కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబ సంతోషానికి తోడ్పడే అంశాలు

యుక్తవయస్సు పిల్లల్ని బాధ్యతగల వ్యక్తులుగా తీర్చిదిద్దండి

యుక్తవయస్సు పిల్లల్ని బాధ్యతగల వ్యక్తులుగా తీర్చిదిద్దండి

“మా పిల్లలతో మాట్లాడడమంటే నాకెంతో ఇష్టం. వాళ్లు నేను చెప్పింది జాగ్రత్తగా వినేవాళ్లు, చెప్పినట్టు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు వాళ్లు యౌవనులు అయ్యేసరికి, ఏ విషయంలోనూ మాకు ఏకాభిప్రాయం కుదరడంలేదు. ఆరాధనకు సంబంధించిన విషయాలను కూడా వాళ్లిప్పుడు అంతగా ఇష్టపడట్లేదు. ‘మనం బైబిలు విషయాలు మాట్లాడుకోవడం అంత అవసరమా?’ అని కూడా ప్రశ్నిస్తున్నారు. మా పిల్లలు యౌవన దశకు రాకముందు, వాళ్లు ఇలా ప్రవర్తిస్తారని నేనస్సలు ఊహించనేలేదు. వేరే పిల్లలు అలా చేయడం చూసినా, నా పిల్లలు అలా చేస్తారని మాత్రం నేనెప్పుడూ అనుకోలేదు.”—ప్రకాశ్‌. *

మీకు యుక్తవయస్సు పిల్లలున్నారా? అలాగైతే మీరు మీ పిల్లవాడి ఎదుగుదలలో ఒక అద్భుతమైన దశను చూస్తున్నారని చెప్పొచ్చు. అంతేకాదు, అది మీకు ఎంతో ఆందోళన కూడా కలిగిస్తుంది. ఈ కింది సన్నివేశాలు మీకు కూడా తెలిసినవేనా?

  • మీ అబ్బాయి చిన్న పిల్లవాడిగా ఎప్పుడూ మీ చుట్టే తిరిగివుండవచ్చు. కానీ, ఇప్పుడు యుక్తవయస్సుకు వచ్చాక మీతో సమయం గడపకుండా, స్నేహితులతోనే ఎక్కువ సమయం గడుపుతుండవచ్చు.

  • మీ అమ్మాయి చిన్నవయస్సులో అన్ని విషయాలు మీతో చెప్పి ఉండవచ్చు. కానీ, ఇప్పుడు తనకంటూ ఒక స్నేహితుల బృందాన్ని ఏర్పర్చుకొని మీకు దూరమైపోతున్నట్లు అనిపిస్తుండవచ్చు.

మీ ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉన్నట్లయితే, మీ అబ్బాయి లేక అమ్మాయి ఇక మీ చేయి దాటిపోయారని అనుకోకండి. మరైతే, వాళ్లకు ఏమౌతోంది? దీని జవాబు కోసం, మీ పిల్లవాడి ఎదుగుదలలో యుక్తవయస్సు పోషించే ప్రాముఖ్యమైన పాత్ర గురించి తెలుసుకుందాం.

యుక్తవయస్సు—ఒక మైలురాయి

పుట్టినప్పటి నుండి పిల్లవాడి జీవితంలో మొదటిసారి చేసేవి ఎన్నో ఉంటాయి. పిల్లవాడు వేసే మొదటి అడుగు, పలికే మొదటి మాట, స్కూల్లో మొదటి రోజు వంటివి మచ్చుకు కొన్ని. పిల్లలు ఒక్కో దశను చేరుకోవడం చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. పిల్లలు ఒక్కో దశను చేరుకోవడం, తల్లిదండ్రులు కోరుకుంటున్నట్టుగా, పిల్లలు ఎదుగుతున్నారని చూపిస్తాయి.

యుక్తవయస్సు కూడా ఒక మైలురాయే. కానీ, కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు యుక్తవయస్సుకు చేరుకుంటుంటే ఎంతో భయపడతారు. వాళ్ల భయం అర్థం చేసుకోదగినదే. చెప్పిన మాట వినే పిల్లవాడు, యుక్తవయస్సుకు వచ్చేసరికి చిరాగ్గా తయారవ్వడం చూసి ఏ తల్లిదండ్రులు మాత్రం సంతోషిస్తారు? అయినా, ఆ దశ పిల్లవాడి ఎదుగుదలలో చాలా ముఖ్యమైనది. ఏ విధంగా ముఖ్యమైనది?

ఏదోక సమయంలో, ‘పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచిపెడతాడు’ అని బైబిలు చెప్తోంది. (ఆదికాండము 2:24) సంతోషం, దుఃఖం రెండూ కలిగే ఆ సమయం కోసం మీ అబ్బాయి లేదా అమ్మాయి సిద్ధపడడానికి ఈ దశ సహాయం చేస్తుంది. అయితే ఆ సమయం వచ్చినప్పుడు, మీ పిల్లలు అపొస్తలుడైన పౌలులా చెప్పగలగాలి. ఆయనిలా అన్నాడు: ‘నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానిలా మాట్లాడాను, పిల్లవానిలా తలంచాను, పిల్లవానిలా యోచించాను. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానేశాను.’—1 కొరింథీయులు 13:11.

ఒక్కమాటలో చెప్పాలంటే, యుక్తవయస్సులో మీ పిల్లలు చేస్తున్నది కూడా అదే. అంటే వాళ్లు ఈ దశలో, పిల్ల చేష్టలను వదిలేసి తమ కాళ్లమీద తాము నిలబడి ఒంటరిగా జీవించేంత పరిణతిగల బాధ్యతాయుత యౌవనులుగా ఎదుగుతారు. నిజానికి ఒక రెఫరెన్సు గ్రంథం, యుక్తవయస్సును “సుదీర్ఘమైన వీడ్కోలు” అని వర్ణిస్తోంది.

అయితే ఇప్పుడు, మీ “చిన్నారి” అబ్బాయి లేదా అమ్మాయి మిమ్మల్ని వదిలి స్వతంత్రంగా ఉంటారన్న ఆలోచనే మీలో ఎన్నో సందేహాలను కలిగించవచ్చు. బహుశా ఇలాంటి సందేహాలు మీకు రావచ్చు:

  • “మా అబ్బాయి తన గదినే శుభ్రంగా ఉంచుకోలేడు. అలాంటిది వాడు ఒంటరిగా జీవించేటప్పుడు ఇంటి పనులన్నీ ఏమి చూసుకుంటాడు?”

  • “మా అమ్మాయి చెప్పిన సమయానికి ఇంటికి రాదు. అలాంటిది రేపు ఉద్యోగానికి వెళ్తే అక్కడ సరిగ్గా పనిచేస్తుందని నమ్మకమేమిటి?”

మీకు అలా అనిపిస్తుంటే, ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి: స్వేచ్ఛ అనేది మీ పిల్లవాడు దాటివెళ్లిపోయే గుమ్మం కాదు; అది మీ అబ్బాయి లేదా అమ్మాయి ప్రయాణించవలసిన మార్గం, ఆ ప్రయాణం ముగియడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. మీరు ఇంతవరకు చూసిన దాన్నిబట్టి, బాలిక లేదా ‘బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుడుతుందని’ మీరిప్పటికే తెలుసుకుని ఉంటారు.—సామెతలు 22:15.

అయితే, సరైన నడిపింపుతో, మీ పిల్లలు యుక్తవయస్సును దాటి, ‘మంచి చెడులను గుర్తించటంలో నేర్పు సంపాదించుకున్న’ బాధ్యతగల యువతీ యువకులుగా మారవచ్చు.—హెబ్రీయులు 5:14, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

విజయానికి దోహదపడే అంశాలు

యుక్తవయస్సులోవున్న మీ అబ్బాయిని బాధ్యతగల వ్యక్తిగా తీర్చిదిద్దాలంటే, అతను తన సొంతగా సరైన నిర్ణయాలు తీసుకోగలిగేలా ‘యుక్తాయుక్త’ పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు మీరు అతనికి సహాయం చేయాలి. * (రోమీయులు 12:1, 2) మీరలా చేయడానికి కింది బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి.

ఫిలిప్పీయులు 4:5, NW: ‘మీ సహేతుకత అందరికీ తెలియనివ్వండి.’ మీ అబ్బాయి రాత్రి కాస్త ఆలస్యంగా ఇంటికి వస్తానని చెప్పినప్పుడు, మీరు వెంటనే కాదంటారు. “మీరు నన్ను ఇంకా చిన్న పిల్లవాడిలాగే చూస్తున్నారు” అంటూ మీ అబ్బాయి సణుగుతాడు. “అవును, నువ్వు అలాగే ప్రవర్తిస్తున్నావు,” అని జవాబిచ్చేముందు, ఈ విషయం గురించి ఆలోచించండి: యౌవనులు తమ వయస్సుకు మించిన స్వేచ్ఛ కావాలని అడగవచ్చు. కానీ తల్లిదండ్రులు, పిల్లలకు ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ స్వేచ్ఛ ఇవ్వాలనుకోవచ్చు. కాలం గడుస్తున్నకొద్దీ, మీరు విధించే నియమాల్లో కొన్ని సడలింపులు చేసుకోవాలి. లేదా కనీసం మీ అబ్బాయివైపు నుండైనా విషయాన్ని ఆలోచించాలి.

ఇలా చేసి చూడండి: ఏ ఒకటి రెండు విషయాల్లో మీ అబ్బాయికి ఇంకాస్త స్వేచ్ఛను ఇవ్వవచ్చేమో రాసి పెట్టుకోండి. ఎక్కువ స్వేచ్ఛనిస్తే దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటాడో లేదో చూడ్డానికే ఇలా చేస్తున్నామని మీ అబ్బాయికి వివరించండి. ఇచ్చిన స్వేచ్ఛను సరిగ్గా ఉపయోగించుకుంటే కొంతకాలానికి మీ అబ్బాయికి మరింత స్వేచ్ఛను ఇవ్వవచ్చు. ఒకవేళ సరిగ్గా ఉపయోగించుకోకపోతే ముందిచ్చిన స్వేచ్ఛను కూడా తగ్గించాలి.—మత్తయి 25:21.

కొలొస్సయులు 3:21: ‘మీ పిల్లలను విసిగించకండి. వాళ్లు చేసే చిన్నచిన్న మంచి పనులు చూసి మీరు సంతోషించకపోతే వాళ్లు ఇక మిమ్మల్ని సంతోషపెట్టడానికే ప్రయత్నించరు.’—ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్స్‌ బైబిల్‌ (ఆంగ్లం). కొంతమంది తల్లిదండ్రులు తమ అబ్బాయి చేసే ప్రతీ పనినీ శాసించడానికి ప్రయత్నిస్తారు. అతణ్ణి దారిలో పెట్టడానికి, అతను ఎవరితో ఉంటున్నాడో, ఏమి చేస్తున్నాడో అని ఎప్పుడూ అతనిమీద ఒక కన్నేసి ఉంచుతారు. అతను ఎవరితో స్నేహం చేయాలనేది కూడా వాళ్లే నిర్ణయిస్తారు. అతడు ఫోనులో మాట్లాడుతుంటే రహస్యంగా వింటారు. కానీ, ఇలాంటి ప్రయత్నాలు బెడిసికొట్టొచ్చు. మరీ కట్టుదిట్టం చేస్తే అతనికి పారిపోవాలనే ఆలోచన రావచ్చు. ఎప్పుడూ అతని స్నేహితులను విమర్శిస్తుంటే అతనికి స్నేహితులంటే ఇంకా ఇష్టం పెరగొచ్చు. మీ అబ్బాయి ఫోనులో మాట్లాడుతున్నప్పుడు మీరు రహస్యంగా వింటే, అతను మీకు తెలియకుండా వాళ్లతో మాట్లాడే మార్గాలు వెతుక్కోవచ్చు. మీరు మీ అబ్బాయిని ఎంత ఎక్కువగా అదుపులో పెట్టాలని చూస్తే అంత ఎక్కువగా మీ అదుపులో లేకుండా పోతాడు. మీ అబ్బాయి మీతో ఉన్నప్పుడే సొంతగా నిర్ణయాలు తీసుకోలేకపోతే, ఇల్లు వదిలి ఒంటరిగా జీవిస్తున్నప్పుడు అతనికి సొంత నిర్ణయాలు తీసుకోవడం ఎలా తెలుస్తుంది?

ఇలా చేసి చూడండి: ఈసారి మీ అబ్బాయితో ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఎలాంటి ఎంపిక చేసుకుంటే ఎలాంటి పేరు వస్తుందనే విషయాన్ని అతనే ఆలోచించుకునేందుకు సహాయం చేయండి. ఉదాహరణకు, అతని స్నేహితులను విమర్శించే బదులు ఇలా అడగండి: “నియమాలను ఉల్లంఘించినందుకు ఒకవేళ [పేరు] అరెస్టయితే ఎలా? అప్పుడు అందరూ నీ గురించి ఏమనుకుంటారు?” మీ అబ్బాయి, తను చేసుకునే ఎంపికలవల్ల తనకెలా మంచి పేరైనా లేదా చెడ్డ పేరైనా వస్తుందో గ్రహించడానికి అతనికి సహాయం చేయండి.—సామెతలు 11:17, 22; 20:11.

ఎఫెసీయులు 6:4 ‘మీ పిల్లలకు కోపము రేపకండి. యెహోవా శిక్షలో, బోధలో వారిని పెంచండి.’ ‘బోధ’ చేయడం అంటే కేవలం వాస్తవాలను తెలియజేయడం కాదు గానీ, తప్పొప్పుల విషయంలో మీ అబ్బాయికున్న అవగాహనను ప్రభావితం చేసి అతను నేర్చుకున్నవాటికి తగిన విధంగా నడుచుకునేలా ప్రోత్సహించడం. ముఖ్యంగా మీ అబ్బాయి యుక్తవయస్సుకు చేరుకున్నప్పుడు ఇలా చేయడం చాలా అవసరం. ఆండ్రే అనే ఒక తండ్రి ఇలా అంటున్నాడు: “మీ అబ్బాయి పెరుగుతున్నకొద్దీ అతనితో మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి, దేనికైనా కారణాలను వివరించాలి.”—2 తిమోతి 3:14.

ఇలా చేసి చూడండి: ఏదైనా ఒక విషయంమీద ఏకాభిప్రాయం లేనప్పుడు, దాని గురించి చర్చించడానికి ఒకరి పాత్రను మరొకరు వహించండి. మీ అబ్బాయి మీ స్థానంలో ఉంటే తన కుమారునిగా మీకు ఏ సలహానిస్తాడో చెప్పమని మీ అబ్బాయిని అడగండి. అతని ఆలోచనను సమర్థించే లేదా వ్యతిరేకించే విషయాల కోసం పరిశోధించమని చెప్పండి. వారం తిరిగేలోపే విషయాన్ని మళ్లీ చర్చించండి.

గలతీయులు 6:7: ‘మనిషి ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు.’ చిన్న పిల్లవాడికైతే శిక్షించడం ద్వారా నేర్పించవచ్చు. ఉదాహరణకు, గదిలోనుండి బయటికి రావద్దని చెప్పి లేదా వాడికిష్టమైనవి చేయకుండా ఆపి అలా చేయవచ్చు. అదే, యుక్తవయస్సులోవున్న అబ్బాయికైతే, ఏ పనికి ఎలాంటి పర్యవసానాలుంటాయో వివరించాల్సి ఉంటుంది.—సామెతలు 6:27.

ఇలా చేసి చూడండి: మీ అబ్బాయి చేసిన అప్పులు మీరు తీర్చడం ద్వారా లేదా పరీక్ష తప్పితే టీచరుకు సంజాయిషీ ఇవ్వడం ద్వారా అతణ్ణి కాపాడే ప్రయత్నం చేయకండి. అతను చేసినదానికి పర్యవసానాలను అనుభవించనీయండి. అప్పుడే అతను, తను నేర్చుకున్న గుణపాఠాన్ని జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకుంటాడు.

తల్లిదండ్రులుగా మీరు, మీ అబ్బాయి ఏ సమస్యల్లో చిక్కుకోకుండా యుక్తవయస్సు దాటి బాధ్యతగల వ్యక్తిగా తయారవ్వాలని ఆశించవచ్చు. కానీ, అది మీరు అనుకున్నంత సులభం కాదు. అయినా, మీ అబ్బాయి యుక్తవయస్సుకు వచ్చినప్పుడు, అతడు ‘నడువాల్సిన త్రోవను అతనికి నేర్పించే’ గొప్ప అవకాశం మీకుంటుంది. (సామెతలు 22:6) బైబిలు సూత్రాలు కుటుంబ సంతోషానికి గట్టి పునాది వేస్తాయి. (w09 5/1)

^ పేరా 3 పేరు మార్చాం.

^ పేరా 19 ఇక్కడ అబ్బాయి అని ఉపయోగించినప్పటికీ ఇందులో చర్చించబడిన సూత్రాలు అమ్మాయిలకు కూడా వర్తిస్తాయి.

ఇలా ఆలోచించండి . . .

మా అబ్బాయి లేక అమ్మాయి ఇల్లు వదిలి వెళ్లే సమయానికి ఈ కింది విషయాలను చేయగలుగుతారా?

  • ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో క్రమంగా పాల్గొంటారా?

  • సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారా?

  • ఇతరులతో చక్కగా సంభాషించగలుగుతారా?

  • తమ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారా?

  • డబ్బును జాగ్రత్తగా ఖర్చుపెడతారా?

  • తాముండే ఇంటిని శుభ్రంగా, మంచి స్థితిలో ఉంచుకోగలుగుతారా?

  • అన్ని పనులూ ఎవరి ప్రోద్భలం లేకుండానే చేసుకోగలుగుతారా?