కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం | దేవుని అత్యంత గొప్ప బహుమానాన్ని మీరు అందుకుంటారా?

ఇలాంటి బహుమానం ఇంకెక్కడా లేదు

ఇలాంటి బహుమానం ఇంకెక్కడా లేదు

జార్డన్‌ చేతిలో ఓడ ఆకారంలో ఉన్న పెన్సిల్‌ షార్ప్‌నర్‌ ప్రత్యేకమైనది కాకపోయినా, అది ఆయనకు చాలా విలువైంది. జార్డన్‌ ఇలా అంటున్నాడు: “నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు, మా కుటుంబానికి దగ్గరి స్నేహితుడు ఒకరు నాకు దీన్ని ఇచ్చారు. ఆయన వయసులో పెద్దవాడు, ఆయన పేరు రస్సెల్‌.” జార్డన్‌ తల్లిదండ్రుల, తాతయ్య జీవితాల్లో రస్సెల్‌ పాత్ర చాలా ఉందని, కష్టకాలాల్లో వాళ్లకు చాలా తోడుగా ఉన్నాడని ఆయన చనిపోయాక జార్డన్‌కు తెలిసింది. “నేను రస్సెల్‌ గురించి ఇప్పుడు ఎక్కువ తెలుసుకున్నాను కాబట్టి ఈ చిన్న బహుమానానికున్న విలువ ఇంకా పెరిగింది,” అని జార్డన్‌ చెప్తున్నాడు.

కొంతమంది దృష్టిలో ఒక బహుమానం విలువ చాలా తక్కువ లేదా అస్సలు లేకపోవచ్చు. జార్డన్‌ ఉదాహరణ చూపిస్తున్నట్లు, ఆ బహుమానాన్ని పొందినవాళ్లు మాత్రం దాన్ని ఎంతో అమూల్యంగా, కొన్నిసార్లు వెలకట్టలేనిదిగా చూస్తారు. బైబిలులో వెల కట్టలేని ఒక గొప్ప బహుమానం గురించి ఇలా ఉంది: “దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతగా అంటే వాళ్లకోసం తన ఒక్కగానొక్క కొడుకును ఇచ్చాడు. ఆయనమీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని అలా చేశాడు.”—యోహాను 3:16.

ఆ బహుమానం పొందినవాళ్లకు అది శాశ్వత జీవితం ఇస్తుంది కాబట్టి, అంతకంటే గొప్ప బహుమానం ఇంకొకటి ఉంటుందా? ఆ బహుమానం విలువ కొందరు గుర్తించకపోయినా, నిజ క్రైస్తవులు దాన్ని అమూల్యమైనదిగా చూస్తారు. (కీర్తన 49:8, 9; 1 పేతురు 1:18, 19) లోకం కోసం ఒక బహుమానంగా దేవుడు తన కొడుకు ప్రాణాన్ని ఎందుకు ఇచ్చాడు?

ఎందుకో అపొస్తలుడైన పౌలు ఇలా వివరిస్తున్నాడు: “ఒక మనిషి ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించాయి. అదే విధంగా, అందరూ పాపం చేశారు కాబట్టి మరణం అందరికీ వ్యాపించింది.” (రోమీయులు 5:12) మొదటి మనిషి ఆదాము తెలిసి కూడా దేవుని మాట వినకుండా పాపం చేశాడు. అందుకు ఆయన మరణం అనే శిక్ష పొందాడు. ఆదాము ద్వారా, ఆయన సంతానంలో అందరూ, అంటే మనుషులు అందరూ మరణాన్ని పొందారు.

“పాపంవల్ల వచ్చే జీతం మరణం, కానీ దేవుడు ఇచ్చే బహుమానం మన ప్రభువైన క్రీస్తుయేసు ద్వారా శాశ్వత జీవితం.” (రోమీయులు 6:23) మరణ దండన నుండి మనుషులను విడిపించడానికి, దేవుడు తన కొడుకుని అంటే యేసుక్రీస్తుని భూమి మీదకు పంపించాడు. ఏ లోపంలేని యేసు ప్రాణాన్ని ఈ లోకంలో ప్రజల కోసం అర్పించాడు. ఆ బలిని “విమోచన క్రయధనం” అంటారు. యేసు మీద విశ్వాసం చూపించే వాళ్లందరూ ఆ బలి ఆధారంగా శాశ్వత జీవాన్ని పొందుతారు.—రోమీయులు 3:24.

యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన ఆరాధకులకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటి గురించి పౌలు “వర్ణించలేని దేవుని బహుమానాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు” అని అన్నాడు. (2 కొరింథీయులు 9:15) విమోచన క్రయధనానికి ఉన్న గొప్పతనాన్ని మనం వర్ణించలేము. అయినప్పటికీ, దేవుడు తన కృపతో మనుషులకు ఇచ్చిన బహుమానాలన్నిటిలో విమోచన క్రయధనమే గొప్పదని ఎందుకు చెప్పవచ్చు? దేవుడు ఇచ్చిన వేరే బహుమానాలతో పోలిస్తే ఇదే ప్రత్యేకమైందని ఎలా చెప్పవచ్చు? a మనం దానికి ఎలా ప్రతిస్పందించాలి? ఈ ప్రశ్నలకు తర్వాతి రెండు ఆర్టికల్స్‌లో బైబిల్లో ఉన్న జవాబులు చదవమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

a యేసు ఇష్టపూర్వకంగా “తన ప్రాణాన్ని మనకోసం అర్పించాడు.” (1 యోహాను 3:16) అయితే, ఆ త్యాగం దేవుని ఉద్దేశంలో భాగం కాబట్టి, దీనికి సంబంధించిన ఆర్టికల్స్‌ అన్నిటిలో విమోచన క్రయధనం ఏర్పాటు చేయడంలో దేవుని పాత్ర గురించి ముఖ్యంగా ఉంది.