కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నోవహు కాలంలో జలప్రళయం నిజంగా భూవ్యాప్తంగా వచ్చిందా?

నోవహు కాలంలో జలప్రళయం నిజంగా భూవ్యాప్తంగా వచ్చిందా?

మా పాఠకుల ప్రశ్న

నోవహు కాలంలో జలప్రళయం నిజంగా భూవ్యాప్తంగా వచ్చిందా?

నోవహు కాలంలో వచ్చిన జలప్రళయం 4,000 సంవత్సరాల కంటే ఎక్కువకాలం క్రితం వచ్చింది. దాని గురించి మనకు చెప్పడానికి దాన్ని కళ్ళారా చూసినవాళ్ళు ప్రస్తుతం భూమ్మీద ఎవరూ లేరు. అయితే ఆ విపత్తును గురించిన వ్రాతపూర్వక నివేదిక ఉంది, ప్రవాహ​జలాలు ఆ కాలంలోని ఎత్తైన పర్వతాన్ని ముంచేశాయని అది చెబుతోంది.

చారిత్రాత్మక నివేదికలో ఇలా ఉంది: “ఆ జలప్రవాహము నలుబది దినములు భూమిమీద నుండగా, . . . ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నియు మునిగిపోయెను. పదిహేను మూరల [6.5 మీటర్ల] యెత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములును మునిగి పోయెను.”​—⁠ఆదికాండము 7:​17-20.

భూమి అంతా నీటితో కప్పబడిపోవడమనేది కట్టుకథైనా అయ్యుండాలి లేదా కనీసం అతిశయోక్తయినా అయ్యుండాలి అని కొంతమంది అనుకోవచ్చు. అయితే ఆ రెండూ నిజం కాదు! నిజానికి భూమ్మీద ఇప్పటికీ నీళ్ళు ఎక్కువగానే ఉన్నాయి. భూమి దాదాపు 71 శాతం సముద్రపు నీటితో నిండివుంది. నిజానికి జలప్రళయపు నీళ్ళు ఇప్పటికీ భూమ్మీద ఉన్నాయి. మంచుపర్వతాలు, ధృవప్రాంతాల్లోని మంచుగడ్డలు గనుక కరిగితే న్యూయార్కు, టోక్యోలాంటి నగరాలు మునిగిపోయేంతగా సముద్రమట్టం పెరగవచ్చు.

అమెరికా నైరుతిదిశ భూభాగాన్ని అధ్యయనం చేస్తున్న భూవిజ్ఞాన శాస్త్రజ్ఞులు, ఒకప్పుడు ఆ ప్రాంతంలో, సుదీర్ఘమైన కాలవ్యవధిలో దాదాపు 100 విపత్కరమైన జల​ప్రళయాలు వచ్చాయని నమ్ముతున్నారు. అలాంటి ఒక జలప్రళయం వచ్చినప్పుడు, నీరు 600 మీటర్ల ఎత్తున, గంటకు 105 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఆ ప్రాంతాన్ని ముంచెత్తిందని, ఆ నీటి ఘనపరిమాణం 2,000 ఘనపు మైళ్ళు, బరువు రెండు లక్షల కోట్ల టన్నులు అని చెప్పబడుతోంది. వెల్లడైన అలాంటి ఇతర వివరాలు, భూవ్యాప్త జలప్రళయం వచ్చే అవకాశముందని ఇతర శాస్త్రజ్ఞులు నమ్మేలా చేశాయి.

అయితే బైబిలు దేవుని వాక్యమని నమ్మేవారు జల​ప్రళయం ఖచ్చితంగా వచ్చిందని నమ్ముతున్నారు. అదొక వాస్తవం. యేసు, “నీ వాక్యమే సత్యము” అని దేవునితో అన్నాడు. (యోహాను 17:​17) “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెను” అని దేవుడు కోరుకుంటున్నాడని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (1 తిమోతి 2:​3, 4) ఒకవేళ దేవుని వాక్యంలో కట్టుకథలుంటే, పౌలు యేసు అనుచరులకు దేవుని గురించిన ఆయన ఉద్దేశం గురించిన సత్యాలను ఎలా బోధించగలిగేవాడు?

జలప్రళయం వచ్చిందనే కాక, అది భూవ్యాప్తంగా వచ్చిందని కూడా యేసు నమ్మాడు. ఆయన తన ప్రత్యక్షత గురించి, యుగ సమాప్తి గురించి గొప్ప ప్రవచనం చెబుతూ, ఆ సమయంలో జరిగేవాటిని నోవహు దినాలకు పోల్చాడు. (మత్తయి 24:​37-39) అపొస్తలుడైన పేతురు కూడా నోవహు కాలంలో వచ్చిన జలప్రళయపు నీటిని గురించి వ్రాశాడు, “ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను.”​—⁠2 పేతురు 3:⁠6.

నోవహు కాల్పనిక వ్యక్తి అయితే, జలప్రళయం కట్టుకథ అయితే, అంత్యదినాల్లో జీవిస్తున్నవారికి పేతురు, యేసు ఇచ్చిన హెచ్చరికలు అర్థంలేనివిగా ఉంటాయి. అలాంటి తలంపులు, ఒక వ్యక్తికి హెచ్చరికగా పనిచేసే బదులు, దైవిక విషయాల్లో అతన్ని తికమకపెట్టి, నోవహుకాలంలో వచ్చిన జలప్రళయం కన్నా గొప్ప శ్రమను తప్పించుకునే అవకాశాలు ఆ వ్యక్తికి లేకుండా చేస్తాయి.​—⁠2 పేతురు 3:1-7.

దేవుడు తన ప్రజలపై తాను నిరంతరం చూపించే కృప గురించి ఇలా చెప్పాడు, “జలములు భూమిమీదికి ఇకను పొర్లుచురావని నోవహు కాలమున నేను ఒట్టుపెట్టుకొనినట్లు నీమీద కోపముగా నుండననియు, నిన్ను గద్దింపననియు నేను ఒట్టుపెట్టుకొనియున్నాను.” నోవహు జల​ప్రళయం భూమిని ముంచెత్తడం ఎంత వాస్తవమో, దేవుని నమ్మేవారిపై ఆయన కృప చూపించడం అంతే వాస్తవం.​—⁠యెషయా 54:⁠9. (w 08 6/1)