కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ వివాహదినపు ఆనందాన్ని, గౌరవాన్ని అధికం చేసుకోండి

మీ వివాహదినపు ఆనందాన్ని, గౌరవాన్ని అధికం చేసుకోండి

మీ వివాహదినపు ఆనందాన్ని, గౌరవాన్ని అధికం చేసుకోండి

“నా వివాహదినం నా జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన, మధురమైన దినాల్లో ఒకటి” అని దాదాపు 60 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న గోర్డన్‌ అన్నాడు. నిజ క్రైస్తవులకు వివాహదినాన్ని అంత ప్రాముఖ్యమైనదిగా చేస్తున్నదేమిటి? ఆ దినాన వారు తామెంతో ప్రేమించిన వ్యక్తితో అంటే తమ భాగస్వామితో, యెహోవా దేవునితో పవిత్రమైన ప్రమాణం చేస్తారు. (మత్తయి 22:​37; ఎఫెసీయులు 5:​22-29) అవును, వివాహం చేసుకోవాలనుకునే జంటలు తమ వివాహదినాన్ని ఆస్వాదించాలనుకుంటారు, అలాగే వారు వివాహ వ్యవస్థాపకుణ్ణి ఘనపర్చాలని కూడా కోరుకుంటారు.​—⁠ఆదికాండము 2:​18-24; మత్తయి 19:​5, 6.

పెళ్లికుమారుడు, ఆ సంతోషభరిత సందర్భపు గౌరవాన్ని ఎలా అధికం చేయవచ్చు? పెళ్లికుమార్తె తన భర్తపట్ల, యెహోవాపట్ల గౌరవాన్ని ప్రదర్శించేందుకు ఏమి చేయవచ్చు? ఆ వివాహానికి హాజరయ్యే ఇతరులు ఆ సందర్భపు ఆనందాన్ని ఎలా అధికం చేయవచ్చు? ఈ ప్రశ్నలకు జవాబిచ్చేందుకు కొన్ని బైబిలు సూత్రాలను పరిశీలించడం సహాయం చేయడమే కాక, ఆ సూత్రాలను అన్వయించుకోవడం ఆ ప్రత్యేక సందర్భ గౌరవానికి భంగం కలిగించగల సమస్యలను కూడా తగ్గిస్తుంది.

ఎవరు బాధ్యులు?

చాలాదేశాల్లో యెహోవాసాక్షుల పరిచారకుడు అధికారికంగా వివాహ ఆచరణను నిర్వహించవచ్చు. పౌర సంబంధ ప్రతినిధే చట్టబద్ధంగా వివాహాన్ని నిర్వహించాల్సిన ప్రాంతాల్లో సహితం, ఒక జంట బైబిలు ప్రసంగాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఇష్టపడవచ్చు. ఆ ప్రసంగంలో, కుటుంబ శిరస్సుగా దేవుడు తనకప్పగించిన పాత్రను గురించి ఆలోచించాలని పెళ్లికుమారునికి చెప్పబడుతుంది. (1 కొరింథీయులు 11:⁠3) కాబట్టి, వివాహానికి సంబంధించిన పనుల్లో పెళ్లికుమారునికే ప్రాథమిక బాధ్యత ఉంటుంది. అయితే, వివాహ ఆచరణకు ఆ తర్వాత జరిగే విందుకు సంబంధించిన ఏర్పాట్లు సాధారణంగా ఎంతో ముందుగానే చేయబడతాయి. ఈ ఏర్పాట్లు చేయడం పెళ్లికుమారునికి ఎందుకు కష్టంగా ఉండవచ్చు?

ఒక కారణమేమిటంటే, పెళ్లికుమార్తె లేదా ఇరువర్గాల బంధువులు వివాహ ఏర్పాట్లపై తమ ప్రభావాన్ని అధికంగా చూపించేందుకు ప్రయత్నించవచ్చు. అనేక వివాహాలు నిర్వహించిన రొడాల్ఫో ఇలా అంటున్నాడు: “కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకంగా బంధువులు వివాహ రిసెప్షన్‌ ఖర్చులను భరిచేందుకు సహాయం చేస్తుంటే, పెళ్లికుమారునిపై వారి నుండి ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. వివాహ ఆచరణ, రిసెప్షన్‌ ఎలా ఉండాలనే విషయంపై వారికి బలమైన అభిప్రాయాలు ఉండవచ్చు. ఇది ఆ సందర్భానికి బాధ్యతగల వ్యక్తిగా పెళ్లికుమారుడు పోషించే లేఖనాధార పాత్రను బలహీనపర్చవచ్చు.”

ముప్పైయైదుకన్నా ఎక్కువ సంవత్సరాలుగా వివాహ ఆచరణలను నిర్వహిస్తున్న మాక్స్‌ ఇలా అంటున్నాడు: “వివాహ ఆచరణలో, రిసెప్షన్‌లో ఏమిచేయాలో నిర్ణయించే విషయాల్లో పెళ్లికుమార్తె పెత్తనం ఎక్కువౌతున్నట్లు, పెళ్లికుమారుడు తన అభిప్రాయాన్ని చెప్పేది తక్కువౌతున్నట్లు నేను గమనించాను.” ఎన్నో వివాహాలు జరిగించిన డేవిడ్‌ కూడా ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “సారథ్యం వహించే అలవాటు పెళ్లికుమారునికి లేని కారణంగా వివాహ ఏర్పాట్లలో తగినంతగా పాలుపంచుకునే అవకాశం ఆయనకు లభించడంలేదు.” పెళ్లికుమారుడు తన బాధ్యతను సమర్థవంతంగా ఎలా నిర్వహించవచ్చు?

సంభాషించుకోవడం ఆనందాన్ని హెచ్చిస్తుంది

పెళ్లికుమారుడు వివాహ ఏర్పాట్లకు సంబంధించిన తన బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించాలంటే, ఆయన సమర్థవంతంగా విషయాలను చర్చించాలి. బైబిలు సూటిగా ఇలా చెబుతోంది: “ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును.” (సామెతలు 15:​22) అయితే, వివాహ ఏర్పాట్ల గురించి పెళ్లికుమారుడు మొదట పెళ్లికుమార్తెతో, కుటుంబ సభ్యులతో, చక్కని బైబిలు సలహానివ్వగల ఇతరులతో చర్చిస్తే నిరాశకు గురికాకుండా ఉండవచ్చు.

అవును, ప్రధానం చేసుకున్న జంట పరస్పరం వారి ప్రణాళికల, తమ ముందు ఉన్న ఎంపికల గురించి మొదట చర్చించుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకు? అలా ఎందుకో తెలుసుకునేందుకు, వేర్వేరు సాంస్కృతిక నేపథ్యాల నుండి వచ్చినా అనేక సంవత్సరాలుగా సంతోషభరిత వైవాహిక జీవితం గడుపుతున్న ఐవన్‌, ఆయన భార్యయైన డెల్విన్‌ ఏమి చెబుతున్నారో గమనించండి. తమ వివాహ ప్రణాళికలను గుర్తుచేసుకుంటూ ఐవెన్‌ ఇలా చెబుతున్నాడు: “నా స్నేహితులందరితో రిసెప్షన్‌, వెడ్డింగ్‌ కేకు, పెళ్లికుమార్తె పెళ్లి సమయంలో ధరించే దుస్తులతోసహా నా పెళ్లికి అవసరమైన వాటన్నింటి గురించి నాకు ఖచ్చితమైన ఆలోచన ఉంది. కానీ డెల్విన్‌ కొద్దిమంది అతిథులతో, వెడ్డింగ్‌ కేక్‌ లేకుండా నిరాడంబరంగా పెళ్లి చేసుకోవాలని కోరుకుంది. పెళ్లి గౌను బదులు సాదా దుస్తులు ధరించాలని కూడా ఆమె ఆలోచించింది.”

ఈ విభేదాలను ఆ దంపతులు ఎలా పరిష్కరించుకున్నారు? నిజాయితీగా, ప్రేమపూర్వకంగా సంభాషించడం ద్వారానే. (సామెతలు 12:​18) ఐవెన్‌ ఇంకా ఇలా అంటున్నాడు: “కావలికోట (ఆంగ్లం) ఏప్రిల్‌ 15, 1984 * సంచికలో ఉన్నలాంటి వివాహాలకు సంబంధించిన బైబిలు ఆధారిత ఆర్టికల్స్‌ను మేము అధ్యయనం చేశాం. దానిలోని సమాచారం వివాహ సందర్భానికి సంబంధించి దేవుని దృక్కోణాన్ని కనబరచేందుకు మాకు సహాయం చేసింది. మా విభిన్న నేపథ్యాల దృష్ట్యా, మా వ్యక్తిగత అభిరుచుల విషయంలో మేము అనేక రంగాల్లో రాజీపడాల్సివచ్చింది. మేమిద్దరం మా దృక్పథాలను సవరించుకున్నాం.”

ఆరెట్‌, పెనీ కూడా అలాంటి విధానాన్నే అనుసరించారు. వారి పెళ్లిరోజు గురించి ఆరెట్‌ ఇలా చెబుతున్నాడు: “వివాహానికి సంబంధించిన మా విభిన్న అభిరుచుల్ని నేను పెనీ కలిసి చర్చించుకున్నాం, మేమిద్దరం ఏకాభిప్రాయానికి రాగలిగాం. ఆ రోజుపై యెహోవా ఆశీర్వాదం కోసం మేము ప్రార్థించాం. అలాగే నేను మా తల్లిదండ్రుల, సంఘంలోని పరిణతిగల మరితర దంపతుల సలహా కూడా తీసుకున్నాను. వారి సూచనలు చాలా సహాయపడ్డాయి. ఫలితంగా మా వివాహం విజయవంతమైంది.”

దుస్తుల్లో, కనబడే తీరులో గౌరవాన్ని ప్రదర్శించడం

పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తె తమ పెళ్లికి చక్కని వస్త్రాలు ధరించాలని కోరుకోవడం అర్థం చేసుకోదగినదే. (కీర్తన 45:​8-15) కాబట్టి, వారు ఆ సందర్భానికి తగిన వస్త్రాల కోసం సమయాన్ని, డబ్బును వెచ్చించడానికి ప్రయత్నించవచ్చు. గౌరవప్రదమైనదే కాక ఆకర్షణీయంగా కూడా ఉండే వస్త్రాలను ఎంచుకునేందుకు వారికి ఏ బైబిలు సూత్రాలు సహాయం చేయగలవు?

ఉదాహరణకు, పెళ్ళికుమార్తె ధరించే వస్త్రాల గురించి ఆలోచించండి. ఒక్కొక్క వ్యక్తికీ, ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన అభిరుచులు వివిధ రకాలుగావున్నా బైబిలు ఉపదేశం మాత్రం అన్ని ప్రాంతాలవారికి వర్తిస్తుంది. “స్త్రీలు గౌరవం కలిగించే దుస్తులు ధరించి వినయంగా, మర్యాదగా ఉండాలి.” ఈ ఉపదేశం క్రైస్తవ స్త్రీలకు వారి వివాహదినంతో సహా అన్ని సందర్భాల్లోనూ వర్తిస్తుంది. అందువల్ల సంతోషభరితమైన వివాహానికి ‘ఖరీదైన దుస్తులే’ అవసరం లేదు. (1 తిమోతి 2:⁠9, ఈజీ టు రీడ్‌ వర్షన్‌; 1 పేతురు 3:​3, 4) ఈ ఉపదేశాన్ని అన్వయించుకోవడం ఎంత సంతోషకరమో కదా!

ముందు పేర్కొనబడిన డేవిడ్‌ ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “చాలా జంటలు బైబిలు సూత్రాలను అనుసరించేందుకు కృషిచేస్తాయి, అందుకు వారు ప్రశంసార్హులు. అయితే పెళ్లికుమార్తెల, తోటిపెళ్లికూతుర్ల గౌన్ల లోకట్‌ మరీ ఎక్కువగావున్న లేదా పారదర్శకంగావున్న సందర్భాలు ఉన్నాయి.” పెళ్లికుమార్తెను, పెళ్లికుమారుణ్ణి ముందుగా కలుసుకునే పరిణతిగల ఒక పెద్ద ఆధ్యాత్మిక దృక్కోణాన్ని కనబరచేందుకు వారికి సహాయం చేస్తాడు. ఎలా? ఆ జంట ధరించుకోవాలనుకునే దుస్తులు క్రైస్తవ కూటానికి వేసుకోదగినట్లుగా ఉంటాయా అని వారిని అడగడం ద్వారానే. నిజమే, కూటాలకు క్రమంగా వేసుకునే దుస్తుల శైలికీ పెళ్లి దుస్తుల శైలికీ మధ్య వ్యత్యాసం ఉండడమే కాక, అవి స్థానిక ఆచారాన్ని ప్రతిబింబించవచ్చు, అయితే వాటి తీరు గౌరవనీయమైన క్రైస్తవ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. లోకస్థులు కొందరు బైబిలు నైతిక నియమావళి నిర్బంధంగా ఉన్నట్లు దృష్టించినా, నిజ క్రైస్తవులు లోకం తమ ఆలోచనా సరళిని మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఎదిరించడానికి సంతోషిస్తారు.​—⁠రోమీయులు 12:⁠2; 1 పేతురు 4:⁠4.

“దుస్తులను లేదా రిసెప్షన్‌ను అత్యంత ప్రాముఖ్యమైనవిగా దృష్టించే బదులు, నేను ఆరెట్‌ ఆ ఆచరణపై, ఆ సందర్భపు ఆధ్యాత్మిక అంశంపై దృష్టి కేంద్రీకరించాం. ఆ అంశమే ఆ రోజులో అత్యంత ప్రాముఖ్యమైన భాగంగా పరిగణించాం. ఆ రోజుకు సంబంధించి నేను ప్రత్యేకంగా గుర్తుంచుకున్న విషయాలు, నేనేమి ధరించుకున్నాను, ఏమి తిన్నాను అనేవి కాదుగానీ, ఆ రోజు నేను ఎవరితో ఉన్నాను, నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లిచేసుకున్నాననే సంతోషమే” అని పెనీ చెబుతోంది. క్రైస్తవ జంట తమ పెళ్లి గురించి ఆలోచిస్తున్నప్పుడు అలాంటి తలంపులను మనసులో ఉంచుకోవాలి.

రాజ్యమందిరం గౌరవప్రదమైన స్థలం

అనేక క్రైస్తవ జంటలు ఒకవేళ రాజ్యమందిరం అందుబాటులో ఉంటే, అక్కడే వివాహం చేసుకునేందుకు ఇష్టపడతారు. వారు అక్కడ వివాహం చేసుకునేందుకు ఎందుకు ఇష్టపడతారు? ఒక జంట తమ కారణాన్ని ఇలా వివరిస్తోంది: “వివాహం యెహోవా చేసిన పవిత్రమైన ఏర్పాటని మేము గ్రహించాం. మన ఆరాధనా స్థలమైన రాజ్యమందిరంలో పెళ్ళి చేసుకోవడం, మా వివాహంలో యెహోవా ఒక భాగమైవుండాలని ఆరంభం నుండే మనసులో ముద్రించుకునేందుకు మాకు సహాయం చేసింది. మరో స్థలంలో కాక రాజ్యమందిరంలోనే వివాహాన్ని ఏర్పాటు చేయడంలోని మరో ప్రయోజనం, ఆ పెళ్లికి హాజరైన అవిశ్వాసులైన మా బంధువులకు యెహోవా ఆరాధన మనకెంత ప్రాముఖ్యమో చూపించింది.”

రాజ్యమందిరానికి సంబంధించిన బాధ్యత ఉన్న పెద్దలు వివాహం అక్కడ జరిగేందుకు అనుమతించినట్లయితే, ఆ జంట తాము చేయాలనుకున్న ఏర్పాట్ల గురించి వారికి ముందే తెలియజేయాలి. వివాహానికి హాజరయ్యేవారిపట్ల పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తె సరైన గౌరవం చూపించే ఒక మార్గమేమిటంటే, వివాహానికి నియమిత సమయానికి చేరుకోవాలని దృఢంగా తీర్మానించుకోవడమే. వారు ప్రతీదీ గౌరవప్రదమైన రీతిలో జరిగించబడాలని ఖచ్చితంగా కోరుకుంటారు. * (1 కొరింథీయులు 14:​39-40) అందువల్ల వారు, అనేక లోకసంబంధ వివాహాల్లో సాధారణంగా కనబడే అనుచిత ప్రవర్తనకు చోటివ్వరు.​—⁠1 యోహాను 2:​15, 16.

వివాహానికి హాజరయ్యేవారు కూడా వివాహానికి సంబంధించి యెహోవాకున్న దృక్కోణమే తమకూ ఉందని చూపించవచ్చు. ఉదాహరణకు, ఎవరి వివాహం ఎక్కువ ఆడంబరంగా ఉంటుందో చూద్దామన్నట్లుగా వారు హాజరయ్యే వివాహం ఇతర క్రైస్తవ వివాహాలకన్నా గొప్పగా ఉండాలని ఆశించరు. అలాగే పరిణతిగల క్రైస్తవులు వివాహ విందు లేదా ఆ తర్వాత ఉండే పార్టీకి హాజరవడంకన్నా రాజ్యమందిరంలో ఇవ్వబడే బైబిలు ఆధారిత ప్రసంగానికి హాజరవడం చాలా ప్రాముఖ్యం, ప్రయోజనకరం అని కూడా గ్రహిస్తారు. సమయం లేదా పరిస్థితులనుబట్టి ఒక క్రైస్తవుడు ఆ రెంటిలో కేవలం ఒక దానికే హాజరవాల్సివస్తే, రాజ్యమందిరానికి హాజరవడమే ఖచ్చితంగా కోరదగినది. విలియమ్‌ అనే పెద్ద ఇలా అంటున్నాడు: “అతిథులు అకారణంగా రాజ్యమందిరంలోని ప్రసంగానికి రాకుండా ఆ తర్వాత జరిగే రిసెప్షన్‌కు హాజరైతే, అది ఆ సందర్భపు పవిత్రతపట్ల అవగాహనా లోపాన్ని చూపిస్తుంది. మనం రిసెప్షన్‌కు ఆహ్వానించబడకపోయినా, రాజ్యమందిరంలోని ఆచరణకు హాజరవడం ద్వారా పెళ్లికుమారునికి, పెళ్లికుమార్తెకి మన మద్దతును ప్రదర్శించడమే కాక, వివాహానికి వచ్చిన అవిశ్వాసులైన బంధువులకు చక్కని సాక్ష్యమిచ్చినవారమౌతాం.”

వివాహానంతరం నిలిచివుండే ఆనందం

వాణిజ్య ప్రపంచం వివాహ ఆచరణను ఒక పెద్ద పరిశ్రమగా మార్చేసింది. ఇటీవలి ఒక నివేదిక ప్రకారం అమెరికాలో సగటు వివాహానికి “22,000 డాలర్లు లేదా అమెరికా కుటుంబపు సగటు [వార్షిక] ఆదాయంలో సగం ఖర్చవుతోంది.” వాణిజ్య ప్రకటనలచేత ప్రభావితులై చాలామంది నవదంపతులు లేదా వారి కుటుంబాలు ఆ ఒక్కరోజు కోసం భారీగా అప్పులు తీసుకుని ఆ రుణభారాన్ని ఆ తర్వాత అనేక సంవత్సరాలపాటు మోస్తున్నారు. వివాహాన్ని అలా ఆరంభించడం తెలివైన పనేనా? బైబిలు సూత్రాలు తెలియనివారు లేదా వాటిని పట్టించుకోనివారు అలాంటి దుబారాను ఇష్టపడవచ్చు, కానీ నిజ క్రైస్తవులు దానికెంత భిన్నమో కదా!

తమ వివాహ ఏర్పాట్లను సముచితమైన, స్తోమతకు తగినవిధంగా పరిమితం చేసుకుంటూ, ఆ సందర్భపు ఆధ్యాత్మిక అంశంపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా చాలామంది క్రైస్తవ దంపతులు దేవునికి తాము చేసుకున్న సమర్పణకు అనుగుణంగా తమ సమయాన్ని, వనరుల్ని ఉపయోగించగలిగారు. (మత్తయి 6:​33) ఉదాహరణకు, తమ వివాహమైన తర్వాత, 17 సంవత్సరాలుగా పూర్తికాల సేవలో కొనసాగుతున్న లాయిడ్‌, అలిక్జాండ్రా విషయమే తీసుకోండి. లాయిడ్‌ ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “కొందరు మా వివాహం చాలా నిరాడంబరంగా జరిగినట్లు దృష్టించవచ్చు, అయితే నేను అలిక్జాండ్రా చాలా సంతోషించాం. మా వివాహం ఆ తర్వాత మోయవలసిన ఆర్థిక భారంగా ఉండాలని భావించలేదుగానీ, ఇద్దరు వ్యక్తులకు అత్యధిక సంతోషాన్ని తీసుకొచ్చే యెహోవా ఏర్పాటుకు సంబంధించిన ఆచరణగా ఉండాలని భావించాం.”

అలిక్జాండ్రా ఇలా అంటోంది: “మేము పెళ్లి చేసుకోకముందు నేను పయినీరు సేవలో ఉన్నాను, కేవలం మితిమీరిన ఖర్చుతో చేసుకునే పెళ్ళికోసం ఆ ఆధిక్యతను పోగొట్టుకునేందుకు నేను ఇష్టపడలేదు. మా వివాహదినం చాలా ప్రత్యేకమైనది. అయితే ఆ వివాహదినమనేది, ఆ తర్వాత మేమిద్దరం కలిసి జీవించే మా జీవితంలో మొదటి రోజు మాత్రమే. వివాహం చేసుకోవడమనే ప్రక్రియపై అధిక దృష్టి నిలపవద్దనే సలహాను మేము అన్వయించుకొని, వివాహ జీవితంలో యెహోవా నిర్దేశం కోసం ప్రయత్నించాం.” అలా చేయడం మాకు నిశ్చయంగా యెహోవా ఆశీర్వాదాల్ని తెచ్చింది. *

అవును, మీ వివాహదినం ఒక ప్రత్యేకమైన సందర్భం. ఆ రోజు కనబరచే దృక్పథాలు, క్రియలు మీ వివాహ జీవితంలోని తర్వాతి సంవత్సరాలకు ఓ పద్ధతిని ఏర్పరుస్తాయి. కాబట్టి నిర్దేశం కోసం యెహోవాపై ఆధారపడండి. (సామెతలు 3:​5, 6) ఆ రోజుకున్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. దేవుడు మీకు నియమించిన పాత్రల్లో పరస్పరం తోడ్పడండి. ఆ విధంగా మీరు మీ వివాహానికి బలమైన పునాది వేసుకోవడమే కాక, యెహోవా ఆశీర్వాదంతో మీ వివాహానంతర సంవత్సరాల్లో నిలిచివుండే ఆనందాన్ని అనుభవిస్తారు.​—⁠సామెతలు 18:​22.

[అధస్సూచీలు]

^ పేరా 11 అదనపు సమాచారం యెహోవాసాక్షులు ప్రచురించిన తేజరిల్లు! (ఆంగ్లం) ఫిబ్రవరి 8, 2002లో లభిస్తుంది.

^ పేరా 20 వివాహ జంట, ఒకవేళ రాజ్యమందిరంలో జరిగే ఆచరణను ఎవరైనా ఫొటోలు తీయాలన్నా, రికార్డు చేయాలన్నా, వారు వివాహ గౌరవానికి భంగం కలిగించేదేదీ జరగకుండా ముందుగానే ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

^ పేరా 25 యెహోవాసాక్షులు ప్రచురించిన కుటుంబ సంతోషానికిగల రహస్యం పుస్తకంలో 26వ పేజీ చూడండి.

[29వ పేజీలోని చిత్రం]

వివాహ జంట తమ వివాహం గురించి ప్రణాళికలు వేసుకుంటున్నప్పుడు దాపరికం లేకుండా, మర్యాదపూర్వకంగా మాట్లాడుకోవాలి

[31వ పేజీలోని చిత్రం]

మీ వివాహదినానికున్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి