కంటెంట్‌కు వెళ్లు

అమెజాన్‌ అడవుల్లో కొత్త అసెంబ్లీ హాలు

అమెజాన్‌ అడవుల్లో కొత్త అసెంబ్లీ హాలు

అమెజాన్‌ అడవి నడి మధ్యలో యెహోవాసాక్షులు ఓ అందమైన కొత్త అసెంబ్లీ హాలును కట్టారు. బ్రెజిల్‌లోని మానాస్‌ పట్టణానికి ఉత్తరాన ఉన్న 52 హెక్టార్ల స్థలంలో ఎక్కువ శాతం అడవే ఉంటుంది. కాపుకు, మెజెస్టిక్‌ బ్రెజిల్‌ నట్‌, ఏంజిలిమ్‌ పెడ్రా వంటి చెట్ల అంచుల నుండి రంగురంగుల మకావ్‌, టౌకన్‌లాంటి ఇతర పక్షుల కిలకిలరావాలు మనకు వినిపిస్తూ ఉంటాయి. మరి అలాంటి చోట అసెంబ్లీ హాలు ఎందుకు కట్టారు?

అమెజాన్‌ నది నుండి 1,450 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానాస్‌ నగరంలో దాదాపు ఇరవై లక్షల జనాభా ఉంది. కొత్తగా కట్టిన హాలు, మానాస్‌-దాని చుట్టు ప్రక్కల ప్రాంతాలతోపాటు అమెజాన్‌ నది-దాని ఉపనదుల గుండా ఉన్న ఊర్ల నుండి వచ్చే దాదాపు 7,000 మంది సాక్షులకు సరిపోతుంది. మానాస్‌కు పడమర వైపున 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న సావొ గేబ్రియల్‌ డ కష్‌వార అనే పట్టణంలో ఉన్న సహోదరసహోదరీల్లో కొంతమంది, ఈ కొత్త హాలులో జరిగే అసెంబ్లీలకు లేదా సమావేశాలకు హాజరుకావడానికి పడవలో మూడు రోజులు ప్రయాణించి వస్తారు.

అమెజాన్‌ అడవి మధ్యలో అసెంబ్లీ హాలు కట్టడం అనేది చాలా కష్టమైన పని. ఇక్కడ నిర్మాణ పనికి కావాల్సిన సామాగ్రినంతటినీ 13 కంటెయినర్లలో సౌ పావ్లోలోని సాంటొస్‌లో ఉన్న ఓడ రేవు నుండి బ్రెజిల్‌ తీరం గుండా అమెజాన్‌ నది ద్వారా నిర్మాణ పని జరుగుతున్న స్థలానికి తీసుకురావాల్సి వచ్చింది.

ఈ కొత్త హాలు బ్రెజిల్‌లో నిర్మించబడిన 27వ అసెంబ్లీ హాలు. 2014, మే 4న జరిగిన ఈ హాలు సమర్పణా కార్యక్రమానికి 1,956 మంది వచ్చారు. వాళ్లలో చాలామంది అసెంబ్లీ హాలులో జరిగే మీటింగ్‌కు హాజరవ్వడం అదే మొదటిసారి, దాంతో వాళ్లు చాలా సంతోషించారు.

అక్కడ హాజరైనవాళ్లు ప్రసంగీకుని మాటల్ని వినడమేకాదు ప్రసంగీకుడిని కూడా చూడగలుగుతున్నారు. ఇంతకుముందు అయితే అసెంబ్లీలను, సమావేశాలను బహిరంగ ప్రదేశాల్లో జరిపేవాళ్లు, అక్కడికి వచ్చిన చాలామందికి స్టేజీగానీ ప్రసంగీకుడుగానీ కనిపించేదికాదు. ఒక సహోదరుడు ఇలా చెప్పాడు, నేను చాలా ఏళ్లుగా సమావేశాలకు హాజరౌతున్నానుగానీ, ఎప్పుడూ బైబిలు డ్రామా కనిపించేదికాదు, కేవలం మాటలే వినిపించేవి. కానీ ఇప్పుడు అందరికీ స్టేజి చక్కగా కనిపిస్తోంది.