కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ లోకం అంతమైపోతుందా?

ఈ లోకం అంతమైపోతుందా?

లోకాంతం గురించి బైబిలు మాట్లాడుతుందని మీకూ తెలిసే ఉంటుంది. (1 యోహాను 2:17) అంటే మనుషులు నాశనం అయిపోతారని చెప్తుందా? భూమి మీద ఏ ప్రాణి లేకుండా ఖాళీగా ఉంటుందా లేదా భూమి పూర్తిగా నాశనమైపోతుందా?

ఈ ప్రశ్నలకు బైబిలు కాదని జవాబిస్తుంది!

ఏవి అంతం కావు?

మనుషులు

బైబిలు ఏం చెప్తుందంటే: దేవుడు “భూమిని ఊరికే చేయలేదు, అది నివాస స్థలంగా ఉండేలా చేశాడు.” —యెషయా 45:18.

భూమి

బైబిలు ఏం చెప్తుందంటే: “ఒక తరం వెళ్లిపోతోంది, ఇంకో తరం వస్తోంది, కానీ భూమి ఎప్పటికీ నిలిచివుంటుంది.”—ప్రసంగి 1:4.

దీని అర్థమేంటి: బైబిలు చెప్తున్నట్టు, భూమి ఎప్పటికీ నాశనం కాదు. దానిమీద ప్రజలు ఎప్పుడూ జీవిస్తారు. మరి లోకాంతం అంటే ఏంటి?

దీని గురించి ఆలోచించండి: బైబిలు రాబోయే లోకాంతాన్ని నోవహు కాలంలో జరిగిన సంఘటనలతో పోలుస్తోంది. ఆ రోజుల్లో భూమంతా “దౌర్జన్యంతో నిండిపోయింది.” (ఆదికాండం 6:13) కానీ నోవహు నీతిమంతుడు. అందుకే దేవుడు నోవహును, అతని కుటుంబాన్ని కాపాడాడు. కానీ ఆయన చెడ్డ ప్రజలను జలప్రళయం ద్వారా నాశనం చేశాడు. ఆ రోజుల్లో ఏం జరిగిందో వివరిస్తూ, బైబిలు ఇలా చెప్తుంది: “జలప్రళయం వచ్చినప్పుడు ఆ నీళ్ల వల్లే అప్పటి లోకం నాశనమైంది.” (2 పేతురు 3:6) అలా అప్పుడున్న లోకం నాశనమైంది. అంటే భూమి నాశనమైందా? లేదు, భూమ్మీద ఉన్న చెడ్డ ప్రజలు. కాబట్టి బైబిలు లోకాంతం అని అంటున్నప్పుడు, భూమి నాశనం అవుతుందని చెప్పట్లేదు. కానీ భూమ్మీద ఉన్న చెడ్డ ప్రజలు, చెడ్డ పరిస్థితులు నాశనమౌతాయని బైబిలు చెప్తుంది.

ఏవి అంతం అవుతాయి?

సమస్యలు, చెడుతనం

బైబిలు ఏం చెప్తుందంటే: “కొంతకాలం తర్వాత దుష్టులు ఇక ఉండరు; ఒకప్పుడు వాళ్లు ఉన్న స్థలాన్ని నువ్వు వెదికినా వాళ్లు కనిపించరు. అయితే సాత్వికులు భూమిని స్వాధీనం చేసుకుంటారు, వాళ్లు ఎంతో శాంతిని అనుభవిస్తూ చాలా సంతోషంగా ఉంటారు.”—కీర్తన 37:10, 11.

దీని అర్థమేంటి: నోవహు రోజుల్లో వచ్చిన జలప్రళయం చెడుతనాన్ని ఒకేసారి పూర్తిగా తీసేయలేదు. జలప్రళయం తర్వాత చెడ్డ ప్రజల వల్ల మళ్లీ అందరూ కష్టాలు పడుతున్నారు. కానీ త్వరలో దేవుడు చెడుతనాన్ని తీసేస్తాడు. “దుష్టులు ఇక ఉండరు” అని బైబిలు చెప్తుంది. దేవుడు చెడుతనాన్ని తన రాజ్యం ద్వారా తీసేస్తాడు. ఆ రాజ్యం పరలోకం నుండి భూమ్మీద దేవునికి లోబడే ప్రజల్ని పరిపాలించే ఒక ప్రభుత్వం.

దీని గురించి ఆలోచించండి: ఇప్పుడు ఈ లోకాన్ని పరిపాలిస్తున్న నాయకులు దేవుని రాజ్యానికి మద్దతిస్తారా? వాళ్లు మద్దతివ్వరని బైబిలు చెప్తుంది. వాళ్లు మూర్ఖంగా దేవుని రాజ్యాన్ని వ్యతిరేకిస్తారు. (కీర్తన 2:2) దానివల్ల ఏం జరుగుతుంది? దేవుని రాజ్యం మనుషుల ప్రభుత్వాలన్నిటినీ నాశనం చేసి, వాటి స్థానంలో అదొక్కటే “ఎప్పటికీ నిలుస్తుంది.” (దానియేలు 2:44) అయితే మనుషుల పరిపాలన ఎందుకు అంతమవ్వాలి?

మనుషుల పరిపాలన ఎందుకు అంతమవ్వాలి?

బైబిలు ఏం చెప్తుందంటే: “తన అడుగును నిర్దేశించుకునే అధికారం కూడా అతనికి లేదు.”—యిర్మీయా 10:23.

దీని అర్థమేంటి: మనుషులు తమను తాము పరిపాలించుకునేలా సృష్టించబడలేదు. అందుకే ప్రజల్ని పరిపాలించే విషయంలో, సమస్యల్ని పరిష్కరించే విషయంలో విఫలమవుతున్నారు.

దీని గురించి ఆలోచించండి: బ్రిటానికా అకాడమిక్‌ అనే రిఫెరెన్సు ఏం చెప్తుందంటే, ప్రతీ ప్రభుత్వం “మనుషులకు శత్రువులుగా ఉన్న పేదరికం, ఆకలి, వ్యాధులు, ప్రకృతి విపత్తులు, యుద్ధం, హింస వంటివాటితో పోరాడలేకపోతున్నాయి.” ఒక ప్రపంచవ్యాప్త ప్రభుత్వం మాత్రమే ఆ శత్రువులతో విజయవంతంగా పోరాడగలదని ఆ రిఫెరెన్సు చెప్తుంది. ఒకవేళ మనుషుల ప్రభుత్వాలన్నీ ఒకే మాట మీద ఉన్నా, దానిలోని పరిపాలకుందరూ అపరిపూర్ణులే అంటే మనలాంటి మనుషులే. కాబట్టి పైన ప్రస్తావించిన సమస్యల్ని వాళ్లు పరిష్కరించలేకపోతున్నారు. దేవుని ప్రభుత్వానికి మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యల్ని పూర్తిగా తీసేయగల శక్తి ఉంది.

కాబట్టి బైబిలు చెప్తున్నట్టు లోకాంతమంటే, ఇప్పుడున్న చెడ్డ పరిస్థితులు నాశనం అవ్వడం. అది జరిగినప్పుడు మంచివాళ్లు భయపడరు. బదులుగా అది వాళ్లకు సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న చెడ్డ లోకం స్థానంలో దేవుడిచ్చే అద్భుతమైన కొత్త లోకం వస్తుంది!

మరి ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? దానికి బైబిలు ఇచ్చే జవాబును తర్వాతి ఆర్టికల్‌ వివరిస్తుంది