కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఆయన మీకు దొరుకుతాడు’

‘ఆయన మీకు దొరుకుతాడు’

దేవునికి దగ్గరవ్వండి

‘ఆయన మీకు దొరుకుతాడు’

1 దినవృత్తాంతములు 28:9,  విత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

దేవుని గురించి మీకు తెలుసా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులభం కాదు. దేవుని గురించి నిజంగా తెలుసుకోవాలంటే ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడో, ఎలా చేస్తాడో పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడు మనం ఆయనకు దగ్గరవుతాం, దాంతో మన జీవిత విధానం పూర్తిగా మారిపోతుంది. అయితే అలా దగ్గరవ్వడం నిజంగా సాధ్యమేనా? అలాగైతే, మనం ఆయనకు ఎలా దగ్గరవ్వచ్చు? వీటికి జవాబులు, రాజైన దావీదు తన కుమారుడైన సొలొమోనుకు చెప్పిన మాటల్లో తెలుసుకోవచ్చు. అవి 1 దినవృత్తాంతములు 28:9లో ఉన్నాయి.

ఈ దృశ్యాన్ని ఊహించుకోండి. దావీదు ఇశ్రాయేలీయుల్ని దాదాపు 40 ఏళ్లు పరిపాలించాడు, ఆయన పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. దావీదు తర్వాత రాజు కాబోయే సొలొమోను అప్పటికి చాలా చిన్నవాడు. (1 దినవృత్తాంతములు 29:1) బాగా వృద్ధుడైన దావీదు చివరిసారిగా తన కుమారుడికి ఎలాంటి ఉపదేశం ఇచ్చాడు?

దేవుణ్ణి ఆరాధించడంలో తనకున్న గొప్ప అనుభవంతో దావీదు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు, ‘సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుణ్ణి నువ్వు తెలుసుకో.’ దేవుని గురించి ఏవో కొన్ని వాస్తవాలు మాత్రమే కాదుగానీ అంతకన్నా ఎక్కువే తెలుసుకోవాలన్నది దావీదు ఉద్దేశం అయ్యుండవచ్చు. సొలొమోను అప్పటికే దావీదు దేవుడైన యెహోవాను ఆరాధిస్తున్నాడు. అప్పటికి హెబ్రీ లేఖనాల్లో దాదాపు మూడు వంతులు పూర్తయ్యాయి, ఈ పరిశుద్ధ లేఖనాలు దేవుని గురించి ఏమి చెబుతున్నాయో సొలొమోనుకు ఖచ్చితంగా తెలుసు. ఇక్కడ ‘తెలుసుకోవడం’ అని అనువదించబడిన హెబ్రీ పదం, “అత్యంత సన్నిహితంగా తెలుసుకోవడాన్ని” సూచిస్తుందని ఒక పండితుడు చెప్పాడు. దావీదు దేవునితో తనకున్న వ్యక్తిగత, దగ్గరి సంబంధాన్ని ఎంతో విలువైనదిగా ఎంచాడు, అందుకే ఆయన తన కుమారుడు కూడా అలాంటి సంబంధాన్ని ఏర్పర్చుకోవాలని కోరుకున్నాడు.

అలాంటి దగ్గరి సంబంధం సొలొమోను ఆలోచనా విధానాన్ని, జీవిత విధానాన్ని పూర్తిగా మార్చాలి. ‘మనసారా, హృదయపూర్వకంగా దేవుని సేవ చెయ్యి’ అని దావీదు తన కుమారుణ్ణి ప్రోత్సహించాడు. అయితే, దేవుని సేవ చేయమని చెప్పడం కన్నా ముందే దేవుని గురించి తెలుసుకోమని ఆయన చెప్పాడని గమనించండి. దేవుని గురించి నిజంగా తెలుసుకుంటే ఆయన సేవ చేయగలుగుతాం. అంతేకానీ మోసకరమైన మనస్సుతో సంకోచిస్తూ లేదా ద్విమనస్సుతో వేషధారణగా ఆయనను ఆరాధించకూడదు. (కీర్తన 12:2; 119:113) మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా దేవుని సేవ చేయమని దావీదు తన కుమారుణ్ణి వేడుకున్నాడు.

సరైన ఉద్దేశంతో, ఆలోచనతో ఆరాధించమని దావీదు తన కుమారుణ్ణి ఎందుకు వేడుకున్నాడు? దావీదు ఇలా వివరిస్తున్నాడు, ‘యెహోవా అందరి హృదయాలను పరిశోధిస్తాడు, ఆలోచనల్లో ఉన్న ఉద్దేశాలన్నిటినీ గ్రహిస్తాడు.’ సొలొమోను తన తండ్రియైన దావీదును సంతోషపెట్టడానికే దేవుణ్ణి ఆరాధించకూడదు. దేవుడు తనను మనస్ఫూర్తిగా ఆరాధించాలనుకునే వాళ్ల కోసం చూస్తున్నాడు.

సొలొమోను తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని యెహోవాకు దగ్గరవుతాడా? అది సొలొమోను ఇష్టం. దావీదు తన కుమారునికి ఇలా చెప్పాడు, ‘ఆయనను వెదికితే ఆయన నీకు దొరుకుతాడు. నువ్వు ఆయనను విడిచిపెడితే ఆయన నిన్ను శాశ్వతంగా విసర్జిస్తాడు.’ సొలొమోను యెహోవా దేవునికి ఇష్టమైన ఆరాధికుడిగా ఉండాలంటే ఆయన గురించి తెలుసుకోవడానికి ఎంతో కృషి చేయాలి. a

యెహోవా మనం తనకు దగ్గరవ్వాలని కోరుకుంటున్నాడని ఒక తండ్రిగా దావీదు చెప్పిన మాటలు హామీ ఇస్తున్నాయి. అయితే, మనం ఆయనకు దగ్గరవ్వాలంటే, ఆయనను సన్నిహితంగా తెలుసుకునేందుకు లేఖనాలను పరిశోధన చేస్తూ ‘ఆయనను వెదకాలి.’ ఆయన గురించి తెలుసుకున్నప్పుడు మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఆయన సేవ చేస్తాం. తనను ఆరాధించేవాళ్లు ఎవరైనా అలాగే సేవచేయాలని ఆయన కోరుకుంటున్నాడు, దానికి ఆయన అర్హుడు.—మత్తయి 22:37. (w10-E 11/01)

[అధస్సూచి]

a సొలొమోను హృదయపూర్వకంగా సేవ చేయడం మొదలుపెట్టినా చివరివరకు నమ్మకంగా ఉండలేదు.—1 రాజులు 11:4.