కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ఒక లేఖనాన్ని మరో లేఖనంతో పోల్చుదాం”

“ఒక లేఖనాన్ని మరో లేఖనంతో పోల్చుదాం”

“ఒక లేఖనాన్ని మరో లేఖనంతో పోల్చుదాం”

న్యూయార్క్‌ నగరానికి వెళ్తున్న ఒక వ్యక్తికి రైలులో క్రింద పడివున్న ఒక మతసంబంధమైన కరపత్రం దొరికింది. ఆ కరపత్రం, మరణించిన తర్వాత మానవునిలో ఏ భాగం సజీవంగా ఉండదని బోధించింది. మతబోధకుడైన ఆ వ్యక్తి ఆసక్తితో ఆ కరపత్రాన్ని చదవడం మొదలుపెట్టాడు. ఆయన దాన్ని చదివి ఆశ్చర్యానికి గురయ్యాడు, ఎందుకంటే ఆయన అంతకుముందు ఎన్నడూ మరణం తర్వాత మనలో ఏదో మిగిలి ఉంటుందనే బోధను అనుమానించలేదు. ఆ కరపత్రాన్ని ఎవరు రాశారన్నది అప్పటికి ఆయనకు తెలియదు. అయినా, అందులోని వాదనలు హేతుబద్ధంగా, లేఖనాధారంగా, జాగ్రత్తగా అధ్యయనం చేయదగినవిగా ఉన్నాయని ఆయన గ్రహించాడు.

ఆ పరిచారకుడు జార్జ్‌ స్టార్స్‌. ఆ సంఘటన 1837లో జరిగింది, అదే సంవత్సరం ఛార్లెస్‌ డార్విన్‌, పరిణామ సిద్ధాంతంగా వృద్ధి చెందబోయే తన ఆలోచనలను నోటుపుస్తకంలో మొదటిసారిగా రాసుకున్నాడు. ఆ కాలంలో ప్రజలకు దైవభక్తి ఉండేది, చాలామంది దేవుణ్ణి నమ్మేవారు. ఎంతోమంది బైబిలు చదివేవారు, దానిని ప్రామాణిక పుస్తకంగా పరిగణించేవారు.

పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాకు చెందిన హెన్రీ గ్రూ ఆ కరపత్రాన్ని రాసినట్లు స్టార్స్‌కు ఆ తర్వాత తెలిసింది. “ఒక లేఖనాన్ని అర్థం చేసుకోవడానికి . . . వేరే లేఖనాలు తోడ్పడతాయి” అనే సూత్రాన్ని హెన్రీ గ్రూ గట్టిగా నమ్మాడు. హెన్రీ గ్రూ, ఆయన సహచరులు తమ జీవితాలను, కార్యకలాపాలను బైబిలు బోధలకు అనుగుణంగా మలచుకోవాలనే లక్ష్యంతో దాన్ని అధ్యయనం చేశారు. వారి అధ్యయనాలు కొన్ని చక్కని లేఖన సత్యాలను వెల్లడిచేశాయి.

గ్రూ రచనల నుండి ప్రేరణపొందిన స్టార్స్‌, మరణించినవారి గురించి బైబిలు ఏమి చెబుతుందో జాగ్రత్తగా పరిశీలించి, దానిలోని విషయాలను తన తోటి ప్రచారకుల్లో కొందరితో చర్చించాడు. ఆయన ఐదు సంవత్సరాలు దానిని జాగ్రత్తగా అధ్యయనం చేసిన తర్వాత తాను కొత్తగా కనుగొన్న ఆ అమూల్యమైన లేఖన సత్యాన్ని ప్రచారం చేయాలని చివరకు నిర్ణయించుకున్నాడు. 1842 సంవత్సరంలోని ఒక ఆదివారం దానిని ప్రచారం చేయడానికి ప్రారంభంలో ఆయన ఒక ప్రసంగాన్ని సిద్ధపడ్డాడు. అయితే, ఆ అంశానికి న్యాయం చేకూర్చాలంటే మరికొన్ని ప్రసంగాలు ఇవ్వాలని ఆయనకు అనిపించింది. కొంతకాలానికి, మానవునిలో అమర్త్యమైనదేదీ లేదనే అంశంమీద ఆయన ఆరు ప్రసంగాలు ఇచ్చాడు, వాటిని సిక్స్‌ సెర్మన్స్‌ అనే పుస్తకంలో ప్రచురించాడు. దేవుణ్ణి అగౌరవపర్చే క్రైస్తవమత సిద్ధాంతాలవల్ల మరుగునపడిన అద్భుతమైన సత్యాన్ని వెలికితీసేందుకు స్టార్స్‌ ఒక లేఖనాన్ని మరో లేఖనంతో పోల్చాడు.

మరణించినవారి గురించి బైబిలు ఏమి బోధిస్తోంది?

యేసు అభిషిక్త అనుచరులు తమ యథార్థతకు ప్రతిఫలంగా అమర్త్యతను పొందుతారని బైబిలు బోధిస్తోంది. (1 కొరింథీయులు 15:​50-56) నమ్మకస్థులకు అమర్త్యత ప్రతిఫలంగా లభిస్తే, దుష్టులు అమర్త్యతను పొందే అవకాశంలేదని స్టార్స్‌ తర్కించాడు. ఆయన ఊహాగానాలు చేసేబదులు లేఖనాలను పరిశోధించాడు. ఆయన మత్తయి 10:​28ను, యెహెజ్కేలు 18:⁠4ను పరిశోధించి, మరణం తర్వాత మానవునిలో ఏదీ మిగిలి ఉండదనే నిర్ధారణకు వచ్చాడు. * బైబిలు అంతటినీ పరిశోధించిన తర్వాత అమూల్యమైన సత్యం స్పష్టమైంది. “ఈ విషయంలో నా అభిప్రాయం సరైందైతే, ఆ సామాన్య సిద్ధాంతంవల్ల అస్పష్టంగా ఉన్న లేఖనాల్లోని అనేక భాగాలు స్పష్టంగా, అందంగా, ఎంతో అర్థవంతంగా, ప్రభావవంతంగా తయారౌతాయి.”

అయితే యూదా 7 వంటి లేఖనాల విషయమేమిటి? అక్కడ ఇలా ఉంది: “ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారము చేయుచు, పరశరీరానుసారులైనందున్న నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను.” ఆ లేఖనాన్ని చదివి, సొదొమ గొమొఱ్ఱాలలో చంపబడినవారు అగ్నిలో శాశ్వతంగా యాతనపెట్టబడతారనే నిర్ధారణకు కొందరు రావచ్చు. “మనం ఒక లేఖనాన్ని మరో లేఖనంతో పోల్చుదాం” అని స్టార్స్‌ రాశాడు. ఆ తర్వాత ఆయన 2 పేతురు 2:​5, 6ను ఉదాహరించాడు, అక్కడ ఇలా ఉంది: “మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించినప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను. మరియు ఆయన సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మముచేసి, ముందుకు భక్తిహీనులగువారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధిం[చెను].” అవును, సొదొమ గొమొఱ్ఱా పట్టణాలను యెహోవా భస్మం చేశాడు, వాటితోపాటు వాటి నివాసులను శాశ్వతంగా నాశనం చేశాడు.

“యూదా పుస్తకంలోని లేఖనాన్ని పేతురు వివరిస్తున్నాడు. ఆ రెండు పుస్తకాలను పోల్చడం ద్వారా దేవుడు పాపులపట్ల తన కోపాన్ని ఎలా చూపించాడో స్పష్టంగా తెలుసుకుంటాం. . . . పూర్వకాలమందున్న లోకంమీద, సొదొమ గొమొఱ్ఱాలమీద విధించబడిన ఆ తీర్పులు, లోకాంతంవరకు జీవించే మానవులందరికీ ఇవ్వబడిన శాశ్వతమైన, నిత్యమైన, లేక ‘నిరంతరమైన’ మందలింపు, హెచ్చరిక, లేక ‘ఉదాహరణ’” అని స్టార్స్‌ వివరించాడు. అందుకే, సొదొమ గొమొఱ్ఱాలను నాశనం చేసిన అగ్ని శాశ్వతమైందని యూదా పేర్కొన్నాడు. యూదా పేర్కొన్న విషయం, మరణం తర్వాత మానవునిలోని ఏదీ సజీవంగా ఉండదనే వాస్తవాన్ని ఏ మాత్రం మార్చదు.

స్టార్స్‌ తన అభిప్రాయాన్ని సమర్థిస్తున్న లేఖనాల్నే ఉపయోగిస్తూ మిగతా లేఖనాలను నిర్లక్యం చేయలేదు. ఆయన ప్రతీ లేఖన సందర్భాన్నే కాక, బైబిల్లోని ముఖ్యాంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాడు. ఒక లేఖనం ఇతర లేఖనాలకు విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తే, సహేతుకమైన వివరణ కోసం ఆయన మిగతా బైబిలును పరిశోధించాడు.

రస్సెల్‌ లేఖనాలను అధ్యయనం చేయడం

జార్జ్‌ స్టార్స్‌తో సహవసించినవారిలో పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో పుస్తక అధ్యయన గుంపును వ్యవస్థీకరించిన ఒక యువకుడు కూడా ఉన్నాడు. ఆయన పేరు ఛార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌. ఆయన ప్రారంభంలో లేఖనాంశాలమీద రాసిన ఆర్టికల్స్‌లో ఒకటి, స్టార్స్‌ సంపాదకత్వంలో బైబిల్‌ ఎగ్జామినర్‌ అనే పత్రికలో 1876లో ప్రచురించబడింది. తొలి బైబిలు విద్యార్థులు తనను ప్రభావితం చేశారని రస్సెల్‌ అంగీకరించాడు. మాటల ద్వారానేకాక వ్రాతల ద్వారా కూడా స్టార్స్‌ తనకు చేసిన అధిక సహాయానికి, జాయన్స్‌ వాచ్‌ టవర్‌ సంపాదకునిగా ఆయన ఆ తర్వాత కృతజ్ఞత తెలియజేశాడు.

సి. టి. రస్సెల్‌, 18 ఏళ్ల వయసులో ఒక బైబిలు అధ్యయన తరగతిని వ్యవస్థీకరించి బైబిలును అధ్యయనం చేసేందుకు ఒక పద్ధతిని ప్రారంభించాడు. రస్సెల్‌తో సహవసించిన ఏ. హెచ్‌. మాక్‌మిలన్‌ అనే బైబిలు విద్యార్థి ఆ పద్ధతిని ఇలా వివరించాడు: “ఒకరు ప్రశ్న లేవనెత్తేవారు. వారు దానిని చర్చించేవారు. ఆ విషయానికి సంబంధించిన లేఖనాలన్నిటినీ పరిశోధించి, అవి ఒకదానితో మరొకటి పొందికగా ఉన్నాయనే నమ్మకం కలిగిన తర్వాత, చివరకు వారు తమ నిర్ధారణను పేర్కొని దానిని నమోదు చేసేవారు.”

బైబిలును పూర్తిగా పరిశోధిస్తే, దానిలోని లేఖనాలు ఒకదానితో మరొకటి పొందిక కలిగివున్న, దాని గ్రంథకర్తయైన దేవుని గుణాలతో పొందిక కలిగివున్న ఒకే సందేశాన్ని వెల్లడిచేయాలని రస్సెల్‌ గట్టిగా విశ్వసించాడు. ఏ బైబిలు భాగాన్నైనా అర్థం చేసుకోవడం కష్టమనిపిస్తే, దానిని ఇతర బైబిలు భాగాలు స్పష్టపరచి వివరిస్తాయని రస్సెల్‌ నమ్మాడు.

లేఖనాధార సంప్రదాయం

ఒక లేఖనాన్ని అర్థం చేసుకోవడానికి మరో లేఖనాన్ని పరిశోధించే సంప్రదాయం రస్సెల్‌తో గానీ, స్టార్స్‌తో గానీ, గ్రూతో గానీ ప్రారంభం కాలేదు. ఆ సంప్రదాయం క్రైస్తవత్వాన్ని స్థాపించిన యేసుక్రీస్తుతోనే ప్రారంభమైంది. ఒక లేఖనానికి ఉన్న సరైన భావాన్ని స్పష్టం చేయడానికి ఆయన అనేక లేఖనాలను ఉపయోగించాడు. ఉదాహరణకు, తన శిష్యులు సబ్బాతు దినాన వెన్నులు తుంచుకొని తిన్నందుకు పరిసయ్యులు వారిని విమర్శించినప్పుడు, ఆయన 1 సమూయేలు 21:6లోని వృత్తాంతాన్ని ఉపయోగించి సబ్బాతు నియమాన్ని ఎలా అన్వయించాలో చూపించాడు. దావీదు, ఆయన మనుష్యులు సముఖపు రొట్టెలు తినడాన్ని గురించిన ఆ వృత్తాంతం మతాధికారులకు తెలుసు. అహరోను కుటుంబానికి చెందినవారు మాత్రమే సన్నిధిరొట్టెలు తినాలని ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞను యేసు ఆ తర్వాత పేర్కొన్నాడు. (నిర్గమకాండము 29:32, 33; లేవీయకాండము 24:⁠9) అయినా, ఆ రొట్టెలు తినేందుకు దావీదు అనుమతించబడ్డాడు. యేసు హోషేయ పుస్తకాన్ని ఉదాహరిస్తూ ఒప్పింపజేసే తన వాదనను ఇలా ముగించాడు: “కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసియుంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు.” (మత్తయి 12:​1-8) సరైన అవగాహనకు రావడానికి ఒక లేఖనాన్ని ఇతర లేఖనాలతో పోల్చే విషయంలో అది ఎంత చక్కని మాదిరో కదా!

ఒక లేఖనాన్ని అర్థం చేసుకునేందుకు ఇతర లేఖనాలను ఉపయోగించే పద్ధతిని యేసు అనుచరులు కూడా అనుసరించారు. అపొస్తలుడైన పౌలు థెస్సలోనీకలోని ప్రజలకు బోధించినప్పుడు, ‘క్రీస్తు శ్రమపడి మృతులలోనుండి లేచుట ఆవశ్యకమనియు, యేసే క్రీస్తయియున్నాడనియు ఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో తర్కించెను.’ (అపొస్తలుల కార్యములు 17:​2, 3) పౌలు తాను రాసిన ప్రేరేపిత లేఖలలో కూడా ఒక లేఖనాన్ని వివరించడానికి ఇతర లేఖనాలను ఉపయోగించాడు. ఉదాహరణకు, హెబ్రీయులకు రాసిన పత్రికలో, ధర్మశాస్త్రం రాబోవుచున్న మేలుల ఛాయ అని నిరూపించడానికి ఆయన అనేక లేఖనాలను ఉల్లేఖించాడు.​—⁠హెబ్రీయులు 10:​1-18.

అవును, 19వ శతాబ్దంలో, 20వ శతాబ్దపు ప్రారంభంలో ఉన్న యథార్థవంతులైన బైబిలు విద్యార్థులు, ఆ క్రైస్తవ సంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించారంతే. లేఖనాలను ఇతర లేఖనాలతో పోల్చే సంప్రదాయం కావలికోటలో కూడా కొనసాగుతోంది. (2 థెస్సలొనీకయులు 2:​15) యెహోవాసాక్షులు ఒక లేఖనాన్ని విశ్లేషిస్తున్నప్పుడు ఆ సూత్రాన్ని ఉపయోగిస్తారు.

సందర్భాన్ని పరిశీలించండి

బైబిలు చదువుతున్నప్పుడు, యేసు ఆయన నమ్మకమైన అనుచరుల చక్కని మాదిరులను మనం ఎలా అనుకరించవచ్చు? మొదటిగా, మనం పరిశీలిస్తున్న లేఖన సందర్భాన్ని గమనించవచ్చు. లేఖన భావం తెలుసుకోవడానికి దాని సందర్భం మనకెలా సహాయం చేయవచ్చు? దానిని ఉదాహరించడానికి మత్తయి 16:​28లో నమోదుచేయబడిన యేసు మాటలను మనం పరిశీలిద్దాం: “ఇక్కడ నిలిచియున్నవారిలో కొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.” ఆ మాటలు విన్న యేసు అనుచరులందరూ దేవుని రాజ్యం పరలోకంలో స్థాపించబడకముందే మరణించారు కాబట్టి, ఆ మాటలు నెరవేరలేదని కొందరు అనుకోవచ్చు. ది ఇంటర్‌ప్రిటర్స్‌ బైబిల్‌ కూడా దాని గురించి ఇలా వ్యాఖ్యానిస్తోంది: “ఆ ప్రవచనం నెరవేరలేదు కాబట్టి, ఆ లేఖనం సూచనార్థకమైనదని ఆ తర్వాతి కాలంలోని క్రైస్తవులు వివరించాల్సివచ్చింది.”

అయితే, ఆ లేఖన సందర్భమేకాక మార్కు, లూకా పుస్తకాల్లో ఉన్న సమాంతర వృత్తాంతాలు ఆ లేఖనానికి ఉన్న నిజమైన భావాన్ని అర్థం చేసుకునేందుకు మనకు సహాయం చేస్తాయి. పైన ఉల్లేఖించబడిన మాటలు పేర్కొన్న వెంటనే మత్తయి దేని గురించి వివరించాడు? ఆయన ఇలా రాశాడు: “ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి యెదుట రూపాంతరము పొందెను.” (మత్తయి 17:​1, 2) మార్కు, లూకా కూడా రాజ్యం గురించి యేసు చేసిన వ్యాఖ్యానాన్ని రూపాంతరానికి సంబంధించిన వృత్తాంతంతో జతచేశారు. (మార్కు 9:1-8; లూకా 9:​27-36) యేసు రాజ్యాధికారంతో రావడం, ఆయన రూపాంతరం ద్వారా, ముగ్గురు అపొస్తలుల ముందు మహిమతో కనిపించడం ద్వారా ప్రదర్శించబడింది. యేసు రూపాంతరానికి సంబంధించి తాను చూసిన ‘ప్రభువైన యేసుక్రీస్తుయొక్క శక్తి, ఆయన రాకడ’ గురించి మాట్లాడడం ద్వారా ఆ అవగాహన సరైందని పేతురు చూపించాడు.​—⁠2 పేతురు 1:​16-18.

మీరు లేఖనాలను అర్థం చేసుకునేందుకు ఇతర లేఖనాలను పరిశోధిస్తారా?

మీరు లేఖన సందర్భాన్ని పరిశోధించిన తర్వాత కూడా దానిని అర్థం చేసుకోలేకపోతే అప్పుడేమిటి? మీరు బైబిలు అంతటిలో ఉన్న ముఖ్యాంశాన్ని గుర్తుంచుకొని దానిని ఇతర లేఖనాలతో పోల్చడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఇప్పుడు పూర్తిగా లేక పాక్షికంగా 57 భాషల్లో లభ్యమౌతున్న న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద హోలీ స్క్రిప్చర్స్‌లో మీరొక చక్కని సహాయకాన్ని చూడవచ్చు. ఆ సహాయకం, దాని అనేక ఎడిషన్‌లలో, ప్రతీ పేజీలోని మధ్య కాలమ్‌లో కనిపించే మార్జినల్‌ రెఫరెన్స్‌ల లేక క్రాస్‌ రెఫరెన్సుల పట్టిక. న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద హోలీ స్క్రిప్చర్స్‌​—⁠విత్‌ రిఫరెన్సెస్‌ బైబిల్లో, మీరు దాదాపు 1,25,000 కన్నా ఎక్కువ మార్జినల్‌ రెఫరెన్సులు చూడవచ్చు. ఆ బైబిల్లోని “పీఠిక” ఇలా వివరిస్తోంది: “మార్జినల్‌ రెఫరెన్సులను జాగ్రత్తగా పోల్చడంతోపాటు సూచించబడిన అధస్సూచీలను పరిశీలించడం, 66 బైబిలు పుస్తకాల మధ్య ఉన్న అంతర్గత సామరస్యాన్ని వెల్లడిచేసి, అవి దేవుడు ప్రేరేపించిన ఏకైక పుస్తకంగా రూపొందుతాయని రుజువు చేస్తుంది.”

ఒక లేఖనాన్ని అర్థం చేసుకోవడానికి క్రాస్‌ రెఫరెన్సులను ఉపయోగించడం మనకు ఎలా సహాయకరంగా ఉంటుందో మనం చూద్దాం. అబ్రాము లేక అబ్రాహాము చరిత్రను ఉదాహరణగా తీసుకోండి. ఈ ప్రశ్నను పరిశీలించండి: అబ్రాము, ఆయన కుటుంబం ఊరు పట్టణం నుండి బయలుదేరినప్పుడు ఎవరు నాయకత్వం వహించారు? ఆదికాండము 11:​31లో మనమిలా చదువుతాం: “తెరహు తన కుమారుడగు అబ్రామును . . . లోతును, తన కుమారుడగు అబ్రాము భార్యయయిన శారయి అను తన కోడలిని తీసికొని కనానుకు వెళ్లుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితోకూడ బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి.” ఒక వ్యక్తి, పైవాక్యాన్ని చదివిన వెంటనే అబ్రాము తండ్రి తెరహు నాయకత్వం వహించాడనే నిర్ధారణకు రావచ్చు. అయితే, న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద హోలీ స్క్రిప్చర్స్‌లో మనం ఈ లేఖనానికి 11 క్రాస్‌ రెఫరెన్సులు ఉన్నట్లు గమనిస్తాం. వాటిలో ఆఖరిది అపొస్తలుల కార్యములు 7:​2, 3, అక్కడ మనం మొదటి శతాబ్దపు యూదులకు స్తెఫను ఇచ్చిన హెచ్చరికను చదువుతాం: “మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై​—⁠నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి, నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను.” (అపొస్తలుల కార్యములు 7:​2, 3) అబ్రాము తన కుటుంబాన్ని హారానుకు తీసుకువెళ్లడంలో నాయకత్వం వహించాడని చెప్పడం ద్వారా స్తెఫను తికమకపెడుతున్నాడా? కానేకాదు, ఎందుకంటే ఆ మాటలు దేవుని ప్రేరేపిత వాక్యంలో భాగంగా ఉన్నాయి.​—⁠ఆదికాండము 12:​1-3.

అయితే, ఆదికాండము 11:​31, “తెరహు తన కుమారుడగు అబ్రామును,” తన ఇతర కుటుంబ సభ్యులను తీసుకొని ఊరు పట్టణం నుండి బయలుదేరాడు అని ఎందుకు పేర్కొంటోంది? తెరహు అప్పటికి ఇంకా మూలపురుషునిగానే ఉన్నాడు. ఆయన అబ్రాముతో వెళ్లడానికి కూడా అంగీకరించాడు కాబట్టి, ఆయన కుటుంబాన్ని హారానుకు తీసుకువెళ్లాడు అని చెప్పబడింది. ఈ రెండు లేఖనాలను పోల్చి, వాటి మధ్య ఉన్న సంబంధాన్ని గమనించడం ద్వారా అసలు ఏమి జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని ఆజ్ఞకు అనుగుణంగా ఊరు పట్టణాన్ని విడిచివెళ్లేందుకు అబ్రాము తన తండ్రిని గౌరవపూర్వకంగా ఒప్పించాడు.

మనం లేఖనాలను చదువుతున్నప్పుడు, మనం లేఖన సందర్భాన్నే కాక బైబిలు అంతటిలో ఉన్న ముఖ్యాంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. క్రైస్తవులు ఇలా హెచ్చరించబడ్డారు: “దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. మనుష్యజ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము.” (1 కొరింథీయులు 2:​11-13) మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేందుకు ఆయన సహాయం కోసం వేడుకొని, పరిశీలిస్తున్న లేఖన సందర్భాన్ని, దానికి సంబంధించిన ఇతర లేఖనాలను పరిశోధించడం ద్వారా “ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూ[డడానికి]” ప్రయత్నించాలి. దేవుని వాక్య అధ్యయనం ద్వారా మనం అద్భుతమైన సత్యపు రత్నాలను ఎల్లప్పుడూ కనుగొంటూ ఉందాం.

[అధస్సూచి]

^ పేరా 7 మరణించినవారి పరిస్థితి గురించిన మరిన్ని వివరాల కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకంలోని 6వ అధ్యాయాన్ని చూడండి.

[12వ పేజీలోని చిత్రాలు]

ఒక లేఖనాన్ని అర్థం చేసుకునేందుకు ఇతర లేఖనాలను పరిశీలించిన 19వ శతాబ్దపు బైబిలు విద్యార్థులు: జార్జ్‌ స్టార్స్‌, హెన్రీ గ్రూ, ఛార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌, ఏ. హెచ్‌. మాక్‌మిలన్‌

[చిత్రసౌజన్యం]

పైన: SIX SERMONS, by George Storrs (1855); పైనుండి రెండవది: Collection of The New-York Historical Society/69288

[15వ పేజీలోని చిత్రం]

అపొస్తలుడైన పౌలు తన బోధలను లేఖనాలను ఉదాహరించడం ద్వారా నిరూపించాడు