కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించేలా ఇతరులకు సహాయం చేయండి

పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించేలా ఇతరులకు సహాయం చేయండి

“నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను.”—కీర్త. 32:8.

1, 2. భూమ్మీదున్న తన సేవకులను యెహోవా ఎలా చూస్తాడు?

 తమ పిల్లలు ఆడుకోవడం మురిపెంగా చూసే తల్లిదండ్రులు, వాళ్లలో ఉన్న సామర్థ్యాలను చూసి తరచూ ఆశ్చర్యపోతుంటారు. బహుశా మీరు కూడా ఆ విషయాన్ని గమనించేవుంటారు. ఓ పిల్లవాడికి బాగా ఆటలాడే సామర్థ్యం ఉంటే, మరో పిల్లవాడికి బొమ్మలుగీసే లేక వస్తువులు తయారుచేసే నైపుణ్యం ఉండవచ్చు. అయితే ఎటువంటి సామర్థ్యాలు ఉన్నా, వాటిని తమ పిల్లలు పూర్తిగా ఉపయోగించేలా తల్లిదండ్రులు సంతోషంగా సహాయం చేస్తారు.

2 యెహోవాకు కూడా భూమ్మీదున్న తన పిల్లలపై ఎంతో ఆసక్తి ఉంది. తన ఆధునికకాల సేవకులను ఆయన ‘అన్యజనులందరియొక్క ఇష్టవస్తువులుగా’ చూస్తాడు. (హగ్గ. 2:7) ముఖ్యంగా వాళ్లకున్న విశ్వాసంవల్ల, భక్తివల్ల వాళ్లు ఆయన దృష్టిలో అమూల్యమైనవాళ్లు. అయితే, మన తోటి సాక్షులకు రకరకాల సామర్థ్యాలు ఉన్నట్లు మీరు గమనించేవుంటారు. కొంతమంది సహోదరులు అద్భుతంగా ప్రసంగాలిస్తారు, మరికొంతమంది చాలా చక్కగా పనులను వ్యవస్థీకరిస్తారు. సహోదరీల విషయానికొస్తే, చాలామంది వేరే భాషలు త్వరగా నేర్చుకుని, ఆ భాషల్లో పరిచర్య చేస్తున్నారు. ఇంకొంతమంది, ఇతరులకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు, అనారోగ్యంతో ఉన్నవాళ్ల బాగోగులు చూసుకుంటున్నారు. (రోమా. 16:1, 12) అలాంటి క్రైస్తవులందరితో పాటు మనం సంఘంలో ఉన్నందుకు ఎంత కృతజ్ఞులమో!

3. ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?

3 అయితే కొంతమంది తోటి విశ్వాసులు, ముఖ్యంగా యౌవనులు లేదా కొత్తగా బాప్తిస్మం పొందిన సహోదరులు సంఘ కార్యకలాపాల్లో పూర్తిగా భాగం వహిస్తుండకపోవచ్చు. అయితే, తమ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించేలా అలాంటివాళ్లకు మనం ఎలా సహాయం చేయవచ్చు? యెహోవా చూస్తున్నట్లుగా ఇతరుల్లో మంచిని చూడడానికి మనం ఎందుకు కృషి చేయాలి?

యెహోవా తన సేవకుల్లో మంచిని చూస్తాడు

4, 5. యెహోవా తన సేవకుల్లోని సామర్థ్యాలను చూస్తాడని, న్యాయాధిపతులు 6:11-16⁠లోని వృత్తాంతం ఎలా నిరూపిస్తుంది?

4 యెహోవా తన సేవకుల్లో ఉన్న మంచినే కాక, వాళ్ల సామర్థ్యాలను కూడా చూస్తాడని బైబిల్లోని ఎన్నో వృత్తాంతాలు స్పష్టం చేస్తున్నాయి. ఉదాహరణకు, మిద్యానీయుల అణిచివేత నుండి దేవుని ప్రజల్ని విడిపించడానికి యెహోవా గిద్యోనును ఎంచుకున్న సందర్భాన్ని పరిశీలించండి. తాను అంత ప్రాముఖ్యమైన వాణ్ణి కానని గిద్యోను భావించాడు, అందుకే ఒక దేవదూత, “పరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైయున్నాడు” అని గిద్యోనుతో చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయుంటాడు. తాను బలశాలినని గిద్యోను ఎప్పుడూ అనుకోలేదు. అందుకే దేవుని ప్రజలను విడిపించడం తనవల్ల కాదని ఆయన అనుకున్నాడు. అయితే, విషయాలను యెహోవా మరో కోణం నుండి చూశాడు. గిద్యోనుకు ఆ సామర్థ్యం ఉందని యెహోవా గమనించాడు, అంతేకాక తన ప్రజలను విడిపించడానికి గిద్యోను తగినవాడని ఆయనకు తెలుసు.—న్యాయాధిపతులు 6:11-16 చదవండి.

5 యెహోవా గిద్యోను నైపుణ్యాలు చూశాడు కాబట్టే, ఇశ్రాయేలీయుల్ని ఆయన విడిపించగలడని నమ్మాడు. గిద్యోను తన బలాన్నంతా ఉపయోగిస్తూ గోధుమలను ఎలా నూర్చుతున్నాడో యెహోవా దూత గమనించాడు. మరో విషయం కూడా దేవదూత అవధానాన్ని చూరగొంది. బైబిలు కాలాల్లో రైతులు సాధారణంగా తమ ధాన్యాన్ని ఆరు బయట నూర్చేవాళ్లు, ఎందుకంటే అక్కడ వీచే గాలివల్ల పొట్టు ఎగిరిపోతుంది కాబట్టి పని తేలికవుతుంది. అయితే ఆశ్చర్యకరంగా, గిద్యోను ఆ కొద్ది పంటను మిద్యానీయుల నుండి కాపాడుకోవడానికి రహస్యంగా గానుగచాటున నూర్చుతున్నాడు. ఎంత తెలివైన పని! యెహోవా గిద్యోనును కేవలం జాగ్రత్తపరుడైన రైతుగానే కాకుండా, ఓ తెలివైన వ్యక్తిగా చూశాడంటే అందులో ఆశ్చర్యం లేదు. అవును, యెహోవా గిద్యోను సామర్థ్యాల్ని చూసి, ఆయనకు శిక్షణనిచ్చాడు.

6, 7. (ఎ) ఆమోసును కొంతమంది ఇశ్రాయేలీయులు చూసిన విధానానికీ యెహోవా చూసిన విధానానికీ తేడా ఏమిటి? (బి) ఆమోసు ఏమాత్రం చదువుకోని వ్యక్తి కాదని ఎలా చెప్పవచ్చు?

6 అలాగే ప్రవక్తయైన ఆమోసులో ఉన్న సామర్థ్యాన్ని కూడా యెహోవా చూశాడు. చాలామంది దృష్టికి, ఆయన ఏమాత్రం ప్రాముఖ్యతలేని నెమ్మదస్థునిలా కనిపించివుండవచ్చు. ఆమోసు గొర్రెల్ని కాయడం, తోటలో పని చేయడం వంటి చిన్నచిన్న పనులు చేసేవాడు. విగ్రహారాధనలో మునిగిపోయిన పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యంపై తీర్పులు ప్రకటించేందుకు యెహోవా ఆమోసును నియమించినప్పుడు, కొంతమంది ఇశ్రాయేలీయులకు అది సరైన ఎంపికలా అనిపించి ఉండకపోవచ్చు.—ఆమోసు 7:14, 15 చదవండి.

7 ఆమోసు మారుమూల గ్రామం నుండి వచ్చాడు, అయితే ఆచారాల విషయంలో, తన కాలంనాటి పరిపాలకుల విషయంలో ఆయనకున్న అవగాహన చూస్తే ఆయన మరీ ఏమీ తెలియని వ్యక్తి కాదని అర్థమౌతుంది. అలాగే, సంచార వర్తకులతో ఆయనకున్న వ్యవహారాలవల్ల ఇశ్రాయేలు రాజ్యంలోని పరిస్థితులు, చుట్టుపక్కల దేశాల్లోని పరిస్థితులు కూడా ఆయనకు తెలిసేవుండవచ్చు. (ఆమో. 1:6, 9, 11, 13; 2:8; 6:4-6) ఆమోసు ప్రవక్తకు మంచి రచనా నైపుణ్యాలు కూడా ఉన్నాయని నేడు కొందరు విద్వాంసులు చెబుతున్నారు. ఆయన సరళమైనవే అయినా శక్తిమంతమైన పదాలు ఉపయోగించాడు. చెడ్డ యాజకుడైన అమజ్యాను ఖండించడానికి ఆయన ఏమాత్రం భయపడలేదు. తన సందేశాన్ని చేరవేయడానికి యెహోవా నిస్సందేహంగా సరైన వ్యక్తినే ఎంపిక చేసుకున్నాడు. ఇతరులు ఆమోసులో చూడలేకపోయిన విలువైన సామర్థ్యాలను యెహోవా చూశాడు.—ఆమో. 7:12, 13, 16, 17.

8. (ఎ) యెహోవా దావీదుకు ఏ భరోసా ఇచ్చాడు? (బి) ఆత్మవిశ్వాసం లేదా నైపుణ్యాలు అంతగా లేనివాళ్లకు కీర్తన 32:8⁠లోని మాటలు ఎందుకు ప్రోత్సాహకరంగా ఉంటాయి?

8 అవును, యెహోవా తన సేవకుల్లో ఉన్న సామర్థ్యాలను గమనిస్తాడు. “నీమీద దృష్టియుంచి” నిన్ను ఎల్లప్పుడూ నడిపిస్తానని ఆయన దావీదుకు భరోసా ఇచ్చాడు. (కీర్తన 32:8 చదవండి.) ఆ మాటలు మనకు ఎందుకు ప్రోత్సాహకరంగా ఉన్నాయి? మనమీద మనకు నమ్మకం లేకపోయినా, మనం మన పరిమితులకు మించి చూడడానికి, మనం ఊహించని లక్ష్యాలను చేరుకోవడానికి యెహోవా సహాయం చేస్తాడు. అనుభవంలేని విద్యార్థి వేసే ప్రతీ అడుగులో ఓ మంచి టీచర్‌ అతనికి నడిపింపు ఇచ్చినట్లే, యెహోవా కూడా మన పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించేలా మనకు నడిపింపు ఇస్తాడు. అందుకోసం ఆయన మన సహోదరసహోదరీలను ఉపయోగించుకోవచ్చు. ఎలా?

ఇతరుల్లో మంచిని చూడండి

9. ఇతరుల ‘కార్యాలు కూడా చూడాలని’ పౌలు చెప్పిన సలహాను మనం ఎలా పాటించవచ్చు?

9 క్రైస్తవులందరూ తోటి విశ్వాసుల ‘కార్యాలు కూడా చూడాలని’ పౌలు ప్రోత్సహించాడు. (ఫిలిప్పీయులు 2:3, 4 చదవండి.) ఇతరుల్లో ఉన్న సామర్థ్యాలను గమనించి, వాటిని గుర్తించాలన్నదే పౌలు మాటల సారాంశం. మనం సాధించిన అభివృద్ధిని ఇతరులు గుర్తించినప్పుడు మనకెలా అనిపిస్తుంది? అది మనలోని అత్యుత్తమ సామర్థ్యాలను బయటకు తీసుకువచ్చి మనం మరింత అభివృద్ధి సాధించేలా పురికొల్పుతుంది. అలాగే మనం తోటి విశ్వాసుల విలువను గుర్తించినప్పుడు వాళ్లు మరింత పురోగతి సాధించేలా, ఆధ్యాత్మికంగా ఎదిగేలా సహాయం చేస్తాం.

10. మనం ముఖ్యంగా ఎవరిమీద దృష్టిపెట్టాలి?

10 మనం ముఖ్యంగా ఎవరిమీద దృష్టి పెట్టాలి? సంఘంలోని ప్రతీ ఒక్కరిమీద అప్పుడప్పుడూ దృష్టి పెట్టడం అవసరమే. అయితే, ముఖ్యంగా పిల్లలు-యౌవనుల మీద, కొత్తగా బాప్తిస్మం పొందిన సహోదరుల మీద మనసు పెట్టాలి. తాము నిజంగా సంఘ కార్యకలాపాల్లో భాగమని వాళ్లు అనుకునేలా చేయడం ప్రాముఖ్యం. ఇలా చేయడం వల్ల, యెహోవా ప్రజల్లో తాము కూడా విలువైనవాళ్లమనే విషయం వాళ్లు అర్థం చేసుకుంటారు. మరోవైపు, అలాంటి సహోదరులకు తగిన గుర్తింపు ఇవ్వకపోతే, దేవుని వాక్యం ప్రోత్సహిస్తున్నట్లు మరిన్ని బాధ్యతల కోసం అర్హతలు సంపాదించుకోవాలనే వాళ్ల కోరిక సన్నగిల్లవచ్చు.—1 తిమో. 3:1.

11. (ఎ) బిడియాన్ని పోగొట్టుకోవడానికి ఓ యౌవనునికి ఒక సంఘపెద్ద ఎలా సహాయం చేశాడు? (బి) జ్యూల్యాన్‌ అనుభవం నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?

11 ప్రస్తుతం ఒక సంఘపెద్దగా సేవచేస్తున్న ల్యూడోవిక్‌, చిన్నతనంలో ఇతరులు తనపై చూపించిన అలాంటి శ్రద్ధ నుండి ప్రయోజనం పొందాడు. ఆయనిలా అంటున్నాడు, “నేను ఓ సహోదరుని మీద నిజమైన ఆసక్తి చూపించినప్పుడు, ఆయన మరింత త్వరగా అభివృద్ధి సాధించాడు.” జ్యూల్యాన్‌ అనే బిడియస్థుడైన యువ సహోదరుని గురించి ఆయన ఏమంటున్నాడంటే, “జ్యూల్యాన్‌ కొన్నిసార్లు కొంచెం ఎబ్బెట్టుగా మాట్లాడేవాడు, దాంతో అతని వ్యవహార శైలి సహజంగా ఉండేదికాదు. అయితే అతను చాలా దయగల వాడని, సంఘంలోని వాళ్లకు సహాయం చేయాలని నిజంగా కోరుకుంటున్నాడని నేను గమనించాను. అందుకే అతని ఉద్దేశాలను తప్పుబట్టే బదులు, నేను అతనికున్న మంచి లక్షణాల మీద మనసు పెట్టి, అతన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నించాను.” కొద్దికాలానికి జ్యూల్యాన్‌ పరిచర్య సేవకునిగా అర్హత సాధించాడు, ఇప్పుడు క్రమ పయినీరు సేవ చేస్తున్నాడు.

పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించేలా ఇతరులకు సహాయం చేయండి

12. పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించేలా ఇతరులకు సహాయం చేయాలంటే మనం ఏమి చేయడం ప్రాముఖ్యం? ఉదాహరణ చెప్పండి.

12 పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించేలా ఇతరులకు సహాయం చేయాలంటే మనకు వివేచన అవసరం. జ్యూల్యాన్‌ అనుభవం చూపిస్తున్నట్లుగా, మనం ఇతరుల బలహీనతలను కాకుండా, వాళ్లలో ముందుముందు వృద్ధి అవ్వగల మంచి లక్షణాలను, నైపుణ్యాలను చూడగలగాలి. యేసు పేతురు విషయంలో ఇదే పద్ధతిని ఉపయోగించాడు. పేతురు కొన్నిసార్లు అస్థిరంగా కనిపించినా, భవిష్యత్తులో “రాయి” వలె స్థిరంగా తయారవుతాడని యేసు చెప్పాడు.—యోహా. 1:42.

13, 14. (ఎ) యువకుడైన మార్కును బర్నబా ఎలా చూశాడు? (బి) మార్కులాగే సహాయం పొందిన ఓ యౌవనుడు ఎలా ప్రయోజనం పొందాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)

13 మార్కు విషయంలో కూడా బర్నబా అలాంటి పనే చేశాడు. (అపొ. 12:25) పౌలు, బర్నబాలు చేసిన మొదటి మిషనరీ యాత్రలో మార్కు వాళ్ల భౌతిక అవసరాలు తీరుస్తూ ‘సహాయకునిలా’ సేవ చేశాడు. అయితే వాళ్లు పంఫూలియాకు చేరుకున్నప్పుడు, సరిగ్గా సహాయం అవసరమైనప్పుడే మార్కు అకస్మాత్తుగా వాళ్లను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. దాంతో వాళ్లు, మార్కు లేకుండానే బందిపోట్లు ఎక్కువగా ఉండే ఉత్తర దిక్కుకు ప్రయాణించాల్సి వచ్చింది. (అపొ. 13:5, 13) అయితే బర్నబా మాత్రం మార్కులో ఉన్న మంచి లక్షణాల మీద మనసు నిలిపాడు. మార్కు నమ్మదగినవాడు కాదని బర్నబా అనుకోలేదు. బదులుగా బర్నబా మార్కుకు తర్ఫీదు ఇచ్చాడు, దానివల్ల మార్కు పరిణతిగల క్రైస్తవునిగా తయారయ్యాడు. (అపొ. 15:37-39) కొన్ని సంవత్సరాల తర్వాత మార్కు, జైల్లో ఉన్న పౌలుకు సహాయం చేస్తూ రోములో ఉండిపోయాడు. పౌలు కొలస్సయులకు పత్రిక రాసినప్పుడు మార్కును మెచ్చుకుంటూ మాట్లాడాడు. (కొలొ. 4:10) చివరికి, పౌలు మార్కు సహాయం కోసం అడిగినప్పుడు బర్నబా ఎంత సంతోషించివుంటాడో ఊహించండి!—2 తిమో. 4:11.

14 ఇటీవలే సంఘపెద్దగా నియామకం పొందిన అలెక్సాండ్రా అనే సహోదరుడు, తనకు ఓ సహోదరుడు చేసిన సహాయాన్ని గుర్తుచేసుకుంటూ ఇలా అంటున్నాడు, “నా చిన్నప్పుడు, బహిరంగంగా ప్రార్థన చేయాలంటే చాలా ఇబ్బందిపడేవాణ్ణి. అయితే ఓ సంఘపెద్ద, ఎలా సిద్ధపడాలో, ప్రశాంతంగా ఎలా ప్రార్థించాలో చూపించాడు. ప్రార్థనా నియామకానికి నన్ను దూరంగా ఉంచే బదులు, క్షేత్రసేవ కూటాల్లో క్రమంగా ప్రార్థించేందుకు ఆయన నన్ను ఆహ్వానించేవాడు. సమయం గడుస్తుండగా మరింత ఆత్మవిశ్వాసంతో ప్రార్థించడం నేర్చుకున్నాను.”

15. పౌలు తన సహోదరులకు విలువిస్తున్నట్లు ఎలా చూపించాడు?

15 మనం తోటి క్రైస్తవునిలో ఏదైనా మంచి లక్షణం గమనించినప్పుడు, ఆ లక్షణాన్ని మనం ఎంత విలువైనదానిగా ఎంచుతున్నామో మాటల్లో వ్యక్తం చేస్తామా? పౌలు రోమీయులకు రాసిన పత్రికలోని 16వ అధ్యాయంలో, 20 కన్నా ఎక్కువమంది గురించి ప్రస్తావిస్తూ, వాళ్లు చూపించిన మంచి లక్షణాలను ప్రశంసించాడు. (రోమా. 16:3-7, 13) ఉదాహరణకు, అంద్రొనీకు యూనీయ అనే ఇద్దరు సహోదరులు, తనకన్నా ఎక్కువకాలంగా క్రీస్తును సేవిస్తున్నారని చెబుతూ వాళ్లు చూపిస్తున్న ఓర్పును మెచ్చుకున్నాడు. రూఫు అనే సహోదరుని తల్లి, గతంలో తన మీద చూపించిన ప్రేమపూర్వక శ్రద్ధను గుర్తుచేసుకుంటూ ఆమె గురించి కూడా ఆప్యాయంగా మాట్లాడాడు.

ఫ్రేడేరీక్‌ (ఎడమ పక్క), యెహోవాను సేవించాలనే దృఢ సంకల్పాన్ని వదులుకోవద్దని రీకొను ప్రోత్సహించాడు (16వ పేరా చూడండి)

16. పిల్లలను లేదా యౌవనులను మెచ్చుకున్నప్పుడు ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది?

16 ఇతరులను మనస్ఫూర్తిగా మెచ్చుకున్నప్పుడు చక్కని ఫలితాలు వస్తాయి. ఫ్రాన్స్‌కు చెందిన రీకొ అనుభవం పరిశీలించండి. అతను చిన్నతనంలోనే బాప్తిస్మం పొందాలనుకున్నా, అవిశ్వాసియైన అతని తండ్రి ఒప్పుకోకపోవడంతో చాలా నిరుత్సాహపడ్డాడు. బాప్తిస్మం పొందడానికి చట్టబద్ధమైన వయసు వచ్చేవరకూ ఆగాలేమోనని రీకొ అనుకున్నాడు. అంతేకాక, స్కూల్లోని తోటి పిల్లల ఎగతాళివల్ల కూడా బాధపడేవాడు. అతనితో బైబిలు అధ్యయనం చేసిన ఫ్రేడేరీక్‌ అనే సంఘపెద్ద ఇలా గుర్తుచేసుకుంటున్నాడు, “అతను ధైర్యంగా తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు కాబట్టే అలాంటి వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడని చెబుతూ అతన్ని మెచ్చుకున్నాను.” ఆ ప్రోత్సాహకరమైన మాటలవల్ల, అభివృద్ధి సాధిస్తూనే ఉండాలని రీకొ నిర్ణయించుకున్నాడు, అంతేగాక తన తండ్రితో ఉన్న సంబంధాన్ని కూడా మెరుగుపర్చుకున్నాడు. రీకొ 12 ఏళ్ల ప్రాయంలో బాప్తిస్మం పొందాడు.

రయ్యాన్‌ మిషనరీ సేవ చేపట్టేలా జేరోమ్‌ (కుడి పక్క) సహాయం చేశాడు (17వ పేరా చూడండి)

17. (ఎ) అభివృద్ధి సాధించేలా సహోదరులకు మనం ఎలా సహాయం చేయవచ్చు? (బి) ఓ మిషనరీ సహోదరుడు, యౌవనులపై ఎలాంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నాడు? దానివల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి?

17 తోటి విశ్వాసులు నియామకాలను చక్కగా నిర్వహించినప్పుడు, అలాగే కష్టపడి పనిచేసినప్పుడు మనం ప్రతీసారి గమనించి మెచ్చుకుంటే, వాళ్లు మరింతగా యెహోవా సేవ చేయాలనే పురికొల్పు పొందుతారు. సహోదరీలు కూడా సహోదరులను మెచ్చుకోవచ్చని, ఎన్నో ఏళ్లుగా ఫ్రాన్స్‌ బెతెల్‌లో సేవ చేస్తున్న సిల్వీ a అంటోంది. సహోదరీలు తాము ప్రత్యేకంగా గమనించిన విషయాల్ని లేదా ప్రయత్నాలను మెచ్చుకోవచ్చని ఆమె చెబుతోంది. వాళ్ల “మాటలు అనుభవజ్ఞులైన సహోదరులు మెచ్చుకుంటూ చెప్పే మాటలకు చక్కగా తోడవుతాయి. మెచ్చుకోవడాన్ని నేను ఓ బాధ్యతగా చూస్తాను” అని ఆమె అంటోంది. (సామె. 3:27) ఫ్రెంచ్‌ గయానాలో మిషనరీ సేవ చేస్తున్న జేరోమ్‌, చాలామంది యౌవనులు మిషనరీ సేవకు అర్హులయ్యేలా సహాయం చేశాడు. ఆయనిలా చెబుతున్నాడు, “పరిచర్యలో వాళ్లు చక్కగా చేసిన ఓ అంశం గురించో, కూటాల్లో అర్థవంతంగా చేసిన వ్యాఖ్యానాల గురించో మెచ్చుకుంటే, యువ సహోదరుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నేను గమనించాను. దానివల్ల వాళ్లు తమ సామర్థ్యాలను మరింతగా పెంచుకుంటారు.”

18. యువ సహోదరులతో పనిచేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది?

18 మనం తోటి సహోదరులతో పని చేయడం ద్వారా కూడా వాళ్లు ఆధ్యాత్మిక ప్రగతి సాధించేలా పురికొల్పవచ్చు. ఉదాహరణకు ఓ సంఘపెద్ద ఏమి చేయవచ్చంటే, కంప్యూటర్‌ పరిజ్ఞానంగల ఓ యువ సహోదరుణ్ణి jw.org వెబ్‌సైట్‌ నుండి వృద్ధులకు ప్రోత్సాహకరంగా ఉండే సమాచారాన్ని ప్రింట్లు తీసి కంప్యూటర్‌లేని వృద్ధులకు ఇవ్వమని చెప్పవచ్చు. అంతేకాదు, మీరు రాజ్యమందిరాన్ని శుభ్రం చేస్తున్నా లేదా మరమ్మతులు చేస్తున్నా, మీతోపాటు పనిచేయడానికి ఓ యువ సహోదరుణ్ణి ఆహ్వానించవచ్చు. అలా చొరవ తీసుకోవడం వల్ల, మీరు యౌవనుల్లోని సామర్థ్యాలను గమనించి వాళ్లను మెచ్చుకోగలుగుతారు, ఫలితాలు కూడా చూడగలుగుతారు.—సామె. 15:23.

భవిష్యత్తు కోసం పునాది వేయండి

19, 20. ఇతరులు ప్రగతి సాధించడానికి మనమెందుకు సహాయం చేయాలి?

19 ఇశ్రాయేలీయులను నడిపించడానికి యెహోషువను నియమిస్తున్నప్పుడు, “అతని ధైర్యపరచి దృఢపరచుము” అని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. (ద్వితీయోపదేశకాండము 3:28 చదవండి.) ప్రపంచవ్యాప్త సంఘంలోకి ప్రజలు ప్రవాహంలా వస్తూనే ఉన్నారు. కాబట్టి కొత్తవాళ్లు, యువకులు తమ సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించేలా పెద్దలే కాదు అనుభవజ్ఞులైన క్రైస్తవులందరూ సహాయం చేయవచ్చు. దానివల్ల, ఎంతోమంది పూర్తికాల పరిచర్యలో అడుగుపెడతారు, చాలామంది సహోదరులు “ఇతరులకును బోధించుటకు సామర్థ్యముగల” వాళ్లుగా తయారౌతారు.—2 తిమో. 2:2.

20 మనం ఒకవేళ పెద్ద సంఘంతో సహవసిస్తున్నా లేదా త్వరలోనే ఓ సంఘంగా తయారవ్వబోయే చిన్న గుంపుతో సహవసిస్తున్నా మనమందరం భవిష్యత్తు కోసం పునాది వేద్దాం. అందుకోసం, తన సేవకుల్లో ఎల్లప్పుడూ మంచినే చూసే యెహోవాను ఆదర్శంగా తీసుకుందాం.

a అసలు పేరు కాదు.