కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆహార ఎలర్జీ, ఆహారం అరగకపోవడం​​—⁠ఈ రెండిటికీ తేడా ఏంటి?

ఆహార ఎలర్జీ, ఆహారం అరగకపోవడం​​—⁠ఈ రెండిటికీ తేడా ఏంటి?

ఎమిలీ: “ఫోర్క్‌ కింద పెట్టేశాను, నాకు ఇబ్బందిగా అనిపించడం మొదలైంది. నోరంతా దురద వస్తున్నట్టు ఉంది. నాలుక వాస్తుంది. తల తిరుగుతుంది, సరిగ్గా ఊపిరి ఆడడం లేదు. చేతులు మీద, మెడ మీద దద్దుర్లు వచ్చేశాయి. భయపడకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాగానీ వెంటనే హాస్పిటల్‌కు వెళ్ళాలని నాకు అర్థమైంది.”

చాలామంది ఆహారాన్ని ఆనందిస్తారు. కానీ, కొంతమంది కొన్ని ఆహార పదార్థాలను “శత్రువులుగా” చూడాల్సి వస్తుంది. మనం పైన చూసిన ఎమిలీలా వాళ్లు కూడా ఆహార పదార్థాలకు సంబంధించిన ఎలర్జీలతో బాధపడతారు. ఎమిలీకు ఎలర్జీ వల్ల జరిగినదానిని అనాఫిలాక్సిస్‌ అంటారు. అది చాలా ప్రమాదకరమైనది. కానీ చాలా ఎలర్జీలు అంత ప్రమాదకరమైనవి కావు.

గత కొన్ని సంవత్సరాల్లో ఆహారం పడక ఎలర్జీ, అరగకపోవడం చాలా ఎక్కువ అయ్యింది. కానీ పరిశోధనల ప్రకారం, చాలా తక్కువమందికి ఆహార ఎలర్జీలు ఉన్నట్టు డాక్టర్లు చెప్తున్నారు.

ఆహార ఎలర్జీ అంటే ఏమిటి?

“ఆహార ఎలర్జీకి ఒక ప్రత్యేక నిర్వచనం లేదు,” అని డాక్టర్‌ జెనిఫర్‌ జే. ష్నైడర్‌ చాఫెన్‌ ఆధ్వర్యంలో కొంతమంది సైంటిస్ట్‌లు The Journal of the American Medical Association అనే పత్రికకు ఇచ్చిన రిపోర్ట్‌లో ఉంది. అయితే, చాలామంది నిపుణులు శరీరంలో ఉండే వ్యాధినిరోధక వ్యవస్థ వల్లే ఎలర్జీలు వస్తున్నాయని నమ్ముతున్నారు.

ఒక ఆహార పదార్థం తిన్నప్పుడు ఎలర్జీ వస్తే సాధారణంగా అది ఆ ఆహారంలో ఉండే ప్రోటీన్‌ లేదా మాంసకృత్తు వల్ల వస్తుంది. వ్యాధినిరోధక వ్యవస్థ ఆ ప్రోటీన్‌ను హానికరమైనదని తప్పుగా గుర్తిస్తుంది. ఆ ప్రోటీన్‌ శరీరంలో ప్రవేశించగానే వ్యాధినిరోధక వ్యవస్థ ఆ ప్రోటీన్‌కు విరుగుడుగా ఐజీఈ (IgE) అనే ఒక రకమైన యాంటీబాడీని విడుదల చేస్తుంది. ఆ ఆహారాన్ని మళ్లీ తిన్నప్పుడు, అంతకుముందు తయారైన యాంటీబాడీలు కొన్ని రసాయనాలను విడుదల చేస్తాయి. వాటిలో ఒకటి హిస్టమీన్‌.

సాధారణంగా వ్యాధినిరోధక వ్యవస్థలో హిస్టమీన్‌ చాలా ఉపయోగకరమైనది. కానీ ఎందుకో కొన్ని రకాల ప్రోటీన్‌లు పడని శరీరంలో ఐజీఈ యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాక, హిస్టమీన్‌ విడుదల అయినప్పుడు ఎలర్జీ రియాక్షన్‌ వస్తుంది.

అందుకే మనం ఏదైన ఒక కొత్త ఆహారాన్ని మొదటిసారి తిన్నప్పుడు ఏ రియాక్షన్‌ కనిపించకపోయినా ఆ తర్వాత మళ్లీ దాన్ని తిన్నప్పుడు ఎలర్జీ వస్తుంది.

ఆహారం అరగకపోవడం అంటే ఏంటి?

ఆహార ఎలర్జీలానే, తిన్న ఆహారం పడనప్పుడు ఆహారం అరగకపోవడం జరుగుతుంది లేదా అజీర్తి చేస్తుంది. ఆహార ఎలర్జీలా (వ్యాధినిరోధక వ్యవస్థ వల్ల వచ్చే రియాక్షన్‌) కాకుండా, ఆహారం అరగకపోవడం జీర్ణ వ్యవస్థలో మొదలౌతుంది. కాబట్టి దీనికి యాంటీబాడీలతో సంబంధం ఉండదు. జీర్ణించడానికి అవసరమైన ఎన్‌జైమ్‌లు లేనప్పుడు లేదా ఆహారంలో ఉన్న రసాయనాలు జీర్ణించడం కష్టమైనప్పుడు అజీర్తి చేస్తుంది. ఉదాహరణకు, పాలలో ఉండే చక్కెర పదార్థం (lactose) జీర్ణించడానికి అవసరమైన ఎన్‌జైమ్‌లు మన పొట్ట తయారు చేయనప్పుడు పాల చక్కెర అరగకపోవడం లేదా lactose intolerance వస్తుంది.

ఈ పరిస్థితి యాంటీబాడీలు ఉత్పత్తి అవ్వడం వల్ల వచ్చేది కాదు కాబట్టి కొత్త ఆహారాన్ని మొదటిసారి తిన్నప్పుడే అరగనట్టు అనిపిస్తుంది. ఎంత తిన్నామో కూడా ముఖ్యం. ఎందుకంటే కొంచెం తిన్నప్పుడు ఏమి కాకపోవచ్చు కానీ అదే ఎక్కువ తింటే సమస్య రావచ్చు. అయితే ఇది తక్కువ తిన్నా ప్రాణాపాయం కలిగించే తీవ్రమైన ఆహార ఎలర్జీల్లాంటిది కాదు.

లక్షణాలు ఏంటి?

మీకు ఆహార ఎలర్జీ ఉంటే, దురద రావచ్చు, దద్దుర్లు రావచ్చు, గొంతు, కళ్లు, నాలుక వాయొచ్చు, కడుపులో తిప్పొచ్చు, వాంతులు, విరోచనాలు అవ్వవచ్చు. పరిస్థితి తీవ్రమైనప్పుడు బీ.పీ. పడిపోవచ్చు, తల తిరగవచ్చు, స్పృహ తప్పిపోవచ్చు, గుండెపోటు కూడా రావచ్చు. ఇలాంటి అనాఫిలాక్‌టిక్‌ రియాక్షన్‌ ఒక్కసారిగా ఎక్కువైపోయి, చివరకు ప్రాణం కూడా పోవచ్చు.

చెప్పాలంటే, ఎలాంటి ఆహారానికైనా ఎలర్జీ రావచ్చు. కానీ, తీవ్రమైన ఎలర్జీలు ఎక్కువగా పాలు, గుడ్లు, చేపలు, పీత-రొయ్య లాంటి పెంకు ఉండే జీవులు, వేరుశనగలు, సోయబీన్స్‌, పప్పు గింజలు (tree nuts), గోధుమలు వల్ల వస్తాయి. ఎలర్జీ ఏ వయసులోనైనా రావచ్చు. పరిశోధనల ప్రకారం ముఖ్యంగా వంశపారంపర్యంగా ఎలర్జీలు వస్తాయి. తల్లిదండ్రుల్లో ఒక్కరికి లేదా ఇద్దరికి ఎలర్జీలు ఉంటే పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ అని చెప్తున్నారు. అయితే ఎదిగే కొద్ది పిల్లల్లో ఎలర్జీలు తగ్గిపోవచ్చు.

ఆహారం అరగకపోవడం వల్ల వచ్చే లక్షణాలు తీవ్రమైన ఎలర్జీలంత ప్రమాదకరం కాదు. ఆహారం అరగనప్పుడు కడుపులో నొప్పి, పొట్ట ఉబ్బడం, గ్యాస్‌, కండరాలు పట్టుకుపోవడం, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు, అలసట, అస్వస్థత అనిపించవచ్చు. పాల పదార్థాలు, గోధుమలు, ధాన్యాల్లో ఉండే జిగట పదార్థం, మద్యం, యీస్ట్‌ లాంటి చాలా రకాల ఆహారం త్వరగా అరగదు.

నిర్ధారణ, చికిత్స

మీకు ఆహార ఎలర్జీ గానీ, ఆహారం అరగకపోవడం గానీ ఉందనిపిస్తే డాక్టర్‌ దగ్గరకు వెళ్లండి. మీకు మీరే నిర్ణయించుకుని, కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం మానేయడం మంచిది కాదు. అలా చేస్తే మీకు తెలియకుండా అవసరమైన కొన్ని పోషక పదార్థాలు మీ శరీరానికి అందవు.

తీవ్రమైన ఎలర్జీలు కలిగించే ఆహార పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండడమే తప్ప వేరే ఖచ్చితమైన చికిత్స ఏది లేదు. a మీకు చిన్నచిన్న ఆహార ఎలర్జీలు ఉన్నా లేదా కొన్ని రకాల ఆహారం అరగకపోయినా అలాంటి ఆహారాన్ని తక్కువ సార్లు తక్కువ మోతాదులో తినడం మంచిది. కొన్ని పరిస్థితుల్లో ఆహారం అరగనప్పుడు తీవ్రతను బట్టి, అందుకు కారణమైన ఆహారానికి కొన్ని రోజుల వరకు దూరంగా ఉండాలి లేదా పూర్తిగా మానేయాలి.

మీకు ఆహార ఎలర్జీ ఉన్నా లేదా ఆహారం అరగకపోయినా ఆ పరిస్థితిలో ఉన్న చాలామంది ఎలా ఉండాలో నేర్చుకుని, రకరకాల ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారం తింటున్నారు కాబట్టి మీరూ వాళ్లలా ఉండవచ్చు. ◼ (g16-E No. 3)

a తీవ్రమైన ఎలర్జీలు ఉన్నవాళ్లు ఎడ్రినలిన్‌ (ఎపినెఫ్రీన్‌) పెన్‌ లేదా ఇంజెక్షన్‌ వాళ్లతోపాటు ఎప్పుడూ పెట్టుకోవడం మంచిది. అత్యవసర పరిస్థితుల్లో ఆ ఇంజెక్షన్‌ను సొంతగా చేసుకోవచ్చు. ఎలర్జీలు ఉన్న పిల్లలు, టీచర్లకు వాళ్లను చూసుకునేవాళ్లకు తెలిసేలా వాళ్ల పరిస్థితి వివరించే ఒక గుర్తును ఎప్పుడు వాళ్లతో ఉంచుకోవడం మంచిదని డాక్టర్లు చెప్తున్నారు.