కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

Manuel Reino Berengui/DeFodi Images via Getty Images

అప్రమత్తంగా ఉండండి!

ప్రపంచ కప్‌—నిజంగా ప్రజల్ని ఐక్యం చేసే శక్తి దానికి ఉందా? . . . బైబిలు ఏం చెప్తోంది?

ప్రపంచ కప్‌—నిజంగా ప్రజల్ని ఐక్యం చేసే శక్తి దానికి ఉందా? . . . బైబిలు ఏం చెప్తోంది?

 2022లో నవంబరు 20 నుండి డిసెంబరు 18 మధ్య వారాల్లో భూవ్యాప్తంగా 500 కోట్ల కన్నా ఎక్కువమంది FIFA ప్రపంచ కప్‌ వేడుకని చూశారని అంచనా. ఇలాంటి ప్రపంచ కప్‌ వేడుకలను చూస్తున్నంతసేపూ ప్రజలు ఐక్యంగా ఉండడమే కాదు, నిజానికి వాళ్లందరి మధ్యున్న సరిహద్దుల్ని అవి చెరిపేస్తాయని చాలామంది అనుకుంటారు.

  •    “క్రీడలకు ఎంత శక్తి ఉందంటే అవి ప్రపంచాన్ని మార్చగలవు. ఏదో సాధించాలనే తపనను ప్రజల్లో పెంచగలవు. కనీవినీ ఎరగని స్థాయిలో ప్రజల్ని ఐక్యం చేయగలవు.”—దక్షిణ ఆఫ్రికా మాజీ ప్రెసిడెంట్‌, నెల్సన్‌ మండేలా.

  •    ‘ఫుట్‌బాల్‌ అందరిలో ఒకేలాంటి ఆశను నింపుతుంది. ఒకేలాంటి సంతోషాన్ని, ఒకేలాంటి పట్టుదలను నింపుతుంది. దీనివల్ల ప్రజలకు ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. అంతేకాదు, దేశాలు భాషలు వేరైనా ఒకేలాంటి అభిరుచుల్ని కలిగిస్తుంది.’—FIFA అధ్యక్షుడు జాన్నీ ఇన్‌ఫంటీనో. a

 ప్రపంచ కప్‌ గానీ ఇలాంటి ఆటల పోటీలు గానీ నిజంగానే, ఎవరెస్టు పర్వతంలా కనిపించేంత గొప్ప లక్ష్యాల్ని సాధించి పెట్టగలవా? భవిష్యత్తులో ఇలాంటి క్రీడలు ప్రపంచ శాంతిని, ఐక్యతని సాధిస్తాయని ఆశ పెట్టుకోగలమా?

ప్రపంచ కప్‌ నిజంగానే ప్రపంచాన్ని ఐక్యం చేస్తుందా?

 ఈ సంవత్సరం జరిగిన ప్రపంచ కప్‌ మాత్రం ఉత్తి ఫుట్‌బాల్‌ ఆట కాదు. అది మానవ హక్కులు, జాతి వివక్ష, బీద-ధనిక వర్గభేదాలు వంటి సామాజిక విషయాల్లో, రాజకీయ విషయాల్లో ఒకింత అలజడిని రేపింది.

 ఏది ఎలా ఉన్నా, చాలామంది దృష్టిలో ప్రపంచ కప్‌ అంటే ప్రపంచమంతా సంబరాలే. కాకపోతే, ఇలాంటి వేడుకలు ప్రజలు అనుకున్నంత స్థాయిలో శాశ్వతమైన ఐక్యతను తీసుకురాలేవు. ఎక్కువసార్లు, ఇలాంటి వేడుకలు జరిగినప్పుడు మనకు కనిపించేది ఏంటంటే ఆయా దేశ ప్రజల మధ్యున్న ఐక్యత కాదు, వాళ్ల మధ్యున్న అగాధం. ఈ పరిస్థితులు ఉండే కాలాన్నే బైబిలు ‘చివరి రోజులు’ అని పిలుస్తుంది.—2 తిమోతి 3:1-5.

ప్రపంచ ఐక్యతకు ఆశా కిరణం

 బైబిలు ప్రపంచ ఐక్యతకు సంబంధించి మనలో ఆశను నింపుతుంది. ఒక పరలోక ప్రభుత్వం కింద భూమంతా ఐక్యమౌతుందని అది మాటిస్తోంది. ఆ ప్రభుత్వాన్ని బైబిలు “దేవుని రాజ్యం” అని పిలుస్తుంది.—లూకా 4:43; మత్తయి 6:10.

 ఆ రాజ్యానికి రాజైన యేసుక్రీస్తు, త్వరలోనే ప్రపంచ శాంతికి శ్రీకారం చుడతాడు. ఆ కాలంలో ఉండే పరిస్థితి గురించి బైబిలు ఇలా చెప్తుంది:

  •   “నీతిమంతులు వర్ధిల్లుతారు, . . . శాంతి విస్తరిస్తుంది.”—కీర్తన 72:7.

  •   “సహాయం కోసం మొరపెట్టే పేదవాళ్లను, . . . ఆయన రక్షిస్తాడు. . . . అణచివేత నుండి, దౌర్జన్యం నుండి ఆయన వాళ్లను రక్షిస్తాడు.”—కీర్తన 72:12, 14.

 నిజం చెప్పాలంటే, ఇప్పటికే 239 దేశాల్లో ఉన్న లక్షలాదిమంది ప్రజల జీవితాల్లో యేసు బోధలు ఐక్యతను చిగురింపజేశాయి. వాళ్లందరూ ద్వేషం తాలూకు మరకల్ని తుడిచేసుకున్నారు. దీని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి “ద్వేషమనే విషచక్రం నుండి బయటపడదాం” అనే అంశం కిందున్న ఆర్టికల్స్‌ చూడండి.

a Fédération Internationale de Football Association, ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ని చూసుకుంటున్న అంతర్జాతీయ బోర్డు.