కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

యేసు పుట్టిన తర్వాత యోసేపు, మరియలు నజరేతులో ఉన్న తమ ఇంటికి వెళ్లకుండా బేత్లెహేములోనే ఎందుకు ఉన్నారు?

బైబిలు దానిగురించి ఏం చెప్పట్లేదు గానీ, వాళ్లు ఆ నిర్ణయం తీసుకోవడం వెనుకున్న కారణాల గురించి ఆసక్తికరమైన వివరాలు చెప్తుంది.

మరియ గర్భవతియై, ఒక బిడ్డను కంటుందని దేవదూత చెప్పాడు. దేవదూత ఆ విషయం చెప్పే సమయానికి యోసేపు, మరియలు గలిలయలోని, నజరేతులో ఉన్నారు. అది యోసేపు సొంత ఊరు. (లూకా 1:26-31; 2:4) తర్వాత కొంతకాలానికి వాళ్లు ఐగుప్తు నుండి నజరేతుకు తిరిగి వచ్చారు. యేసు అక్కడే పెరిగాడు కాబట్టి ఆయన నజరేయుడు అని పిలవబడ్డాడు. (మత్త. 2:19-23) అందుకే యేసు, యోసేపు, మరియ అనగానే మనకు నజరేతు గుర్తొస్తుంది.

మరియకు ఎలీసబెతు అనే బంధువు ఉంది, ఆమె యూదయలో ఉండేది. ఎలీసబెతు యాజకుడైన జెకర్యాకు భార్య, బాప్తిస్మమిచ్చు యోహానుకు తల్లి. (లూకా 1:5, 9, 13, 36) మరియ ఎలీసబెతును కలవడానికి వెళ్లి యూదయలో మూడు నెలలు ఆమెతోపాటు ఉంది. ఆ తర్వాత నజరేతుకు తిరిగొచ్చింది. (లూకా 1:39, 40, 56) అందుకే, మరియకు యూదయ ప్రాంతమంతా కాస్త సుపరిచితమే.

కొంతకాలానికి, యోసేపు తమ పేర్లను “నమోదు చేయించుకోవడానికి” నజరేతు నుండి ‘దావీదు నగరమైన’ బేత్లెహేముకు వెళ్లారు. మెస్సీయ అక్కడ పుడతాడని ప్రవచనాలు చెప్తున్నాయి. (లూకా 2:3, 4; 1 సమూ. 17:15; 20:6; మీకా 5:2) కాబట్టి మరియ యేసుకు జన్మనిచ్చిన తర్వాత, ఆ పసికందును అలాగే బాలింతగా ఉన్న ఆమెను తీసుకుని వెనక్కి అంతదూరం నజరేతుకు ప్రయాణించడం సరికాదని యోసేపు అనుకున్నాడు. కాబట్టి వాళ్లు బేత్లెహేములోనే ఉండిపోయారు, అది యెరూషలేముకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం బలి అర్పించడానికి, పసికందైన యేసును ఆలయానికి తీసుకెళ్లడానికి అది అనువుగా ఉండింది.—లేవీ. 12:2, 6-8; లూకా 2:22-24.

మరియకు పుట్టబోయే కొడుకు ‘దావీదు సింహాసనం’ ఎక్కుతాడని, “రాజుగా పరిపాలిస్తాడు” అని దేవదూత చెప్పాడు. కాబట్టి యేసు దావీదు నగరంలో పుట్టడం ప్రాముఖ్యమని యోసేపు, మరియలు అనుకుని ఉంటారా? (లూకా 1:32, 33; 2:11, 17) అందుకే వాళ్లు అక్కడే ఉండి, దేవుడు ఇంకా ఏ నిర్దేశం ఇస్తాడా అని ఎదురుచూసి ఉండవచ్చు.

జ్యోతిష్యులు యేసును చూడడానికి వచ్చినప్పటికీ యోసేపు, మరియలు ఎంతకాలం నుండి బేత్లెహేములో ఉంటున్నారో మనకు తెలీదు. కానీ అప్పటికే వాళ్లు ఒక ఇంటిలో ఉంటున్నారు. యేసు కూడా పసికందుగా కాదుగానీ ‘పిల్లవాడిగా’ ఉన్నాడు. (మత్త. 2:11) బహుశా వాళ్లు నజరేతుకు వెళ్లిపోయే బదులు, బేత్లెహేములోనే కొంతకాలంగా ఉంటూ అక్కడే స్థిరపడి ఉంటారు.

‘బేత్లెహేములో, రెండు సంవత్సరాలు, అంతకన్నా తక్కువ వయసున్న మగపిల్లలందర్నీ చంపాలని’ హేరోదు ఆజ్ఞ జారీచేశాడు. (మత్త. 2:16) ఆ ఆజ్ఞ గురించి యోసేపును దేవదూత హెచ్చరించడంతో ఆయన మరియను, యేసును తీసుకుని ఐగుప్తుకు పారిపోయాడు. హేరోదు చనిపోయేవరకు అక్కడే ఉన్నాడు. తర్వాత, యోసేపు తన కుటుంబాన్ని తీసుకొని నజరేతుకు వచ్చాడు. మరి వాళ్లు బేత్లెహేముకు ఎందుకు తిరిగి వెళ్లలేదు? ఎందుకంటే, హేరోదు స్థానంలో అతని కొడుకైన అర్కెలాయు యూదయను పరిపాలించడం మొదలుపెట్టాడు. ఇతను వాళ్ల నాన్న కన్నా క్రూరుడు. అలాగే బేత్లెహేముకు వెళ్తే ప్రమాదంలో పడే అవకాశం ఉందని దేవదూత యోసేపును మళ్లీ హెచ్చరించాడు. కాబట్టి నజరేతు, యేసును పెంచడానికి సురక్షితమైన స్థలం.—మత్త. 2:19-22; 13:55; లూకా 2:39, 52.

బహుశా యేసు చనిపోయి పరలోకానికి మార్గం తెరవకముందే యోసేపు చనిపోయివుంటాడు. కాబట్టి ఆయన భవిష్యత్తులో భూమ్మీద పునరుత్థానం అవుతాడు. మనలో చాలామంది ఆయన్ని కలిసి, యేసు పుట్టిన తర్వాత వాళ్లు బేత్లెహేములోనే ఎందుకు ఉండిపోయారో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకోవచ్చు.