కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

సెక్స్‌ గురించిన నా నమ్మకాలను నేను ఎలా వివరించాలి?

సెక్స్‌ గురించిన నా నమ్మకాలను నేను ఎలా వివరించాలి?

“ఏంటీ! … నువ్వింకా కన్యవేనా?”

మిమ్మల్ని ఎవరైనా అలా అడిగినప్పుడు జవాబు చెప్పాలని మీరు అనుకుంటే, మీ జవాబు ‘అవును’ అయితే మీరు ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పాలనుకుంటున్నారా? అయితే, ఈ ఆర్టికల్‌ మీకు ఉపయోగపడుతుంది!

 అబ్బాయిల, అమ్మాయిల కన్యత్వం

 కొంతమంది యువతీయువకులు లైంగిక సంభోగం జరగనంతవరకు సెక్స్‌ చేయడంలో తప్పులేదని అనుకుంటారు.

 వాళ్లు వేరే పనులు అన్నీ చేసేసినా, అమ్మాయి కన్యగా ఉంటే సరిపోతుందని అనుకుంటారు. కానీ సెక్స్‌ అంటే సంభోగం ఒక్కటే కాదు.

 ఓరల్‌ సెక్స్‌ (ముఖరతి), ఆనల్‌ సెక్స్‌ (ఆసన సంభోగం), వేరేవాళ్లకు హస్తప్రయోగం చేయడం వంటివి కూడా సెక్స్‌ కిందకే వస్తాయి.

 ఒక్కమాటలో: సెక్స్‌లో పాల్గొన్న అబ్బాయైనా, అమ్మాయైనా తమ కన్యత్వాన్ని కోల్పోతారు, అది ఓరల్‌ సెక్సైనా, ఆనల్‌ సెక్సైనా, వేరేవాళ్లకు హస్తప్రయోగం చేయడమైనా సరే.

 సెక్స్‌ గురించి బైబిలు ఏమి చెప్తుంది?

 పెళ్లి చేసుకున్న ఒక పురుషుడు, ఒక స్త్రీ (భార్యాభర్తల) మధ్య మాత్రమే సెక్స్‌ (లైంగిక కార్యకలాపాలు) జరగాలని బైబిలు చెప్తుంది. (సామెతలు 5:18) కాబట్టి, దేవుణ్ణి సంతోషపెట్టాలనుకునే వ్యక్తి, పెళ్లి చేసుకునేంత వరకు సెక్స్‌లో (లైంగిక కార్యకలాపాల్లో) పాల్గొనకూడదు.—1 థెస్సలొనీకయులు 4:3-5.

 బైబిలు చెప్పేది పాత చింతకాయ పచ్చడి అని, మన అధునాతన ప్రపంచానికి అది పనికిరాదని కొంతమంది అంటారు. అయితే మన అధునాతన ప్రపంచం విడాకులతో, అక్కర్లేని గర్భాలతో, సుఖవ్యాధులతో విలవిల్లాడిపోతుందని గుర్తుంచుకోండి. మన అధునాతన ప్రపంచం, నైతిక విలువల విషయంలో సలహాలు ఇచ్చే స్థానంలో లేదు, ఇది నిజం!—1 యోహాను 2:15-17.

 ఆలోచిస్తే, నైతిక విషయాల్లో బైబిలు ఇచ్చే నిర్దేశం మంచిదని మీకే అర్థమవుతుంది. ఈ ఉదాహరణ చూడండి: ఒకవేళ మీకు ఎవరైనా బహుమతిగా లక్ష రూపాయలు ఇచ్చారనుకోండి. మీరు డాబా ఎక్కి, రోడ్డు మీద వెళ్లే ఎవరో ఒకరు తీసుకునేలా ఆ డబ్బును విసిరేస్తారా?

 సెక్స్‌ విషయంలో కూడా మీరు అలాగే ఆలోచించాలి. “కొన్ని సంవత్సరాల తర్వాత నాకు గుర్తుండని ఎవరో ఒకరికి నా కన్యాత్వాన్ని విసిరేయడం నాకు ఇష్టంలేదు” అని 14 ఏళ్ల సీయెరా చెప్తోంది. 17 ఏళ్ల ట్యామీ కూడా అలాగే అంటోంది. “సెక్స్‌ అనేది ప్రత్యేకమైన బహుమతి, పాడుచేసుకునేది కాదు” అని తను అంటోంది.

 ఒక్కమాటలో: పెళ్లికానివాళ్లు కన్యాత్వాన్ని, స్వచ్ఛమైన ప్రవర్తనను కాపాడుకోవాలని, అదే వాళ్లకు సరైనదని బైబిలు చెప్తోంది.—1 కొరింథీయులు 6:18; 7:8, 9.

 మీరు ఏమి నమ్ముతున్నారు?

  •   సెక్స్‌ విషయంలో బైబిలు చెప్పేది సరైనదే అంటారా, లేక మరీ కఠినంగా ఉందంటారా?

  •   ఎవరైనా ఇద్దరు పెళ్లికాని వ్యక్తులు, తాము నిజంగా ప్రేమించుకుంటున్నామని చెప్తూ సెక్స్‌లో పాల్గొంటే, దాంట్లో తప్పులేదని మీకనిపిస్తోందా?

 చాలామంది యౌవనులు బాగా ఆచితూచి పరిశీలించిన తర్వాత కన్యాత్వాన్ని, స్వచ్ఛమైన ప్రవర్తనను కాపాడుకోవడం ఉత్తమమని చెప్పారు. అలా జీవిస్తున్నందుకు వాళ్లు బాధపడడం లేదు, ఏదో కోల్పోయామని భావించడం లేదు. అలాంటి కొంతమంది ఏమంటున్నారో వినండి:

  •  “నేను కన్యగా ఉన్నందుకు సంతోషిస్తున్నాను! పెళ్లి కాకుండా సెక్స్‌లో పాల్గొనడం వల్ల కలిగే మానసిక, శారీరక, భావోద్వేగ బాధను తప్పించుకోవడంలో ఏ తప్పూ లేదు.”—ఎమలీ.

  •  “లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, తర్వాత విడిపోవడం వంటి అనుభవాలు నాకు లేనందుకు నేను సంతోషిస్తున్నాను. అంతేకాదు, అలాంటి పనుల వల్ల వచ్చే ఏ రోగమూ నాకు వచ్చే అవకాశమే లేదని తలచుకుంటే చాలా హాయిగా అనిపిస్తుంది.”—ఇలాన్‌.

  •  “నా వయసున్న అమ్మాయిలు, నాకంటే పెద్ద వయసున్న అమ్మాయిలు చాలామంది, సెక్స్‌లో పాల్గొన్నందుకు బాధపడ్డామని, వేచివుంటే బాగుండేదని అనడం నేను విన్నాను. నేను ఆ తప్పు చేయకూడదు అనుకుంటున్నాను.”—విర.

  •  “కన్యాత్వాన్ని పోగొట్టుకోవడం వల్ల లేదా ఎక్కువ మందితో సెక్స్‌లో పాల్గొనడం వల్ల గతం మిగిల్చిన గాయాలతో బాధపడుతున్న చాలామందిని నేను చూశాను. నా దృష్టిలో అలాంటి బ్రతుకు చాలా బాధాకరం.”—డీయన్‌.

 ఒక్కమాటలో: సెక్స్‌లో పాల్గొనమనే ఒత్తిడి గానీ, పాల్గొనాలనే ప్రలోభం గానీ మీకు ఎదురవ్వక ముదే మీరు ఏమి నమ్ముతున్నారో మీరు తెలుసుకోవాలి.—యాకోబు 1:14, 15.

 మీ నమ్మకాన్ని ఇతరులకు ఎలా వివరించవచ్చు?

 సెక్స్‌ విషయంలో మీ నమ్మకాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే మీరు ఏమి చెప్పాలి? అది ఎక్కువగా పరిస్థితుల మీదే ఆధారపడి ఉంటుంది.

 “ఎవరైనా నన్ను ఏడిపించడానికే అలా అడిగితే, నేను అక్కడ నిలబడి, వింటూ ఉండను. ‘అది నీకు అనవసరం,’ అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాను.”—కరిన్‌.

 “దౌర్భాగ్యం ఏంటంటే, స్కూల్లో కొంతమందికి ఎదుటివాళ్లను ఏడిపించడం అంటే సరదా. నన్ను ఎవరైనా అలా ఏడిపించడానికే అడిగితే, నేను వాళ్లకు అస్సలు జవాబు చెప్పను.”—డేవిడ్‌.

 మీకు తెలుసా? ఎగతాళిచేసే వాళ్లకు యేసుక్రీస్తు కొన్నిసార్లు మౌనంతోనే “జవాబు” ఇచ్చాడు.—మత్తయి 26:62, 63.

 ఒకవేళ ఆ వ్యక్తి మిమ్మల్ని పద్ధతిగా, నిజాయితీగా ఆ ప్రశ్న అడిగితే మీరేం చెప్పాలి? ఆ వ్యక్తి బైబిలును గౌరవించే అవకాశం ఉందని మీకనిపిస్తే, 1 కొరింథీయులు 6:18 వంటి ఒక లేఖనం చూపించవచ్చు. పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొనే వ్యక్తి తన సొంత శరీరాన్ని పాడు చేసుకుంటూ, దానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడని ఆ వచనం చెప్తోంది.

 మీరు బైబిలు తెరచి చూపించినా చూపించకపోయినా, ధైర్యంగా మాట్లాడడం మాత్రం ముఖ్యం. నైతికంగా స్వచ్ఛంగా ఉండాలన్న మీ నిర్ణయం చాలా గొప్పది. దాని గురించి గర్వంగా చెప్పుకునే హక్కు మీకు ఉందని గుర్తుంచుకోండి.—1 పేతురు 3:16.

 “ఎవరైనా అడిగినప్పుడు జవాబు ధైర్యంగా చెప్పాలి. అప్పుడే మీరు నమ్ముతున్నవాటి మీద మీకు సందేహాలు లేవని అర్థమౌతుంది, మీరు చేస్తున్నది ఎవరో చెప్పడం వల్ల కాదుగానీ, అది సరైనది కాబట్టే చేస్తున్నారని వాళ్లకు అర్థమవుతుంది.”—జిల్‌.

 ఒక్కమాటలో: సెక్స్‌ విషయంలో మీరు పాటిస్తున్నది సరైనదనే నమ్మకం మీకు ఉంటే, దాని గురించి మీరు ఇతరులకు వివరించగలుగుతారు. అప్పుడు వాళ్లెలా స్పందిస్తారో చూసి మీరే ఆశ్చర్యపోతారు. 21 ఏళ్ల మెలిండ, “నాతో పనిచేసేవాళ్లు నేను కన్యగా ఉన్నందుకు నన్ను మెచ్చుకున్నారు” అంటోంది. “వాళ్లు నన్ను వింతగా చూడలేదు. కన్యాత్వాన్ని ఆత్మనిగ్రహానికి, మంచి గుణానికి గుర్తుగా భావించారు” అని కూడా అంటోంది.

 టిప్‌! సెక్స్‌ విషయంలో మీ దృఢనమ్మకాన్ని పెంచుకోవడానికి మీకు సాయం అవసరమైతే, “సెక్స్‌ గురించిన మీ నమ్మకాలను వివరించడం ఎలా?” అనే వర్క్‌షీట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మక సమాధానాలు (ఇంగ్లీషు) అనే పుస్తకాన్ని కూడా చూడండి.

 “‘యువత అడిగే ప్రశ్నలు’ పుస్తకాల్లోని వివరణ నాకు చాలా నచ్చింది. ఉదాహరణకు, 1వ సంపుటిలోని 187వ పేజీలో ఉన్న చిత్రం, పెళ్లి కాకుండా సెక్స్‌లో పాల్గొనడాన్ని, విలువైన హారాన్ని ఉచితంగా ఇచ్చేయడంతో పోలుస్తోంది. అంటే మీ విలువను మీరే తగ్గించేసుకుంటున్నట్టు. 177వ పేజీలో ఉన్న చిత్రం, పెళ్లవకుండా సెక్స్‌లో పాల్గొనడం, ఒక అందమైన పెయింటింగ్‌ను గుమ్మం దగ్గర కాళ్లు తుడుచుకోవడానికి ఉపయోగించడం లాంటిదని చూపిస్తోంది. అయితే నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది మాత్రం 2వ సంపుటిలోని 54వ పేజీలో ఉన్న చిత్రం. ఆ చిత్రం పక్కన ఇలా ఉంటుంది: ‘పెళ్లి కాకుండా సెక్స్‌లో పాల్గొనడం, మీ కోసం దాచిన బహుమతిని మీకు ఇవ్వకముందే తెరిచి చూడడం లాంటిది.’ అది, వేరేవాళ్ల వస్తువుని దొంగిలించడం లాంటిది. ఇక్కడ ఆ వేరే వ్యక్తి మిమ్మల్ని చేసుకోబోయే వ్యక్తే.”—విక్టొరీయ.