కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రంగులు చూపించే ప్రభావం

రంగులు చూపించే ప్రభావం

మీరు పరిసరాలను చూసినప్పుడు మీ కళ్లు, మీ మెదడు కలిసికట్టుగా పనిచేసి సమాచారాన్ని సేకరిస్తాయి. మీరొక పండును చూడగానే, దాన్ని తినాలో వద్దో నిర్ణయించుకుంటారు. ఆకాశాన్ని చూడగానే, వర్షం కురుస్తుందో లేదో చెప్పేస్తారు. అంతెందుకు, ఇప్పుడు మీరు చదువుతున్న ఆర్టికల్‌ను కూడా పదాలను చూసి, వాటి భావాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. నిజానికి, మీరు రంగుల వల్ల ప్రభావితమౌతున్నారు. ఎలా?

పండును చూడగానే అది పండిందో లేదో, తినడానికి బాగుంటుందో లేదో ఎలా తెలుస్తుంది? దాని రంగు వల్లే. ఆకాశాన్ని, మేఘాల్ని చూడగానే వాతావరణం ఇలా ఉంటుందని ఎలా చెప్పగలుగుతున్నారు? వాటి రంగు వల్లే. అలాగే, ఈ పేజీ రంగుకు, అక్షరాల రంగుకు మధ్య సరిపడా తేడా ఉండబట్టే మీరు ఈ ఆర్టికల్‌ను ఇబ్బందిపడకుండా చదవగలుగుతున్నారు. బహుశా మీరు ఈ విషయం గురించి అంతగా ఆలోచించకపోయినా, రంగుల వల్లే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. అంతేకాదు, రంగులు మీ భావోద్వేగాల మీద కూడా ప్రభావం చూపిస్తాయి.

భావోద్వేగాల మీద రంగుల ప్రభావం

మీరు షాప్‌కు వెళ్లగానే అక్కడి అరల్లో, మీ కళ్లను కట్టిపడేసేలా తయారుచేసిన వస్తువుల్ని చూస్తారు. బహుశా మీరు గమనించినా గమనించకపోయినా, ప్రకటనలు (ఆడ్స్‌) తయారుచేసేవాళ్లు ఆడా మగా, పిల్లా పెద్దా వంటి తేడాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా వాళ్లకు నచ్చేలా రంగులను, రంగుల కలయికలను జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటారు. ఇళ్లను అలంకరించే వృత్తిలో ఉన్న వాళ్లకు, బట్టల డిజైనర్లకు, చిత్రకారులకు రంగులు భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయని తెలుసు.

స్థానిక ఆచారాలు, సంప్రదాయాలను బట్టి ప్రజలు ఒక్కో రంగును ఒక్కోదానికి సూచనగా ఎంచుతారు. ఉదాహరణకు, ఆసియాలో నివసించే కొందరు ఎరుపు రంగును శుభసూచకంగా, ఉత్సవసూచకంగా భావిస్తారు. కానీ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎరుపును సంతాపానికి సూచనగా భావిస్తారు. అయితే ప్రజలు ఎలాంటి పరిస్థితుల మధ్య పెరిగినా, కొన్ని రంగులు అందరి భావోద్వేగాల్ని ఒకేలా ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు మూడు రంగులను, అవి మనపై చూపించే ప్రభావాన్ని పరిశీలిద్దాం.

ఎరుపు రంగు అన్ని రంగుల్లోకెల్లా స్పష్టంగా కనిపిస్తుంది. ఎరుపును ఎక్కువగా శక్తికి, యుద్ధానికి, ప్రమాదానికి సూచనగా ఉపయోగిస్తారు. భావోద్వేగాల మీద ఎరుపు రంగు చూపించే ప్రభావం చాలా ఎక్కువ. అది మనుషుల్లో జీవక్రియను, శ్వాసవేగాన్ని, రక్తపోటును పెంచుతుంది.

బైబిల్లో “ఎరుపు” అని అనువాదమైన హీబ్రూ పదానికి “రక్తం” అనే అర్థం ఉంది. బైబిలు, ‘దేవదూషణ నామములతో నిండుకున్న ఎర్రని మృగం మీద’ కూర్చొని ఉన్న హంతకురాలైన వేశ్యను వర్ణించడానికి ఎరుపును ఉపయోగిస్తూ ఆమె “ధూమ్రరక్తవర్ణముగల వస్త్రము ధరించుకొని” ఉందని చెబుతుంది.—ప్రకటన 17:1-6.

పచ్చ రంగు ఎరుపు రంగుకు వ్యతిరేకమైన ప్రభావం చూపిస్తుంది. అది జీవక్రియ వేగాన్ని తగ్గిస్తుంది, ప్రశాంతతను తీసుకువస్తుంది. పచ్చ రంగు నెమ్మదిని కలుగజేస్తుంది కాబట్టి తరచూ దాన్ని ప్రశాంతతకు చిహ్నంగా ఉపయోగిస్తారు. పచ్చని తోటలను, పచ్చని కొండాకోనలను చూసినప్పుడు మన మనసెంతో ఉల్లాసంగా ఉంటుంది. దేవుడు పచ్చని గడ్డిని, చెట్లను మనుషుల కోసం సృష్టించాడని బైబిలు తెలియజేస్తుంది.—ఆదికాండము 1:11, 12, 29, 30.

తెలుపు రంగును తరచూ వెలుతురుకు, భద్రతకు, పరిశుభ్రతకు ప్రతీకగా ఉపయోగిస్తారు. మంచితనం, నిర్దోషత్వం, స్వచ్ఛత వంటి లక్షణాలను సూచించడానికి కూడా దాన్ని వాడతారు. బైబిల్లో ఎక్కువగా ప్రస్తావించిన రంగు తెలుపు. కొన్ని దర్శనాల్లో ఆయా మనుషులు, దేవదూతలు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నట్లు బైబిలు వర్ణిస్తుంది. అంటే వాళ్లు దేవుని దృష్టిలో నీతిమంతులుగా, పరిశుభ్రంగా ఉన్నారని అర్థం. (యోహాను 20:12; ప్రకటన 3:4; 7:9, 13, 14) నీతికోసం చేసే యుద్ధాన్ని సూచించడానికి, పరిశుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించిన రౌతులు, తెల్లని గుర్రాల మీద స్వారీ చేస్తున్నారని బైబిలు వర్ణిస్తుంది. (ప్రకటన 19:14) మన పాపాల్ని క్షమించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి దేవుడు తెలుపు రంగును ఉపయోగించాడు. “మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమమువలె తెల్లబడును” అని ఆయన అన్నాడు.—యెషయా 1:18.

గుర్తుంచుకోవడానికి సహాయం చేస్తాయి

బైబిల్లో ఆయా రంగుల్ని ఉపయోగించిన తీరు, రంగులు మనుషుల్లో కలిగించే భావోద్వేగాల గురించి దేవునికి తెలుసని చూపిస్తుంది. ఉదాహరణకు, మనకాలంలోని పరిస్థితుల గురించి అంటే యుద్ధాలు, కరువుల గురించీ ఆహార కొరత, వ్యాధుల వల్ల జరుగుతున్న మరణాల గురించీ బైబిల్లోని ప్రకటన పుస్తకం ముందే చెప్పింది. అంతేకాదు మనం వాటిని స్పష్టంగా గుర్తుంచుకోగలిగేలా ఒక ఆసక్తికరమైన దర్శనం రూపంలో వివరిస్తుంది. మామూలు గుర్రాల మీద కాకుండా రంగురంగుల గుర్రాల మీద కూర్చున్న రౌతుల గురించి ఆ దర్శనం చెబుతుంది.

మొదటి గుర్రం తెల్లగావుంది. అది యేసుక్రీస్తు చేసే యుద్ధం నీతియుక్తమైనదని సూచిస్తుంది. రెండవ గుర్రం ఎర్రగావుంది. అది యుద్ధాలకు ప్రతీక. నల్లగావున్న మూడవ గుర్రం కరువుకు గుర్తు. ఆ తర్వాత, “పాండుర వర్ణముగల” గుర్రం కనబడుతుంది, “దానిమీద కూర్చున్నవాని పేరు మృత్యువు.” (ప్రకటన 6:1-8) ప్రతీ గుర్రం రంగు, ఆ గుర్రం దేనికి ప్రతీకగా ఉందో దానికి తగిన భావోద్వేగాన్ని మనలో కలుగజేస్తుంది. ఈ రంగురంగుల గుర్రాల వల్ల మనకాలంలో జరిగే సంఘటనలను సులువుగా గుర్తుంచుకోగలుగుతాం.

ఆయా పదచిత్రాలను గీయడానికి బైబిలు ఎన్నోసార్లు రంగులను ఉపయోగించింది. వెలుతురునూ రంగులనూ మన కళ్లనూ సృష్టించిన వ్యక్తి, రంగుల్ని ఎంతో నైపుణ్యంగా ఉపయోగించి ఆయా విషయాల్ని చక్కగా అర్థం చేసుకునేలా, గుర్తుంచుకునేలా మనకు బోధిస్తున్నాడు. సమాచారాన్ని సేకరించడానికి, దాని గురించి ఆలోచించడానికి రంగులు సహాయం చేస్తాయి. అవి మన భావోద్వేగాల్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడానికి ఉపకరిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, జీవితాన్ని ఆస్వాదించడానికి సృష్టికర్త ప్రేమతో మనకిచ్చిన వరమే రంగులు! (w13-E 10/01)