కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సాధారణ ఫిర్యాదులు పరిష్కార మార్గాలు

సాధారణ ఫిర్యాదులు పరిష్కార మార్గాలు

సాధారణ ఫిర్యాదులు పరిష్కార మార్గాలు

దాంపత్య జీవితం సాఫీగా సాగడం అంత సులువు కాదని బైబిలు చెప్తోంది. పెళ్లయిన వాళ్లకు ‘దైనందిన కష్టాలు’ ఎదురవుతాయని అపొస్తలుడైన పౌలు దేవుని ప్రేరణతో రాశాడు. (1 కొరింథీయులు 7:28, పవిత్ర గ్రంథము, క్యాతలిక్‌ అనువాదము) అయితే సమస్యలను తగ్గించుకుని, సంతోషంగా ఉండడం చాలావరకు భార్యాభర్తల చేతుల్లోనే ఉంటుంది. వాళ్లు సాధారణంగా చేసే ఆరు ఫిర్యాదులను ఇప్పుడు మనం పరిశీలించి, బైబిలు సూత్రాలు పాటించి వాటినెలా పరిష్కరించుకోవచ్చో చూద్దాం.

1

ఫిర్యాదు:

“రానురాను మామధ్య దూరం ఎక్కువవుతోంది.”

బైబిలు సూత్రం:

‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో గ్రహించండి.’ఫిలిప్పీయులు 1:10, NW.

వివాహం మీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన వాటిలో ఒకటి. మీరు దానికి ప్రాధాన్యతనివ్వాలి. పైన పేర్కొన్న ఫిర్యాదుకు మీ పనులు కూడా కారణమవుతున్నాయేమో ఆలోచించండి. రోజువారీ పనులవల్ల మీమధ్య దూరం పెరగనివ్వకండి. ఉద్యోగంవల్ల లేదా కొన్ని అనివార్య పరిస్థితులవల్ల మీరిద్దరూ కలిసి సమయం గడపలేకపోతుండవచ్చు. కానీ మీరు తగ్గించుకోగలిగిన వాటిని అంటే వ్యాపకాల కోసం వెచ్చించే లేదా స్నేహితులతో గడిపే సమయాన్ని తగ్గించుకోవచ్చు, తగ్గించుకోవాలి కూడా.

కొంతమంది తమ భార్యతో లేదా భర్తతో సమయం గడపకుండా తప్పించుకోవడానికి ఎక్కువ పనో, ఏదో ఒక వ్యాపకమో పెట్టుకుంటుంటారు. నిజానికి, అలాంటి వాళ్ల మధ్య “దూరం ఎక్కువవడం” లేదు గానీ వాళ్లే సమస్యల నుండి పారిపోతున్నారు. మీరు ఒకవేళ ఆ కోవకు చెందినవాళ్లయితే, సమస్యకు అసలు కారణమేమిటో గ్రహించి, దాన్ని పరిష్కరించుకోవాలి. మీరు కలిసి సమయం గడిపితేనే ఒకరికొకరు దగ్గరవుతారు. అప్పుడే మీరు సంపూర్ణ భావంలో ‘ఏక శరీరమై ఉంటారు.’—ఆదికాండము 2:24.

కొంతమంది ఈ సలహాను ఎలా పాటించారు? ఆస్ట్రేలియాలో ఉంటున్న ఆండ్రూకు a టాంజీకి పెళ్లయి పదేళ్లు అవుతోంది. ఆండ్రూ ఇలా చెబుతున్నాడు, “ఎక్కువసేపు పనిచేసినా, స్నేహితులతో గడిపినా లేదా వినోదానికి ఎక్కువ సమయం వెచ్చించినా దాంపత్య జీవితం ప్రమాదంలో పడుతుందని నాకు అర్థమైంది. అందుకే, నేనూ నా భార్యా మాట్లాడుకోవడానికి, ఒకరి భావాలను ఒకరు అర్థంచేసుకోవడానికి కొంత సమయం పక్కనపెడతాం.

అమెరికాలో ఉంటున్న డేవ్‌కు జేన్‌కు పెళ్లయి 22 ఏళ్లవుతోంది. వాళ్లు రోజూ సాయంత్రం అరగంటసేపు ఆ రోజు చేసినవాటి గురించి మాట్లాడుకుంటారు. జేన్‌ ఇలా అంటోంది, “ఆ అరగంట మాకెంతో ప్రాముఖ్యమైనది. అందుకే ఆ సమయంలో వేరే ఏ పనులూ పెట్టుకోం.”

2

ఫిర్యాదు:

“నాకు కావల్సింది నాకు దొరకట్లేదు.”

బైబిలు సూత్రం:

‘తమ కోసమే కాదు, ఎదుటి వాళ్ల మేలు కోసం చూడాలి.’1 కొరింథీయులు 10:24.

పెళ్లి చేసుకోవడం వల్ల మాకేమి ప్రయోజనం కలిగిందని ఎక్కువగా ఆలోచించేవాళ్లు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా సరే నిజంగా ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. భార్యాభర్తలు ఇద్దరూ ఏమి పొందుతున్నామనే దాని కన్నా ఏమి ఇస్తున్నామనే దానికి ప్రాధాన్యతనిస్తే దాంపత్య జీవితం చక్కగా సాగుతుంది. యేసు దానికి కారణాన్ని ఇలా వివరించాడు, ‘తీసుకోవడం కంటే ఇవ్వడంలో ఎక్కువ ఆనందం ఉంది.’—అపొస్తలుల కార్యములు 20:35, NW.

కొంతమంది ఈ సలహాను ఎలా పాటించారు? మెక్సికోలో ఉంటున్న మారియకు, మార్టిన్‌కు పెళ్లయి 39 ఏళ్లవుతోంది. అయితే వాళ్ల దాంపత్య జీవితం పూలబాటలా సాగలేదు. వాళ్లకు వచ్చిన ఒక సమస్యను గుర్తుతెచ్చుకుంటూ మారియ ఇలా చెబుతోంది, “ఒకసారి మా ఇద్దరికీ పెద్ద గొడవైంది. అప్పుడు కోపంలో మార్టిన్‌ను కించపర్చే మాటొకటి అన్నాను. ఆయనకు చాలా కోపమొచ్చింది. నేను కావాలని అలా అనలేదని, ఏదో కోపంలో అనేశానని వివరించడానికి ప్రయత్నించాను, కానీ ఆయన వినిపించుకోలేదు.” మార్టిన్‌ ఇలా అంటున్నాడు, “మా ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు ఇక మేమిద్దరం కలిసివుండడం అసాధ్యమని, కలిసివుండడానికి ప్రయత్నించడం మానేయాలని అనుకోవడం మొదలుపెట్టాను.”

ఆమె తనను గౌరవించాలని మార్టిన్‌, ఆయన తనను అర్థంచేసుకోవాలని మారియ కోరుకున్నారు. ఇద్దరికీ వాళ్లకు కావల్సింది దొరకట్లేదు.

వాళ్లు తమ సమస్యను ఎలా పరిష్కరించుకోగలిగారు? మార్టిన్‌ ఇలా చెబుతున్నాడు, “నా కోపం తగ్గేవరకు ఆగాను. ఒకరినొకరు గౌరవించుకోమనీ ప్రేమించుకోమనీ బైబిల్లోవున్న మంచి సలహాను పాటించాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. సంవత్సరాలు గడుస్తుండగా, ఎన్నిసార్లు సమస్యలు వచ్చినా సరే సహాయం కోసం దేవునికి ప్రార్థించి, బైబిల్లోవున్న సలహాను పాటిస్తే వాటిని పరిష్కరించుకోవచ్చని తెలుసుకున్నాం.”—యెషయా 48:17, 18; ఎఫెసీయులు 4:31, 32.

3

ఫిర్యాదు:

“మా దాంపత్య జీవితం సాఫీగా సాగడానికి ఆయన (లేదా ఆమె) చేయాల్సింది చేయడం లేదు.”

బైబిలు సూత్రం:

‘మనలో ప్రతీ ఒక్కరం మన గురించి దేవునికి లెక్క అప్పగించాలి.’రోమీయులు 14:11, 12.

భార్యాభర్తల్లో ఎవరైనా ఒక్కరు కృషిచేసినంత మాత్రాన దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందని చెప్పలేమన్నది నిజమే. కానీ, భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు నిందించుకుంటూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది.

మీరు మీ భాగస్వామి చేయాల్సినదాని మీదే దృష్టిపెడితే, జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు. ముఖ్యంగా, మీ భాగస్వామి బలహీనతల్ని సాకుగా తీసుకుని మీరు మీ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించనప్పుడు మీకు సంతోషం కరువవుతుంది. అయితే, మీరు మంచి భర్తగా లేదా మంచి భార్యగా ఉండడానికి కృషిచేస్తే మీ దాంపత్య జీవితం మెరుగుపడే అవకాశముంది. (1 పేతురు 3:1-3) అన్నిటికన్నా ముఖ్యంగా, మీరలా చేస్తే దేవుడు చేసిన వివాహ ఏర్పాటు మీద మీకు గౌరవముందని చూపిస్తారు. అంతేకాదు, మీరలా చేస్తే ఆయనెంతో సంతోషిస్తాడు.—1 పేతురు 2:19.

కొంతమంది ఈ సలహాను ఎలా పాటించారు? కొరియాలో ఉంటున్న కిమ్‌కు పెళ్లయి 38 ఏళ్లవుతోంది. కిమ్‌ ఇలా చెబుతోంది, “అప్పుడప్పుడు మావారికి నామీద కోపమొస్తే నాతో మాట్లాడడం మానేస్తారు, ఎందుకలా చేస్తారో నాకస్సలు తెలీదు. దాంతో ఆయనకు నామీద ప్రేమ తగ్గిపోయిందేమో అనిపిస్తుంది. ‘ఆయన నన్ను అర్థంచేసుకోవడానికి ప్రయత్నించరు గానీ, నేను ఆయనను అర్థంచేసుకోవాలని ఎందుకు అనుకుంటారు?’ అని కొన్నిసార్లు నాకనిపిస్తుంటుంది.”

అన్యాయం జరుగుతోందని, తన భర్త చేయాల్సింది చేయడం లేదని కిమ్‌ బాధపడుతూ ఉండిపోవచ్చు, కానీ ఆమె అలా చేయలేదు. తను ఇలా చెబుతోంది, “బాధపడుతూ కూర్చోకుండా, పరిస్థితిని సరిదిద్దుకోవడానికి చొరవ తీసుకుంటే మంచిదని నాకు అర్థమైంది. చివరకు, మేమిద్దరం కోపం తగ్గించుకుని, ప్రశాంతంగా మాట్లాడుకోగలుగుతున్నాం.”—యాకోబు 3:18.

4

ఫిర్యాదు:

“మా ఆవిడ నా మాట వినదు.”

బైబిలు సూత్రం:

“ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు.”1 కొరింథీయులు 11:3.

భార్య తన మాట వినడంలేదని భర్తకు అనిపిస్తే, తనకు శిరస్సుగా ఉన్న యేసుక్రీస్తు మాట వినడానికి తనెంత సుముఖంగా ఉన్నానని ముందు ఆయన పరిశీలించుకోవాలి. యేసు చేసినట్టు చేయడం ద్వారా ఆయనకు లోబడివుంటున్నానని భర్త చూపించవచ్చు.

‘పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించండి. అలాగే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి, దాని కోసం తననుతాను అప్పగించుకున్నాడు’ అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (ఎఫెసీయులు 5:25) యేసు తన శిష్యుల మీద ‘పెత్తనం చెలాయించలేదు.’ (మార్కు 10:42-44, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) ఆయన తన అనుచరులకు స్పష్టమైన నిర్దేశాలిచ్చాడు, వాళ్లను సరిదిద్దాల్సినప్పుడు సరిదిద్దాడు. అంతేకానీ ఆయన వాళ్లతో ఎప్పుడూ కఠినంగా వ్యవహరించలేదు. వాళ్లతో ప్రేమగా ఉండేవాడు, వాళ్లు చేయగలిగిన దానికన్నా ఎక్కువ చేయాలని ఆశించేవాడు కాదు. (మత్తయి 11:29, 30; మార్కు 6:30, 31; 14:37, 38) ఆయన ఎప్పుడూ తన ప్రయోజనాలకన్నా వాళ్ల ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు.—మత్తయి 20:25-28.

‘శిరస్సత్వం గురించి, స్త్రీల గురించి నాకున్న అభిప్రాయం మీద బైబిలు సలహా, అందులో ప్రస్తావించబడిన వాళ్ల ప్రభావంకన్నా చుట్టుపక్కల వాళ్ల ఆచారాల ప్రభావం ఎక్కువగా పడిందా?’ అని భర్త ప్రశ్నించుకోవాలి. ఉదాహరణకు, తన భర్త అభిప్రాయంతో ఏకీభవించకుండా దానికి పూర్తి విరుద్ధమైన తన అభిప్రాయాన్ని స్థిరంగానే, అయితే మర్యాదగా వ్యక్తంచేసిన స్త్రీ గురించి మీరేమి అనుకుంటారు? అబ్రాహాము భార్య అయిన శారాను భర్త మాట జవదాటని ఆదర్శవంతురాలైన భార్య అని బైబిలు పొగడుతోంది. (1 పేతురు 3:1, 6) ఆమె అవసరమైనప్పుడు తన మనసులో ఉన్నది తెలియజేసేది. ఉదాహరణకు, కుటుంబం మీదకు రాబోతున్న ప్రమాదాన్ని అబ్రాహాము గ్రహించనప్పుడు ఆమె అలా చేసింది.—ఆదికాండము 16:5; 21:9-12.

ఆమె తన అభిప్రాయాన్ని చెప్పడానికి జంకేలా అబ్రాహాము ఆమెను భయపెట్టలేదని తెలుస్తోంది. ఆయన కఠినాత్ముడు కాదు. అలాగే, బైబిలు సలహాను పాటించే భర్త, భార్య మీద పెత్తనం చెలాయిస్తూ ఆమె తన చెప్పుచేతల్లో ఉండాలని పట్టుబట్టడు. ఇంటి పెద్దగా ఆయన తన భార్యతో ప్రేమగా వ్యవహరిస్తే ఆమె గౌరవాన్ని చూరగొంటాడు.

కొంతమంది ఈ సలహాను ఎలా పాటించారు? ఇంగ్లండులో ఉంటున్న జేమ్స్‌కు పెళ్లయి 8 ఏళ్లవుతోంది. ఆయనిలా చెబుతున్నాడు, “నా భార్యను సంప్రదించకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదని నేను తెలుసుకున్నాను. నా గురించి మాత్రమే కాదు ఆమె గురించి కూడా ఆలోచించడానికి ప్రయత్నిస్తాను. నా అవసరాలకన్నా ఆమె అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడానికి చూస్తాను.”

అమెరికాలో ఉంటున్న జార్జ్‌కు పెళ్లయి 59 ఏళ్లవుతోంది. ఆయనిలా అంటున్నాడు, “నా భార్య నాకన్నా తక్కువ స్థాయికి చెందిందన్నట్టు చూడలేదు. ఆమెను తెలివైన, సమర్థవంతురాలైన భాగస్వామిగా చూడడానికి ప్రయత్నించాను.”—సామెతలు 31:10.

5

ఫిర్యాదు:

“ఇంటి పెద్దగా ఆయన తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించరు.”

బైబిలు సూత్రం:

“జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును. మూఢురాలు తన చేతులతో తన యిల్లు ఊడ బెరుకును.”సామెతలు 14:1.

మీ భర్త నిర్ణయాలు తీసుకోవడానికి లేదా ఇంటి విషయాలు చూసుకోవడానికి వెనకాడుతుంటే మీరు ఈ మూడింటిలో ఏదో ఒకటి చేసే అవకాశముంది: (1) ఆయన వైఫల్యాలను పదేపదే ఎత్తి చూపించవచ్చు, (2) ఇంటి పెద్దగా ఆయనకున్న అధికారాన్ని మీ చేతుల్లోకి తీసుకోవచ్చు, (3) ఆయన చేసే ఏ చిన్న ప్రయత్నాన్నైనా మనస్ఫూర్తిగా మెచ్చుకోవచ్చు. మొదటి రెండింటిలో మీరు దేన్ని చేయాలనుకున్నా మీరు మీ చేతులతోనే మీ ఇంటిని ఊడబెరుక్కుంటారు. మూడవదాన్ని చేయాలనుకుంటే, మీరు మీ ఇంటిని కట్టుకోగలుగుతారు అంటే మీ దాంపత్య జీవితం సాఫీగా సాగేలా చూసుకోగలుగుతారు.

చాలామంది పురుషులు ప్రేమకన్నా గౌరవాన్ని ఎక్కువగా కోరుకుంటారు. మీరు మీ భర్తను గౌరవిస్తున్నారని చూపిస్తే, అంటే ఇంటి పెద్దగా తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు చాలా బాగున్నాయని, వాటిని మీరు విలువైనవిగా ఎంచుతున్నారని చూపిస్తే, ఆయన తన బాధ్యతను మరింత బాగా నిర్వర్తించే అవకాశముంది. కొన్నిసార్లు ఏదైనా ఒక విషయం మీద మీ ఇద్దరికీ ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు. అలాంటి విషయాల గురించి మీరిద్దరూ కలిసి చర్చించుకోవాలి. (సామెతలు 18:13) అయితే, మీరు మాట్లాడే మాటల్ని బట్టి, మీ స్వరాన్ని బట్టి మీ దాంపత్య జీవితం ముక్కలవ్వొచ్చు లేదా సాఫీగా సాగవచ్చు. (సామెతలు 21:9; 27:15) మీ మనసులో ఉన్నది గౌరవపూర్వకంగా వ్యక్తంచేయండి, అప్పుడు మీరు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు, అంటే మీ భర్త ఇంటి పెద్దగా తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించడానికి వెనకాడకుండా ఉంటాడు.

కొంతమంది ఈ సలహాను ఎలా పాటించారు? అమెరికాలో ఉంటున్న మిషేల్‌కు పెళ్లయి 30 ఏళ్లవుతోంది. ఆమె ఇలా చెబుతోంది, “మా అమ్మ, భర్త సహాయం లేకుండానే నన్నూ మా చెల్లెళ్లను పెంచింది. ఆమె చాలా ధైర్యవంతురాలు, దేనికీ ఎవ్వరిమీదా ఆధారపడదు. కొన్నిసార్లు నేను కూడా మా అమ్మలా ప్రవర్తిస్తుంటాను. అందుకే, మావారి మాట వినడానికి నేనింకా కృషి చేస్తూనే ఉన్నాను. నా అంతట నేనే నిర్ణయాలు తీసుకోకుండా మావారిని సంప్రదించడంలాంటివి నేర్చుకున్నాను.”

ఆస్ట్రేలియాలో ఉంటున్న రేచెల్‌కు మార్క్‌కు పెళ్లయి 21 ఏళ్లవుతోంది. రేచెల్‌ మీద కూడా ఆమె కుటుంబ పరిస్థితుల ప్రభావం పడింది. ఆమె ఇలా గుర్తుచేసుకుంటోంది, “మా అమ్మ మానాన్న మాట ఎప్పుడూ వినేది కాదు. అస్తమానం ఇద్దరూ వాదించుకునేవాళ్లు, ఒకరంటే ఒకరికి అస్సలు గౌరవముండేది కాదు. పెళ్లయిన కొత్తలో నేను కూడా మా అమ్మలా ప్రవర్తించేదాన్ని. అయితే, గౌరవించడం గురించి బైబిల్లోవున్న సలహా పాటించడం ఎంత ముఖ్యమో తర్వాత్తర్వాత తెలుసుకున్నాను. ఇప్పుడు మా దాంపత్య జీవితం ఎంతో సాఫీగా సాగుతోంది.”

6

ఫిర్యాదు:

“మా ఆయన (లేదా మా ఆవిడ) అలవాట్లు చూస్తే నాకు పిచ్చికోపం వస్తుంది.”

బైబిలు సూత్రం:

‘ఒకవేళ మీలో ఎవరికైనా ఎవరిమీదైనా ఫిర్యాదు చేయడానికి కారణం ఉన్నా ఒకరిపట్ల ఒకరు సహనం చూపించండి, ఒకరినొకరు క్షమించండి.’కొలొస్సయులు 3:13, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

మొదట్లో మీరు ప్రేమించుకుంటున్నప్పుడు మీ కాబోయే భాగస్వామిలో ఉన్న మంచి లక్షణాలనే చూసివుంటారు గానీ లోపాలను గమనించివుండకపోవచ్చు. ఇప్పుడు కూడా అలాగే చేయగలరా? మీ భాగస్వామిలో ఏదోక లోపం ఉండేవుంటుంది. అయితే మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి, ‘నా భర్తలో (లేదా భార్యలో) ఉన్న మంచి లక్షణాలను చూస్తున్నానా లేక చెడు లక్షణాలనే చూస్తున్నానా?’

ఎదుటివాళ్ల లోపాలను మనం పట్టించుకోకుండా ఉండాలని చూపించే ఒక శక్తివంతమైన దృష్టాంతాన్ని యేసు చెప్పాడు. ‘మీరు మీ సోదరుని కంట్లో ఉన్న నలుసును గమనిస్తారు. కానీ మీ కంట్లో ఉన్న దూలాన్ని గమనించరెందుకు?’ అని ఆయన అడిగాడు. (మత్తయి 7:3, పరిశుద్ధ బైబిల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) నలుసు అంటే ఎండుగడ్డిలోని ఒక చిన్న భాగం. దూలమంటే ఇంటికప్పు వేయడానికి వాసాలకు ఆధారంగా అడ్డంగా వేసే లావుపాటి కర్ర. ఆయన చెప్పాలనుకుంటున్నది ఏమిటి? ‘మొదట మీ కంట్లోవున్న దూలాన్ని తీసేసుకోండి. అప్పుడు మీ సహోదరుని కంట్లోవున్న నలుసును తీసేయడానికి మీకు తేటగా కనబడుతుంది.’—మత్తయి 7:5.

యేసు ఆ దృష్టాంతం చెప్పడానికి ముందు వాళ్లను గట్టిగా హెచ్చరించాడు. ‘తీర్పు తీర్చకండి, అప్పుడు మీ గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చే తీర్పు చొప్పుననే మీ గురించి తీర్పు తీర్చబడుతుంది’ అని ఆయన చెప్పాడు. (మత్తయి 7:1, 2) దేవుడు మీ కంట్లోవున్న దూలాన్ని, అంటే మీ లోపాలను పట్టించుకోకుండా ఉండాలంటే, మీరు కూడా మీ భాగస్వామి లోపాలను చూసీచూడనట్టు ఉండడం మంచిది.—మత్తయి 6:14, 15.

కొంతమంది ఈ సలహాను ఎలా పాటించారు? ఇంగ్లండ్‌లో ఉంటున్న జెన్నీకి సైమన్‌కు పెళ్లయి 9 ఏళ్లవుతోంది. ఆమె ఇలా అంటోంది, “మా ఆయన ఏదీ ముందే ప్లాన్‌ చేసుకోకుండా చివరి క్షణంలో చేస్తాడు. అదే నాకు తరచూ చికాకు తెప్పిస్తుంది. విడ్డూరమేమిటంటే, మేము ప్రేమించుకుంటున్నప్పుడు ఆయనకున్న అదే లక్షణం నాకు తెగ నచ్చేది. అనుకున్నదే తడవుగా చేసేస్తాడని అప్పట్లో మురిసిపోయేదాన్ని. కానీ నాలో కూడా ఆయనను కట్టుదిట్టం చేయడంలాంటి లోపాలు ఉన్నాయని నాకిప్పుడు అర్థమైంది. నా భర్త సైమన్‌, నేను మాలోవున్న చిన్నచిన్న లోపాలను పెద్దగా పట్టించుకోకుండా ఉండడం నేర్చుకుంటున్నాం.”

ముందు ప్రస్తావించిన మిషేల్‌ భర్త కర్ట్‌ ఇలా చెబుతున్నాడు, “మనం మన భాగస్వామిలోవున్న కోపం తెప్పించే లక్షణాలనే పట్టుకుని కూర్చుంటే అవే పెద్దపెద్ద లోపాల్లా కనబడతాయి. మొదట్లో నేను ఆమెలో ఏ లక్షణాలు చూసి ఆమెను ప్రేమించానో ఆ లక్షణాలకు ప్రాధాన్యతనిస్తాను.”

సమస్యలను అధిగమించాలంటే ఏమి చేయాలి?

దాంపత్య జీవితంలో సమస్యలు తప్పకుండా వస్తాయి కానీ వాటిని పరిష్కరించుకోవడం అసాధ్యమేమీ కాదని ఈ కొన్ని ఉదాహరణలను చూస్తే తెలుస్తుంది. సమస్యలను అధిగమించాలంటే ఏమి చేయాలి? దేవుని మీద ప్రేమ పెంచుకోండి, బైబిల్లోవున్న సలహాను పాటించడానికి సుముఖంగా ఉండడం నేర్చుకోండి.

నైజీరియాలో ఉంటున్న ఆలెక్స్‌కు ఇటోహంగ్‌కు పెళ్లయి 20 ఏళ్లపైనే అవుతోంది. సమస్యలను అధిగమించాలంటే ఏమి చేయాలో వాళ్లు నేర్చుకున్నారు. ఆలెక్స్‌ ఇలా చెబుతున్నాడు, “భార్యాభర్తలిద్దరూ బైబిలు సూత్రాలు పాటిస్తే, దాంపత్య జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చని నేను గ్రహించాను.” ఆయన భార్య ఇలా చెబుతోంది, “క్రమంగా కలిసి ప్రార్థన చేసుకోవడం, ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకోమని, ఒకరిపట్ల ఒకరు సహనం చూపించుకోమని బైబిలు ఇస్తున్న సలహాను పాటించడం ఎంత ముఖ్యమో మేము తెలుసుకున్నాం. ఇప్పుడు మాకు పెళ్లయిన కొత్తలో ఉన్నన్ని సమస్యలు లేవు.”

బైబిల్లోవున్న పాటించదగిన సలహాలు మీ కుటుంబానికి ఎలా ప్రయోజనం చేకూర్చగలవనేదాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? b అనే పుస్తకంలోని 14వ అధ్యాయాన్ని మీతో చర్చించమని యెహోవాసాక్షులను అడగండి. (w11-E 02/01)

[అధస్సూచీలు]

a అసలు పేర్లు కావు.

b యెహోవాసాక్షులు ప్రచురించారు.

[4వ పేజీలోని చిత్రం]

మేము కలిసి సమయం గడపడానికి కొన్ని పనులు పక్కనపెడతానా?

[5వ పేజీలోని చిత్రం]

నేను పొందుతున్న దానికన్నా ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నిస్తానా?

[6వ పేజీలోని చిత్రం]

మనస్పర్థలు తొలగించుకోవడానికి చొరవ తీసుకుంటానా?

[7వ పేజీలోని చిత్రం]

నిర్ణయాలు తీసుకునే ముందు నా భార్య అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటానా?

[9వ పేజీలోని చిత్రం]

నా భాగస్వామిలోని మంచి లక్షణాలకు ప్రాధాన్యతనిస్తానా?