కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

83వ అధ్యాయం

విందుకు ఆహ్వానించడం

విందుకు ఆహ్వానించడం

లూకా 14:7-24

  • వినయం గురించి పాఠం

  • ఆహ్వానించబడినవాళ్లు సాకులు చెప్పారు

ఒంట్లో నీరు వచ్చి బాధపడుతున్న వ్యక్తిని బాగుచేసిన తర్వాత, యేసు ఇంకా ఆ పరిసయ్యుని ఇంట్లోనే ఉన్నాడు. మిగతా అతిథులు భోజనం బల్ల దగ్గర ముఖ్యమైన స్థానాల్ని ఎంచుకోవడం యేసు గమనించి, వినయం గురించి ఒక పాఠం నేర్పించాడు.

యేసు ఇలా చెప్పాడు: “ఎవరైనా నిన్ను పెళ్లి విందుకు ఆహ్వానిస్తే, అన్నిటికన్నా ముఖ్యమైన స్థానంలో కూర్చోవద్దు. బహుశా అతను నీ కన్నా ప్రముఖుణ్ణి ఆహ్వానించి ఉండొచ్చు. అప్పుడతను నీ దగ్గరికి వచ్చి, ‘ఇతన్ని ఇక్కడ కూర్చోనివ్వు’ అంటాడు. అప్పుడు నువ్వు అవమానంతో అక్కడి నుండి లేచి, అన్నిటికన్నా తక్కువ స్థానంలో కూర్చోవాల్సి వస్తుంది.”—లూకా 14:8, 9.

యేసు ఇంకా ఇలా అన్నాడు: “ఎవరైనా నిన్ను ఆహ్వానించినప్పుడు వెళ్లి అన్నిటికన్నా తక్కువ స్థానంలో కూర్చో. అప్పుడు నిన్ను ఆహ్వానించిన వ్యక్తి వచ్చి, ‘స్నేహితుడా, పై స్థానంలో కూర్చో’ అని నీతో అంటాడు. దానివల్ల అతిథులందరి ముందు నీకు ఘనత కలుగుతుంది.” మర్యాదగా నడుచుకోవడం గురించి మాత్రమే యేసు చెప్పట్లేదు. ఆయన ఇలా వివరించాడు: “తనను తాను గొప్ప చేసుకునే ప్రతీ వ్యక్తి తగ్గించబడతాడు. తనను తాను తగ్గించుకునే వ్యక్తి గొప్ప చేయబడతాడు.” (లూకా 14:10, 11) అవును, వినయం అలవర్చుకోమని యేసు వాళ్లను ప్రోత్సహిస్తున్నాడు.

తర్వాత యేసు, తనను ఆహ్వానించిన పరిసయ్యునికి మరో పాఠం నేర్పించాడు. దేవుని దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలంటే విందు ఎలా ఇవ్వాలో ఆయన చెప్పాడు. “మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా నువ్వు విందు ఏర్పాటు చేసినప్పుడు నీ స్నేహితుల్ని గానీ, సహోదరుల్ని గానీ, బంధువుల్ని గానీ, బాగా డబ్బున్న ఇరుగుపొరుగువాళ్లను గానీ పిలవద్దు. ఎందుకంటే, వాళ్లు కూడా నిన్ను భోజనానికి పిలుస్తారేమో; అది నువ్వు చేసినదానికి ప్రతిఫలం అవుతుంది. కానీ నువ్వు విందు ఏర్పాటు చేసినప్పుడు పేదవాళ్లను, కుంటివాళ్లను, గుడ్డివాళ్లను, వికలాంగుల్ని ఆహ్వానించు. అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. ఎందుకంటే, నీకు తిరిగివ్వడానికి వాళ్ల దగ్గర ఏమీ ఉండదు.”—లూకా 14:12-14.

స్నేహితుల్ని, బంధువుల్ని, పొరుగువాళ్లను భోజనానికి పిలవడం సహజమే. అది తప్పని యేసు అనట్లేదు. బదులుగా, అవసరంలో ఉన్నవాళ్లకు అంటే పేదవాళ్లకు, వికలాంగులకు, గుడ్డివాళ్లకు భోజనం పెడితే గొప్ప ఆశీర్వాదాలు పొందవచ్చని యేసు చెప్తున్నాడు. తనను ఆహ్వానించిన పరిసయ్యునికి యేసు ఇలా వివరించాడు: “నీతిమంతుల పునరుత్థానంలో నీకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది.” ఆ మాటతో ఏకీభవిస్తూ తోటి అతిథి ఇలా అన్నాడు: “దేవుని రాజ్యంలో విందు ఆరగించే వ్యక్తి సంతోషంగా ఉంటాడు.” (లూకా 14:15) అది ఎంతో గొప్ప అవకాశమని అతను గ్రహించాడు. అయితే యేసు ఆ తర్వాత వివరించినట్లు అందరూ దాన్ని గొప్ప అవకాశంలా చూడలేదు.

యేసు ఈ ఉదాహరణ చెప్పాడు: “ఒక వ్యక్తి గొప్ప విందు ఏర్పాటు చేస్తూ, చాలామందిని ఆహ్వానించాడు. విందుకు సమయమైనప్పుడు ఆహ్వానించబడిన వాళ్లతో, ‘అంతా సిద్ధంగా ఉంది, రండి’ అని చెప్పడానికి ఆ యజమాని తన దాసుణ్ణి పంపించాడు. కానీ వాళ్లంతా ఒకేలా సాకులు చెప్పడం మొదలుపెట్టారు. ఒక వ్యక్తి, ‘నేనొక పొలం కొన్నాను, వెళ్లి దాన్ని చూడాలి. కాబట్టి నేను రాలేను, నన్ను క్షమించు’ అన్నాడు. ఇంకో వ్యక్తి, ‘నేను ఐదు జతల ఎద్దులు కొన్నాను, వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను. కాబట్టి రాలేను, నన్ను క్షమించు’ అన్నాడు. మరో వ్యక్తి, ‘నాకు ఈమధ్యే పెళ్లయింది, కాబట్టి నేను రాలేను’ అన్నాడు.”—లూకా 14:16-20.

అవన్నీ కుంటిసాకులు! ఎవరైనా పొలం లేదా ఎద్దులు కొనే ముందే జాగ్రత్తగా చూసుకుంటారు, కాబట్టి అత్యవసరంగా వెళ్లి వాటిని మళ్లీ చూడాల్సిన అవసరం లేదు. మూడో వ్యక్తి పెళ్లి ఏర్పాట్లు చేసుకోవట్లేదు, అతనికి అప్పటికే పెళ్లి అయిపోయింది. కాబట్టి ఆ ముఖ్యమైన ఆహ్వానాన్ని తిరస్కరించడానికి అది కూడా సరైన కారణం కాదు. ఈ సాకులు విన్న యజమాని కోపంతో తన దాసునికి ఇలా చెప్పాడు:

“నువ్వు వెంటనే నగర ముఖ్య వీధుల్లోకి, సందుల్లోకి వెళ్లి పేదవాళ్లను, గుడ్డివాళ్లను, కుంటివాళ్లను, వికలాంగుల్ని ఇక్కడికి తీసుకురా.” దాసుడు తన యజమాని చెప్పినట్టే చేశాడు, అయినా ఇంకా ఖాళీ ఉంది. కాబట్టి యజమాని ఆ దాసునికి ఇలా చెప్పాడు: “నువ్వు నగరం బయట, అలాగే పొలాల మధ్య ఉన్న దారుల్లోకి వెళ్లి అక్కడున్న వాళ్లను రమ్మని బలవంతం చేయి. నా ఇల్లంతా నిండిపోవాలి. ఎందుకంటే, నేను ముందు ఆహ్వానించిన వాళ్లలో ఏ ఒక్కరూ నా విందును రుచి చూడరని నేను నీతో చెప్తున్నాను.”—లూకా 14:21-24.

యెహోవా యేసుక్రీస్తు ద్వారా ఆయా వ్యక్తుల్ని పరలోక రాజ్యంలో ఉండడానికి ఆహ్వానిస్తున్నాడని ఈ ఉదాహరణ చక్కగా తెలియజేసింది. ముందు యూదులు, ముఖ్యంగా మతనాయకులు ఆహ్వానించబడ్డారు. వాళ్లలో చాలామంది యేసు పరిచర్య చేసినంత కాలం ఆ ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ వచ్చారు. అయితే ఆ ఆహ్వానం అక్కడితో ఆగిపోలేదు. భవిష్యత్తులో రెండో ఆహ్వానం యూదా జనాంగంలోని దీనులకు, యూదులుగా మారిన అన్యులకు అందుతుందని యేసు స్పష్టంగా చెప్పాడు. చివరిగా మూడో ఆహ్వానం, దేవునికి దగ్గరయ్యే అర్హత లేదని యూదులు భావించే అన్యులకు అందుతుంది.—అపొస్తలుల కార్యాలు 10:28-48.

అవును, యేసు తోటి అతిథి అన్నట్టుగానే “దేవుని రాజ్యంలో విందు ఆరగించే వ్యక్తి సంతోషంగా ఉంటాడు.”