కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచమంతటా పెరుగుతున్న మానసిక సమస్యలు

ప్రపంచమంతటా పెరుగుతున్న మానసిక సమస్యలు

“ఏ కారణం లేకపోయినా సరే, నాకు ప్రతీ క్షణం కాస్త ఆందోళనగా ఉంటుంది.”

“నాకు అప్పుడప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది, కానీ కాసేపటికే మనసులో ఏదో తెలియని బాధ మొదలౌతుంది. అందుకే సంతోషంగా అనిపించిన ప్రతీసారి కంగారు పడుతుంటాను.”

“నేను ఏ రోజు గురించి ఆరోజే ఆలోచించడానికి ప్రయత్ని స్తుంటాను; కానీ అప్పుడప్పుడు చాలా విషయాలు ఒకేసారి గుర్తొచ్చి ఊపిరాడనట్లు అనిపిస్తుంది.”

ఈ మాటలు మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్లు చెప్పినవి. మీకు గానీ, మీకు తెలిసినవాళ్లకు గానీ ఇలా ఎప్పుడైనా అనిపిస్తోందా?

ఒకవేళ అనిపిస్తుంటే, మీకే కాదు చాలామందికి అలానే అనిపిస్తుందని గుర్తుంచుకోండి. మానసిక సమస్యలతో బాధపడేవాళ్లు అన్నిచోట్ల ఉన్నారు.

ప్రస్తుతం మనం “ప్రమాదకరమైన, కష్టమైన” కాలాల్లో జీవిస్తున్నాం. దాంతో, మన చుట్టూ ఉన్న పరిస్థితులు చాలామందిలో ఒత్తిడిని, ఆందోళనను పెంచుతున్నాయి. (2 తిమోతి 3:1) ప్రపంచంలో ప్రతీ ఎనిమిది మందిలో ఒకరికి మానసిక సమస్య ఉందని ఒక పరిశోధనలో తేలింది. కోవిడ్‌-19 ప్రపంచాన్ని ఎంతలా కుదిపేసిందో మనందరికీ తెలుసు. 2020లో పరిస్థితి ఎలా ఉందని సర్వే చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, 2019తో పోలిస్తే దాదాపు 26 కన్నా ఎక్కువ శాతం మంది ఆందోళనకు (anxiety) గురయ్యారు. 28 కన్నా ఎక్కువ శాతం మంది తీవ్రమైన డిప్రెషన్‌కు లోనయ్యారు.

ఆందోళనకు, డిప్రెషన్‌కు ఎంతమంది గురౌతున్నారో తెలుసుకోవడం ముఖ్యమే. అయితే మీరు, మీకిష్టమైనవాళ్లు ఎలా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది లాంటి వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడం దానికన్నా ముఖ్యం.

మానసిక ఆరోగ్యం అంటే ఏంటి?

మానసికంగా ఆరోగ్యంగా ఉండడమంటే ఏ దిగులు లేకుండా, మన పనిని చక్కగా చేసుకోవడం; సాధారణంగా ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకుంటూ ముందుకు వెళ్లడం, సంతృప్తిగా జీవించడం.

మానసిక సమస్య . . .

  • మీ బలహీనత వల్ల వచ్చేది కాదు.

  • శరీరానికి జబ్బులు వచ్చినట్టే మనసుకు కూడా జబ్బులు వస్తాయి; వాటినే మానసిక సమస్యలు అంటారు. అవి ఉన్నవాళ్లకు చాలా బాధగా అనిపిస్తుంది, సరిగ్గా ఆలోచించలేరు, ఎమోషన్స్‌ కంట్రోల్‌ చేసుకోలేరు, ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది.

  • అలాంటివాళ్లు అంత త్వరగా స్నేహితుల్ని చేసుకోలేరు; రోజువారీ పనుల్ని చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది.

  • ఈ సమస్య ఎవ్వరికైనా రావచ్చు. వయసు, సంస్కృతి, జాతి, దేశం, మతం, చదువు, డబ్బుతో దీనికి సంబంధం లేదు.

మానసిక సమస్యలు ఉంటే వైద్య సహాయం తీసుకోవాలి

ప్రవర్తనలో చాలా మార్పు, సరిగ్గా నిద్రపట్టకపోవడం, అతిగా తినడం లేదా సరిగ్గా తినకపోవడం, ఎక్కువసేపు బాధగా గానీ, కంగారుగా గానీ అనిపించడం​—ఇలాంటి లక్షణాలు మీకు గానీ, మీకిష్టమైన వాళ్లకు గానీ ఉంటే, వెంటనే డాక్టర్‌ని కలిసి అలా ఎందుకు అనిపిస్తుందో, దానికి పరిష్కారం ఏంటో తెలుసుకోవడం మంచిది.

ఇప్పటివరకు భూమ్మీద జీవించిన వాళ్లలో అత్యంత తెలివైన వ్యక్తి యేసుక్రీస్తు. ఆయనిలా అన్నాడు: “ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు వైద్యుడు అవసరం లేదు, రోగులకే అవసరం.” (మత్తయి 9:12) మానసిక సమస్యలతో పోరాడుతున్నవాళ్లు సరైన ట్రీట్‌మెంట్‌ తీసుకుని మందులు వాడితే వ్యాధి లక్షణాలు తగ్గుతాయి, వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ సంతోషంగా జీవించగలుగుతారు. ఒకవేళ వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్నా లేదా ఎక్కువకాలం నుండి ఉన్నా, ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా ట్రీట్‌మెంట్‌ తీసుకోవడం మంచిది. a

బైబిలు వైద్య సలహాలు ఉన్న పుస్తకం కాకపోయినా, అందులోని విషయాలు మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయం చేస్తాయి. మానసిక సమస్యలతో పోరాడడానికి బైబిల్లో ఉన్న సలహాలు ఎలా సహాయం చేస్తాయో, తర్వాత పేజీల్లో ఉన్న సమాచారాన్ని చదివి తెలుసుకోమని ప్రేమతో ప్రోత్సహిస్తున్నాం.

aకావలికోట ఫలానా ట్రీట్‌మెంట్‌ మంచిదని సలహా ఇవ్వడం లేదు. ప్రతీ ఒక్కరు ఎవరికి వాళ్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి.