కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వారి విశ్వాసాన్ని అనుసరించండి | హనోకు

అతను దేవుణ్ణి సంతోషపెట్టాడు

అతను దేవుణ్ణి సంతోషపెట్టాడు

హనోకు ఎన్నో సంవత్సరాలు బ్రతికాడు. మనకు ఊహించుకోవడం కష్టమే అయినా ఆయన 365 సంవత్సరాలు బ్రతికాడు. అంటే, ఈ రోజుల్లో ఒక మనిషి బ్రతికే సంవత్సరాలకన్నా నాలుగు రెట్లు ఎక్కువ! కానీ, ఆయన జీవించిన కాలంలో ఆయనది అంత పెద్ద వయసు కాదు. ఎందుకంటే 5000 సంవత్సరాల క్రితం మనుషులు, ఇప్పటివాళ్ల కన్నా ఎంతో కాలం ఎక్కువ బ్రతికేవాళ్లు. హనోకు పుట్టినప్పుడు మొదటి మనిషి అయిన ఆదాము వయసు 600 సంవత్సరాలు దాటింది, ఆ తర్వాత ఆదాము ఇంకా 300 సంవత్సరాలు బ్రతికాడు. ఆదాము పిల్లల్లో కొంతమంది ఆయనకన్నా ఎక్కువ కాలం బ్రతికారు. కాబట్టి, 365 సంవత్సరాల వయసుకు హనోకు ఇంకా ఆరోగ్యంగా, ఇంకెన్నో సంవత్సరాలు బ్రతకాల్సిన వాడిలా ఉన్నాడు. కానీ అలా జరగలేదు.

హనోకు ప్రాణం ప్రమాదంలో ఉంది. ఆయన తప్పించుకుని పారిపోతున్నట్లు ఊహించుకోండి. దేవుని నుండి వచ్చిన సందేశాన్ని ప్రజలకు చెప్పినప్పుడు వాళ్ల ప్రతిస్పందన ఆయన మనసులో ఇంకా మెదులుతుంది. కోపంతో వాళ్ల ముఖాలు రగిలిపోయాయి, వాళ్లకు ఆయన అంటే ద్వేషం. ఆయన చెప్పిన సందేశాన్ని, దాన్ని పంపించిన దేవున్ని వాళ్లు అసహ్యించుకున్నారు. హనోకు దేవుడైన యెహోవాను వాళ్లు ఏమి చేయలేరు కానీ హనోకును ఖచ్చితంగా ఏదోకటి చేయగలరు. ఆ సమయంలో బహుశా తన కుటుంబాన్ని మళ్లీ చూడగలనా అని హనోకు అనుకుని ఉంటాడు. తన భార్య గురించి, కూతుళ్ల గురించి, కొడుకు మెతూషెల గురించి, మనవడు లెమెకు గురించి ఆలోచించాడేమో. (ఆదికాండము 5:21-23, 25) ఇవే ఆయన జీవితానికి ఆఖరి క్షణాలా?

బైబిలులో హనోకు గురించి అన్నీ విషయాలు లేవు. మూడు చిన్న భాగాల్లో మాత్రమే ఆయన గురించి ఉంది. (ఆదికాండము 5:21-24; హెబ్రీయులు 11:5; యూదా 14, 15) కానీ, ఆ కొన్ని వచనాల్లోనే ఎంతో గొప్ప విశ్వాసం ఉన్న మనిషిని మన మనసులో చిత్రీకరించుకోవచ్చు. మీరు కుటుంబాన్ని పోషిస్తున్నారా? సరైన దానివైపు గట్టిగా నిలబడే విషయంలో మీరు కష్టపడుతున్నారా? అయితే, మీరు హనోకు చూపించిన విశ్వాసం నుండి ఎంతో నేర్చుకోవచ్చు.

హనోకు సత్యదేవునితో నడిచాడు

హనోకు జీవించిన కాలంలో మనుషులు చాలా చెడిపోయారు. ఆదాము నుండి ఏడవ తరంవాళ్లు అప్పుడు ఉన్నారు. ఆదాముహవ్వలో ఒకప్పుడు ఉన్న పరిపూర్ణతకు మనుషులు చాలా దగ్గరగా ఉన్నారు. అందుకే అప్పట్లో వాళ్లు అన్ని సంవత్సరాలు బ్రతికారు. కానీ నైతికంగా వాళ్ల పరిస్థితి ఘోరంగా ఉంది, దేవుడంటే భయం, భక్తి అసలు లేదు. హింస చాలా ఎక్కువగా ఉంది. ఆ పరిస్థితులు మనుషుల రెండవ తరంలోనే మొదలయ్యాయి. అప్పుడే కయీను తన తమ్ముడైన హేబెలును చంపాడు. కయీను పిల్లల్లో ఒకతను కయీను కంటే ఎక్కువ హింసను, పగను చూపిస్తున్నందుకు గర్వపడేవాడు. మూడవ తరంలో ప్రజలు ఒక కొత్త విధానంలో పాపం చేయడం మొదలుపెట్టారు. వాళ్లు దేవుని పేరును భక్తితో కాకుండా వేరే విధంగా ఉపయోగించడం మొదలుపెట్టారు. దేవుని పవిత్ర పేరును అపవిత్రంగా, అగౌరవంగా వాడారని తెలుస్తుంది.—ఆదికాండము 4:8, 23-26.

అలాంటి చెడ్డ మతం హనోకు కాలంలో చాలా ఎక్కువ అయిపోయింది. కానీ హనోకు పెరిగి పెద్దవాడు అయ్యేటప్పుడు ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ ప్రజల మధ్యలో వాళ్లలానే జీవిస్తాడా? లేదా భూమిని, ఆకాశాన్ని చేసిన నిజమైన దేవుడు యెహోవా గురించి తెలుసుకుంటాడా? యెహోవాకు ఇష్టమైన విధంగా ఆయనను ఆరాధించినందుకు ప్రాణాలు పోగొట్టుకున్న హేబెలు గురించి విన్నప్పుడు హనోకు ఎంతో కదిలించబడి ఉంటాడు. హనోకు కూడా అలానే జీవించాలని నిర్ణయించుకున్నాడు. ఆదికాండము 5:22⁠లో హనోకు “దేవునితో నడుచుచు” ఉన్నాడు అని ఉంది. ఆ మాటను బట్టి భక్తిలేని ఆ లోకంలో హనోకు ఎంతో భక్తిగా జీవించాడని అర్థమౌతుంది. ఒక మనిషి గురించి బైబిలు అలా చెప్పడం ఇదే మొదటిసారి.

కొడుకు మెతూషెల పుట్టాక కూడా హనోకు యెహోవాతో నడిచాడని ఆ బైబిలు వచనంలో మనం చూస్తాం. కాబట్టి హనోకుకు 65 సంవత్సరాలు వచ్చేసరికి ఆయనకు ఒక కుటుంబం ఉందని తెలుస్తుంది. ఆయన భార్య పేరు బైబిల్లో లేదు. అయితే వాళ్లిద్దరికి ఎంతోమంది కొడుకులు, కూతుళ్లు పుట్టారని ఉంది. కుటుంబాన్ని చూసుకుంటూ దేవునితో నడిచాడంటే దైవభక్తితోనే తన కుటుంబాన్ని పోషించాడని అర్థమౌతుంది. భార్యకు నమ్మకంగా అంటిపెట్టుకుని జీవించాలని యెహోవా కోరుతున్నట్లు హనోకుకు తెలుసు. (ఆదికాండము 2:24) యెహోవా దేవుని గురించి తన పిల్లలకు నేర్పించడానికి ఆయన ఖచ్చితంగా ఎంతో ప్రయత్నించి ఉంటాడు. ఆయన ఎలాంటి ప్రతిఫలాన్ని పొందాడు?

ఈ విషయాలన్నిటి గురించి బైబిల్లో కొన్ని వివరాలే ఉన్నాయి. హనోకు కొడుకు మెతూషెల విశ్వాసం గురించి ఎక్కువ సమాచారం లేదు. కానీ బైబిల్లో ఉన్న వాళ్లందరిలో మెతూషెల వయసే ఎక్కువ. జలప్రళయం వచ్చిన సంవత్సరం వరకు ఆయన బ్రతికే ఉన్నాడు. మెతూషెల కొడుకు పేరు లెమెకు. ఆయనకు దాదాపు వంద సంవత్సరాలు వచ్చే వరకు తాతయ్య హనోకు బ్రతికే ఉన్నాడు. లెమెకు పెద్దవాడయ్యాక మంచి విశ్వాసం చూపించాడు. యెహోవా శక్తితో లెమెకు తన కొడుకు నోవహు గురించి ఒక ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం జలప్రళయం తర్వాత నెరవేరింది. తన ముత్తాత హనోకులానే నోవహు కూడా దేవునితో నడిచాడు అని బైబిల్లో ఉంది. నోవహు హనోకును ఎప్పుడూ కలవలేదు. కానీ, హనోకు ఒక గొప్ప ఆస్తిని వదిలి వెళ్లాడు. దాని గురించి నోవహు తన తండ్రి లెమెకు నుండి లేదా తాతయ్య మెతూషెల నుండి తెలుసుకుని ఉంటాడు. లేదా హనోకు తండ్రియైన యెరెదు నుండి కూడా వినుంటాడు. ఆయన నోవహుకు 366 సంవత్సరాలు వచ్చేవరకు బ్రతికే ఉన్నాడు.—ఆదికాండము 5:25-29; 6:9; 9:1.

హనోకుకి, ఆదాముకి ఎంత తేడా ఉందో ఆలోచించండి. ఆదాము పరిపూర్ణుడైనా, యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసి, తన వారసులకు తిరుగుబాటును, కష్టాలను ఆస్తిగా ఇచ్చాడు. హనోకు అపరిపూర్ణుడైనా దేవునితో నడిచి, తన పిల్లలకు విశ్వాసమనే ఆస్తిని ఇచ్చాడు. హనోకుకు 308 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆదాము మరణించాడు. ఆదాము మరణించినప్పుడు అలాంటి స్వార్థపరుడి కోసం అతని కుటుంబం బాధపడిందా? మనకు తెలీదు. ఏదేమైనా, హనోకు దేవునితో నడుస్తూనే ఉన్నాడు.—ఆదికాండము 5:24.

మీరు కుటుంబాన్ని చూసుకునే స్థానంలో ఉంటే, హనోకు విశ్వాసం నుండి మీరేమి నేర్చుకోవచ్చో చూడండి. కుటుంబ అవసరాలు చూసుకోవడం ముఖ్యమే గానీ, వాళ్లకు దేవుని మీద భక్తి ఉండేలా చూసుకోవడం అంతకన్నా ముఖ్యం. (1 తిమోతి 5:8) మీరు చెప్పేవాటిని బట్టే కాదు చేసేవాటి బట్టి కూడా మీరు మీ కుటుంబాన్ని దేవునికి దగ్గర చేస్తారు. హనోకులా మీరూ దేవునితో నడవాలని నిర్ణయించుకుంటే, దేవుని సూత్రాలు బట్టి జీవిస్తే, మీరు కూడా మీ కుటుంబానికి ఒక గొప్ప ఆస్తిని ఇస్తారు. అదేంటంటే, వాళ్లు పాటించడానికి ఒక మంచి మాదిరిగా ఉంటారు.

హనోకు ‘వీరిని గూర్చి ప్రవచించాడు’

విశ్వాసంలేని ఆ లోకంలో విశ్వాసం చూపిస్తూ జీవించిన హనోకుకు ఒంటరిగా అనిపించి ఉండవచ్చు. మరి, తన దేవుడైన యెహోవా అతనిని చూశాడా? చూశాడు. నమ్మకంగా ఉన్న తన సేవకుడితో యెహోవా మాట్లాడిన రోజు వచ్చింది. అప్పుడు ప్రజలకు ఒక సందేశాన్ని చెప్పమని దేవుడు హనోకుకు చెప్పాడు. అలా దేవుడు హనోకును మొదటి ప్రవక్తగా చేశాడు. ఆయన చెప్పింది బైబిల్లో ఉంది. ఎన్నో వందల సంవత్సరాల తర్వాత, హనోకు చెప్పిన ప్రవచనార్థక మాటలను యేసు తమ్ముడైన యూదా దేవుని శక్తితో రాశాడు. a

హనోకు ప్రవచనం ఇలా ఉంది: “ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.” (యూదా 14, 15) హనోకు చెప్పిన మాటల్ని చూస్తే, దేవుడు ప్రవచనంలో చెప్పినవి అప్పటికే జరిగిపోయినట్లు హనోకు చెప్పాడు. తర్వాత వచ్చిన చాలా ప్రవచనాలు కూడా అదే పద్ధతిలో ఉంటాయి. ఎందుకంటే, ప్రవక్త చెప్పిన మాటలు ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టే వాటిని అప్పటికే జరిగిపోయినట్లు చెప్పేవాళ్లు.—యెషయా 46:10.

ఎంతో క్రూరమైన లోకానికి హనోకు ధైర్యంగా దేవుని సందేశాన్ని ప్రకటించాడు

ఆ సందేశాన్ని వినేవాళ్లందరికీ చెప్పడానికి హనోకుకు ఎలా అనిపించి ఉంటుంది? ఆ ప్రవచనంలో ఎంత గట్టి హెచ్చరిక ఉందో గమనించండి. నాలుగుసార్లు “భక్తిహీన” అనే పదంతో ప్రజలను, వాళ్లు చేసిన పనులను, ఆ పాపాలను ఎలా చేశారనే విషయాన్ని వివరించారు. ఏదెను నుండి బయటికి పంపించేసినప్పటి నుండి ప్రజలు తయారుచేసుకున్న లోకం పూర్తిగా చెడిపోయిందని ఆ ప్రవచనం అందరిని హెచ్చరించింది. యెహోవా “వేవేల పరిశుద్ధుల పరివారముతో” అంటే లక్షలమంది యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్న దూతలతో వచ్చి వాళ్లపై నాశనం తీసుకొస్తాడు. ఆ లోకానికి ఒక భయంకరమైన అంతం రాబోతుంది. దేవుడు నుండి వచ్చిన ఆ హెచ్చరికను హనోకు ధైర్యంగా చెప్పాడు. ఆయన ఒక్కడే ఆ పనిని చేశాడు. హనోకు ధైర్యాన్ని చూసి మనవడైన లెమెకుకు ఎంతో గర్వంగా అనిపించి ఉంటుంది. మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు.

యెహోవా చూస్తున్నట్లే ఈ లోకాన్ని చూస్తున్నామా లేదా అని ప్రశ్నించుకునేలా హనోకు విశ్వాసం మనల్ని కదిలించాలి. హనోకు ధైర్యంగా చెప్పిన తీర్పు సందేశం నేటికీ ఉంది. హనోకు కాలంలోలానే ఇప్పుడున్న లోకానికి కూడా అదే హెచ్చరిక ఉంటుంది. హనోకు చెప్పినట్లే యెహోవా ఆ భక్తిహీన ప్రజలపై నోవహు కాలంలో నాశనం తీసుకొచ్చాడు. అయితే ఈ నాశనం రాబోయే ఇంకో గొప్ప నాశనానికి గుర్తుగా ఉంది. (మత్తయి 24:38, 39; 2 పేతురు 2:4-6) అప్పటిలానే, ఇప్పుడు కూడా దేవుడు లక్షలమంది దూతలతో ఈ భక్తిహీన లోకంపై నీతియుక్త తీర్పును తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. మనలో ప్రతి ఒక్కరు హనోకు చెప్పిన హెచ్చరిక గురించి బాగా ఆలోచించి అందరికీ చెప్పాలి. మన కుటుంబంలో వాళ్లు, స్నేహితులు మనకు దూరమైపోవచ్చు. కొన్నిసార్లు మనం ఒంటరి వాళ్లమైపోయినట్లు అనిపించవచ్చు. హనోకుకు తోడున్నట్టే ఇప్పుడు కూడా యెహోవా తన నమ్మకమైన సేవకులకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు.

“మరణము చూడకుండునట్లు కొనిపోబడెను”

హనోకు ఎలా మరణించాడు? ఆయన జీవితం కన్నా ఆయన మరణం అంతు చిక్కని ఎన్నో ప్రశ్నలు లేవదీస్తుంది. ఆదికాండములో ఇలా ఉంది: “హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.” (ఆదికాండము 5:24) దేవుడు హనోకును తీసుకున్నాడు అనే మాటకు అర్థమేమిటి? దాని గురించి పౌలు ఇలా వివరించారు: “విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడైయుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు.” (హెబ్రీయులు 11:5) “మరణము చూడకుండునట్లు కొనిపోబడెను” అని చెప్పినప్పుడు పౌలు ఉద్దేశం ఏమిటి? కొన్ని బైబిలు అనువాదాల్లో హనోకును దేవుడు పరలోకానికి తీసుకెళ్లాడని ఉంది. కానీ అది నిజం కాదు, ఎందుకంటే చనిపోయి తిరిగి లేచినవాళ్లలో పరలోకానికి మొదట వెళ్లింది యేసుక్రీస్తే అని బైబిలు చెప్తుంది.—యోహాను 3:13.

“మరణము చూడకుండునట్లు” హనోకు ఎలా కొనిపోబడ్డాడు? బహుశా, యెహోవా హనోకుకు ఎలాంటి బాధ, నొప్పి లేకుండా మరణించేలా చేశాడు. కానీ చనిపోకముందు హనోకు “దేవునికి ఇష్టుడైయుండెనని సాక్ష్యము పొందెను” అని బైబిలు చెప్తుంది. ఎలా? మరణించే ముందు హనోకు దేవుని నుండి వచ్చిన దర్శనం చూసి ఉంటాడు. బహుశా భూమంతా పరదైసులా మారిన దర్శనం. యెహోవాకు అతని మీద ఉన్న ఇష్టానికి గుర్తుగా వచ్చిన ఆ దర్శనాన్ని చూసి హనోకు చనిపోయాడు. హనోకు గురించి, మిగతా నమ్మకమైన స్త్రీపురుషుల గురించి రాస్తూ పౌలు ఇలా అన్నాడు: “విశ్వాసముగలవారై మృతినొందిరి.” (హెబ్రీయులు 11:13) ఆయన శత్రువులు అతని శరీరం కోసం వెదికే ఉంటారు కానీ అది “కనబడలేదు.” వాళ్లు దాన్ని పాడుచేయకుండా లేదా అబద్ధ ఆరాధనకు ఉపయోగించకుండా యెహోవా అలా చేసి ఉంటాడు. b

ఈ విషయాన్ని మనసులో ఉంచుకుని హనోకు జీవితంలో చివరి క్షణాలు ఎలా ఉండి ఉంటాయో ఊహించుకుందాం. ఖచ్చితంగా ఇలాగే జరిగిందని చెప్పలేం కానీ, ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి. హనోకు తప్పించుకుని పరిగెత్తుతూ బాగా అలసిపోయాడు. ఆయన చెప్పిన తీర్పు సందేశం విని కోపంతో రగిలిపోతూ ఆయన శత్రువులు వెంటాడుతున్నారు. దాక్కోవడానికి హనోకు ఒక స్థలాన్ని చూసుకుని అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకున్నా ఎక్కువసేపు దాక్కోలేడని ఆయనకు తెలుసు. అతనిని ఘోరంగా చంపే సమయం దగ్గరలో ఉంది. అక్కడ విశ్రాంతి తీసుకుంటూ తన దేవునికి ప్రార్థించాడు. అప్పుడు ఒక విధమైన మనశ్శాంతిని అనుభవించాడు. ఒక దర్శనాన్ని చూశాడు, అది ఎంత నిజంగా ఉందంటే హనోకు అందులో ఉన్నట్లే అనుకున్నాడు.

భయంకరమైన మరణాన్ని చూసే ముందే దేవుడు హనోకును తీసుకువెళ్లాడు

హనోకు కళ్లెదురుగా చూస్తున్న దృశ్యంలో ఆయనకు తెలిసిన లోకానికి వేరుగా ఉన్న ఒక లోకాన్ని చూస్తున్నట్లు మీరు ఊహించుకోండి. ఈ లోకం ఏదెను తోటలా అందంగా ఉంది. కానీ, మనుషులు రాకుండా కాపలా కాసే కెరూబులు అక్కడ లేరు. మంచి ఆరోగ్యంతో, యవనంతో ఉన్న ఎంతోమంది స్త్రీపురుషులు ఆయనకు కనిపిస్తున్నారు. వాళ్లందరు శాంతితో ఉన్నారు. హనోకు ఎక్కువగా చూసిన ద్వేషం, మత సంబంధమైన హింస అక్కడ అస్సలు లేదు. ఇక్కడ యెహోవా ఇచ్చే ధైర్యాన్ని, ప్రేమని, ఆమోదాన్ని హనోకు స్వయంగా అనుభవించాడు. ఆయన ఉండాల్సింది ఇక్కడే అని అతనికి ఖచ్చితంగా అనిపించింది, ఇదే ఆయన ఇల్లు. ఆ ప్రశాంతత కమ్ముకుంటుంటే, హనోకు కళ్లు మూసుకుని కలలు రాని గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు.

ఆయన ఈ రోజు వరకు అక్కడే ఉన్నాడు, మరణంలో నిద్రపోతున్నాడు. ఎప్పటికీ చెరగని యెహోవా దేవుని జ్ఞాపకంలో భద్రంగా ఉన్నాడు. యేసు చెప్పినట్లు దేవుని జ్ఞాపకంలో ఉన్న వాళ్లందరూ క్రీస్తు శబ్దాన్ని విని, సమాధుల నుండి బయటకు వచ్చే రోజు వస్తుంది. అప్పుడు వాళ్లు అందమైన, ప్రశాంతమైన లోకంలో కళ్లు తెరుస్తారు.—యోహాను 5:28, 29.

మీకూ అక్కడ ఉండాలనుందా? హనోకును అక్కడ కలిసినప్పుడు ఎంత బాగుంటుందో ఊహించుకోండి. ఆయన దగ్గర ఎన్ని మంచి, ఆసక్తికరమైన విషయాలు నేర్చుకోవచ్చో ఆలోచించండి. ఆయన చివరి క్షణాల గురించి మనం ఇప్పటివరకు ఊహించుకున్నవి నిజంగా జరిగాయో లేదో ఆయననే అడిగి తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు హనోకు నుండి మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. హనోకు గురించి చెప్పాక పౌలు ఇలా అన్నాడు: “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము.” (హెబ్రీయులు 11:6) హనోకు ధైర్యంగా చూపించిన విశ్వాసాన్ని అనుసరించడానికి ఇది ముఖ్యమైన కారణం!

a కొంతమంది బైబిలు పండితులు యూదా ఆ మాటల్ని “హనోకు పుస్తకం” అనే ఒక పుస్తకం నుండి తీసుకున్నాడు అని చెప్తారు. ఎవరు రాశారో, ఎలా వచ్చిందో ఆధారాలు లేకపోయినా ఆ పుస్తకాన్ని హనోకు రాశాడు అని తప్పుగా అంటారు. హనోకు ప్రవచనం యూదా రాసిన పుస్తకంలో, హనోకు పుస్తకంలో ఒకేలా ఉంది. బహుశా యూదా మాటలకి, హనోకు పుస్తకంలో మాటలకి ఆధారం ఒకటే అయ్యుండవచ్చు. అది ఏవో పాత ఆధారాలు కావచ్చు లేదా తరతరాలుగా ప్రజలు చెప్పుకుంటూ వచ్చిన విషయాలు కూడా అయ్యుండవచ్చు. కానీ యూదా, పరలోకం నుండి హనోకు జీవితాన్ని చూసిన యేసు నుండి కూడా ఈ విషయాన్ని తెలుసుకుని ఉండవచ్చు.

b మోషే, యేసు చనిపోయిన తర్వాత వాళ్ల శరీరాలను చెడుగా ఉపయోగించకుండా దేవుడు వాటిని కనిపించకుండా తీసేసి ఉంటాడు.—ద్వితీయోపదేశకాండము 34:5, 6; లూకా 24:3-6; యూదా 9.