కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మోషే విశ్వాసంగల వ్యక్తి

మోషే విశ్వాసంగల వ్యక్తి

విశ్వాసం అంటే ఏమిటి?

“విశ్వాసం” అంటే గట్టి రుజువుల మీద ఆధారపడిన బలమైన నమ్మకం అని బైబిలు చెబుతోంది. దేవుని మీద విశ్వాసమున్న వ్యక్తి, దేవుడు తానిచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకుంటాడని నమ్ముతాడు.

మోషే విశ్వాసాన్ని ఎలా చూపించాడు?

మోషే యెహోవా వాగ్దానాల మీద నమ్మకం ఉంచాడు, ఆ విషయం ఆయన తీసుకున్న నిర్ణయాల్లో స్పష్టమైంది. (ఆదికాండము 22:15-18) ఐగుప్తులోని భోగభాగ్యాల నడుమ విలాసవంతమైన జీవితం గడిపే అవకాశమున్నా ఆయన దాన్ని వదులుకొని, ‘అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు’ అనుకున్నాడు. (హెబ్రీయులు 11:24-26) అది మోషే ఆవేశంలో తీసుకున్న నిర్ణయమా, దానికి ఆయన ఆ తర్వాత బాధపడ్డాడా? లేదు. మోషే ‘అదృశ్యుడైనవానిని చూస్తున్నట్టు స్థిరబుద్ధిగలవానిగా’ నడుచుకున్నాడని బైబిలు చెబుతోంది. విశ్వాసంతో తను తీసుకున్న నిర్ణయాల విషయంలో మోషే ఎన్నడూ విచారించలేదు.

మోషే ఇతరుల విశ్వాసాన్ని బలపర్చడానికి కూడా ప్రయత్నించాడు. ఉదాహరణకు ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రానికి, ఫరో సైన్యానికి మధ్య చిక్కుకుపోయామని అనుకున్నప్పుడు ఏంజరిగిందో ఆలోచించండి. ముంచుకొస్తున్న ప్రమాదానికి భయపడిన ఇశ్రాయేలీయులు యెహోవాకు, మోషేకు మొరపెట్టారు. దానికి మోషే ఎలా స్పందించాడు?

యెహోవా ఇంకాసేపట్లో ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీలుస్తాడని, ఇశ్రాయేలీయులు తప్పించుకోవడానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడని మోషేకు తెలిసివుండకపోవచ్చు. అయినా, దేవుడు తన ప్రజల్ని కాపాడడానికి ఏదో ఒకటి చేస్తాడనే నమ్మకం మోషేకు ఉంది. తోటి ఇశ్రాయేలీయులు కూడా అదే నమ్మకంతో ఉండాలని మోషే కోరుకున్నాడు. ‘భయపడవద్దని, యెహోవా మీకు నేడు కలుగజేసే రక్షణను ఊరికే నిలబడి చూడమని మోషే ప్రజలతో చెప్పాడు’ అని బైబిలు చెబుతోంది. (నిర్గమకాండము 14:13, 14) మరి వాళ్ల విశ్వాసాన్ని మోషే బలపర్చాడా? అవును, బలపర్చాడు! మోషే గురించి, ఇశ్రాయేలీయుల గురించి బైబిలు ఇలా చెబుతోంది: ‘విశ్వాసంతో వారు పొడి నేలమీద నడిచినట్లు ఎర్రసముద్రంలో నడిచి వెళ్లారు.’ (హెబ్రీయులు 11:29) మోషే విశ్వాసం వల్ల ఆయనే కాదు, యెహోవామీద విశ్వాసముంచడం ప్రాముఖ్యమని అర్థం చేసుకున్నవాళ్లంతా ప్రయోజనం పొందారు.

మనం ఏమి నేర్చుకోవచ్చు?

మోషేలాగే మనం కూడా యెహోవా వాగ్దానాలపై నమ్మకం ఉందని మన నిర్ణయాల ద్వారా చూపించాలి. ఉదాహరణకు, తన ఆరాధనకు మొదటి స్థానం ఇస్తే మన నిత్యావసరాలను తీరుస్తానని యెహోవా మాటిస్తున్నాడు. (మత్తయి 6:33) నిజమే, వస్తుసంపదలంటే విపరీతమైన మోజు ఉన్న ఈ కాలంలో వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా జీవించడం మనకు కత్తి మీద సామే. కానీ మనం మన జీవితాల్ని నిరాడంబరంగా ఉంచుకుని, యెహోవా ఆరాధనకు ప్రముఖ స్థానం ఇవ్వడానికి సాధ్యమైనంతగా కృషి చేస్తే ఆయన మన అవసరాలన్నిటినీ తీరుస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. ‘నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను’ అని యెహోవా హామీ ఇస్తున్నాడు.—హెబ్రీయులు 13:5.

మనం ఇతరుల విశ్వాసాన్ని బలపర్చడానికి కూడా ప్రయత్నిస్తాం. ఉదాహరణకు, తమ పిల్లల హృదయాల్లో దేవుని మీద విశ్వాసాన్ని వృద్ధిచేసే అద్భుతమైన అవకాశం తమకుందని తెలివైన తల్లిదండ్రులు గుర్తిస్తారు. దేవుడు ఉన్నాడని, ఆయన మంచి చెడులకు సంబంధించి ప్రమాణాలు ఇచ్చాడని ఎదిగే పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. దానితోపాటు ఆయన ప్రమాణాల్ని పాటించడమే శ్రేష్ఠమైన జీవన విధానమని పిల్లలు అర్థం చేసుకునేలా వారికి సహాయం చేయాలి. (యెషయా 48:17, 18) ‘దేవుడు ఉన్నాడని, తనను వెదికేవారికి ఫలము దయచేస్తాడని’ తమ పిల్లలకు నమ్మకం కుదిరేలా సహాయం చేసినప్పుడు తల్లిదండ్రులు వారికి అమూల్యమైన బహుమతి ఇచ్చినవాళ్లౌతారు.—హెబ్రీయులు 11:6. (w13-E 02/01)