కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“లేదు, అలా జరిగి ఉండదు!”

“లేదు, అలా జరిగి ఉండదు!”

అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ఒక వ్యక్తి ఇలా చెబుతున్నాడు: “మా అబ్బాయి జోనాతాన్‌ కొన్ని మైళ్ల దూరంలోవున్న స్నేహితులను కలవడానికి వెళ్తుండేవాడు. నాభార్య వాలంటీనాకు అతడలా వెళ్లడం ఏమాత్రం ఇష్టంలేదు. ట్రాఫిక్‌ గురించి ఆమె ఎప్పుడూ భయపడుతుండేది. అయితే మా అబ్బాయికి ఎలక్ట్రానిక్స్‌ అంటే చాలా ఇష్టం, అందుకే అనుభవం సంపాదించుకోవడానికి అతడు తన స్నేహితుల వర్క్‌షాప్‌కు వెళ్ళేవాడు. నేను న్యూయార్క్‌లోని వెస్ట్‌ మాన్‌హాటన్‌లోవున్న మా ఇంట్లోనే ఉన్నాను. మా ఆవిడ తన బంధువులను చూడడానికి ప్యూర్టోరికోకు వెళ్లింది. ‘జోనాతాన్‌ త్వరగానే ఇంటికి వస్తాడని’ అనుకున్నాను. ఇంతలో డోర్‌బెల్‌ మ్రోగింది. ‘మా అబ్బాయే అనుకున్నాను.’ కానీ వచ్చింది మా అబ్బాయి కాదు, ఒక పోలీసు అధికారి, సంచార వైద్య బృందం వాళ్ళు వచ్చారు. ‘ఈ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను మీరు గుర్తుపట్టగలరా?’ అని ఆ పోలీసు అధికారి అడిగాడు. ‘ఇది మా అబ్బాయిదే.’ ‘మీకొక దుర్వార్త. అక్కడొక ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదంలో . . . మీ అబ్బాయి, . . . మీ అబ్బాయి చనిపోయాడు.’ ‘లేదు, అలా జరిగి ఉండదు’ అని నేను అన్నాను. ఆ దుర్ఘటన మా గుండెల్లో మానని గాయం చేసింది, అది జరిగి ఎన్నో ఏళ్ళు గడిచినా మాలో ఆ గాయం ఇంకా మానలేదు.”

‘మీకొక దుర్వార్త. అక్కడొక ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదంలో . . . మీ అబ్బాయి . . . మీ అబ్బాయి చనిపోయాడు.’

స్పెయిన్‌లోని బార్సిలోనాకు చెందిన ఒక తండ్రి ఇలా వ్రాస్తున్నాడు: “1960లలో మేము స్పెయిన్‌లో ఉన్నప్పుడు మా కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. నా భార్య పేరు మారియా. మాకు ముగ్గురు పిల్లలు, డేవిడ్‌కు 13, పకీటోకు 11, ఈసబెల్‌కు 9 సంవత్సరాలు.

“1963 మార్చిలో ఒక రోజు, పకీటో పాఠశాల నుండి వస్తూనే తల విపరీతంగా నొస్తుందని చెప్పాడు. కారణం తెలియక మేము చాలా కంగారుపడ్డాం—ఆ తర్వాత కొద్దిసేపటికి కారణమేమిటో మాకు తెలిసింది. మూడు గంటలు గడిచాక మా అబ్బాయి మెదడు నరాలు చిట్లినందువల్ల చనిపోయాడు.

“పకీటో చనిపోయి 30 సంవత్సరాలైంది, అయినా మాకది ఇప్పటికీ తీరని లోటుగానే ఉంది. ఒక బిడ్డను కోల్పోయి ఎంతకాలం గడచినా, ఇంకా ఎంతమంది పిల్లలున్నా, ఆ బిడ్డను కోల్పోయామనే బాధను తల్లిదండ్రుల మనస్సుల్లో నుండి ఏదీ తీసివేయలేదు.”

ఈ రెండు అనుభవాలు, ఒక బిడ్డ చనిపోయినప్పుడు అది తల్లిదండ్రుల మనస్సుల్లో ఎంతటి తీవ్రమైన గాయాన్ని చేస్తుందో వివరిస్తున్నాయి. ఒక డాక్టరు వ్రాసిన ఈ మాటలు ఎంతో వాస్తవమైనవి: “ఒక వృద్ధుడు చనిపోయినప్పటి కంటే ఒక పిల్లవాడు చనిపోయినప్పుడు తీవ్రమైన దుఃఖం, వ్యధ కలుగుతాయి, ఎందుకంటే సాధారణంగా కుటుంబంలో అందరికంటే ఆఖరున పిల్లలే చనిపోతారని మనం అనుకుంటాం . . . కాబట్టి ఒక చిన్న పిల్లవాడు చనిపోయాడంటే, అతడింకా చవిచూడని భావిస్వప్నాలను, కుటుంబ బాంధవ్యాలను [కుమారుడు, కోడలు, మనుమలు మనుమరాళ్ళు], జీవితానుభవాలను కోల్పోయినట్లే.” అలాగే గర్భస్రావం కారణంగా బిడ్డను కోల్పోయిన ప్రతీ స్త్రీ ఇలాంటి వేదనే అనుభవిస్తుంది.

భర్తను కోల్పోయిన ఒక భార్య ఇలా వివరిస్తోంది: “నా భర్త రస్సల్‌, రెండవ ప్రపంచ యుద్ధకాలంలో పసిఫిక్‌ యుద్ధభూమిలో వైద్య సహాయకునిగా పనిచేశారు. ఆయన కొన్ని భయంకరమైన యుద్ధాలను చూశారు, వాటినుండి బ్రతికి బయటపడ్డారు కూడా. ఆయన అమెరికాకు తిరిగివచ్చి, ప్రశాంతమైన జీవితాన్ని గడపడం ఆరంభించారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన దేవుని వాక్య పరిచారకునిగా సేవ చేశారు. ఆయనకు అరవయ్యేళ్ళు వచ్చేసరికి గుండెజబ్బు సూచనలు కనబడ్డాయి. అయినా ఆయన చురుగ్గా ఉండడానికే ప్రయత్నించారు. కానీ 1988 జూలైలో ఒకరోజు ఆయన తీవ్రమైన గుండెపోటుతో చనిపోయారు. ఆయననలా పోగొట్టుకోవడం నాకు తీరనిలోటును మిగిల్చింది. చివరిక్షణాల్లో కనీసం ఆయనతో మాట్లాడే అవకాశం కూడా నాకు లభించలేదు. ఆయన నాకు భర్త మాత్రమే కాదు, మంచి స్నేహితుడు కూడా. మేమిద్దరం 40 సంవత్సరాలు కలిసి కాపురం చేశాం. నాకిక ఒంటరి జీవితం తప్పదన్నట్లు అన్పించింది.”

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు, కొన్ని వేల కుటుంబాల్లో సంభవిస్తున్న విషాద సంఘటనలలో ఇవి కొన్ని మాత్రమే. దుఃఖిస్తున్న వారిలో చాలామంది తమ బిడ్డను, తమ భర్తను, తమ భార్యను, తమ తల్లిని, తమ తండ్రిని, తమ స్నేహితుడ్ని పోగొట్టుకున్నప్పుడు, క్రైస్తవ రచయిత పౌలు అన్నట్లుగా మరణం నిజంగా, ‘కడపటి శత్రువు’ అని అంటారు. భయంకరమైన వార్త విన్నప్పుడు “లేదు, అలా జరిగి ఉండదు! నేను నమ్మలేను” అంటూ మొదట వాస్తవాన్ని అంగీకరించకపోవడం సహజమే. మనం చూడబోతున్నట్లుగా, ఆ తర్వాత ఇతర ప్రతిస్పందనలు కూడా ఉంటాయి.—1 కొరింథీయులు 15:25, 26.

అయితే, దుఃఖ భావాలను పరిశీలించడానికి ముందు, మనం కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం. మరణం ఒక వ్యక్తి అంతమా? మన ప్రియమైన వాళ్లను మళ్ళీ చూసే నిరీక్షణ ఉందా?

నిజమైన నిరీక్షణ ఉంది

బైబిలు రచయిత పౌలు, ‘కడపటి శత్రువు’ అయిన మరణం నుండి విమోచన పొందే నిరీక్షణ గురించి చెబుతూ ఇలా వ్రాశాడు: “కడపట నశింపజేయబడు శత్రువు మరణము.” “చివరి శత్రువైన మృత్యువు నాశనము చేయబడుతుంది.” (1 కొరింథీయులు 15:26, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) పౌలు దాని గురించి ఎందుకంత నమ్మకంగా చెప్పగలిగాడు? ఎందుకంటే మరణం నుండి తిరిగి లేపబడిన యేసుక్రీస్తే స్వయంగా ఆయనకు బోధించాడు. (అపొస్తలుల కార్యములు 9:3-19) అందుకే పౌలు ఇలా కూడా వ్రాయగలిగాడు: “మనుష్యుని [ఆదాము] ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని [యేసుక్రీస్తు] ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.”—1 కొరింథీయులు 15:21, 22.

నాయీనుకు చెందిన ఒక విధవరాలు యేసుకు ఎదురైనప్పుడు, ఆమెను, చనిపోయిన ఆమె కుమారుడ్ని చూసి ఆయన చాలా బాధపడ్డాడు. బైబిలు వృత్తాంతం మనకిలా చెబుతోంది: “ఆయన [యేసు] ఆ ఊరి [నాయీను] గవిని యొద్దకు వచ్చినప్పుడు, చనిపోయిన యొకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు; ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడ ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడి—ఏడువవద్దని ఆమెతో చెప్పి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన—చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. అందరు భయాక్రాంతులై—మనలో గొప్ప ప్రవక్త బయలుదేరియున్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమనుగ్రహించి యున్నాడనియు దేవుని మహిమపరచిరి.” యేసు కనికరముతో ఎంతగా కదిలించబడ్డాడో గమనించండి, అందువల్లే ఆయన విధవరాలి కుమారుడ్ని పునరుత్థానం చేశాడు. అది భవిష్యత్తును గూర్చి ఏమి సూచిస్తుందో ఒక్కసారి ఊహించండి!—లూకా 7:12-16.

ఎంతోమంది చూస్తుండగా అక్కడ యేసు మరువలేని ఒక పునరుత్థానం చేశాడు. ఆయన ఆ సంఘటన జరగడానికి కొంతకాలం ముందే ప్రవచించిన పునరుత్థానానికి, అంటే ‘క్రొత్త ఆకాశపు’ ఆధ్వర్యంలో భూమిమీద జరిగే జీవపునరుత్థానానికి అదొక హామీగా ఉంది. ఆ ప్రవచనం చెప్పిన సందర్భంలో యేసు ఇలా అన్నాడు: “దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని . . . బయటికి వచ్చెదరు.”—ప్రకటన 21:1, 3, 4; యోహాను 5:28, 29; 2 పేతురు 3:13.

పునరుత్థానం ప్రత్యక్షంగా చూసినవారిలో పేతురు, యేసుతో పాటు ప్రయాణించిన 12 మందిలోని కొందరు కూడా ఉన్నారు. వాళ్లు గలిలయ సముద్ర తీరంలో, పునరుత్థానుడైన యేసు మాట్లాడడాన్ని స్వయంగా విన్నారు. ఆ వృత్తాంతం మనకిలా చెబుతోంది: “యేసు—రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున—నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసికొని వారికి పంచిపెట్టెను. ఆలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతులలోనుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి.”—యోహాను 21:12-14.

అందుకే పేతురు దృఢనమ్మకంతో ఇలా వ్రాయగలిగాడు: ‘మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన యేసుక్రీస్తును పునరుత్థానం చేయడం ద్వారా మనకు జీవముతో కూడిన నిరీక్షణ కలుగునట్లు తన విశేష కనికరము చొప్పున మనలను మళ్ళీ జన్మింపజేశాడు.’—1 పేతురు 1:3, NW.

అపొస్తలుడైన పౌలు తనకున్న గట్టి నిరీక్షణను ఈ మాటల్లో వ్యక్తం చేశాడు: “ధర్మశాస్త్రమందును, ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడియున్నవన్నియు నమ్మి, నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడ దేవునియందు నిరీ[క్షించుచున్నాను].”—అపొస్తలుల కార్యములు 24:14, 15.

కాబట్టి లక్షలాదిమంది ఇప్పటి పరిస్థితులకు చాలా భిన్నంగా ఉండే పరిస్థితుల్లో, తమ ప్రియమైన వారిని ఈ భూమిపై మళ్ళీ సజీవంగా చూసే దృఢమైన నిరీక్షణతో ఉండవచ్చు. ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి? చనిపోయిన మన ప్రియమైన వారికున్న బైబిలు ఆధారిత నిరీక్షణ గురించిన ఇతర వివరాలు, ఈ బ్రోషుర్‌లోని “చనిపోయిన వారికిగల నిశ్చయమైన నిరీక్షణ” అనే చివరి అధ్యాయంలో పరిశీలించబడతాయి.

మీరు మీ ప్రియమైనవారిని పోగొట్టుకొని దుఃఖిస్తున్నట్లయితే మీకు రాగల సందేహాలను మనం మొదట పరిశీలిద్దాం: ఈ విధంగా దుఃఖించడం సహజమేనా? ఈ దుఃఖంతో నేనెలా జీవించగలను? దుఃఖాన్ని సహించడానికి నాకు ఇతరులు ఎలా సహాయపడగలరు? దుఃఖిస్తున్న ఇతరులకు నేనెలా సహాయపడగలను? ప్రాముఖ్యంగా, చనిపోయినవారికిగల ఖచ్చితమైన నిరీక్షణ గురించి బైబిలేమి చెబుతోంది? చనిపోయిన నా ప్రియమైనవారిని నేను మళ్ళీ ఎప్పుడైనా చూస్తానా? ఎక్కడ చూస్తాను?