కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కృతజ్ఞతా స్ఫూర్తి చూపించడం మానకండి

కృతజ్ఞతా స్ఫూర్తి చూపించడం మానకండి

మూడవది

కృతజ్ఞతా స్ఫూర్తి చూపించడం మానకండి

దీని గురించి బైబిలు ఏమి చెబుతోంది? ‘ప్రతీ విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి.’—1 థెస్సలొనీకయులు 5:18.

దీన్ని పాటించడం ఎందుకు కష్టం? మన చుట్టూ ఉన్నవాళ్లు అహంకారులు, కృతజ్ఞతలేని వాళ్లు కాబట్టి మనం కూడా వాళ్లలా ప్రవర్తించే అవకాశం ఉంది. (2 తిమోతి 3:1, 2) దానికి తోడు, ఇప్పటికే బిజీగా ఉన్న మన జీవితాల్లో ఇంకా ఎక్కువ పనులను పెట్టుకోవాలని అనిపించవచ్చు. మన దగ్గర ఇప్పటికే ఉన్నవాటిని విలువైనవిగా ఎంచలేనంతగా లేదా వేరేవాళ్లు మన కోసం చేసిన వాటికి కృతజ్ఞత చూపించలేనంతగా మనం పనుల్లో మునిగిపోవచ్చు లేదా సమస్యలతో తలమునకలవుతుండవచ్చు.

మీరేమి చేయవచ్చు? మీరు ఇప్పుడు ఏ విషయాల వల్ల సంతోషంగా ఉన్నారో వాటి గురించి ఆలోచించడానికి సమయం తీసుకోండి. నిజమే, మీరు సమస్యలతో సతమతమవుతుండవచ్చు. అయితే రాజైన దావీదు ఉదాహరణే తీసుకోండి. ఆయనకు ఎదురైన కష్టాల వల్ల కొన్నిసార్లు ఆయన మనసు నలిగిపోయింది, ఆయన ఎంతో కృంగిపోయాడు. అయినా, ఆయన దేవునికి ఇలా ప్రార్థించాడు, ‘నీ క్రియలన్నీ ధ్యానిస్తున్నాను. నేను నీ చేతుల పనిని యోచిస్తున్నాను.’ (కీర్తన 143:3-5) దావీదు తనకు శ్రమలు ఎదురైనా కృతజ్ఞతా స్ఫూర్తి చూపించడం మానలేదు, ఎప్పుడూ సంతృప్తిగానే ఉన్నాడు.

మీ కోసం ఇతరులు చేసినవాటి గురించి ఆలోచించండి, వాళ్లు చేసినదానికి కృతజ్ఞత చూపించండి. ఈ విషయంలో యేసు మనకెంతో ఆదర్శంగా ఉన్నాడు. ఉదాహరణకు, ఆయన స్నేహితురాలైన మరియ ఆయన తలమీద, పాదాల మీద ఖరీదైన అత్తరు పోసినప్పుడు, ‘అత్తరు ఇలా వృధా చేయడమెందుకు?’ అని కొంతమంది అడిగారు. a ఆ అత్తరు అమ్మి, వచ్చిన డబ్బు బీదవాళ్లకు ఇవ్వాలన్నది ఆ విమర్శకుల ఉద్దేశం. దానికి యేసు ఇలా అన్నాడు, ‘ఆపండి, ఆమెనెందుకు కంగారు పెడుతున్నారు? ఆమె తను చేయగలిగింది చేసింది.’ (మార్కు 14:3-8, పరిశుద్ధ బైబల్‌: తెలుగు, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌; యోహాను 12:3) యేసు మరియ చేయని దాని గురించి ఆలోచించలేదు, ఆమె చేసిన దాన్ని మెచ్చుకున్నాడు.

కొంతమంది తమ కుటుంబాన్ని, స్నేహితులను పోగొట్టుకున్న తర్వాతే వాళ్ల విలువను లేదా ఇతర ఆశీర్వాదాలను కోల్పోయిన తర్వాతే వాటి విలువను గుర్తిస్తారు. ఇప్పుడు మీరు ఏ మంచి విషయాల వల్ల సంతోషంగా ఉన్నారో వాటి గురించి ఆలోచిస్తే, అలాంటి బాధాకరమైన పరిస్థితి రాకుండా చూసుకోవచ్చు! మీరు కృతజ్ఞత చూపించాలనుకుంటున్న వాటి గురించి మనసులో ఆలోచించవచ్చు లేదా వాటిని ఒక కాగితం మీద రాసుకోవచ్చు.

“శ్రేష్ఠమైన ప్రతీ యీవి,” అంటే ప్రతీ బహుమతి దేవుడు ఇస్తాడు కాబట్టి, ప్రార్థనలో మనమాయనకు కృతజ్ఞతలు తెలియజేయడం మంచిది. (యాకోబు 1:17) క్రమంగా అలా చేస్తే, మనం కృతజ్ఞతా స్ఫూర్తి చూపించడం ఎప్పుడూ మానుకోం, అంతేకాదు ఎప్పుడూ సంతృప్తిగా ఉండగలుగుతాం.—ఫిలిప్పీయులు 4:6, 7. (w10-E 11/01)

[అధస్సూచి]

a మొదటి శతాబ్దంలో, అతిథి తలమీద అత్తరు పోయడం ఆతిథ్యం ఇవ్వడాన్ని సూచించేది; పాదాల మీద అత్తరు పోయడం వినయంతో చేసే పనిని సూచించేది.

[6వ పేజీలోని చిత్రం]

ఇతరులు చేసినదానికి కృతజ్ఞత వ్యక్తం చేస్తారా?