కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దౌర్జన్యానికి గురైనవారి హక్కులు సమర్థించబడ్డాయి

దౌర్జన్యానికి గురైనవారి హక్కులు సమర్థించబడ్డాయి

దౌర్జన్యానికి గురైనవారి హక్కులు సమర్థించబడ్డాయి

ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో ఉన్న యూరోపియన్‌ కోర్ట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ (ఐరోపాలోని మానవ హక్కుల న్యాయస్థానం) 2007, మే 3న, రిపబ్లిక్‌ ఆఫ్‌ జార్జియాలోని యెహోవాసాక్షులకు అనుకూలంగా ముక్తకంఠంతో తీర్పునిచ్చింది. సాక్షులు అమానుషంగా హింసించబడ్డారనీ, వారి మత స్వాతంత్ర్యపు హక్కు భంగపరచబడిందనీ న్యాయస్థానం గ్రహించింది. అలా దౌర్జన్యం చేసిన నేరస్థులపై చట్టబద్ధమైన చర్య తీసుకోనందుకు యూరోపియన్‌ న్యాయస్థానం జార్జియా మాజీ ప్రభుత్వాన్ని గద్దించింది. న్యాయస్థానం ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది?

రిపబ్లిక్‌ ఆఫ్‌ జార్జియాకు రాజధానియైన టిబిలిసి అనే నగరంలోని గ్లడానీలో యెహోవాసాక్షుల సంఘం ఒకటి ఉంది. దానికి చెందిన దాదాపు 120 మంది సభ్యులు 1999 అక్టోబరు 17న ఆరాధన కోసం ప్రశాంతంగా సమకూడు​తున్నారు. అంతలో, పదవీచ్యుతుడైన వసీలీ మకాలావీష్వీలీ అనే ఆర్థొడాక్స్‌ పాదిరీ నేతృత్వం క్రింద ఒక పెద్ద అల్లరిమూక ఆ హాలులోకి దూసుకువచ్చింది. వారు లావుపాటి కర్రలతో, ఇనుప సిలువలతో వచ్చి, అక్కడున్నవారిలో అనేకమందిని క్రూరంగా కొట్టి గాయపర్చారు, కొందరిని తీవ్రంగా గాయపర్చారు. ఒక స్త్రీకైతే తగిలిన దెబ్బలవల్ల ఒక కన్ను పోయింది. కనీసం 16 మందికి వైద్య సహాయం అవసరమైంది. కొంతమంది సాక్షులు సహాయం కోసం పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లారు. అక్కడ వారు కలిసిన ఒక పోలీసు ముఖ్యాధికారి తానైతే వారిని ఇంకా క్రూరంగా హింసించేవాడినని అన్నాడు! ఆ మూకలోని ఒక వ్యక్తి జరిగిన దాడినంతటినీ వీడియో తీశాడు, ఆ తర్వాత అది జాతీయ ఛానెళ్లలో ప్రసారం చేయబడింది. దానిలో దాడిచేసిన​వారెవరో స్పష్టంగా చూపించబడింది. *

దౌర్జన్యానికి గురైన సాక్షులు నేరస్థులపై క్రిమినల్‌ కేసు వేశారు. కానీ ఆ దాడి చేసినవారిపై ఎలాంటి చర్యా తీసుకోబడలేదు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి నియమించబడిన పోలీసు అధికారి, తానొక ఆర్థొడాక్స్‌ చర్చి సభ్యుడినని, ఈ కేసు విషయంలో తాను నిష్పక్షపాతంగా ఉండలేనని చెప్పాడు. ప్రభుత్వాధికారులు, పోలీసులు ఏ చర్యా తీసుకోక​పోయేసరికి మతోన్మాదులు తెగించి వందకు పైగా అలాంటి దాడులు చేశారు.

అందువల్ల 2001 జూన్‌ 29న యెహోవాసాక్షులు యూరోపియన్‌ కోర్ట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ న్యాయస్థానానికి విన్నవించుకున్నారు. * న్యాయస్థానం 2007 మే 3న తుది నిర్ణయాన్ని ప్రకటించింది. ఆ సమయంలో సాక్షులపై జరిగిన దాడిని కళ్లకు కట్టినట్లుగా వివరించి, ఏ చర్యా తీసుకోనందుకు జార్జియాలోని ప్రభుత్వాధికారులను ఖండించింది. న్యాయస్థానం తన తీర్పులో ఇలా పేర్కొంది: దాడి గురించిన “సమాచారం సరైనదో కాదో నిర్ధారించుకోవడానికి సత్వరమే చర్య తీసుకోవడం . . . అధికారుల బాధ్యత. . . . అధికారులు అలాంటి పనులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్ల ప్రజలకు న్యాయంపట్ల నమ్మకం ఉండదు, ప్రభుత్వం న్యాయాన్ని కాపాడుతుందన్న నమ్మకం పోతుంది.”

న్యాయస్థానం ఈ మాటలతో ముగించింది: “వినతిదారులపై 1999 అక్టోబరు 17న జరిగిన దాడి, యెహోవాసాక్షులపై అంత పెద్ద ఎత్తున జరిగిన దాడుల్లో మొదటిది. మొదటిసారే అధికారులు నిర్లక్ష్యం చేయడంతో అదే అల్లరిమూక జార్జియా అంతటా అలాంటి మతపరమైన దౌర్జన్యానికి తెగించింది.”

దౌర్జన్యానికి గురైనవారి హక్కులు సమర్థించబడ్డాయి. జార్జియా ప్రభుత్వం జరిగినదానికి నష్టపరిహారం చెల్లించాలని, గ్లడానీ సంఘ సభ్యులకు న్యాయపరమైన రుసుము చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. జార్జియాలో తమపై జరుగుతున్న దౌర్జన్యం, హింస చాలావరకు తగ్గినందుకు యెహోవాసాక్షులు సంతోషిస్తున్నారు. అయితే తాము ప్రశాంతంగా కూడుకునే తమ హక్కును సమర్థిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చినందుకు వారు మరెంతో సంతోషిస్తున్నారు. ఈ పరీక్షలన్నిటిలో తమకు నిర్దేశాన్ని, కాపుదలను ఇచ్చిన తమ పరలోక తండ్రియైన యెహోవా దేవునికి వారెంతో కృతజ్ఞులైవున్నారు.​—⁠కీర్తన 23:⁠4. (w 08 3/1)

[అధస్సూచీలు]

^ పేరా 3 మరిన్ని వివరాల కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన తేజరిల్లు! (ఆంగ్లం) జనవరి 22, 2002వ సంచిక 18-24 పేజీలు చూడండి.

^ పేరా 5 యూరోపియన్‌ కోర్ట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ అనే సంస్థ, కౌన్సిల్‌ ఆఫ్‌ యూరప్‌కు సంబంధించిన సంస్థ. ఇది యూరోపియన్‌ కన్వెన్షన్‌ ఫర్‌ ద ప్రొటెక్షన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ ఫండమెంటల్‌ రైట్స్‌లోని నియమాలను ఉల్లంఘించడానికి సంబంధించిన ఆరోపణలపై తీర్పులిస్తుంది. జార్జియా 1999 మే 20న ఈ మానవ హక్కుల ఒడంబడికను అంగీకరించి, దానికి కట్టుబడి ఉండాలని తీర్మానించుకుంది.