కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ పిల్లలకు నేర్పించండి

మొదట్లో మొండికేసినా తర్వాత మాట విన్నాడు

మొదట్లో మొండికేసినా తర్వాత మాట విన్నాడు

మీరెప్పుడైనా మీ అమ్మానాన్నల మాట వినకుండా మొండికేశారా?​— a బహుశా వాళ్ళు చూడవద్దని చెప్పిన టీవీ ప్రోగ్రామ్‌ను మీరు చూసివుంటారు. కానీ ఆ తర్వాత అమ్మానాన్నల మాట విననందుకు బాధపడేవుంటారు. అలా మొదట్లో మాట వినకుండా మొండికేసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు నయమాను. ఆయన ఇంకెప్పుడూ అలా మొండికేయకుండా ఉండేందుకు ఏమి సహాయం చేసిందో చూద్దాం.

మనం 3,000 సంవత్సరాలు వెనక్కి వెళదాం. నయమాను సిరియా దేశంలో ప్రముఖుడైన సైన్యాధిపతి. ఆయన చేతి కింద సైనికులు ఉండేవాళ్ళు, వాళ్ళు ఆయన చెప్పినట్లు చేసేవాళ్ళు. కానీ నయమానుకు కుష్ఠువ్యాధి అనే భయంకరమైన చర్మవ్యాధి వచ్చింది. దానివల్ల ఆయన చాలా వికారంగా కనిపించేవాడు, ఆయనకు నొప్పిగా కూడా ఉండివుండవచ్చు.

నయమాను భార్య దగ్గర ఇశ్రాయేలీయురాలైన ఒక చిన్న అమ్మాయి దాసీగా పనిచేసేది. ఒకరోజు ఆ అమ్మాయి తమ దేశంలో ఎలీషా అనే వ్యక్తి ఉన్నాడనీ ఆయన నయమాను వ్యాధిని బాగుచేస్తాడనీ తన యజమానురాలితో చెప్పింది. ఆ విషయం తెలుసుకున్న నయమాను వెంటనే ఎలీషా దగ్గరకు వెళ్ళాలనుకున్నాడు. ఆయన చాలా బహుమానాలు తీసుకొని సైనికులను వెంటబెట్టుకొని ఇశ్రాయేలు దేశానికి ప్రయాణమయ్యాడు. ముందుగా ఆ దేశ రాజు దగ్గరకు వెళ్ళి తాను అక్కడికి ఎందుకు వచ్చాడో చెప్పాడు.

అది తెలుసుకున్న ఎలీషా నయమానును తన దగ్గరకు పంపించమని రాజుకు కబురు చేశాడు. నయమాను ఎలీషా ఇంటికి వచ్చినప్పుడు ఎలీషా బయటకు రాలేదు. కానీ, నయమాను యొర్దాను నదిలో ఏడుసార్లు స్నానం చేస్తే కుష్ఠువ్యాధి పోతుందని ఒక మనిషి చేత చెప్పించాడు. అప్పుడు నయమానుకు ఎలా అనిపించి ఉంటుంది?​—

నయమానుకు చాలా కోపం వచ్చింది. అందుకే దేవుని ప్రవక్త చెప్పిన మాట వినకుండా మొండికేశాడు. అప్పుడాయన తన సైనికులతో, ‘మన దేశంలో ఇంతకంటే మంచి నదులు ఎన్నో ఉన్నాయి కదా’ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోబోయాడు. అప్పుడు సైనికులు ఏమన్నారో తెలుసా? ​ ‘ప్రవక్త ఏదైనా కష్టమైన పని చేయమంటే మీరు తప్పకుండా చేసివుండేవారు కదా? ఇది చిన్న పనేగా, ఈ ఒక్కసారికి ఆయన మాట వినండి ప్రభూ!’ అన్నారు.

నయమాను తన సైనికుల మాట విని, ఎలీషా చెప్పినట్లు చేశాడు. ఆయన ఆరుసార్లు ఆ నదిలో మునిగి, లేచాడు. కానీ ఏడోసారి నీళ్ళలో నుండి బయటకు వచ్చేసరికి నయమాను ఎంతో ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే ఆయన చర్మవ్యాధి పూర్తిగా పోయింది. ఆయన బాగయ్యాడు! వెంటనే ఆయన ఎలీషాకు ‘థ్యాంక్స్‌’ చెప్పడానికి దాదాపు 48 కిలోమీటర్లు ప్రయాణించి వెనక్కి వచ్చాడు. ఎలీషాకు ఖరీదైన బహుమానాలు ఇవ్వాలనుకున్నాడు గానీ ఎలీషా అవేవీ తీసుకోలేదు.

అప్పుడు నయమానే ఎలీషాను ఒకటి అడిగాడు. అదేమిటో తెలుసా?​— ‘రెండు గాడిదలు మోయగలిగినంత మట్టి నాకు ఇప్పించండి’ అని అడిగాడు. ఇంతకీ ఆయనకు ఆ మట్టి దేనికి?​— దేవుని ప్రజల దేశమైన ఇశ్రాయేలులో నుండి తీసుకువెళ్ళే ఆ మట్టి మీదే దేవునికి బలులు అర్పిస్తానని నయమాను ఎలీషాతో చెప్పాడు. ఇకమీదట యెహోవాను తప్ప వేరే ఏ దేవుణ్ణీ ఆరాధించనని వాగ్దానం చేశాడు. ఆ తర్వాత ఇంకెప్పుడూ మొండికేయకుండా, నిజమైన దేవుని మాట విన్నాడు.

నయమాను నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?​— మీరు కూడా ఎప్పుడైనా అలా మొండికేస్తుంటారా? అయితే మీరూ మారవచ్చు. చెప్పిన మాట విని, ఇంకెప్పుడూ మొండికేయకుండా ఉండవచ్చు. (w12-E 06/01)

మీ బైబిల్లో చదవండి

a మీరు చిన్నపిల్లలతో కలిసి చదువుతుంటే గీత ఉన్నచోట ఆగి, అక్కడున్న ప్రశ్నకు జవాబు చెప్పమని అడగండి.