కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రిబ్కా కష్టపడి పనిచేసే దైవభక్తిగల స్త్రీ

రిబ్కా కష్టపడి పనిచేసే దైవభక్తిగల స్త్రీ

రిబ్కా కష్టపడి పనిచేసే దైవభక్తిగల స్త్రీ

మీ కుమారునికి మీరే ఒక భార్యను చూడాలనుకోండి. మీరు ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటారు? ఆమెకు ఎలాంటి లక్షణాలుండాలి? అందమైన, తెలివిగల, దయగల, కష్టపడే అమ్మాయి కోసం చూస్తారా? లేక మొదట మరితర లక్షణాల కోసం చూస్తారా?

అబ్రాహాముకు ఈ పరిస్థితే ఎదురైంది. తన కుమారుడైన ఇస్సాకు ద్వారా తన సంతానానికి ఆశీర్వాదాల వెల్లువ వస్తుందని యెహోవా వాగ్దానం చేశాడు. ఆ వృత్తాంతాన్ని మనం పరిశీలిస్తే, అప్పటికి అబ్రాహాము వృద్ధుడైపోగా, ఆయన కుమారుడు ఇంకా అవివాహితునిగానే ఉన్నట్లు మనం చూస్తాం. (ఆదికాండము 12:1-3, 7; 17:19; 22:17, 18; 24:⁠1) ఇంకా తనకు దొరకని భార్యతో, వారికి కలుగబోయే సంతానంతో ఇస్సాకు ఆ ఆశీర్వాదాలు పంచుకోవాలి కాబట్టి, అబ్రాహాము ఇస్సాకుకు తగిన భార్యను అన్వేషించే ఏర్పాటు చేశాడు. అన్నింటికంటే మిన్నగా ఆమె యెహోవా సేవకురాలై ఉండాలి. అబ్రాహాము నివసిస్తున్న కనాను దేశంలో అలాంటి స్త్రీ దొరకడం దుర్లభం, అందుకని ఆయన మరెక్కడో వెతకాలి. చివరికి రిబ్కా ఎంపిక చేయబడింది. ఆమె వారికెలా దొరికింది? ఆమె ఆధ్యాత్మికతగల స్త్రీయేనా? ఆమె మాదిరిని పరిశీలించడం ద్వారా మనమేమి నేర్చుకోవచ్చు?

తగిన స్త్రీ కోసం అన్వేషణ

యెహోవా ఆరాధకులైన తన బంధువుల్లో నుండి ఇస్సాకుకు భార్యను తీసుకురావడానికి అబ్రాహాము తన ఇంటిలో ఎంతోకాలంగా పనిచేస్తున్న దాసుణ్ణి, అనగా బహుశా ఎలీయెజెరును మెసొపొతమియకు పంపిస్తాడు. ఆ విషయమెంత గంభీరమైనదంటే అతడు ఇస్సాకు కోసం కనానీయ స్త్రీని తీసుకురాకుండా ఉండేలా ఎలీయెజెరుచేత ప్రమాణం చేయించబడింది. ఈ విషయమై అబ్రాహాముకున్న పట్టుదల గమనార్హం.​—⁠ఆదికాండము 24:2-10.

అబ్రాహాము బంధువుల పట్టణానికి ప్రయాణమై వెళ్లిన తర్వాత ఎలీయెజెరు తన ఒంటెలను ఒక బావి దగ్గరకు తీసుకొనివెళ్ళాడు. ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి! అది సాయంకాల సమయం, ఎలీయెజెరు ఇలా ప్రార్థించాడు: “చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊటయొద్ద నిలుచుచున్నాను; ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి—నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా—నీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని యే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకుకొరకు నీవు నియమించినదై యుండునుగాక.”​—⁠ఆదికాండము 24:​13, 14.

దప్పికతో ఉన్న ఒంటె చాలా నీళ్లు (దాదాపు 100 లీటర్లు) త్రాగుతుందనే విషయం స్థానిక స్త్రీలందరికీ బహుశా తెలిసే ఉంటుంది. అందువల్ల పది ఒంటెలకు నీళ్లు పెడతానని చెప్పే స్త్రీ కష్టపడి పనిచేయడానికి సుముఖురాలై ఉండాలి. ఇతరుల సహాయం లేకుండా అలా చూస్తుండగా ఆమె అలా నీళ్లు పెట్టడం ఆమె శక్తికి, ఓపికకు, వినయానికి అలాగే మనుష్యులపట్ల, జంతువులపట్ల ఆమెకున్న దయార్ధ్ర హృదయానికి ఖచ్చితమైన రుజువుగా ఉంటుంది.

ఆ తర్వాత ఏమి జరిగింది? “అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొనివచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది; ఆమె కన్యక; . . . ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని యెక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి—నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను. అందుకామె—అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను.”​—⁠ఆదికాండము 24:15-18.

రిబ్కా తగినదేనా?

రిబ్కా అబ్రాహాముకు వరుసకు మనవరాలు, పైగా ఆమె సౌందర్యవతి, శీలవతి. ఆమె కొత్తవారితో మాట్లాడ్డానికి జంకలేదు లేదా అతి చొరవ చూపలేదు. తనకు దాహమిమ్మని ఎలీయెజెరు అడిగినప్పుడు, ఆమె అతనికి నీళ్లిచ్చింది. అది మామూలు మర్యాద కాబట్టి, ఆమె అలా చేయడం ఆశించదగ్గదే. అయితే పరీక్షలోని రెండవ భాగం మాటేమిటి?

రిబ్కా ఇలా అంది: “అయ్యా త్రాగుము.” అయితే ఆమె అంతటితోనే ఆగిపోలేదు. రిబ్కా ఇంకా ఇలా అంది: “నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేదిపోయుదును.” సాధారణంగా ఆశించిన దానికంటే ఎక్కువే చేయడానికి ఆమె ముందుకొచ్చింది. ఇష్టపూర్వకంగా ఆమె “త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేదిపోసెను.” ఆమె బహు కార్యశీలి. ఆ సమయమంతటిలో ఆశ్చర్యంతో ‘ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచుచుండెను’ అని ఆ వృత్తాంతం తెలియజేస్తోంది.​—⁠ఆదికాండము 24:19-21.

ఆ యౌవనురాలు అబ్రాహాముకు బంధువని తెలిసినప్పుడు, ఎలీయెజెరు సాగిలపడి యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేశాడు. తను, తనతోవున్న వారు ఆ రాత్రి బసచేయడానికి ఆమె తండ్రియింట స్థలమున్నదా అని ఆయన విచారణ చేశాడు. దానికి రిబ్కా సానుకూలంగా ప్రతిస్పందించి, ఆ సందర్శకుల వార్త తెలియజేయడానికి ఇంటికి పరుగెత్తుతుంది.​—⁠ఆదికాండము 24:22-28.

ఎలీయెజెరు చెప్పినదంతా విన్న తర్వాత, రిబ్కా సోదరుడైన లాబాను, ఆమె తండ్రి బెతూయేలు ఇదంతా దేవుని మార్గదర్శకత్వమనే విషయాన్ని గ్రహించారు. అవును, రిబ్కా ఇస్సాకు కోసం ఎంపిక చేయబడింది. వారు “ఆమెను తీసికొని పొమ్ము; యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చిరి.” రిబ్కా ఎలా భావించింది? వెంటనే బయల్దేరడం తనకు ఇష్టమేనా అని రిబ్కాను అడినప్పుడు దానికామె హీబ్రూ భాషలో “వెళ్లెదను” అని అర్థమిచ్చే ఒకే మాటతో జవాబిచ్చింది. ఈ ప్రతిపాదనను అంగీకరించడానికి ఆమె ఒత్తిడి చేయబడలేదు. ఆమెనలా ఒత్తిడి చేసే అవసరమే లేదు ఎందుకంటే “నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని యెడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు” అని అబ్రాహాము ఎలీయెజెరుకు చెప్పాడు. అయితే రిబ్కా కూడా ఈ విషయంలో దేవుని మార్గనిర్దేశత్వాన్ని చూసింది. అందువల్ల, ఆలస్యం చేయకుండా ఆమె తనెన్నడూ చూడని పురుషుణ్ణి వివాహం చేసుకోవడానికి తన కుటుంబాన్ని వదిలి వచ్చేసింది. ఆ ధైర్యవంతమైన నిర్ణయం ఆమె అసాధారణ విశ్వాసాన్ని ప్రదర్శించింది. నిజంగా ఆమెను ఎన్నుకోవడం సరైన నిర్ణయమే!​—⁠ఆదికాండము 24:​29-59.

ఇస్సాకును కలుసుకున్నప్పుడు, విధేయతకు గుర్తుగా రిబ్కా ముసుగు వేసికొంది. ఇస్సాకు ఆమెను భార్యగా పరిగ్రహించాడు, ఆమె చక్కని లక్షణాలనుబట్టి ఇస్సాకు ఆమెను ప్రేమించడం ప్రారంభించాడనడంలో సందేహం లేదు.​—⁠ఆదికాండము 24:62-67.

కవల పిల్లలు

రిబ్కా 19 సంవత్సరాలపాటు పిల్లలు లేకుండా ఉంది. చివరికామె కవల పిల్లలతో గర్భం ధరించింది, అయితే ఆ శిశువులు గర్భంలో పెనుగులాడుతూ ఆమెకెంతో కష్టం కలిగించడంతో ఆమె ఈ విషయమై దేవునికి ప్రార్థించింది. జీవితంలో మనకు గొప్ప విపత్తు ఎదురైనప్పుడు మనం కూడా అదే ప్రకారం చేయవచ్చు. యెహోవా రిబ్కా ప్రార్థన ఆలకించి ఆమెను ఓదారుస్తాడు. ఆమె రెండు జనాంగాలకు తల్లి అవుతుంది, కాగా ‘పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు.’​—⁠ఆదికాండము 25:20-26.

రిబ్కా తన చిన్న కుమారుడైన యాకోబును ఎక్కువగా ప్రేమించడానికి కేవలం ఆ మాటలే కారణం కాకపోవచ్చు. ఆ బాలురిద్దరూ విభిన్నంగా ఉన్నారు. యాకోబు ‘సాధువుగా [‘అనింద్యునిగా,’ NW]’ ఉండగా, ఏశావు ఆధ్యాత్మిక విషయాలను అంతగా పట్టించుకోలేదు. అతనిలో ఆ స్వభావపు ప్రభావం ఎంతగా ఉందంటే, అతడు కేవలం ఒకపూట భోజనం కోసం తన జ్యేష్ఠత్వాన్ని అంటే దేవుని వాగ్దానాలను అనుభవించే తన హక్కును యాకోబుకు అమ్మివేశాడు. ఏశావు ఇద్దరు హిత్తీయ స్త్రీలను వివాహం చేసుకోవడం ఆధ్యాత్మిక విలువలపట్ల తృణీకార స్వభావం కాకపోయినా అతనికున్న నిర్లక్ష్యాన్ని చూపిస్తోంది, అది అతని తల్లిదండ్రులకు తీవ్ర మనోవేదన కలుగజేసింది.​—⁠ఆదికాండము 25:27-34; 26:34, 35.

యాకోబుకు ఆశీర్వాదాలు దక్కేలా చేయడం

ఏశావు యాకోబుకు దాసుడవుతాడనే సంగతి ఇస్సాకుకు తెలుసో లేదో బైబిలు చెప్పడం లేదు. ఏదేమైనా, ఆశీర్వాదం యాకోబుకు దక్కాలనే విషయం అటు రిబ్కాకు ఇటు యాకోబుకు తెలుసు. వేట మాంసంతో భోజ్యములు సిద్ధపరచినప్పుడు ఏశావును ఇస్సాకు ఆశీర్వదించాలనుకుంటున్నాడని విన్నప్పుడు రిబ్కా వెంటనే తగిన చర్య తీసుకుంది. యౌవనం నుండి ఆమెలో ఉన్న ఆ నిర్ణయాత్మక స్వభావం, ఆసక్తి ఆమెలో ఏ మాత్రం సన్నగిల్లలేదు. రెండు మేక పిల్లల్ని తీసుకొనిరమ్మని ఆమె యాకోబుకు ‘ఆజ్ఞాపించింది.’ ఆ పిమ్మట ఆమె తన భర్తకు ఇష్టమైన రీతిలో భోజనం సిద్ధంచేసింది. ఆ తర్వాత ఆశీర్వాదం పొందడానికి యాకోబు ఏశావులా నటించాలి. అయితే యాకోబు దానికి అభ్యంతరం చెబుతాడు. అతని తండ్రి ఆ వంచన పసిగట్టి అతణ్ణి శపిస్తాడేమో! కానీ రిబ్కా పట్టుబట్టి, “ఆ శాపము నామీదికి వచ్చును గాక” అని అంటుంది. ఆ తర్వాత ఆమె భోజనం సిద్ధంచేసి, యాకోబుకు ఏశావు వేషం ధరింపజేసి అతణ్ణి తన భర్తదగ్గరకు పంపిస్తుంది.​—⁠ఆదికాండము 27:1-17.

రిబ్కా ఎందుకు అలా చేసిందో చెప్పబడలేదు. చాలామంది ఆమె చేసిన చర్యను ఖండిస్తారు, అయితే బైబిలు దానిని ఖండించడంలేదు లేదా యాకోబు ఆ ఆశీర్వాదం పొందాడని తెలిసిన తర్వాత ఇస్సాకు కూడా ఆమె చేసిన దానిని ఖండించలేదు. బదులుగా, ఇస్సాకు ఆ ఆశీర్వాదాన్ని మరెక్కువ చేస్తాడు. (ఆదికాండము 27:29; 28:​3, 4) తన కుమారుల గురించి యెహోవా ముందే ఏమి చెప్పాడో రిబ్కాకు తెలుసు. అందువల్ల యాకోబుకు న్యాయంగా దక్కాల్సిన ఆశీర్వాదం అతనికే దక్కేలా రిబ్కా తగిన చర్య తీసుకుంది. ఇది స్పష్టంగా యెహోవా చిత్తానికి అనుగుణంగా ఉంది.​—⁠రోమీయులు 9:6-13.

యాకోబు హారానుకు పంపించబడడం

తన సోదరుని కోపం తగ్గేవరకు అక్కడనుండి పారిపోవల్సిందిగా యాకోబును బలవంతం చేయడం ద్వారా రిబ్కా ఏశావు ప్రయత్నాలను అడ్డగిస్తుంది. అలా పంపించడానికి ఆమె ఇస్సాకు అనుమతి కోరుతూ, అదే సమయంలో ఆమె వినయంగా ఏశావు కోపాన్ని గురించి ప్రస్తావించదు. బదులుగా, యాకోబు ఎప్పటికీ కనానీయ స్త్రీలను వివాహం చేసుకోకుండా ఉండాలనే తన చింతను ఆమె యుక్తిగా తన భర్తకు తెలియజేస్తుంది. అలాంటి వివాహానికి తావివ్వకుండా, దైవభక్తిగల భార్యను కనుగొనేందుకు రిబ్కా కుటుంబం దగ్గరకు వెళ్లాలని యాకోబును ఆదేశించేలా ఇస్సాకును ఒప్పించడానికి ఆ ఒక్క ఆలోచనే చాలు. రిబ్కా యాకోబును మళ్లీ చూసిందని ఎక్కడా వ్రాయబడలేదు, అయితే ఆమె చర్యలు భావి ఇశ్రాయేలు జనాంగానికి సమృద్ధిగా ప్రతిఫలాలు తెచ్చాయి.​—⁠ఆదికాండము 27:43-28:2.

రిబ్కా గురించి మనకు తెలిసింది ఆమెను మెచ్చుకోవడానికి మనల్ని పురికొల్పుతుంది. ఆమె చాలా అందంగా ఉండేది, అయితే ఆమె నిజ సౌందర్యం ఆమెకున్న దైవభక్తిలో ఉంది. అబ్రాహాము తన కోడలిలో చూడాలనుకున్నది అదే. ఆమెలోని ఇతర మంచి లక్షణాలు బహుశా అబ్రాహాము ఆశించిన వాటిని మించి ఇంకా ఎక్కువే ఉండవచ్చు. దైవిక నిర్దేశాన్ని అనుసరించడంలో ఆమెకున్న విశ్వాసం, ధైర్యం మరియు ఆసక్తి, నమ్రత, ఔదార్యంతో ఆతిథ్యమిచ్చే లక్షణాలు క్రైస్తవ స్త్రీలందరూ అనుకరించదగ్గవే. నిజంగా మాదిరికరంగా ఉన్న స్త్రీలల్లో యెహోవా ఈ లక్షణాలనే చూస్తాడు.