కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ముఖపత్ర అంశం | మనకు దేవుడు అవసరమా?

మనకు దేవుని అవసరం ఎందుకు ఉందంటే . . .

మనకు దేవుని అవసరం ఎందుకు ఉందంటే . . .

మనిషి నిజంగా సంతోషంగా ఉండాలంటే కేవలం భౌతిక అవసరాలు తీర్చుకుంటే సరిపోదని మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే, ప్రజలు ఏదోకటి సాధించాలనీ తమకన్నా గొప్ప వ్యక్తిని సేవించాలనీ కోరుకుంటారు. దానికోసం కొందరు తమ ఖాళీ సమయాన్ని ప్రకృతి, కళలు, సంగీతం వంటివాటికి అంకితం చేస్తుంటారు. అయినా, వాళ్లలో చాలామంది ఏదో అసంతృప్తితో జీవిస్తుంటారు.

మానవులు ఇప్పుడు, నిరంతరం సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు

దానికి కారణం, స్వతహాగా మనలో ఉన్న ఆధ్యాత్మిక చింతనే. ఈ విషయం గురించి బైబిలు చదివేవాళ్లకు బాగా తెలుసు. దేవుడు మొదటి స్త్రీపురుషులను సృష్టించాక, తరచూ వాళ్లతో మాట్లాడుతూ తనతో ఒక అనుబంధం ఏర్పర్చుకునే అవకాశం వాళ్లకు ఇచ్చాడని ఆదికాండము పుస్తకంలోని మొదటి అధ్యాయాలు చెబుతున్నాయి. (ఆదికాండము 3:8-10) దేవునితో సంబంధం లేకుండా, ఆయనతో సంభాషించకుండా మనంతట మనమే జీవించేలా ఆయన మనల్ని సృష్టించలేదు. దీనిగురించి బైబిలు చాలాసార్లు చెప్పింది.

ఒకసారి యేసు ఇలా అన్నాడు: ‘తమ ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించినవాళ్లు సంతోషంగా ఉంటారు.’ (మత్తయి 5:3, NW) మనం సంతోషంగా, సంతృప్తిగా జీవించాలంటే దేవుని గురించి తెలుసుకోవాలనే మనలోని కోరికను తీర్చుకోవడం చాలా ప్రాముఖ్యమని ఆ మాటలు చూపిస్తున్నాయి. అందుకు మనమేమి చేయాలి? యేసు ఇలా చెప్పాడు: “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును.” (మత్తయి 4:4) “దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాట” అంటే బైబిల్లోవున్న దేవుని ఆలోచనలు, నిర్దేశాలు. మనం సంతోషంగా, అర్థవంతంగా జీవించడానికి అవి మూడు ప్రాథమిక మార్గాల్లో సహాయం చేస్తాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

మనకు సరైన నిర్దేశం అవసరం

ఈ రోజుల్లో చాలామంది నిపుణులు మానవ సంబంధాలు, ప్రేమ, కుటుంబ జీవితం, గొడవలు పరిష్కరించుకోవడం, సంతోషం పొందడం, జీవిత పరమార్థం వంటివాటికి సంబంధించి సలహాలు ఇస్తుంటారు. అయితే ఈ విషయాలన్నిటిలో శ్రేష్ఠమైన నిర్దేశాన్ని మన సృష్టికర్త యెహోవా దేవుడు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. a

యూజర్స్‌ మాన్యుల్‌లా బైబిలు మన జీవితాలకు మార్గనిర్దేశం ఇస్తుంది

ఉదాహరణకు, మీరు కెమెరా, కంప్యూటర్‌ వంటి కొత్త వస్తువు ఏదైనా కొన్నప్పుడు దాన్ని చక్కగా, సరిగ్గా ఎలా వాడాలో తెలిపే పుస్తకం (యూజర్స్‌ మాన్యుల్‌) కూడా ఉంటే బాగుంటుందని మీకనిపిస్తుంది. ఒకరకంగా, బైబిలు కూడా అలాంటి పుస్తకమే. మనకు జీవాన్నిచ్చిన దేవుడు మనం ఆ జీవాన్ని ఎలా ఉపయోగించాలో అందులో తెలియజేశాడు. సృష్టికర్త మనల్ని ఎందుకు తయారుచేశాడో, మనం ఎలా జీవిస్తే సంతోషంగా ఉంటామో అది వివరిస్తుంది.

ఒక చక్కని యూజర్స్‌ మాన్యుల్‌, వస్తువు పాడవకుండా ఎక్కువకాలం పనిచేయాలంటే దాన్ని ఎలా వాడకూడదో చెబుతుంది. అలాగే బైబిలు కూడా, మన జీవితాలను నాశనం చేసే అలవాట్ల గురించి హెచ్చరిస్తుంది. కొన్నిసార్లు ఎదుటివాళ్లు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించడానికి సులువుగా అనిపించవచ్చు. కానీ సృష్టికర్త ఇచ్చే నిర్దేశాలు పాటిస్తేనే మనం శ్రేష్ఠమైన జీవితాన్ని గడుపుతాం, సమస్యలు తప్పించుకుంటాం, కాదంటారా?

“నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.”—యెషయా 48:17, 18

మనకు కావాల్సిన నడిపింపు, సహాయం బైబిల్లో దొరుకుతాయి

యెహోవా దేవుడు మనకు కావాల్సిన నిర్దేశాలు, సూచనలు ఇస్తాడే తప్ప వాటిని పాటించమని బలవంతం చేయడు. అయితే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు, మనకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు కాబట్టే ఇలా అభ్యర్థిస్తున్నాడు: “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.” (యెషయా 48:17, 18) ఒక్కమాటలో చెప్పాలంటే, దేవుని నిర్దేశాన్ని పాటిస్తే మనం సురక్షితంగా ఉంటాం. దీన్నే ఇంకోలా చెప్పాలంటే: మనం క్షేమంగా, సంతోషంగా ఉండాలంటే మనకు దేవుడు అవసరం.

మనకు, జీవితానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు అవసరం

ప్రేమగల దేవుడు ఉన్నాడని నమ్మిన కొందరికి, కలవరపెట్టే ఎన్నో ప్రశ్నలకు జవాబులు దొరకలేదు. దాంతో, దేవుని అవసరం తమకు లేదనే నిర్ణయానికి వాళ్లు వచ్చారు. అలాంటివాళ్లు ఇలా అడుగుతుంటారు: ‘మంచివాళ్లకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి?’ ‘అభంశుభం ఎరగని పసికందులు ఎందుకు వైకల్యంతో పుడుతున్నారు?’ ‘లోకంలో ఎందుకింత అన్యాయం ఉంది?’ అవి చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు. వాటికి సరైన సమాధానాలు తెలుసుకుంటే అవి మన జీవితాన్ని ఎంతగానో మార్చేస్తాయి. తొందరపడి దేవుణ్ణి తప్పుపట్టే బదులు, దేవుని వాక్యమైన బైబిలు ఈ విషయం గురించి ఏమి చెబుతుందో చూద్దాం.

మంచిచెడ్డల తెలివినిచ్చే చెట్టు పండ్లను తినొద్దని యెహోవా దేవుడు మొదటి స్త్రీపురుషులకు ఆజ్ఞాపించాడు. అయితే, సాతాను ఒక పామును ఉపయోగించుకొని వాళ్లు ఆ ఆజ్ఞను మీరేలా చేశాడు. దాని గురించి ఆదికాండము 3వ అధ్యాయంలో చూస్తాం. సాతాను హవ్వతో ఇలా అన్నాడు: “మీరు చావనే చావరు; ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియును.”—ఆదికాండము 2:16, 17; 3:4, 5.

అంటే, దేవుడు అబద్ధికుడనీ ఆయన మార్గాలు న్యాయమైనవికావనీ సాతాను ఆరోపించాడు. ప్రజలు తన మాట వింటే ఇంకా బావుంటారని కూడా అపవాది అన్నాడు. ఆ ఆరోపణలకు జవాబివ్వడం ఎలా? వాటిలో ఎంత వాస్తవముందో అందరూ తెలుసుకునేలా కొంతకాలం ఆగాలని యెహోవా నిర్ణయించుకున్నాడు. ఒకవిధంగా చెప్పాలంటే, తన అవసరం లేకుండా ప్రజలు సంతోషంగా జీవించగలరో లేదో చూపించే అవకాశాన్ని సాతానుకు, అతని పక్షాన ఉన్నవాళ్లకు యెహోవా ఇచ్చాడు.

సాతాను చేసిన ఆరోపణలకు జవాబు ఏమిటని మీకనిపిస్తుంది? ప్రజలు దేవుని అవసరం లేకుండా సంతోషంగా ఉండగలరంటారా? తమను తామే చక్కగా పరిపాలించుకోగలరంటారా? శతాబ్దాలుగా మానవజాతిని పట్టిపీడిస్తున్న బాధ, అన్యాయం, వ్యాధులు, మరణం, నేరం, నైతిక విలువల పతనం, యుద్ధాలు, జాతి నిర్మూలన, ఇతర దారుణాలు దేవుని సహాయం లేకుండా మానవులు తమను తాము పరిపాలించుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని ఎలుగెత్తి చాటుతున్నాయి. బైబిలు మానవుల కష్టాలకు దేవుణ్ణి బాధ్యునిగా చేయడం లేదు. బదులుగా, వాటికిగల అసలు కారణాన్ని ఇలా వివరిస్తుంది: “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు.”—ప్రసంగి 8:9.

కలవరపెట్టే సమస్యలకు కారణాల్నే కాదు, వాటి పరిష్కారాల్ని తెలుసుకోవాలన్నా మనకు దేవుని అవసరం ఉందని దీన్నిబట్టి స్పష్టమౌతుంది. ఇంతకీ దేవుడు వాటిని ఎలా పరిష్కరిస్తాడు?

మనకు దేవుని సహాయం అవసరం

వ్యాధుల నుండి, వృద్ధాప్యం నుండి, మరణం నుండి బయటపడాలని ప్రజలు ఎంతోకాలంగా పరితపిస్తున్నారు. దానికోసం చెప్పలేనంత సమయాన్ని, ఎన్నో వనరులను వెచ్చించారు, ఎంతో ప్రయాసపడ్డారు. కానీ దానివల్ల వాళ్లు పెద్దగా సాధించిందేమీ లేదు. ఏవేవో మిశ్రమాలను, పానీయాలను సేవిస్తే లేదా కొన్ని ప్రాంతాల్లో జీవిస్తే నిత్య యౌవనం పొందవచ్చని కొందరు అనుకున్నారు. కానీ వాళ్ల ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి.

మానవులు క్షేమంగా, సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఉద్దేశంతోనే ఆయన మానవులను తయారుచేశాడు. ఆయన దాన్ని ఇప్పటికీ మర్చిపోలేదు. (ఆదికాండము 1:27, 28; యెషయా 45:18) తాను చెప్పింది ఖచ్చితంగా జరిగి తీరుతుందని యెహోవాయే మనకు అభయమిస్తున్నాడు. (యెషయా 55:10, 11) మొదటి మానవ దంపతులు కోల్పోయిన సంతోషభరితమైన జీవితాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడని బైబిలు చెబుతుంది. బైబిల్లోని చివరి పుస్తకంలో మనం ఈ మాటలు చూస్తాం: “ఆయన [యెహోవా దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.” (ప్రకటన 21:4) ఇంత చక్కని పరిస్థితుల్ని దేవుడు ఎలా తీసుకొస్తాడు? ఆ వాగ్దానం నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

దేవుని చిత్తం గురించి ప్రార్థించమని, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తన అనుచరులకు చెప్పాడు. “ప్రభువు ప్రార్థన” అని కొందరు పిలిచే ఆ ప్రార్థన చాలామందికి సుపరిచితమే, వాళ్లు దాన్ని వల్లిస్తుంటారు కూడా. అది ఇలా మొదలౌతుంది: “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.” (మత్తయి 6:9, 10) అవును యెహోవా దేవుడు, మానవ పరిపాలన వల్ల వచ్చిన విపత్కర పరిణామాలను తన రాజ్యం ద్వారా తీసేసి, తాను వాగ్దానం చేసిన నీతి విలసిల్లే కొత్త లోకాన్ని తీసుకొస్తాడు. b (దానియేలు 2:44; 2 పేతురు 3:13) ఆ వాగ్దానం నుండి ప్రయోజనం పొందాలంటే మనమేమి చేయాలి?

మనం తప్పనిసరిగా చేయాల్సిన ఒక సరళమైన పని గురించి యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:3) అవును, దేవుని సహాయం తీసుకుంటే ఆయన వాగ్దానం చేసిన కొత్త లోకంలో కలకాలం జీవించడం సాధ్యమే. మనకు దేవుని అవసరం ఉందని చెప్పడానికి ఇది ఇంకో కారణం.

ఇది దేవుని గురించి ఆలోచించాల్సిన సమయం

రెండువేల సంవత్సరాల క్రితం అపొస్తలుడైన పౌలు ఏథెన్సులోని అరేయొపగు (మార్స్‌ హిల్‌) దగ్గర, ఆలోచనాపరులైన ఏథెన్సువాసులకు దేవుని గురించి ఇలా చెప్పాడు: ‘ఆయన అందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేయువాడు. మనం ఆయనయందు బ్రతుకుతున్నాం, చలిస్తున్నాం, ఉనికి కలిగివున్నాం. మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెబుతున్నారు.’—అపొస్తలుల కార్యములు 17:25, 28.

పౌలు ఏథెన్సువాసులకు చెప్పింది ఇప్పటికీ నిజం. మనం పీల్చే గాలి, తినే ఆహారం, తాగే నీరు అన్నీ మన సృష్టికర్త ఇచ్చినవే. యెహోవా అలాంటి మంచివాటిని ఇవ్వకపోతే మనం బ్రతకను కూడా బ్రతకలేం. మానవులు తన గురించి ఆలోచించినా, ఆలోచించకపోయినా దేవుడు అలాంటివాటిని అందరికీ ఎందుకు ఇస్తున్నాడు? దానికిగల కారణాన్ని పౌలు ఇలా వివరించాడు: “వారు తనను వెదకాలని – తడవులాడి తనను కనుక్కోవాలని దేవుడు అలా చేశాడు. అయితే వాస్తవంగా ఆయన మనలో ఎవరికీ దూరంగా లేడు.”—అపొస్తలుల కార్యములు 17:27, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

మీరు ఇప్పుడు, నిరంతరం సంతోషంగా జీవించగలిగేలా దేవుని గురించి అంటే ఆయన సంకల్పాలు, నిర్దేశాల గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అలాగైతే, దయచేసి మీకు ఈ పత్రికను ఇచ్చిన వాళ్లనుగానీ, దీని ప్రచురణకర్తలనుగానీ సంప్రదించండి. వాళ్లు మీకు సంతోషంగా సహాయం చేస్తారు. (w13-E 12/01)

a దేవుని పేరు యెహోవా అని బైబిల్లో ఉంది.

b ఆ రాజ్యం, దేవుని చిత్తం భూమ్మీద నెరవేరేలా ఎలా చేస్తుందనే దానిగురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 8వ అధ్యాయం చూడండి. చదువుకోవడానికి, డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి వీలుగా ఈ పుస్తకం www.ps8318.comలో కూడా అందుబాటులో ఉంది.