సమూయేలు రెండో గ్రంథం 4:1-12

  • ఇష్బోషెతు హత్య (1-8)

  • ఆ హంతకుల్ని దావీదు చంపించడం (9-12)

4  అబ్నేరు హెబ్రోనులో చనిపోయాడని+ సౌలు కుమారుడు ఇష్బోషెతు*+ విన్నప్పుడు, అతను ఎంతో భయపడ్డాడు,* ఇశ్రాయేలీయులు అందరూ ఎంతో ఆందోళనపడ్డారు.  సౌలు కుమారునికి చెందిన దోపిడీ ముఠాలకు ఇద్దరు నాయకులు ఉండేవాళ్లు: ఒకతని పేరు బయనా, ఇంకొకతని పేరు రేకాబు. వాళ్లు బెన్యామీను గోత్రానికి చెందిన బెయేరోతీయుడైన రిమ్మోను కుమారులు. (బెయేరోతును+ కూడా బెన్యామీనులో ఒక భాగంగా పరిగణించేవాళ్లు.  బెయేరోతీయులు గిత్తయీముకు+ పారిపోయారు. వాళ్లు ఈ రోజు వరకు అక్కడ పరదేశులుగా నివసిస్తున్నారు.)  సౌలు కుమారుడైన యోనాతానుకు+ కుంటివాడైన ఒక కుమారుడు ఉన్నాడు.+ సౌలు, యోనాతాను చనిపోయారనే వార్త యెజ్రెయేలు+ నుండి వచ్చినప్పుడు అతనికి ఐదేళ్లు. అప్పుడు అతని దాది అతన్ని ఎత్తుకొని పారిపోయింది. కానీ ఆమె అలా భయంతో పారిపోతున్నప్పుడు అతను కింద పడిపోయి కుంటివాడయ్యాడు. అతని పేరు మెఫీబోషెతు.+  బెయేరోతీయుడైన రిమ్మోను కుమారులు రేకాబు, బయనా బాగా ఎండకాస్తున్న సమయంలో ఇష్బోషెతు ఇంటికి వెళ్లారు. అతను మధ్యాహ్నం పూట విశ్రాంతి తీసుకుంటున్నాడు.  వాళ్లు గోధుమలు తెస్తున్నట్టు నటిస్తూ ఇంట్లోకి వెళ్లి అతన్ని పొత్తికడుపులో కత్తితో పొడిచారు; తర్వాత రేకాబు, అతని సహోదరుడు బయనా+ అక్కడి నుండి పారిపోయారు.  వాళ్లు ఇష్బోషెతు ఇంట్లోకి వెళ్లినప్పుడు, అతను తన పడకగదిలో మంచంమీద పడుకొని ఉన్నాడు. వాళ్లు అతన్ని పొడిచి చంపారు. తర్వాత వాళ్లు అతని తల నరికారు. వాళ్లు అతని తలను తీసుకొని అరాబాకు వెళ్లే దారిలో రాత్రంతా నడిచారు.  వాళ్లు అతని+ తలను హెబ్రోనులో ఉన్న దావీదు రాజు దగ్గరికి తీసుకొచ్చి, “నీ ప్రాణం తీయాలని చూసిన+ నీ శత్రువైన సౌలు+ కుమారుడు ఇష్బోషెతు తల ఇదిగో. ఈ రోజు యెహోవా మా ప్రభువైన రాజు కోసం సౌలు మీద, అతని వంశస్థుల మీద పగతీర్చుకున్నాడు” అన్నారు.  అయితే, దావీదు బెయేరోతీయుడైన రిమ్మోను కుమారులతో అంటే రేకాబుతో, అతని సహోదరుడైన బయనాతో ఇలా అన్నాడు: “కష్టాలన్నిట్లో నుండి నన్ను రక్షించిన* యెహోవా+ జీవం తోడు, 10  ఒకతను వచ్చి, ‘సౌలు చనిపోయాడు’+ అని నాకు చెప్పినప్పుడు, అతను నాకు మంచివార్త తెస్తున్నానని అనుకున్నాడు. కానీ నేను అతన్ని పట్టుకొని సిక్లగులో చంపాను.+ అదే ఆ సందేశకుడికి నేను ఇచ్చిన బహుమానం! 11  అలాంటిది దుష్టులు ఒక నీతిమంతుణ్ణి అతని ఇంట్లోనే అతని మంచం మీద చంపినందుకు నేను వాళ్లను ఇంకెంత ఎక్కువగా శిక్షించాలి! నేను అతని రక్తానికి మిమ్మల్ని బాధ్యులుగా చేసి+ మిమ్మల్ని భూమ్మీద లేకుండా చేయొద్దా?” 12  వాళ్లను చంపమని దావీదు తన యువకులకు ఆజ్ఞాపించాడు.+ ఆ యువకులు వాళ్ల చేతుల్ని, పాదాల్ని నరికి వాళ్ల శవాల్ని హెబ్రోనులోని కోనేరు దగ్గర వేలాడదీశారు,+ అయితే ఇష్బోషెతు తలను మాత్రం తీసుకెళ్లి హెబ్రోనులోని అబ్నేరు సమాధిలో పాతిపెట్టారు.

అధస్సూచీలు

అక్ష., “సౌలు కుమారుడు.”
అక్ష., “అతని చేతులు బలహీనపడ్డాయి.”
లేదా “విడిపించిన.”