కంటెంట్‌కు వెళ్లు

బైబిలు జీవితాలను మారుస్తుంది

బైబిలు జీవితాలను మారుస్తుంది

బైబిలు జీవితాలను మారుస్తుంది

స్కాట్‌లాండ్‌కి చెందిన ఒక వ్యక్తికి వ్యాపారంలో రాణించడం కన్నా సంతోషాన్నిచ్చింది ఏమిటి? అనైతిక జీవితాన్ని, క్రాక్‌ కొకెయిన్‌ పీల్చడాన్ని విడిచిపెట్టేలా బ్రెజిల్‌కి చెందిన ఒకతనికి ఏది సహాయం చేసింది? బాగా తాగే అలవాటు ఉన్న స్లోవేనియాలోని ఒక వ్యక్తి దాన్ని ఎలా మానుకోగలిగాడు? వాళ్ల మాటల్లోనే తెలుసుకోండి.

“నా జీవితం బాగుందని అనిపించింది.”​—జాన్‌ రికెట్స్‌

పుట్టిన సంవత్సరం: 1958

దేశం: స్కాట్‌లాండ్‌

ఒకప్పుడు: పెద్ద వ్యాపారవేత్త

నా గతం: నా బాల్యం చాలా సంతోషంగా గడిచింది. మా నాన్న బ్రిటీష్‌ ఆర్మీలో పనిచేసేవాడు కాబట్టి మా కుటుంబం ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి మారుతూ ఉండేది. అలా మేము స్కాట్‌లాండ్‌లోనే కాకుండా ఇంగ్లాండ్‌, జర్మనీ, కెన్యా, మలేసియా, ఐర్లాండ్‌, సైప్రస్‌ దేశాల్లో జీవించాం. నాకు ఎనిమిదేళ్లు ఉన్నప్పటి నుండి నేను స్కాట్‌లాండ్‌లోని బోర్డింగ్‌ స్కూళ్లలో చదువుకున్నాను. తర్వాత కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో పట్టా పొందాను.

నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడు ఆయిల్‌ వ్యాపారంలో అడుగుపెట్టి ఎనిమిదేళ్ల పాటు అందులో కొనసాగాను. మొదట్లో దక్షిణ అమెరికాలో పనిచేసేవాణ్ణి, తర్వాత ఆఫ్రికాలో, చివరికి పశ్చిమ ఆస్ట్రేలియాలో చేశాను. ఆస్ట్రేలియాకు వెళ్లాక ఒక పెట్టుబడి సంస్థను స్థాపించాను, ఆ తర్వాత దాన్ని అమ్మేశాను.

అలా అమ్మడం వల్ల చాలా డబ్బు రావడంతో 40 ఏళ్లకే రిటైర్‌ అయ్యాను. దానివల్ల దొరికిన సమయాన్ని ప్రపంచమంతా తిరగడానికి ఉపయోగించాను. నేను బైక్‌ మీద ఆస్ట్రేలియా అంతా రెండుసార్లు చుట్టివచ్చాను, అలాగే ప్రపంచ యాత్ర కూడా చేశాను. నాకు నా జీవితం బాగుందని అనిపించింది.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ... రిటైర్‌ అవ్వకముందు కూడా, నాకు మంచి జీవితం ఇచ్చినందుకు దేవునికి ఏదోలా కృతజ్ఞత చెప్పాలని అనిపించేది. నేను చిన్నప్పుడు వెళ్లిన ఆంగ్లికన్‌ చర్చికి వెళ్లడం మొదలుపెట్టాను. కానీ ఆ చర్చిలో బైబిలు విషయాలు ఎక్కువగా చెప్పేవాళ్లు కాదు. తర్వాత నేను మోర్మన్‌ చర్చివాళ్లతో కలిసి అధ్యయనం చేశాను, కానీ వాళ్లు కూడా బైబిలు మీద ఆధారపడడం లేదని చూసినప్పుడు దానిమీద ఆసక్తి తగ్గిపోయింది.

ఒకరోజు యెహోవాసాక్షులు మా ఇంటి తలుపు తట్టారు. వాళ్లు కేవలం బైబిల్లో ఉన్న విషయాలు మాత్రమే బోధిస్తున్నారని నేను గమనించాను. వాళ్లు నాకు చూపించిన లేఖనాల్లో ఒకటి, 1 తిమోతి 2:3,4. ఆ వచనాలు, దేవుడు “అన్నిరకాల ప్రజలు సత్యం గురించిన సరైన జ్ఞానాన్ని సంపాదించుకొని రక్షించబడాలని కోరుకుంటున్నాడు” అని చెప్తున్నాయి. వాళ్లు కేవలం జ్ఞానం గురించి కాకుండా బైబిల్లోని సరైన జ్ఞానం గురించి మాట్లాడడం నాకు బాగా నచ్చింది.

యెహోవాసాక్షులతో కలిసి బైబిలు స్టడీ చేయడం వల్ల ఆ సరైన జ్ఞానాన్ని సంపాదించగలిగాను. ఉదాహరణకు దేవుడు, యేసు ఎవ్వరికీ అర్థంకాని త్రిత్వంలో భాగం కాదని, బదులుగా వాళ్లిద్దరూ వేర్వేరు వ్యక్తులని నేర్చుకున్నాను. (యోహాను 14:28; 1 కొరింథీయులు 11:3) సరళమైన ఆ సత్యం నేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉండేది. ఎప్పటికీ అర్థంచేసుకోలేని ఒక సిద్ధాంతాన్ని అర్థంచేసుకోవడానికి అప్పటివరకు అనవసరంగా కష్టపడ్డానని అనిపించింది.

త్వరలోనే నేను యెహోవాసాక్షుల కూటాలకు వెళ్లడం మొదలుపెట్టాను. వాళ్లలో ప్రతీ ఒక్కరు స్నేహపూర్వకంగా ఉండడం, ఉన్నత నైతిక ప్రమాణాలు పాటించడం నన్ను బాగా ఆకట్టుకున్నాయి. వాళ్లు చాలా మంచివాళ్లని, దైవభక్తిగల ప్రజలని నాకు అర్థమైంది. వాళ్లు చూపించిన కపటంలేని ప్రేమ, అదే సత్యమతం అనే నా నమ్మకాన్ని బలపర్చింది.—యోహాను 13:35.

నేనెలా ప్రయోజనం పొందానంటే ... నేను బాప్తిస్మం తీసుకున్నాక, డైయన్‌ అనే చక్కని అమ్మాయిని కలిశాను. ఆమె ఒక యెహోవాసాక్షిగా పెరిగింది, నాకు నచ్చిన ఎన్నో మంచి లక్షణాలు ఆమెలో ఉన్నాయి. కొంతకాలానికి ఇద్దరం పెళ్లిచేసుకున్నాం. ఆమెతో స్నేహం, ఆమె మద్దతు నిజంగా యెహోవా నాకిచ్చిన ఆశీర్వాదాలు.

అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లి బైబిల్లోని మంచివార్తను చెప్పాలనే బలమైన కోరిక మా ఇద్దరికీ ఉండేది. 2010 లో మేము సెంట్రల్‌ అమెరికాలోని బెలీజ్‌కు తరలివెళ్లాం. ఇక్కడ మేము దేవుని మీద ప్రేమ, ఆయన గురించి తెలుసుకోవాలనే కోరిక ఉన్న ప్రజలకు మంచివార్త ప్రకటిస్తున్నాం.

దేవుని గురించిన, ఆయన వాక్యమైన బైబిలు గురించిన సత్యం తెలుసుకోవడం నాకెంతో మనశ్శాంతిని ఇస్తుంది. నేను పూర్తికాల పరిచర్య చేయడం వల్ల చాలామందికి బైబిల్లోని విషయాలు నేర్పించాను. నా జీవితాన్ని మార్చినట్టే, బైబిల్లోని సత్యం ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తుందో చూడడాన్ని మించిన సంతోషం ఇంకొకటి లేదు. మొత్తానికి, దేవుడు నాకిచ్చిన మంచి జీవితం కోసం ఆయనకు కృతజ్ఞతలు చెప్పే అత్యుత్తమ మార్గం నాకు దొరికింది.

“వాళ్లు నాతో చాలా దయగా వ్యవహరించారు.”​—మౌరీసియో ఆరౌజ్యూ

పుట్టిన సంవత్సరం: 1967

దేశం: బ్రెజిల్‌

ఒకప్పుడు: అనైతిక జీవితం గడిపేవాడు

నా గతం: నేను సావో పౌలో రాష్ట్రంలోని అవారే అనే చిన్న పట్టణంలో పెరిగాను. అందులో ఎక్కువగా శ్రామిక వర్గానికి చెందినవాళ్లు నివసించేవాళ్లు.

నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. చిన్నతనంలో, మా అమ్మ బయటికి వెళ్లినప్పుడు ఆమె బట్టలు వేసుకునేవాణ్ణి. నేను ఆడవాళ్లలాగే ప్రవర్తించేవాణ్ణి, దాంతో అందరూ నన్ను స్వలింగ సంయోగిలా చూసేవాళ్లు. కొంతకాలానికి నేను ఇతర అబ్బాయిలతో, మగవాళ్లతో లైంగిక సంబంధం పెట్టుకున్నాను.

నాకు 17-19 ఏళ్లు ఉన్నప్పుడు, లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి ఎవరైనా దొరుకుతారేమో అని తరచూ వెతికేవాణ్ణి. నేను వీలైన చోటల్లా అంటే బార్‌లలో, నైట్‌క్లబ్‌లలో, చివరికి చర్చీల్లో కూడా వెతికేవాణ్ణి. సంబరాలు (carnival) జరిగేటప్పుడు, ఆడవాళ్లలా తయారై సాంబా-స్కూల్‌ ఊరేగింపుల్లో డాన్స్‌ చేసేవాణ్ణి. నాకు చాలా పేరు కూడా వచ్చింది.

నా స్నేహితుల్లో స్వలింగ సంయోగులు, వేశ్యలు, డ్రగ్స్‌కి బానిసలైన వాళ్లు ఉండేవాళ్లు. వాళ్లలో కొంతమంది నాకు క్రాక్‌ కొకేయిన్‌ అలవాటు చేశారు, కొంతకాలానికే నేను దానికి బానిసనయ్యాను. ఒక్కోసారి మేము రాత్రంతా కొకేయిన్‌ పీలుస్తూ ఉండేవాళ్లం. ఇంకొన్నిసార్లు నేను ఒంటరిగా ఉండి రోజంతా దాన్ని పీలుస్తూ ఉండేవాణ్ణి. నేను ఎంత సన్నగా తయారయ్యానంటే, ప్రజలు నాకు ఎయిడ్స్‌ ఉందని చెప్పుకునేవాళ్లు.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ... దాదాపు ఆ సమయంలోనే నాకు యెహోవాసాక్షులు పరిచయమయ్యారు. వాళ్లు నా మీద చాలా దయ చూపించారు. వాళ్లు నాకు చూపించిన లేఖనాల్లో రోమీయులు 10:13 ఒకటి, అందులో ఇలా ఉంది: “యెహోవా పేరు ఉపయోగించి ప్రార్థించే ప్రతీ ఒక్కరు రక్షించబడతారు.” అది చదివినప్పుడు యెహోవా పేరు ఉపయోగించడం ఎంత ముఖ్యమో నాకు అర్థమైంది. చాలాసార్లు, రాత్రంతా కొకేయిన్‌ పీల్చాక మా ఇంటి కిటికీ తెరిచి ఆకాశం వైపు చూస్తూ కన్నీళ్లతో యెహోవాకు ప్రార్థించేవాణ్ణి, సహాయం చేయమని చాలా వేడుకునేవాణ్ణి.

నేను డ్రగ్స్‌తో జీవితాన్ని నాశనం చేసుకోవడం చూసి మా అమ్మ ఎంతో కుమిలిపోయేది. ఆమె బాధ చూడలేక, డ్రగ్స్‌ మానేద్దామని నిర్ణయించుకున్నాను. ఆ వెంటనే, యెహోవాసాక్షులతో బైబిల్‌ స్టడీకి ఒప్పుకున్నాను. స్టడీ చేస్తే, డ్రగ్స్‌ మానేయాలనే నా నిశ్చయం బలపడుతుందని వాళ్లు చెప్పారు, అలాగే జరిగింది!

స్టడీ చేస్తున్నప్పుడు, నా జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించాను. ముఖ్యంగా, స్వలింగ సంయోగానికి చెందిన అలవాట్లు మార్చుకోవడం చాలా కష్టమైంది, ఎందుకంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి అవి నాలో భాగం అయ్యాయి. నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకోవడం నాకు కొంతవరకు సహాయం చేసింది. నా పాత స్నేహితులను వదిలేశాను, బార్‌లకు, నైట్‌క్లబ్‌లకు వెళ్లడం మానేశాను.

అలాంటి మార్పులు చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను. అయితే యెహోవా నా గురించి ఆలోచిస్తున్నాడని, నా కష్టాన్ని అర్థంచేసుకుంటాడని తెలుసుకోవడం ఊరటనిచ్చింది. (1 యోహాను 3:19, 20) నేను 2002 కల్లా, స్వలింగ సంయోగానికి చెందిన అలవాట్లన్నీ మానుకున్నాను, ఆ సంవత్సరమే బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షిని అయ్యాను.

నేనెలా ప్రయోజనం పొందానంటే ... నేను చేసుకున్న మార్పులు చూసి మా అమ్మ ఎంత సంతోషించిందంటే, తను కూడా బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టింది. అయితే అనుకోకుండా బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడం వల్ల అప్పటినుండి ఆమె ఇబ్బందిపడుతోంది. ఏమైనా యెహోవా మీద, బైబిలు సత్యం మీద ఆమెకున్న ప్రేమ పెరుగుతూనే ఉంది.

గత ఎనిమిదేళ్లుగా నేను పూర్తికాల పరిచర్య చేస్తూ ఎక్కువ సమయాన్ని ఇతరులకు బైబిలు గురించి నేర్పించడానికి ఉపయోగిస్తున్నాను. నిజమే, ఒక్కోసారి నేను తప్పుడు కోరికలతో పోరాడాల్సి వచ్చింది. అయితే వాటికి లొంగిపోకుండా ఉండాలని నిర్ణయించుకోవడం ద్వారా నేను యెహోవాను సంతోషపెట్టవచ్చని తెలుసుకోవడం ధైర్యాన్ని ఇస్తుంది.

యెహోవాకు దగ్గరవ్వడం, ఆయనకు నచ్చినట్టు జీవించడం వల్ల నా ఆత్మగౌరవం పెరిగింది. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను.

“ఒకప్పుడు నేను సీసాలుసీసాలు తాగేవాణ్ణి.”​—లూకా షట్స్‌

పుట్టిన సంవత్సరం: 1975

దేశం: స్లోవేనియా

ఒకప్పుడు: అతిగా తాగేవాడు

నా గతం: నేను స్లోవేనియా రాజధాని అయిన లుబ్యానాలో పుట్టాను. నాకు నాలుగేళ్లు వచ్చేవరకు నా బాల్యం ఆనందంగా సాగింది. అప్పుడే మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషాద సంఘటన తర్వాత నన్ను, మా అన్నయ్యను పోషించడానికి మా అమ్మ కష్టపడి పనిచేసేది.‏

నాకు 15 ఏళ్లు ఉన్నప్పటి నుండి మా అమ్మమ్మ దగ్గరే పెరిగాను.‏ ఆమె దగ్గర ఉన్నప్పుడు బాగుండేది, ఎందుకంటే మా ఫ్రెండ్స్‌ అందరూ దగ్గర్లోనే ఉండేవాళ్లు. అంతేకాదు, ఎక్కువ స్వేచ్ఛ ఉండేది. నాకు 16 ఏళ్లు వచ్చినప్పుడు, వారాంతాల్లో మద్యం తాగేవాళ్లతో కలిసేవాడిని. జుట్టు పొడుగ్గా పెంచుకున్నాను, తిరుగుబాటు చేసేవాళ్లలా బట్టలు వేసుకొన్నాను, సిగరెట్లు కూడా అలవాటు చేసుకున్నాను.

నేను రకరకాల డ్రగ్స్‌ తీసుకున్నాను, కానీ మద్యం తాగడంలోనే నాకు ఎక్కువ సంతోషం దొరికేది కాబట్టి తాగడం అలవాటు చేసుకున్నాను. మొదట్లో కొన్ని గ్లాసులు వైన్‌ తాగేవాణ్ణి, కానీ ఆ తర్వాత ఒకేసారి ఒక బాటిల్‌ కన్నా ఎక్కువ తాగేవాణ్ణి. అయితే ఎంత తాగేవాడినో బయటకు తెలియకుండా చాలా జాగ్రత్తపడేవాణ్ణి. తరచూ, నా నోటి నుండి వచ్చే మద్యం వాసనను బట్టి మాత్రమే నేను తాగానని ఇతరులు గుర్తుపట్టేవాళ్లు. కానీ నేను లీటర్ల కొద్దీ వైన్‌ లేదా బీరు తాగానని, అది కూడా వోడ్కా కలుపుకుని తాగానని ఎవరూ కనిపెట్టలేకపోయేవాళ్లు.

చాలాసార్లు, నేను మా ఫ్రెండ్స్‌ కన్నా రెండురెట్లు ఎక్కువగా తాగినా, వాళ్లు అర్ధరాత్రి డిస్కోలో తూలి పడిపోకుండా పట్టుకునేవాణ్ణి. ఒకరోజు, మా ఫ్రెండ్స్‌ నా గురించి నేను సీసాలుసీసాలు తాగుతాను అని అనుకోవడం విన్నాను. అందరికన్నా ఎక్కువగా తాగేవాళ్లను మా దేశంలో అలా తూలనాడతారు. ఆ మాట విన్నప్పుడు చాలా బాధ అనిపించింది.

నా జీవితం ఏమైపోతోంది అని ఆలోచించడం మొదలుపెట్టాను. నేను ఎందుకూ పనికిరానివాణ్ణి అనే ఆలోచనలు ఎక్కువయ్యాయి. జీవితంలో పనికొచ్చేది ఏదీ నేను చేయడం లేదని అనిపించింది.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ... దాదాపు ఆ సమయంలోనే, నా క్లాస్‌మేట్స్‌లో ఒకతను మారడం గమనించాను. అతను మృధుస్వభావిగా తయారయ్యాడు. అతనిలో ఆ మార్పుకు కారణం ఏంటో తెలుసుకోవాలని అతన్ని కాఫీ షాపుకు పిలిచాను. మాటల మధ్యలో అతను, యెహోవాసాక్షుల దగ్గర బైబిలు స్టడీ తీసుకుంటున్నాడని చెప్పాడు. తాను నేర్చుకుంటున్న కొన్ని విషయాలు అతను నాకు చెప్పాడు, అయితే నాకు అవన్నీ చాలా కొత్తగా అనిపించాయి, ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను దేవుడంటే తెలియకుండా పెరిగాను. నేను కూడా యెహోవాసాక్షుల కూటాలకు వెళ్లడం, బైబిలు స్టడీ చేయడం మొదలుపెట్టాను.

బైబిలు స్టడీ వల్ల చాలా ప్రాముఖ్యమైన, పురికొల్పే సత్యాలు తెలుసుకున్నాను. ఉదాహరణకు, మనం బైబిలు “చివరి రోజులు” అని పిలుస్తున్న కాలంలో జీవిస్తున్నామని నేర్చుకున్నాను. (2 తిమోతి 3:1-5) దేవుడు త్వరలో చెడ్డవాళ్లందరినీ నాశనం చేసి, మంచివాళ్లకు పరదైసులో శాశ్వత జీవితాన్ని ఇస్తాడని కూడా నేర్చుకున్నాను. (కీర్తన 37:29) ఆ మంచివాళ్లలో నేను కూడా ఉండాలనుకున్నాను, కాబట్టి నా జీవితాన్ని శుభ్రం చేసుకోవాలని బలంగా నిర్ణయించుకున్నాను.

నేను నేర్చుకుంటున్న బైబిలు సత్యాలను నా ఫ్రెండ్స్‌కు చెప్పడం మొదలుపెట్టాను. వాళ్లలో చాలామంది నన్ను ఎగతాళి చేశారు, కానీ దానివల్ల ఒకరకంగా నాకు మంచే జరిగింది. వాళ్లు నిజమైన స్నేహితులు కారని నాకు అర్థమైంది. నా తాగుడు అలవాటుకు నా స్నేహితులే కారణమని నేను గ్రహించాను. వాళ్లు వారమంతా, వారాంతం ఎప్పుడూ వస్తుందా, ఎప్పుడు మత్తుగా తాగుదామా అని ఎదురుచూసేవాళ్లు.

నేను వాళ్లతో స్నేహం మానేసి, యెహోవాసాక్షులతో స్నేహం చేయడం మొదలుపెట్టాను. వాళ్లతో ఉండడం ఎంతో ప్రోత్సాహంగా అనిపించేది. ఎందుకంటే వాళ్లకు దేవుని మీద నిజమైన ప్రేమ ఉంది, అలాగే ఆయన ప్రమాణాల ప్రకారం జీవించడానికి చాలా ప్రయత్నిస్తారు. మెల్లమెల్లగా నేను అతిగా తాగే అలవాటు నుండి బయటపడ్డాను.

నేనెలా ప్రయోజనం పొందానంటే ... ఇప్పుడు నేను, తాగితేనే సంతోషంగా ఉంటాను అనే పరిస్థితిలో లేను. అందుకు నేను యెహోవాకు కృతజ్ఞుణ్ణి. యెహోవాసాక్షిని కాకపోయుంటే, నా జీవితం ఏమైపోయి ఉండేదో తెలీదు. నా జీవితం ఇప్పుడు మెరుగ్గా ఉందని నేను బలంగా చెప్పగలను.

గత ఏడు సంవత్సరాలుగా స్లోవేనియాలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో సేవ చేసే గొప్ప అవకాశం నాకు దొరికింది. యెహోవాను తెలుసుకోవడం వల్ల, ఆయన సేవ చేయడం వల్ల నా జీవితానికి నిజమైన అర్థం ఏర్పడింది.