. వాటిలో ఒక దానిమీద ఇలా ఉంది: ‘నెబుకద్నెజరు, బబులోను రాజు. ఈ రాజ భవనాన్ని గొప్ప రాజైన నేను కట్టించాను, నా వంశస్థులందరూ ఎప్పటికీ దీన్ని పరిపాలిస్తూ ఉండాలి.’ ఈ మాటలు, దానియేలు 4:30​లోని నెబుకద్నెజరు తన గురించి తాను గొప్పలకు పోతూ చెప్పుకున్న మాటలకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఆ వచనంలో ఇలా ఉంది: “ఈ మహా బబులోను నేను నా ఘనతావైభవాల్ని చూపించడం కోసం నా సొంత శక్తితో, బలంతో రాజధానిగా కట్టించుకున్న నగరం కాదా?”