కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు జీవితాలను మారుస్తుంది

బైబిలు జీవితాలను మారుస్తుంది

బైబిలు జీవితాలను మారుస్తుంది

వజ్రాలను దొంగ రవాణా చేస్తూ, పనిచేసే చోట అధికారుల కళ్లుగప్పి దొంగతనాలు చేసిన ఒక స్త్రీ ఎందుకిప్పుడు నిజాయితీగా పనిచేస్తోంది? రెండుసార్లు ప్రాణం తీసుకోవాలని చూసిన ఒక స్త్రీ తన జీవితానికి ఒక అర్థముందని ఎలా తెలుసుకుంది? మత్తుమందులకు బానిసైన ఒక తాగుబోతు అలాంటి ప్రాణాంతకమైన వ్యసనాల బారినుండి ఎలా బయటపడ్డాడు? వాళ్లెందుకలా మారారో వారి మాటల్లోనే వినండి. అలాగే వారు చెప్పేదాని గురించి ఆలోచించి చూడండి.

పరిచయం

పేరు: మార్గరేట్‌ డబేర్న్‌

వయసు: 45

దేశం: బోట్సువానా

ఒకప్పుడు: దొంగ రవాణా, దొంగతనాలు చేసేది

నా గతం: మా నాన్న పుట్టింది జర్మనీలో కానీ ఆ తర్వాత ఆఫ్రికాలో ఆగ్నేయ ప్రాంతానికి (నమీబియాకు) వచ్చి స్థిరపడ్డాడు. మా అమ్మ బోట్సువానాలో పుట్టింది. ఆమె మన్గోలోగా తెగకు చెందింది. నేను నమీబియాలోని గొబాబిస్‌ నగరంలో పుట్టాను.

అప్పట్లో అంటే 1970లలో దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి నమీబియాపై చాలా అధికారం ఉండేది. పట్టణాల్లోనూ, పల్లెల్లోనూ ప్రభుత్వం జాతి వెలి విధాన చట్టాలను చాలా కఠినంగా అమలుచేసేది. మా అమ్మానాన్నలది వర్ణాంతర వివాహం కాబట్టి వాళ్లను విడిపొమ్మని చాలా బలవంతపెట్టారు. దాంతో మా అమ్మ పిల్లల్ని తీసుకుని బోట్సువానాలోని ఘాన్సీకి తిరిగొచ్చింది.

బోట్సువానాలోని లోబాట్సేలో ఉంటున్న మా పెంపుడు తల్లిదండ్రుల దగ్గరకి 1979లో వచ్చాను. అక్కడే స్కూలు చదువు పూర్తిచేశాను. తర్వాత నాకు గ్యారేజీలో క్లర్కు ఉద్యోగం దొరికింది. దేవుడు మనల్ని పట్టించుకోడనీ, మన కోసం మన కుటుంబం కోసం సంపాదించుకోవడానికి తప్పోఒప్పో ఏదోకటి మనమే చేయాలనే నమ్మకం నాలో చిన్నప్పుటి నుండి నాటుకుపోయింది.

నేను పనిచేసే చోట మంచి స్థానంలో ఉండడంతో ఆ అవకాశాన్ని వాడుకుని స్పేరు సామాను దొంగలించేదాన్ని. మేమున్న పట్టణంగుండా రాత్రుళ్ళు ఏదైనా రైలు వెళితే నేనూ, నా తోటివాళ్ళు దానిలోకి ఎక్కి అందిందంతా దోచుకునేవాళ్ళం. వజ్రాలు, బంగారం, కంచు దొంగ రవాణా చేసేదాన్ని. మత్తుమందులకు అలవాటుపడ్డాను, చాలా క్రూరంగా తయారయ్యాను, చాలామంది అబ్బాయిలతో తిరిగేదాన్ని.

ఇదిలా ఉండగా 1993లో దొంగతనం చేస్తూ దొరికిపోయాను, దాంతో ఉద్యోగం ఊడిపోయింది. నేను స్నేహితులనుకున్న వాళ్ళందరూ వాళ్ళెక్కడ దొరికిపోతారోనని నన్ను వదిలేశారు. వాళ్ళలా చేయడం చూసి నాకెంతో బాధనిపించింది. అప్పటినుండి ఇక ఎవ్వరినీ నమ్మకూడదని నిర్ణయించుకున్నాను.

కానీ బైబిలు నా జీవితాన్ని మార్చింది. ఎలాగంటే . . .1994లో టిమ్‌, వర్జీనియాలను కలిశాను. వాళ్ళిద్దరు యెహోవాసాక్షులు, మిషనరీలు. నేను కొత్తగా ఉద్యోగం చేస్తున్నచోట మధ్యాహ్న భోజన సమయంలో నాకు బైబిలు గురించి నేర్పించడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళ మీద నమ్మకం కుదిరాక నాతో బైబిలు పఠనం చేయడానికి ఇంటికే రమ్మన్నాను.

దేవునికి నచ్చినట్టుండాలంటే, నా జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాలని నాకు కొన్ని రోజుల్లోనే అర్థమైంది. ఉదాహరణకు, 1 కొరింథీయులు 6:​9, 10 నుండి నేను ‘జారులైనా దొంగలైనా లోభులైనా త్రాగుబోతులైనా దూషకులైనా దోచుకొనేవారైనా దేవుని రాజ్యానికి వారసులు కాలేరు’ అని నేర్చుకున్నాను. నా చెడు అలవాట్లను ఒక్కొక్కటిగా మానుకున్నాను. దొంగతనం చేయడం మానేశాను. నాతోపాటు పెరిగిన ముఠా సభ్యులతో తెగదెంపులు చేసుకున్నాను. యెహోవా దేవుని సహాయంతో నా బాయ్‌ఫ్రెండ్‌లను నా జీవితంలోనుండి తరిమేశాను.

నేనెలా ప్రయోజనం పొందానంటే . . .నేనెంతో కష్టపడి నా కోపాన్ని అదుపులో పెట్టుకోవడం నేర్చుకున్నాను. ఏదైనా జరిగితే మా పిల్లల మీద అరవడం మానుకున్నాను. (ఎఫెసీయులు 4:31) సమస్య గురించి ప్రశాంతంగా చర్చించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇలా చేయడంవల్ల సమస్యా దూరమవుతుంది, మామధ్య అనురాగమూ పెరుగుతుంది.

నా పాత స్నేహితులకు, చుట్టుపక్కలవాళ్ళకు నామీద నమ్మకం కుదిరింది. నేనిప్పుడు ఆఫీసులో నాకప్పజెప్పిన వస్తువులనూ డబ్బునూ జాగ్రత్తగా చూసుకుంటూ నిజాయితీగా, నమ్మకంగా పనిచేస్తున్నాను. ఇతరులకు బైబిలు గురించి నేర్పించడానికి నా సమయాన్నంతా వెచ్చిస్తున్నాను కాబట్టి నిజాయితీగా పనిచేసుకుంటూ నాకవసరమైన డబ్బు సంపాదించుకుంటున్నాను. సామెతలు 10:22లో (ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) “యెహోవా దీవెన నీకు ఐశ్వర్యం ఇస్తుంది. మరియు ఆ ఐశ్వర్యం దానితో బాటు కష్టాలు తీసుకొని రాదు” అనే మాటలను నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను.

పరిచయం

పేరు: గ్లోరియా ఎలిజరారస్‌ డి ఛోపరేనా

వయసు: 37

దేశం: మెక్సికో

ఒకప్పుడు: ఆత్మహత్యా ప్రయత్నం చేసింది

నా గతం:నేను మెక్సికో రాష్ట్రంలోని నౌకాల్పాన్‌ ప్రాంతంలో పుట్టాను. అక్కడంతా సిరిమంతులే. చిన్నప్పటినుండే నాకెవ్వరి మాటా వినడం ఇష్టముండేదికాదు. పార్టీలకు వెళ్లడమంటే మహాసరదా. 12 ఏళ్లకు పొగతాగడం, 14 ఏళ్లకే తాగుడూ, 16 ఏళ్ళు వచ్చేసరికి మత్తుమందులూ అలవాటయ్యాయి. ఇంకొన్నేళ్లకి నేను ఇల్లు వదిలి వెళ్లిపోయాను. నా స్నేహితుల్లో ఎక్కువమంది, అంత మంచి కుటుంబాలనుంచి వచ్చినవాళ్లేం కాదు. వాళ్ళిళ్లల్లో ఒకళ్ళనొకళ్ళు పట్టించుకునేవారే కాదు, పిల్లల్ని బాగా కొట్టేవారు, ఘోరంగా తిట్టేవారు. నాకు జీవితం మీద ఎంత విరక్తి పుట్టిందంటే రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాను.

పంతొమ్మిదేళ్లు వచ్చేసరికి నేను మోడల్‌గా పనిచేయడం మొదలుపెట్టాను. అలా నాకు రాజకీయ, వినోద రంగాల్లోని వ్యక్తులతో పరిచయాలు ఎక్కువయ్యాయి. ఆ తర్వాత నాకు పెళ్లై పిల్లలు కూడా పుట్టారు. అయితే, ఇంట్లో పెత్తనమంతా నాదే. సిగరెట్లు, మద్యం తాగడం మానలేదు. నా సమయమంతా స్నేహితులకు, సరదాలకే సరిపోయేది. నోరు తెరిస్తే చాలు నాకు బూతులే వచ్చేవి. అసభ్యమైన జోకులు చెప్పడానికి ఇష్టపడేదాన్ని. నేను ముక్కోపిని.

నా స్నేహితుల్లో చాలామంది జీవితాలు నాలాగే ఉండేవి. వాళ్ళ దృష్టిలో నాకు ఏ లోటూ లేదు. కానీ నాకు మాత్రం నా జీవితం ఎటు వెళ్తుందో తెలీక ఏదో వెలితిగా ఉండేది.

కానీ బైబిలు నా జీవితాన్ని మార్చింది. ఎలాగంటే . . .నేను 1998లో యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. జీవితానికి ఓ గమ్యం ఉందని నాకు బైబిలు నేర్పింది. యెహోవా దేవుడు భూమ్మీది పరిస్థితులను చక్కదిద్ది దాన్ని అందమైన తోటలా మార్చాలనుకుంటున్నాడనీ, చనిపోయినవాళ్ళను తిరిగి లేపుతాడనీ నేర్చుకున్నాను. ఆ తోటలో నేను కూడా ఉండొచ్చని తెలుసుకున్నాను.

దేవునిమీద మనకు ప్రేముందని చూపించాలంటే ఆయనకు లోబడివుండాలని నేర్చుకున్నాను. (1 యోహాను 5:⁠3) అలా లోబడివుండడం మొదట్లో చాలా కష్టంగా ఉండేది, ఎందుకంటే అంతకుముందెప్పుడు నేనెవ్వరి మాటా విన్నదిలేదు. అయితే ఎప్పటికీ అలా ఉండడం కుదరదని నాకు అర్థమైంది. (యిర్మీయా 10:23) సహాయం కోసం యెహోవాకు ప్రార్థించాను. నా జీవితాన్ని ఆయనకు ఇష్టమైనవిధంగా మార్చుకోవడానికీ, నా పిల్లల జీవితం నాలా అవకుండా వాళ్ళకి మంచిదారి నేర్పించడానికీ సహాయం చేయమని ప్రార్థించాను.

అవసరమైన మార్పులు చేసుకోవడం మొదట్లో చాలా కష్టంగా ఉండేది. అయితే మెల్లమెల్లగా ఎఫెసీయులు 4:​22-24లో ఉన్న ఈ సలహాను పాటించడం మొదలుపెట్టాను: ‘మునుపటి ప్రవర్తన విషయములో మీ ప్రాచీనస్వభావాన్ని వదిలి నీతి, యథార్థమైన భక్తిగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావాన్ని’ అలవర్చుకోండి. ఆ కొత్త స్వభావాన్ని అలవర్చుకోవడానికి సిగరెట్లు తాగడంలాంటి చెడ్డ అలవాట్లు మానేశాను, బూతుల్లేకుండా మాట్లాడడం నేర్చుకున్నాను. బాప్తిస్మం తీసుకుని ఒక యెహోవాసాక్షిగా అవడం కోసం అవసరమైన మార్పులు చేసుకోవడానికి నాకు మూడేళ్ళు పట్టింది.

అంతేకాదు, ఓ తల్లిగా, భార్యగా నా బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించడం మొదలుపెట్టాను. ‘స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి; అందువల్ల వారిలో ఎవరైనా వాక్యానికి అవిధేయులైతే, భయంతోకూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి, వాక్యం లేకుండానే తమ భార్యల నడవడివల్ల’ మారతారని 1 పేతురు 3:​1, 2లో ఉన్న సలహాను పాటించడం మొదలుపెట్టాను.

నేనెలా ప్రయోజనం పొందానంటే . . .జీవితానికి ఒక అర్థముందని తెలుసుకున్నందుకు నేను యెహోవాకు చాలా కృతజ్ఞురాలిని. నేనిప్పుడు ఎంతో మారిపోయాను. మా పిల్లల్ని చక్కగా పెంచగలుగుతున్నాను. అప్పుడప్పుడు గతంలో చేసిన తప్పులు గుర్తొచ్చి బాధపడుతుంటాను కానీ నా హృదయమేంటో యెహోవాకు తెలుసు. (1 యోహాను 3:​19, 20) బైబిలు సూత్రాల ప్రకారం జీవించడంవల్ల గొప్ప ప్రమాదం నుండి బయటపడి, ఇప్పుడు మనశ్శాంతిగా బ్రతుకుతున్నానని నమ్మకంగా చెప్పగలను.

పరిచయం

పేరు: జేల్సన్‌ కారేయా డి ఒలివేరా

వయసు: 33

దేశం: బ్రెజిల్‌

ఒకప్పుడు: తాగుడుకు, మత్తుమందులకు బానిస

నా గతం:నేను బ్రెజిల్‌ ఉరుగ్వేల సరిహద్దు ప్రాంతంలోని బాజే పట్టణంలో పుట్టాను. ఇక్కడ దాదాపు ఓ లక్షమంది ఉంటారు. ఇక్కడి ప్రజలకు ఎక్కువగా పాడిపంటలే జీవనాధారం. నేను పుట్టిన ప్రాంతంలో చాలామంది పేదవాళ్లే. ఇక్కడ ముఠా దౌర్జన్యం ఎక్కువ. ఇక్కడి యౌవనులు తాగడం, మత్తమందులు తీసుకోవడం సర్వసాధారణం.

స్కూలు చదువులు అయిపోయేసరికి నాకు తాగడం, గంజాయి పీల్చడం, చెవులకు చిల్లులుపడేంత గట్టి సంగీతాన్ని వినడం అలవాటైంది. నాకు దేవుడిపై నమ్మకముండేది కాదు. దేవుడు లేడు కాబట్టే ఈ లోకంలో ఇంత బాధ, గందరగోళం ఉన్నాయని అనుకునేవాణ్ణి.

నేను పాటలు రాసి, గిటారు వాయించేవాణ్ణి. తరచూ నేను బైబిల్లోని ప్రకటన పుస్తకంలోని మాటలతో పాటలు రాసేవాణ్ణి. నేను అనుకున్నంత బాగా మా టీమ్‌ రాణించకపోయేసరికి ఎక్కువగా మత్తెక్కించే మాదకద్రవ్యాలకు బానిసయ్యాను. డోసు ఎక్కువైతే చచ్చిపోతానన్న పట్టింపు కూడా ఉండేది కాదు. ఎందుకంటే నా ఆరాధ్య గాయకులందరూ అలాగే ప్రాణాలు పోగొట్టుకున్నారు.

మత్తుమందులు కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే నన్ను పెంచిన మా అమ్మమ్మ దగ్గర అడిగితీసుకునేవాణ్ణి. ఆమె ఎప్పుడైనా దేనికి అని అడిగితే ఏదోక అబద్ధం చెప్పి తప్పించుకునేవాణ్ణి. సరదా కోసం మొదలుపెట్టిన క్షుద్రవిద్యలవల్ల పరిస్థితులు ఇంకా దారుణంగా తయారయ్యాయి. మంచి సంగీతం కూర్చడానికి పనికొస్తుందని మంత్రతంత్రాలపై ఆసక్తి చూపించాను.

కానీ బైబిలు నా జీవితాన్ని మార్చింది. ఎలాగంటే . . .నేను యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేసి, వాళ్ల కూటాలకు వెళ్లడం మొదలుపెట్టిన తర్వాత నా మనస్తత్వం మారుతూ వచ్చింది. జీవితంపై ఆశ చిగురించింది, సంతోషంగా బ్రతకాలనిపించింది. ఆ ఆలోచనతోనే, అసంతృప్తిని, తిరుగుబాటుతనాన్ని చూపించడానికి పెంచుకున్న పెద్ద జట్టును కత్తిరించుకున్నాను. కానీ దేవుడు నన్ను ఇష్టపడాలంటే నేను తాగడం, మత్తుమందులు తీసుకోవడం, పొగతాగడం మానెయ్యాలని అర్థంచేసుకున్నాను. ఎంతో ఇష్టంగా నేను వినే సంగీతాన్ని కూడా వదిలెయ్యాలని తెలుసుకున్నాను.

నేను మొదటిసారి యెహోవాసాక్షుల కూటానికి వెళ్లినప్పుడు, గోడమీద సామెతలు 3:​5, 6 వచనాలు చూశాను. దానిపై ‘నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోకుండా నీ పూర్ణహృదయంతో యెహోవాపై నమ్మకముంచు. నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారాన్ని ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళం చేస్తాడు’ అనివుంది. ఆ వచనం గురించి ఆలోచించినప్పుడు, నా జీవితాన్ని సరిచేసుకోవడానికి సహాయం చేయమని యెహోవాను కోరితే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడనే నమ్మకం కలిగింది.

అయినా, నా పాత జీవితాన్ని వదులుకుని, నాలో పాతుకుపోయిన వ్యసనాలను మానుకోవడం ఏదో నా చెయ్యిని నరికేసుకున్నంత కష్టంగా అనిపించింది. (మత్తయి 18:​8, 9) మెల్లమెల్లగా మానుకోవడం నావల్ల కాదు. నా విషయంలో అది పనిచేయదని నాకు తెలుసు. ఒక్కసారిగా వాటన్నిటినీ మానేశాను. నన్ను మళ్లీ నా పాత జీవితంలోకి లాగే చోట్లకు, వ్యక్తులకు దూరంగా ఉన్నాను.

చేయలేకపోయినదాన్ని చూసి నిరుత్సాహపడడం కాదుగానీ రోజులో ఏమి చేయగలుగుతున్నానో చూసి గర్వపడడం నేర్చుకున్నాను. యెహోవా దృష్టిలో ఆరాధనపరంగా, శారీరక, నైతిక విషయాల్లో పవిత్రంగా ఉండడమంటే అదో గొప్ప గౌరవమని అనుకున్నాను. నా పాత జీవితాన్ని గురించి ఆలోచించకుండా ముందుకు సాగిపోయేలా సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించాను, అప్పుడాయన సహాయం చేశాడు. కొన్నికొన్నిసార్లు నా పాత అలవాట్లు తిరగబెట్టేవి. అప్పుడప్పుడూ అంతకుముందు రోజు తాగిన మత్తు దిగకపోయినా, బైబిలు అధ్యయనం చెయ్యమని నాకు బైబిలు గురించి నేర్పించే సహోదరుణ్ణి అడిగేవాణ్ణి.

బైబిలు నుండి దేవుని గురించి సత్యం తెలుసుకున్నాను. దేవుడు మన గురించి పట్టించుకుంటాడనీ, ఆయన అబద్ధ మతాలను నాశనం చేస్తాడనీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రకటనా పనికి ఆయన మద్దతిస్తున్నాడనీ నేర్చుకున్నప్పుడు నాకు అవి నిజమే కదా అని అనిపించింది. (మత్తయి 7:​21-23; 24:14; 1 పేతురు 5:​6, 7) నేను నేర్చుకున్నదాంట్లో అర్థం ఉందనిపించింది. చివరకు నేను నా జీవితాన్ని యెహోవాకు సమర్పించుకోవాలని నిర్ణయించుకుని, ఆయన నాకు చేసిన మేలంతటికీ కృతజ్ఞత చూపించాలనుకున్నాను.

నేనెలా ప్రయోజనం పొందానంటే . . .ఇప్పుడు నా జీవితానికి ఒక అర్థం ఉంది. నేనెందుకు బ్రతుకుతున్నానో నాకు తెలుసు. (ప్రసంగి 12:13) ఇప్పుడు నా కుటుంబీకుల దగ్గర తీసుకునే బదులు నేనే వాళ్లకు సహాయం చేస్తున్నాను. బైబిలునుండి నేర్చుకున్న మంచి విషయాలను మా అమ్మమ్మకు చెప్పాను. ఇప్పుడామె యెహోవాకు సమర్పించుకుంది. మా కుటుంబంలో చాలామంది, ఇంకా మా సంగీతం టీమ్‌లోని ఒకరు కూడా యెహోవాకు సమర్పించుకున్నారు.

నాకు పెళ్లైంది. నా భార్యా నేనూ ఎక్కువగా ఇతరులకు బైబిలు గురించి నేర్పించడంలోనే సమయం గడుపుతున్నాం. నేను ‘పూర్ణహృదయంతో యెహోవాపై నమ్మకముంచడం’ నేర్చుకున్నందుకు యెహోవా నన్ను మెండుగా ఆశీర్వదించాడు. (w09 2/1)

[21వ పేజీలోని బ్లర్బ్‌]

“జీవితంపై ఆశ చిగురించింది, సంతోషంగా బ్రతకాలనిపించింది”