కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

4వ పాఠం

యేసుక్రీస్తు ఎవరు?

యేసుక్రీస్తు ఎవరు?

1. యేసు ఎక్కడనుండి వచ్చాడు?

యేసుకున్న ఏ లక్షణాల వల్ల ప్రజలు భయపడకుండా ఆయన దగ్గరికి వెళ్లేవాళ్లు?—మత్తయి 11:29; మార్కు 10:13-16.

యేసు భూమ్మీదికి రాకముందు పరలోకంలో దేవదూతగా జీవించాడు, వేరే ఏ మనిషీ అలా జీవించలేదు. (యోహాను 8:23) దేవుడు మొట్టమొదట యేసును చేశాడు. మిగతావన్నీ సృష్టించడానికి యేసు ఆయనకు సహాయం చేశాడు. యేసును మాత్రమే యెహోవా స్వయంగా చేశాడు కాబట్టి ఆయన దేవుని ‘ఒక్కగానొక్క కుమారుడు’ అని పిలవబడ్డాడు. (యోహాను 1:14) దేవుని తరఫున మాట్లాడాడు కాబట్టి యేసుకు “వాక్యం” అనే పేరు కూడా ఉంది.సామెతలు 8:22, 23, 30; కొలొస్సయులు 1:15, 16 చదవండి.

2. యేసు భూమ్మీదికి ఎందుకు వచ్చాడు?

దేవుడు పరలోకంలో ఉన్న తన కుమారుని జీవాన్ని, యూదురాలైన మరియ అనే కన్య గర్భంలోకి మార్చడం ద్వారా యేసును భూమ్మీదికి పంపించాడు. అందుకే యేసుకు మానవ తండ్రి లేడు. (లూకా 1:30-35) యేసు (1) దేవుని గురించిన సత్యం చెప్పడానికి, (2) కష్టాలు వచ్చినా దేవుడు కోరినట్టు ఎలా జీవించాలో మనకు చూపించడానికి, (3) తన పరిపూర్ణ జీవాన్ని “విమోచన క్రయధనంగా” ఇవ్వడానికి భూమ్మీదికి వచ్చాడు.మత్తయి 20:28 చదవండి.

3. మనకు విమోచన క్రయధనం ఎందుకు అవసరం?

ఒక ఖైదీని విడిపించాలంటే లేదా ఒక వస్తువును వెనక్కి తెచ్చుకోవాలంటే తగిన మూల్యం చెల్లించాలి, దాన్నే విమోచన క్రయధనం అంటారు. (నిర్గమకాండం 21:29, 30) దేవుడు మనుషుల్ని చేసినప్పుడు, వాళ్లు ముసలివాళ్లై చనిపోవాలని ఆయన కోరుకోలేదు. అలాగని మనకెలా తెలుసు? దేవుడు మొదటి మనిషైన ఆదాముతో, “పాపం” చేస్తే చనిపోతావని చెప్పాడు. అంటే, ఆదాము పాపం చేయకపోతే చనిపోయేవాడే కాదు. (ఆదికాండం 2:16, 17; 5:5) ఆదాము ద్వారా మరణం ఈ లోకంలోకి ప్రవేశించిందని బైబిలు చెప్తుంది. అలా ఆదాము తన సంతానం అంతటికీ పాపాన్ని, దానివల్ల వచ్చే మరణాన్ని వారసత్వంగా ఇచ్చాడు. ఆ మరణం నుండి విడుదలవ్వాలంటే మనకు విమోచన క్రయధనం అవసరం.రోమీయులు 5:12; 6:23 చదవండి.

మనల్ని మరణం నుండి విడిపించడానికి విమోచన క్రయధనం ఎవరు చెల్లించగలరు? ఒక అపరిపూర్ణ మనిషి చనిపోయినప్పుడు అతని పాపాలు మాత్రమే పరిహారం అవుతాయి. కాబట్టి ఏ అపరిపూర్ణ మనిషీ వేరేవాళ్ల పాపాల కోసం పరిహారం చెల్లించలేడు.కీర్తన 49:7-9 చదవండి.

4. యేసు ఎందుకు చనిపోయాడు?

యేసు మనలా అపరిపూర్ణుడు కాదు, ఆయన పరిపూర్ణుడు. ఆయన అస్సలు పాపం చేయలేదు, తన పాపాల కోసం చనిపోవాల్సిన అవసరం ఆయనకు లేదు. వేరేవాళ్ల పాపాల కోసమే ఆయన చనిపోయాడు. మన కోసం చనిపోవడానికి తన కుమారుణ్ణి పంపించడం ద్వారా దేవుడు మనుషుల మీద సాటిలేని ప్రేమ చూపించాడు. యేసు తన తండ్రికి విధేయత చూపించి మన పాపాల కోసం చనిపోవడం ద్వారా మన మీద ప్రేమ చూపించాడు.యోహాను 3:16; రోమీయులు 5:18, 19 చదవండి.

యేసు ఎందుకు చనిపోయాడు? వీడియో చూడండి.

5. యేసు ఇప్పుడు ఏం చేస్తున్నాడు?

యేసు భూమ్మీద ఉన్నప్పుడు రోగుల్ని బాగుచేశాడు, చనిపోయినవాళ్లను బ్రతికించాడు, కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకున్నాడు. అలా ఆయన, దేవునికి లోబడే వాళ్లందరి కోసం భవిష్యత్తులో ఏం చేస్తాడో చూపించాడు. (మత్తయి 15:30, 31; యోహాను 5:28) యేసు చనిపోయిన తర్వాత, దేవుడు ఆయన్ని బలమైన దేవదూతగా తిరిగి బ్రతికించాడు. (1 పేతురు 3:18) అప్పటినుండి యెహోవా తనకు భూమంతటి మీద రాజ్యాధికారం ఇచ్చే వరకు, యేసు ఆయన కుడిపక్కన వేచివున్నాడు. (హెబ్రీయులు 10:12, 13) ఇప్పుడు యేసు పరలోకంలో రాజుగా పరిపాలిస్తున్నాడు, ఆయన అనుచరులు ప్రపంచవ్యాప్తంగా ఆ మంచివార్త ప్రకటిస్తున్నారు.దానియేలు 7:13, 14; మత్తయి 24:14 చదవండి.

త్వరలోనే యేసు తన రాజ్యాధికారాన్ని ఉపయోగించి బాధల్ని, బాధలు పెట్టేవాళ్లను పూర్తిగా తీసేస్తాడు. యేసుకు లోబడుతూ ఆయన మీద విశ్వాసం ఉంచే వాళ్లందరూ పరదైసు భూమ్మీద జీవిస్తారు.కీర్తన 37:9-11 చదవండి.