కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన భూమికి ఏమౌతుంది?

గాలి

గాలి

మనందరికీ గాలి అవసరం. ఊపిరి పీల్చుకోవడానికే కాదు, గాలి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సూర్యుని నుండి వచ్చే హానికరమైన రేడియేషన్‌ నుండి ఒక గొడుగులా గాలి మన భూమిని రక్షిస్తుంది. గాలి లేకపోతే ప్రపంచంలో అన్ని చోట్లా ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కన్నా తక్కువకు పడిపోతాయి.

గాలికి పొంచివున్న ముప్పు

అంతకంతకూ పెరిగిపోతున్న గాలి కాలుష్యం వల్ల భూమ్మీదున్న ప్రాణులకు పెద్ద ముప్పే పొంచివుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, మొత్తం ప్రపంచ జనాభాలో కేవలం ఒక్క శాతం మంది మాత్రమే సురక్షితమైన గాలిని పీల్చుకుంటున్నారు.

కలుషితమైన గాలిని పీల్చడం వల్ల శ్వాస సంబంధిత జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, గుండె జబ్బులు వస్తున్నాయి. ప్రతీ సంవత్సరం, గాలి కాలుష్యం వల్ల వయసు నిండకుండానే సుమారు 70,00,000 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

మన భూమి ఎప్పటికీ ఉండేలా చేయబడింది

ఊపిరి పీల్చుకునే ప్రాణులన్నిటికీ అవసరమయ్యే ఆరోగ్యకరమైన గాలిని నిరంతరం అందించే సహజ సామర్థ్యం మన భూమికి ఉంది. మనుషులు వాతావరణాన్ని కలుషితం చేయడం తగ్గిస్తేనే ప్రకృతిలోని ఈ సహజ ప్రక్రియలు సజావుగా పనిచేస్తాయి. ఈ ఉదాహరణలు గమనించండి:

  • అడవులు గాలిలోని కార్బన్‌డైయాక్సైడ్‌ పీల్చుకుంటాయని మనందరికీ తెలిసిందే. అయితే చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. అదేంటంటే, తీర ప్రాంతాల్లోని చిత్తడి నేలల్లో పెరిగే మడ అడవులకు (mangroves) ఒక ప్రత్యేకమైన సామర్థ్యం ఉంది. మడ అడవులు మిగతా అడవులు పీల్చుకునే దానికన్నా ఐదు రెట్లు ఎక్కువ కార్బన్‌డైయాక్సైడ్‌ని పీల్చుకుంటాయి!

  • కెల్ప్‌ అని పిలిచే ఒక రకమైన సముద్రపు నాచు పెద్ద సైజులో ఉంటుంది; ఇది శైవలాల (algae) జాతికి చెందినది. ఈ మధ్య కాలంలో ఈ సముద్రపు నాచు మీద కొన్ని పరిశోధనలు చేశారు. వాతావరణంలో కార్బన్‌డైయాక్సైడ్‌ను లేకుండా చేసే ప్రత్యేకమైన గుణం దీనికి ఉందని కనుక్కున్నారు. అదెలా అంటారా? ఈ సముద్రపు నాచులో గాలి బుడగలు ఉండడం వల్ల, అది చాలా దూరం నీటిలో తేలుతూ వెళ్తుంది. తీరానికి దూరంగా కొట్టుకుపోయాక ఆ గాలి బుడగలు పగిలిపోతాయి. దాంతో, కార్బన్‌డైయాక్సైడ్‌తో నిండిన నాచు సముద్రం అడుగు భాగానికి మునిగిపోయి అక్కడే కొన్ని వందల ఏళ్లు ఉండిపోతుంది.

  • కాలుష్యం తగ్గితే వాతావరణం మళ్లీ దానంతటదే ఆరోగ్యకరంగా మారుతుందని కోవిడ్‌ లాక్‌డౌన్‌ రుజువు చేసింది. 2020​లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, వాహనాలు కూడా ఇళ్లు దాటి బయటికి రాలేదని అందరికీ తెలుసు. దాంతో కొన్ని రోజులకే గాలిలో కాలుష్యం తగ్గిపోయింది! లాక్‌డౌన్‌ అమలైన కొంతకాలానికే గాలి చాలా స్వచ్ఛంగా మారిందని 80 శాతం కన్నా ఎక్కువ దేశాలు గుర్తించినట్లు ఒక ప్రపంచ రిపోర్టు తెలియజేసింది.

సంరక్షణ చర్యలు

సైకిల్‌ని వాడితే గాలి కాలుష్యాన్ని తగ్గించవచ్చు

గాలి కాలుష్యాన్ని తగ్గించమని ప్రభుత్వాలు పరిశ్రమలకు పదేపదే గుర్తుచేస్తూనే ఉన్నాయి. కాలుష్యం వల్ల జరిగిన నష్టాన్నంతా తీసేయడానికి సైంటిస్టులు కూడా కొత్తకొత్త పద్ధతుల్ని కనుక్కుంటున్నారు. వాటిలో ఒక పద్ధతి ఏంటంటే, సూక్ష్మజీవుల్ని ఉపయోగించి కాలుష్యానికి కారణమయ్యే వాటిని హాని కలిగించని పదార్థాలుగా మారుస్తున్నారు. అంతేకాదు ఇంట్లో తక్కువ వనరులతో జీవించడం అలవాటు చేసుకోమని, ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే కారు, బైక్‌ మీద కాకుండా సైకిల్‌ మీదో, నడిచో వెళ్లమని నిపుణులు సలహా ఇస్తున్నారు.

గాలి కాలుష్యాన్ని అరికట్టడం కోసం కొన్ని ప్రభుత్వాలు ప్రజలకు స్టవ్‌లను పంచిపెడుతున్నాయి. కానీ ఇంకా చాలామందికి అవి అందుబాటులో లేవు

అయితే అవి మాత్రమే సరిపోవని 2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఒక రిపోర్టులో చెప్పాయి.

ఆ రిపోర్టు ప్రకారం, ఒక్క 2020 సంవత్సరంలోనే ప్రపంచంలోని మూడో వంతు జనాభా గాలి కాలుష్యానికి కారణమయ్యే వాటితో వంట చేసుకున్నారట! చాలా ప్రాంతాల్లో కొద్దిమందికే కొత్త స్టవ్‌లు, కాలుష్యం కలిగించని ఇంధనాలు కొనుక్కునే స్తోమత ఉంది.

ఒక తీపి కబురు—బైబిల్లో ఇలా ఉంది

“యెహోవాయే సత్యదేవుడు, ఆయనే ఆకాశాన్ని సృష్టించాడు. . . . ఆయనే భూమిని, దాని పంటను పరిచాడు. దానిమీదున్న ప్రజలకు ఊపిరిని, దానిలో నడిచేవాళ్లకు జీవశక్తిని ఇస్తున్నది ఆయనే.”—యెషయా 42:5.

మనం పీల్చుకునే గాలిని, దాన్ని స్వచ్ఛంగా మార్చే ప్రకృతి చక్రాల్ని దేవుడే చేశాడు. ఆయనకు అపారమైన శక్తితోపాటు, మనుషుల మీద అంతులేని ప్రేమ కూడా ఉంది. అలాంటి ఆయన గాలి కాలుష్యాన్ని మటుమాయం చేయడానికి ఏమీ చేయడంటారా? “మన భూమి ఎప్పటికీ ఉంటుందని దేవుడు మాటిస్తున్నాడు” ఆర్టికల్‌ చూడండి.