కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

తప్పు చేయాలనే ఒత్తిడిని ఎలా ఎదిరించవచ్చు?

తప్పు చేయాలనే ఒత్తిడిని ఎలా ఎదిరించవచ్చు?

 అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “నేను సరైనది చేయాలనుకున్నప్పుడు, చెడు చేయడం వైపే మొగ్గుచూపుతున్నాను.” (రోమీయులు 7:21) మీకూ ఎప్పుడైనా అలా అనిపించిందా? అయితే, తప్పు చేయాలనే కోరికను తిప్పికొట్టేలా ఈ ఆర్టికల్‌ మీకు సహాయం చేస్తుంది.

 మీరు ఏం తెలుసుకోవాలి?

 వేరేవాళ్లు ఒత్తిడి చేసినప్పుడు, తప్పు చేసే అవకాశం ఎక్కువ. “చెడు సహవాసాలు మంచి నైతిక విలువల్ని పాడుచేస్తాయి” అని బైబిలు చెప్తుంది. (1 కొరింథీయులు 15:33, అధస్సూచి) ఇతరుల ఒత్తిడి లేదా మీడియాలో చూపించే విషయాలు మీ హృదయంలో చెడ్డ కోరికల్ని పుట్టిస్తాయి, దానివల్ల మీకు తప్పు చేయాలని అనిపించవచ్చు. చివరికి, అందరిలాగే మీరు కూడా తప్పు చేసే ప్రమాదం ఉంది.—నిర్గమకాండము 23:2.

 “అందరికీ నచ్చేలా ఉండాలి, అందరితో కలిసిపోవాలి అనే ఒత్తిడి ఇతరులకు నచ్చడం కోసం మీరూ వాళ్లలాగే ప్రవర్తించేలా చేస్తుంది.”—జెరెమీ.

 ఆలోచించండి: వేరేవాళ్లు మీ గురించి ఏమనుకుంటారు అనే దాని గురించి అతిగా ఆలోచిస్తే తప్పు చేయాలనే కోరిక బలపడవచ్చు, ఎందుకు?—సామెతలు 29:25.

 ఒక్కమాటలో: వేరేవాళ్ల ఒత్తిడి వల్ల మీకున్న ఉన్నత ప్రమాణాల విషయంలో రాజీపడకండి.

 మీరు ఏం చేయవచ్చు?

 మీ నమ్మకాలేంటో తెలుసుకోండి. మీ నమ్మకాలేంటో మీకు తెలియకపోతే, మీరు ఇతరుల చేతిలో తోలుబొమ్మలు అయ్యే అవకాశం ఉంది. బైబిలిచ్చే ఈ సలహా పాటించడం చాలా మంచిది: “అన్నిటినీ పరీక్షించి, ఏది మంచిదో దాన్ని ఎప్పుడూ పాటించండి.” (1 థెస్సలొనీకయులు 5:21) మీ నమ్మకాల్ని మీరు అర్థం చేసుకునే కొద్దీ, వాటికి కట్టుబడి ఉండడం, వాటికి వ్యతిరేకంగా ఉన్న తప్పుడు కోరికల్ని తిప్పికొట్టడం తేలికౌతుంది.

 ఆలోచించండి: దేవుడు ఇచ్చిన నైతిక ప్రమాణాలు మీ మంచి కోసమే అని మీరు ఎందుకు నమ్ముతున్నారు?

 “నేను నా నమ్మకాలకు కట్టుబడి ఉండి, ఒత్తిడికి లొంగిపోని ప్రతీసారి, ఇతరులకు నామీద ఉన్న గౌరవం పెరగడం గమనించాను.”—కింబర్లీ.

 బైబిల్లో ఆదర్శంగా ఉన్న వ్యక్తి: దానియేలు. టీనేజీలో ఉన్నప్పుడే దేవుని నియమాలకు లోబడాలని దానియేలు “తన హృదయంలో నిశ్చయించుకున్నాడు.”—దానియేలు 1:8, NW.

మీ నమ్మకాలేంటో మీకు తెలియకపోతే, మీరు ఇతరుల చేతిలో తోలుబొమ్మలు అయ్యే అవకాశం ఉంది.

 మీ బలహీనతలు తెలుసుకోండి. బైబిలు “యౌవన కోరికల” గురించి మాట్లాడుతోంది. అవి యౌవనంలో ఉన్నప్పుడు మరింత ఎక్కువగా ఉంటాయి. (2 తిమోతి 2:22) వాటిలో లైంగిక కోరికలే కాదు, అందరికీ నచ్చినట్టు ఉండాలి, సరైన వయసు రాకముందే అమ్మానాన్నలు చెప్పినట్టు కాకుండా సొంతగా నిర్ణయాలు తీసుకోవాలి అనే కోరికలు కూడా ఉన్నాయి.

 ఆలోచించండి: “ఒక వ్యక్తి కోరికే అతన్ని లాక్కెళ్లి, ప్రలోభపెట్టి పరీక్షకు గురిచేస్తుంది” అని బైబిలు చెప్తుంది. (యాకోబు 1:14) ఏ కోరిక మిమ్మల్ని తప్పు చేయాలనే ఒత్తిడికి ఎక్కువగా గురిచేస్తుంది?

 “వేటిని తట్టుకోవడం మీకు చాలాచాలా కష్టమో నిజాయితీగా పరిశీలించుకోండి. వాటిని ఎలా ఎదిరించాలో పరిశోధన చేయండి, మీరు పాటించాలి అనుకుంటున్న వాటిని రాసిపెట్టుకోండి. అప్పుడు మీకు ఒత్తిడి ఎదురైనప్పుడు, దాన్ని ఎలా జయించవచ్చో మీకు తెలుస్తుంది.”—సిల్వియా.

 బైబిల్లో ఆదర్శంగా ఉన్న వ్యక్తి: దావీదు. ఆయన కూడా కొన్నిసార్లు వేరేవాళ్ల ఒత్తిడికి లొంగిపోయాడు, తన సొంత కోరికల ఉరిలో పడిపోయాడు. కానీ దావీదు తన తప్పుల నుండి పాఠాలు నేర్చుకున్నాడు, మెరుగవ్వడానికి కృషిచేశాడు. ఆయన యెహోవాకు ఇలా ప్రార్థించాడు: “నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము.”—కీర్తన 51:10.

 మీరు కోరుకున్నట్టు ఉండండి. “చెడును మీమీద విజయం సాధించనివ్వకండి” అని బైబిలు చెప్తుంది. (రోమీయులు 12:21) అంటే, ఒత్తిడికి లొంగిపోవద్దు. సరైనది చేయాలని మీరు నిర్ణయించుకోవచ్చు.

 ఆలోచించండి: తప్పు చేయాలనే ఒత్తిడి ఎదురైనప్పుడు, సరైనదే చేసేలా పరిస్థితుల్ని మీరు ఎలా అదుపులోకి తీసుకోవచ్చు?

 “ఒకవేళ ఒత్తిడికి లొంగిపోతే ఆ తర్వాత నాకెలా అనిపిస్తుందో నేను ఆలోచిస్తాను. నాకు హాయిగా అనిపిస్తుందా? కొద్దిసేపు అలా అనిపిస్తుందేమో! కానీ కొన్ని రోజుల తర్వాత కూడా నాకు అలానే అనిపిస్తుందా? లేదు, చాలా బాధపడాల్సి వస్తుంది. మరి ఒత్తిడికి లొంగిపోవడం సరైనదేనా? కానేకాదు.”—సోఫియా.

 బైబిల్లో ఆదర్శంగా ఉన్న వ్యక్తి: పౌలు. తను చెడు చేయడం వైపు మొగ్గు చూపుతున్నానని ఒప్పుకున్నా, పౌలు వాటిని అదుపు చేసుకున్నాడు. ఆయన ఇలా అన్నాడు: “నా శరీరాన్ని అదుపులో పెట్టుకుంటున్నాను, దాన్ని నా బానిసగా చేసుకుంటున్నాను.”—1 కొరింథీయులు 9:27.

 ఒక్కమాటలో: ఒత్తిడి ఎదురైనప్పుడు ఏం చేయాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు మీరు డ్రైవర్‌ సీట్లో ఉన్నారు.

 ఒత్తిళ్లు కాసేపే ఉంటాయని గుర్తుంచుకోండి. 20 ఏళ్ల మెలిస్సా ఇలా అంటోంది: “హైస్కూల్లో ఉన్నప్పుడు చాలా పెద్దపెద్ద ఒత్తిళ్లుగా అనిపించినవి ఇప్పుడు చాలా చిన్నగా అనిపిస్తున్నాయి. దాని గురించి ఆలోచించినప్పుడు, ఇప్పుడు ఎదురయ్యే ఒత్తిళ్లు కూడా కొద్దిసేపే ఉంటాయి, ఒకరోజు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను వాటిని తట్టుకోవడం వల్ల నా జీవితం బావుందని గుర్తిస్తాను.”