కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

5వ అధ్యాయం

యేసు ఎప్పుడు, ఎక్కడ పుట్టాడు?

యేసు ఎప్పుడు, ఎక్కడ పుట్టాడు?

లూకా 2:1-20

  • యేసు బేత్లెహేములో పుట్టాడు

  • పసివాడైన యేసును చూడడానికి గొర్రెల కాపరులు వచ్చారు

రోమా సామ్రాజ్య చక్రవర్తి అయిన కైసరు ఔగుస్తు, ప్రతీ ఒక్కరు తమ పేరు నమోదు చేయించుకోవాలని ఆజ్ఞ జారీచేశాడు. అందుకే యోసేపు మరియలు యెరూషలేముకు దక్షిణాన ఉన్న బేత్లెహేము నగరానికి వెళ్లాల్సి వచ్చింది. అది యోసేపు సొంతూరు.

పేర్లు నమోదు చేయించుకోవడానికి చాలామంది బేత్లెహేముకు వచ్చారు. కాబట్టి, యోసేపు మరియలకు ఉండడానికి ఎక్కడా చోటు దొరకలేదు. దాంతో గాడిదల్ని, పశువుల్ని ఉంచే కొట్టంలో వాళ్లు ఉండాల్సి వచ్చింది. యేసు అక్కడే పుట్టాడు. మరియ ఆయన్ని పొత్తిగుడ్డల్లో చుట్టి, పశువులు మేతమేసే తొట్టిలో పడుకోబెట్టింది.

పేర్లు నమోదు చేయించుకోవాలని కైసరు ఔగుస్తు ఆజ్ఞాపించేలా దేవుడే చేసివుంటాడు. ఎందుకు? ఎందుకంటే యేసు బేత్లెహేములో పుట్టాలి. అది ఆయన పూర్వీకుడైన దావీదు రాజు సొంతూరు. దేవుడు వాగ్దానం చేసిన పరిపాలకుడు బేత్లెహేములో పుడతాడని లేఖనాలు ఎంతోకాలం ముందే చెప్పాయి.—మీకా 5:2.

అది చాలా ముఖ్యమైన రాత్రి! పొలాల్లో ఉన్న కొంతమంది గొర్రెల కాపరుల చుట్టూ గొప్ప వెలుగు ప్రకాశించింది. అది యెహోవా మహిమ! అప్పుడు ఒక దేవదూత వాళ్లతో, “భయపడకండి. ఇదిగో! ప్రజలందరికీ గొప్ప సంతోషాన్ని తీసుకొచ్చే శుభవార్తను నేను మీకు ప్రకటిస్తున్నాను. ఈ రోజు దావీదు నగరంలో మీ కోసం ఒక రక్షకుడు పుట్టాడు, ఆయనే ప్రభువైన క్రీస్తు. ఆయన్ని మీరెలా గుర్తుపట్టవచ్చంటే, ఒక పసిబిడ్డ పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువులు మేతమేసే తొట్టిలో పడుకొని ఉంటాడు” అని చెప్పాడు. వెంటనే, చాలామంది దేవదూతలు కనిపించి ఇలా అన్నారు: “అత్యున్నత స్థలాల్లో దేవునికి మహిమ, భూమ్మీద ఆయనకు ఇష్టమైన మనుషులకు శాంతి కలగాలి.”—లూకా 2:10-14.

ఆ దూతలు వెళ్లిపోయిన తర్వాత కాపరులు ఒకరితో ఒకరు ఇలా అనుకున్నారు: “ఎలాగైనా సరే మనం బేత్లెహేముకు వెళ్లి, యెహోవా మనకు తెలియజేసినదాన్ని చూడాలి.” (లూకా 2:15) వాళ్లు దూత చెప్పిన చోటుకు త్వరత్వరగా వెళ్లి, అప్పుడే పుట్టిన యేసును చూశారు. దూత చెప్పిన విషయాల్ని కాపరులు అక్కడున్న వాళ్లకు తెలియజేశారు, అప్పుడు వాళ్లంతా ఆశ్చర్యపోయారు. మరియ ఆ విషయాలన్నీ మనసులో దాచుకొని, వాటి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది.

యేసు డిసెంబరు 25న పుట్టాడని నేడు చాలామంది అనుకుంటున్నారు. కానీ బేత్లెహేము ప్రాంతంలో డిసెంబరులో వర్షాలు పడతాయి, చలిగా ఉంటుంది. ఒక్కోసారి మంచు కూడా కురుస్తుంది. ఆ నెలలో కాపరులు రాత్రంతా పొలాల్లో ఉండి గొర్రెల్ని కాయరు. అంతేకాదు, ప్రజలు ఎప్పుడెప్పుడు తిరుగుబాటు చేద్దామా అని చూస్తున్నారు. వాళ్లను తీవ్రమైన చలిలో రోజుల తరబడి ప్రయాణం చేసి, పేర్లు నమోదు చేయించుకోమని రోమా చక్రవర్తి ఖచ్చితంగా ఆజ్ఞాపించడు. కాబట్టి, యేసు డిసెంబరులో కాదుగానీ అక్టోబరులో పుట్టివుంటాడని స్పష్టమౌతుంది.