కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వివక్ష​—⁠అది మీకూ అంటుకుందా?

వివక్ష​—⁠అది మీకూ అంటుకుందా?

వివక్ష అనేది ఒక జబ్బు లాంటిది. దాని బారినపడిన వాళ్లకు అది హాని చేస్తుంది, తమలో ఆ జబ్బు ఉందని కూడా వాళ్లకు తెలియకపోవచ్చు.

ప్రజలు సాధారణంగా దేశం, జాతి, కులం, మతం, భాష, హోదా వంటి వాటిని బట్టి వివక్షకు గురౌతుంటారు. కొంతమంది మగవాళ్లను ఒకలా, ఆడవాళ్లను ఒకలా చూస్తారు. ఇంకొంతమంది ఎదుటివాళ్ల వయసు, చదువు, వైకల్యం, కనిపించే తీరును బట్టి ముందే ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు. అయినా తాము వివక్ష చూపిస్తున్నామని గుర్తించరు.

వివక్ష అనే జబ్బు మీలో కూడా ఉండే అవకాశం ఉందా? వేరేవాళ్లు వివక్ష చూపిస్తున్నారని మనలో చాలామందిమి గుర్తిస్తాం. కానీ మనం కూడా వివక్ష చూపిస్తున్నామని గుర్తించలేకపోవచ్చు. వాస్తవం ఏంటంటే, అందరిలోనూ ఎంతో కొంత వివక్ష ఉంటుంది. సమాజశాస్త్ర (Sociology) ప్రొఫెసర్‌ అయిన డేవిడ్‌ విలియమ్స్‌ ఇలా అంటున్నాడు: ‘ఏదైనా ఒక వర్గం వాళ్ల మీద ఒకవ్యక్తికి చెడు అభిప్రాయం ఉంటే, అతను వాళ్లను కలిసినప్పుడు వాళ్లతో సరిగ్గా ప్రవర్తించడు. నిజానికి తను అలా ప్రవర్తిస్తున్నట్టు తనకే తెలీదు.’

ఉదాహరణకు, బాల్కన్‌ దేశానికి చెందిన జోవిక ఇలా అంటున్నాడు: “మా దేశంలో ఒక మైనారిటీ గుంపు ఉంది. ఆ గుంపులోని వాళ్లందరూ మంచివాళ్లు కాదని నేను అనుకున్నాను. నా అభిప్రాయం సరైనదనే భ్రమలో ఉండడం వల్ల నేను వివక్ష చూపిస్తున్నట్టు నాకు తెలీలేదు.”

జాతి వివక్షను, వేరే రకాల వివక్షల్ని తీసేయడానికి చాలా ప్రభుత్వాలు చట్టాల్ని తయారుచేశాయి. అయినా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఎందుకు? ఎందుకంటే ఆ చట్టాలు ఒకవ్యక్తి చేసే పనుల్ని అదుపు చేయగలవు కానీ అతని ఆలోచనల్ని, భావాల్ని కాదు. పైగా వివక్ష అనేది ఒకవ్యక్తి మనసులో, హృదయంలో మొదలౌతుంది. మరి ఈ వివక్ష ఎప్పటికీ ఇలాగే ఉంటుందా? ఈ జబ్బుకు మందు లేదా?

చాలామంది తమ మనసులో, హృదయంలో ఉన్న వివక్షను తీసేసుకోగలిగారు. వాళ్లకు సహాయం చేసిన ఐదు విషయాల్ని తర్వాతి పేజీల్లో చూస్తాం.