కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మంచి విలువలు మంచి దిక్సూచి లాంటివి. మీ పిల్లలు ఎటు వెళ్లాలో నిర్ణయించుకోవడానికి అవి సహాయం చేస్తాయి

తల్లిదండ్రులకు

7: విలువలు

7: విలువలు

అంటే ఏంటి?

“విలువలు” అంటే జీవితంలో ఇలా ఉండాలని మీకు మీరుగా పెట్టుకునే ప్రమాణాలు. ఉదాహరణకు మీరు అన్ని విషయాల్లో నిజాయితీగా ఉండడానికి కష్టపడుతూ ఉంటారా? అప్పుడు మీరు అదే మంచి విలువని మీ పిల్లల్లో కూడా నాటడానికి ప్రయత్నిస్తారు.

విలువల్లో నీతినియమాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు మంచి నియమాలున్న అతను కష్టపడి పని చేస్తాడు, న్యాయంగా ఉంటాడు, వేరేవాళ్ల గురించి ఆలోచిస్తాడు. చిన్నతనంలోనే ఇలాంటి మంచి లక్షణాలను బాగా అభివృద్ధి చేసుకోవచ్చు.

మంచి సూత్రాలు: “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.”—సామెతలు 22:6.

ఎందుకు ముఖ్యం?

టెక్నాలజీ యుగంలో నైతిక విలువలు చాలా అవసరం. “చెడు ప్రభావాలు ఏ మొబైల్‌ ఫోన్‌లోనైనా ఎప్పుడైనా ఉంటాయి. మన పిల్లలు మన పక్కనే కూర్చుని ఉన్నా అసభ్యకరమైన వాటిని చూస్తూ ఉండవచ్చు” అని కరెన్‌ అనే తల్లి అంటుంది.

మంచి సూత్రాలు: ‘పరిణతి గలవాళ్లు . . . తమ వివేచనా సామర్థ్యాల్ని ఉపయోగిస్తూ వాటికి శిక్షణ ఇచ్చుకున్నారు. దానివల్ల వాళ్లు తప్పొప్పులను గుర్తించగలుగుతారు.’—హెబ్రీయులు 5:14.

నీతినియమాలు లేదా మంచి అలవాట్లు కూడా అవసరం. చిన్నచిన్న మర్యాదలు (“ప్లీజ్‌,” “థాంక్యూ” అని చెప్పడం), ఇతరుల గురించి ఆలోచించడం కూడా మంచి అలవాట్లే. కానీ ఈ రోజుల్లో ఇతరుల గురించి ఆలోచించడం చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే మనుషులకన్నా ఎక్కువగా ఎలక్ట్రానిక్‌ పరికరాలపైనే ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.

మంచి సూత్రాలు: “ఇతరులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటారో మీరూ వాళ్లకు అలాగే చేయండి.”—లూకా 6:31.

మీరు ఏమి చేయవచ్చు

మీ నైతిక విలువల గురించి చెప్పండి. ఉదాహరణకు పెళ్లికి ముందే సెక్స్‌ తప్పు అనే విషయాన్ని టీనేజర్లకు స్పష్టంగా చెప్పినట్లైతే అలాంటి ప్రవర్తనకు వాళ్లు దూరంగా ఉండే అవకాశం ఎక్కువ అని పరిశోధనలు చూపిస్తున్నాయి.

ఇలా చేయండి: విలువల గురించి మాట్లాడడానికి ఇప్పుడు జరుగుతున్న ఒక సంఘటనను ప్రస్తావించండి. ఉదాహరణకు వార్తల్లో కోపం వల్ల జరిగిన నేరం గురించి వస్తే, మీరు ఇలా చెప్పవచ్చు: “కొంతమంది వాళ్ల కోపాన్ని ఇతరుల మీద చాలా భయంకరంగా చూపిస్తారు. అసలు మనుషులు అలా ఎలా తయారు అవుతారని నీకు అనిపిస్తుంది?”

“పిల్లలకు మంచి ఏదో చెడు ఏదో తెలియనప్పుడు వాళ్లకు మంచిచెడుల మధ్య నిర్ణయించుకోవడం చాలా కష్టం అవుతుంది.”—బ్రాండన్‌.

మంచి అలవాట్లు నేర్పించండి. చిన్నపిల్లలు కూడా “ప్లీజ్‌,” “థాంక్యూ” చెప్పడం, వేరేవాళ్ల పట్ల శ్రద్ధ చూపించడం నేర్చుకోగలరు. “పిల్లలు వాళ్లు ఒక్కళ్లే కాదు, వాళ్ల చుట్టూ చాలామంది ఉన్నారనే విషయాన్ని చూడగలగాలి. అంటే వాళ్లు ఒక కుటుంబంలో, ఒక స్కూల్లో, ఒక సమాజంలో ఉన్నారనే విషయాన్ని అర్థం చేసుకుంటే వాళ్లు ఎంతో ఎక్కువగా తమకు ఉపయోగపడే పనులే కాకుండా అందరికీ ఉపయోగపడే మంచి పనులు చేస్తారు” అని పేరెంటింగ్‌ వితౌట్‌ బార్డర్స్‌ అనే పుస్తకం చెప్తుంది.

ఇలా చేయండి: ఇతరులకు సేవ చేయడంలో ఉన్న విలువ నేర్పించడానికి మీ పిల్లలకు ఇంట్లో కొన్ని పనులు చెప్పండి.

“మీ పిల్లలు ఇప్పుడు పనులు చేయడం నేర్చుకుంటే, వాళ్ల సొంతగా జీవించాల్సి వచ్చినప్పుడు వాళ్లకు పెద్ద ఇబ్బంది ఉండదు. బాధ్యతలు చూసుకోవడం ఇప్పటికే వాళ్ల జీవితంలో ఒక భాగం అయిపోతుంది.”—టారా.