కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు వేసుకుంటున్న పథకాలు దేవుడు ఉద్దేశించినదానితో పొందికగా ఉన్నాయా?

మీరు వేసుకుంటున్న పథకాలు దేవుడు ఉద్దేశించినదానితో పొందికగా ఉన్నాయా?

మీరు వేసుకుంటున్న పథకాలు దేవుడు ఉద్దేశించినదానితో పొందికగా ఉన్నాయా?

ఉత్తర అమెరికా పశ్చిమ ప్రాంత అడవుల్లో, బూడిదరంగులో ఉండే, పాటలు పాడే క్లార్క్స్‌ నట్‌క్రాకర్‌ అనే పక్షి కనిపిస్తుంది. ఇది తీవ్రమైన చలికాలపు నెలల కోసం సిద్ధపడుతూ సంవత్సరానికి దాదాపు 33,000 విత్తనాలను సేకరించి, వాటిని దాదాపు 2,500 స్థలాల్లో భద్రపరుస్తుంది. ఈ పక్షి భవిష్యత్తు కోసం ఆహారాన్ని నిల్వ చేసుకోవడంలో ‘సహజ జ్ఞానాన్ని’ ప్రదర్శిస్తుంది.—సామెతలు 30:24, NW.

మానవులకు అంతకన్నా విశేషమైన సామర్థ్యముంది. గత అనుభవాల నుండి నేర్చుకుని, అలా నేర్చుకున్న పాఠాలు భవిష్యత్తు విషయంలో తమ ఆలోచనలను ప్రభావితం చేయడానికి అనుమతించే సామర్థ్యం యెహోవా సృష్టించిన భూ​ప్రాణులన్నిటిలో మానవులకే ఎక్కువగా ఉంది. “మనుష్యులు ఎన్నో పథకాలు వేస్తారు” అని జ్ఞానియైన సొలొమోను రాజు పేర్కొన్నాడు.—సామెతలు 19:21, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

అయినప్పటికీ, మానవులు సాధారణంగా భవిష్యత్తు విషయంలో తమకున్న ఊహల ఆధారంగానే పథకాలు వేసుకుంటారు. ఉదాహరణకు, సూర్యుడు ఉదయిస్తాడని, మీరు సజీవంగా ఉంటారని ఊహిస్తూ, రేపటికోసం మీ కార్యకలాపాలను పథకం వేసుకుంటారు. ఈ మొదటిది వాస్తవాలపై ఆధారపడినది; అయితే రెండవది అంత నిశ్చయమైనది కాదు. బైబిలు రచయితయైన యాకోబు ఈ వాస్తవాన్ని వెల్లడి​చేశాడు, “రేపేమి సంభవించునో మీకు తెలియదు.”—యాకోబు 4:13, 14.

యెహోవా దేవునికి అలాంటి పరిమితులు లేవు. ‘పూర్వ​కాలమునుండి ఇంకా జరగనివి’ ఆయనకు తెలుసు. ఆయన తాను ఉద్దేశించానని చెప్పినది తప్పక నెరవేరుతుంది. ‘నా ఆలోచన నిలుచును, నా చిత్తమంతయు నెరవేర్చు​కొనెదను’ అని ఆయన ప్రకటించాడు. (యెషయా 46:10) అయితే, మానవులు దేవుడు ఉద్దేశించినదానిని పరిగణనలోకి తీసుకోకుండా భవిష్యత్తు గురించి పథకాలు వేసుకుంటే ఏమి జరుగుతుంది?

మానవుల పథకాలు దేవుడు ఉద్దేశించినదానిని అలక్ష్యంచేసినప్పుడు

దాదాపు 4,000 వేల సంవత్సరాల క్రితం బాబెలు గోపుర నిర్మాణకులు మానవజాతి భూవ్యాప్తంగా చెదిరిపోకుండా ఆపాలని పథకం వేశారు. వారిలా చెప్పుకున్నారు, “మనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును, ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండి.”—ఆదికాండము 11:4.

అయితే, భూమి విషయంలో దేవుడు ఉద్దేశించినది అది కాదు. ఆయన, “మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి” అని నోవహుకు, ఆయన కుమారులకు ఆజ్ఞాపించాడు. (ఆదికాండము 9:1) బాబెలులోని తిరుగుబాటుదారులైన ప్రజలు సాధించాలనుకున్నదానితో దేవుడెలా వ్యవహరించాడు? వారు ఒకరితో ఒకరు సంభాషించుకోలేని విధంగా దేవుడు వారి భాషను తారుమారు చేశాడు. దాని ఫలితంగా ఏమి జరిగింది? “యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను.” (ఆదికాండము 11:5-8) బాబెలు నిర్మాణకులు ఒక విలువైన పాఠాన్ని నేర్చుకోవాల్సివచ్చింది. మానవుల పథకాలు దేవుడు ఉద్దేశించినదానికి అనుగుణంగా లేనప్పుడు, “యెహోవా కోరేవి మాత్రమే జరుగుతాయి.” (సామెతలు 19:21) గతం నుండి నేర్చుకున్న అలాంటి పాఠాలు మీ జీవితంపై ప్రభావం చూపడానికి మీరు అనుమతిస్తారా?

ఒక ధనవంతుడు చేసిన పొరపాటు

మీరు ఒక గోపురం కట్టాలని పథకం వేసుకోకపోవచ్చు, కానీ ఉద్యోగ విరమణ పొందిన తర్వాత నిశ్చింతగా జీవించడానికి వీలుగా చాలామంది బ్యాంకులో డబ్బు దాచుకోవాలని, వస్తు సంపదలు సంపాదించుకోవాలని పథకం వేసుకుంటారు. ఒక వ్యక్తి తన కష్టానికి తగిన ఫలాన్ని అనుభవించాలని కోరుకోవడం సహజమే. “ప్రతివాడు అన్నపానములు పుచ్చు​కొనుచు తన కష్టార్జితమువలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే” అని సొలొమోను వ్రాశాడు.—​ప్రసంగి 3:13.

ఈ బహుమానాన్ని ఉపయోగించుకునే విషయంలో యెహోవాకు మనం జవాబుదారులం. దాదాపు 2,000 సంవత్సరాల క్రితం యేసు ఒక ఉపమానం ద్వారా ఈ విషయాన్ని తన శిష్యులకు నొక్కిచెప్పాడు. ఆయన ఆ ఉపమానాన్ని ఇలా ప్రారంభించాడు, “ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు​—నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొని—నేనీలాగు చేతును; నా కొట్లువిప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో—ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను.” (లూకా 12:16-19) ఈ ధనవంతుని ఆలోచన సమంజసమైనదిగానే అనిపిస్తుంది, కాదంటారా? మొదట్లో ప్రస్తావిం​చబడిన క్లార్క్స్‌ నట్‌క్రాకర్‌ అనే పక్షిలాగే ఈ ఉపమానంలోని వ్యక్తి తన భవిష్యత్‌ అవసరాల కోసం సిద్ధపడుతున్నట్లుగా కనిపిస్తుంది.

అయితే ఈ వ్యక్తి ఆలోచనా విధానంలో ఒక లోపముంది. యేసు ఆ ఉపమానాన్ని కొనసాగిస్తూ ఇంకా ఇలా చెప్పాడు, “దేవుడు—వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని అతనితో చెప్పెను.” (లూకా 12:20) పని, దానివల్ల వచ్చే మంచి ఫలితాలు దేవుడిచ్చిన బహుమానమని సొలొమోను చేసిన వ్యాఖ్యానాన్ని యేసు వ్యతిరేకించాడా? లేదు. మరి యేసు ఏమి చెప్పాడు? “దేవునియెడల ధనవంతుడుకాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండును” అని చెప్పాడు.​—లూకా 12:21.

మనం పథకాలు వేసుకుంటున్నప్పుడు తనను పరిగణనలోకి తీసుకోవాలని యెహోవా ఆశిస్తున్నాడని యేసు తన ప్రేక్షకులకు బోధించాడు. ఆ ధనవంతుడు తనకున్న దైవభక్తిని, జ్ఞానాన్ని, ప్రేమను వృద్ధిచేసుకోవడానికి ప్రయత్నించివుంటే దేవుని దృష్టిలో ధనవంతుడై ఉండేవాడు. అయితే ఆయనకు అలాంటి విషయాల్లో ఆసక్తి లేదనీ, పేదవాళ్ళు ఏరుకోవడానికి కొంత పంటను విడిచిపెట్టడంలో, యెహోవాకు అర్పణలు చెల్లించడంలో కూడా ఆయనకు ఆసక్తి లేదనీ ఆ వ్యక్తి మాటలనుబట్టి తెలుస్తోంది. అలాంటి ఆధ్యాత్మిక లక్ష్యాలకు, నిస్వార్థ చర్యలకు ఆ ధనవంతుని జీవితంలో స్థానంలేదు. ఆయన పథకాలు వేసుకుంటున్నప్పుడు తన సొంత కోరికలకు, సుఖాలకే ప్రాధాన్యతనిచ్చాడు.

నేడు చాలామంది తమ జీవితాల్లో, యేసు వర్ణించిన ధనవంతుడు ప్రాధాన్యతనిచ్చిన విషయాలకే ప్రాధాన్యతనిస్తున్నారని మీరు గమనించారా? మనం ధనవంతులమైనా, పేదవారమైనా వస్తువులను సమకూర్చుకోవాలనే ఉరిలో చిక్కుకుని, అనుదిన జీవితావసరాలను, కోరికలను తీర్చు​కోవడంలో నిమగ్నమైపోయి, దేవునితో మనకున్న సంబంధాన్ని నిర్లక్ష్యం చేయడం చాలా సులభం. అలాంటి ఉరిలో చిక్కుకోకుండా ఉండాలంటే మీరేం చేయవచ్చు?

“సాధారణ” జీవితం కోసం పథకం వేసుకోవడం

యేసు ఉపమానంలోని ధనవంతునిలా కాక మీకు ఆర్థిక సమస్యలుండవచ్చు. అయినా, మీరు వివాహితులైతే, మీ కుటుంబానికి జీవితావసరాలను, వీలైతే మీ పిల్లలకు మంచి ప్రాథమిక విద్యను అందించాలని పథకం వేసుకుంటారనడంలో సందేహం లేదు. మీరు అవివాహితులైతే, ఇతరులకు భారం కాకుండా మీరు ఉద్యోగం సంపాదించుకోవాలనో, మీకున్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోవాలనో పథకం వేసుకుంటుండ​వచ్చు. ఇవి పెట్టుకోదగిన మంచి లక్ష్యాలే.—2 థెస్సలొనీ​కయులు 3:10-12; 1 తిమోతి 5:8.

పనిచేయడం, తినడం, త్రాగడం వంటివి కూడా అంటే సాధారణ జీవితంగా పరిగణించబడే జీవితం కూడా ఒక వ్యక్తి దేవుడు ఉద్దేశించినదానికి అనుగుణంగా లేని జీవితాన్ని గడిపేలా చేయగలదు. అదెలా జరగవచ్చు? యేసు ఇలా చెప్పాడు, “నోవహు దినములు ఏలాగుండెనో మనుష్య​కుమారుని రాకడయును ఆలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినము​వరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి; ఆలాగుననే మనుష్య​కుమారుని రాకడ ఉండును.”—మత్తయి 24:37-39.

జలప్రళయానికి ముందు ప్రజలు తాము సాధారణ జీవితమని పరిగణించిన దానిని అనుభవించారు. అయితే వారి సమస్యేమిటంటే భూవ్యాప్త జలప్రళయం ద్వారా దుష్ట ప్రపంచాన్ని నాశనం చేయాలని దేవుడు ఉద్దేశించినదానిని వారు “ఎరుగక పోయిరి” అంటే పరిగణనలోకి తీసుకోలేదు. నోవహు జీవనవిధానం అసాధారణంగా ఉన్నట్లు వారు భావించారనడంలో సందేహం లేదు. అయితే, జలప్రళయం వచ్చినప్పుడు, నోవహు ఆయన కుటుంబం అనుసరిస్తున్న జీవన విధానమే నిజంగా జ్ఞానవంతమైనదని నిరూపించబడింది.

నేడు, మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామని అందుబాటులో ఉన్న రుజువులన్నీ నిరూపిస్తున్నాయి. (మత్తయి 24:3-12; 2 తిమోతి 3:1-5) త్వరలో దేవుని రాజ్యం ప్రస్తుత లోక విధానాన్ని “నాశనం చేసి, అంతం చేస్తుంది.” (దానియేలు 2:44, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఆ రాజ్య పరి​పాలన భూమిని అందమైన తోటగా మారుస్తుంది. అది వ్యాధులు, మరణం లేకుండా చేస్తుంది. (యెషయా 33:24; ప్రకటన 21:3-5) భూమ్మీదున్న సమస్త జీవకోటి ఆకలిదప్పులు లేకుండా సామరస్యంగా జీవిస్తుంది.—కీర్తన 72:16; యెషయా 11:6-9.

అయితే, యెహోవా అలా చేయడానికి ముందు, తన రాజ్యానికి సంబంధించిన సువార్త ‘సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతట ప్రకటించబడాలి’ అని ఉద్దేశించాడు. (మత్తయి 24:14) దేవుడు ఉద్దేశించినదానికి అనుగుణంగా 236 దేశాల్లో దాదాపు 70 లక్షలమంది యెహోవాసాక్షులు 400 కన్నా ఎక్కువ భాషల్లో ఈ సువార్తను ప్రకటిస్తున్నారు.

లోకంలోని ప్రజలకు యెహోవాసాక్షుల జీవన విధానం కొన్ని విషయాల్లో వింతగా, చివరికి హాస్యాస్పదంగా కూడా అనిపించవచ్చు. (2 పేతురు 3:3, 4) జలప్రళయానికి ముందు జీవించినవారిలాగే నేడు అనేకమంది తమ దైనందిన జీవిత కార్యకలాపాల్లో మునిగిపోయి ఉంటున్నారు. వారు, సమాజం సాధారణమైనదిగా పరిగణించే జీవన విధానాన్ని అనుసరించనివారిని సమతూకం లేనివారిగా దృష్టిస్తారు. కానీ దేవుని వాగ్దానాలపై విశ్వాసమున్న వారి దృక్కోణం నుండి చూస్తే, దేవుని సేవకు ప్రాధాన్యతనిచ్చే జీవితం నిజంగా సమతూకంగలది.

కాబట్టి, మీరు ధనవంతులైనా, పేదవారైనా లేక మధ్య తరగతివారైనా సమీప భవిష్యత్తు కోసం మీరు వేసుకునే పథకాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం జ్ఞానయుక్తమైనది. అలా చేస్తుండగా మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి, ‘నేను వేసుకుంటున్న పథకాలు దేవుడు ఉద్దేశించినదానితో పొందికగా ఉన్నాయా?’ (w 08 7/1)

[9వ పేజీలోని చిత్రం]

మానవుల పథకాలు దేవుడు ఉద్దేశించినదానికి అనుగుణంగా లేనప్పుడు, యెహోవా కోరేవి మాత్రమే జరుగుతాయి

[10వ పేజీలోని చిత్రం]

యేసు ఉపమానంలోని ధనవంతుడు, తాను పథకాలు వేసుకుంటున్నప్పుడు దేవుడు ఉద్దేశించినదానికి ప్రాధాన్యతనివ్వలేదు